“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

8, జనవరి 2012, ఆదివారం

విజయవాడ బుక్ ఎక్జిబిషన్ విశేషాలు

ఎప్పటిలాగే జనవరి ఒకటినుంచి విజయవాడలో పుస్తక ప్రదర్శన మొదలైంది. వెళదాం వెళదాం అనుకుంటూ నిన్నటికి కుదిరింది. "నవ్వులాట" శ్రీకాంత్, "హోరాసర్వం" సోమశేఖర్, వీరుభోట్లవెంకటగణేష్, మదన్, మాధవ్, సత్యా, నేనూ పుస్తక ప్రదర్శనలో కలిశాము. ఒక నాలుగుగంటలపాటు సరదాగా మాట్లాడుకుంటూ గ్రౌండ్ లో తిరుగుతూ కాలక్షేపం చేశాము.

"నవ్వులాట" శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా సరదాగా మాట్లాడతాడు. కాకపోతే ఆయన ఒకటాపిక్ మొదలుపెట్టాడంటే దానిని ఆపడం ఎవరితరమూ కాదు. మనం శ్రోతల్లా వింటూ ఉండాల్సిందే.ఇక సోమశేఖర్ "horasarvam" బ్లాగు వ్రాస్తుంటాడు. భారతీయజ్యోతిష్యం మీద మంచిపట్టు ఇద్దరికీ ఉంది. శ్రీకాంత్ తనకున్న బహుముఖప్రజ్ఞను తన బ్లాగులో ఎక్కడా బయట పడనివ్వడు. కాని ఆయన ఒక వాకింగ్ ఎన్సైక్లోపీడియా అని చెప్పొచ్చు.చాలావిషయాలమీదఅనర్గళంగా మాట్లాడగలడు. మహా ఓపిక.

సోమశేఖర్ వృత్తిరీత్యా ఆడిటర్ అయినప్పటికీ, ప్రవృత్తి రీత్యా జ్యోతిష్కుడు. నిత్యపరిశోధకుడు. తన పరిశోధనలో కొన్ని కొత్తసూత్రాలు కనుక్కున్నాడు. తాజక సహమాలను ఉపయోగించడంలో దిట్ట. జాతకంలో రాహుకేతువుల యొక్క పాత్రమీద, గెలాక్టిక్ సెంటర్ యొక్క పాత్రమీదా కొన్ని మంచిసూత్రాలు తనపరిశోధనలో రాబట్టాడు. అష్టకవర్గసిద్దాంతం ఆధారంగా జాతకాన్ని ఎక్కువగా విశ్లేషిస్తాడు. గ్రహాల షడ్బలాలు మొదలైన విషయాలలో పరిశోధన చేస్తున్నాడు.

వెంకటగణేష్ చెన్నైలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. తెలుగుబ్లాగర్లకు సుపరిచితుడు. నా బ్లాగుకు నిత్య సందర్శకుడు. పంచవటి గ్రూపు సభ్యుడు. మొదటినుంచీ నాకు మంచిమిత్రుడు. మంచివ్యక్తిత్వంతో బాటు, విషయాలమీద ఆసక్తి మెండు. చర్చల్లో ఎక్కువగా పాల్గొనకపోయినా శ్రద్దగా వింటూ ఉంటాడు.

మదన్ ప్రభుత్వోద్యోగి. ఆధ్యాత్మిక విషయాలమీద అమితమైన ఆసక్తి ఉన్నవాడు. నిరంతరం పుస్తకాలు బాగా చదువుతాడు. మంచి ఆలోచనాపరుడు. మాట్లాడేది తక్కువే కాని మాట్లాడిన ఒక్కమాటా చాలాలోతుగా ఉంటుంది. మాధవ్, సత్యా, ఇద్దరూ త్వరలో చెన్నై టీసీఎస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గా చేరబోతున్నారు.

అన్ని స్టాల్స్ తిరుగుతూ "కినిగే" వారి స్టాల్ కూడా దర్శించాము.అట్లూరి అనిల్ గారు కనిపిస్తే వారితో కొంచంసేపు మాట్లాడాము.అక్కడ రహ్మానుద్దీన్ షేక్ అనే బ్లాగర్ కలిశారు. "బ్లాగులెలా వ్రాయాలి?" అని అతనూ  సుజాతగారూ కలిసి వ్రాసిన పుస్తకం చూపించారు. నవ్వొచ్చింది. షాపులు తిరిగి ఎవరికి కావలసిన పుస్తకాలు వారు కొనుక్కున్న తర్వాత ఒకచోట కూర్చుని ఇక చర్చ మొదలుపెట్టాం. జ్యోతిష్యానికి ఉన్న పరిమితులు, తాజకవిధానం, జ్యోతిష్యంలో ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అసలెందుకు, జాతకంప్రకారం ఏరత్నాన్ని ధరించాలి అని ఎలా చెప్పగలం, స్వామీజీలు వాళ్ళ మోసాలు, ఇలా చాలా టాపిక్స్ దొర్లాయి. శ్రీకాంతూ సోమశేఖరూ మంచి స్నేహితులు, కాని సబ్జెక్టులో మంచి ప్రత్యర్ధులు కూడా. వారి వాదన వింటుంటే మహాముచ్చటగా ఉంటుంది. జ్యోతిష్యంలో కొన్ని మౌలికసమస్యల గురించి వాదన నడిచింది. ఎవరి వాదనలు వారు చాలాలాజికల్ గా సమర్ధవంతంగా వినిపించారు. అంతావిని 'వాదనలో గెలిచినవారు మాకందరికీ మైసూరు బజ్జీలు ఇప్పించాలి' అని నేను చెప్పాను. "అమ్మో అలా అయితే నేను ఓడిపోతాను"-- అని శ్రీకాంత్ అన్నాడు. "బ్రాహ్మల చర్చలన్నీ ఇదుగో ఇలా ఉంటాయి" అని నేను సరదాగా కామెంట్ చేసాను. 'మైసూరుబజ్జీలు నవనవలాడుతూ కనిపించడానికి వంటసోడా బాగా దట్టించినట్లున్నాడు. అవి తింటే వచ్చే అల్సర్ తగ్గాలంటే మైసూరువెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలేమో?' అని నవ్వుకున్నాం.

వారికి తెలిసిన ఒక స్వామీజీ ఒక మధ్యాన్నంపూట ఉన్నట్టుండి అలిగి కూచున్నాడుట. ఆయన బాలాత్రిపురసుందరి అమ్మవారి అవతారం అని వారి నమ్మకమట. అప్పటికప్పుడు తనకు నగలు కావాలని అలిగి కూచుంటే, భక్తులందరూ డబ్బులు వేసుకుని ఎనిమిదో తొమ్మిదో లక్షలు పోగేసి అప్పటికప్పుడు ఆయనకీ నగలు చేయించారుట. ఈ సంగతి సోమశేఖర్ చెప్పాడు. "ఇంకానయం. ఆయన మధ్యాన్నం పూట కోరిన కోరికల సమయంలో మీవాళ్ళు వున్నారు. కనుక వాటిని తీర్చగలిగారు. ఆయన రాత్రిపూట కోరే కోరికలు వింటే తీర్చలేక చచ్చేవారు.ఇప్పటికిప్పుడు శివుణ్ణి తీసుకురమ్మంటే ఎక్కణ్ణించి తెచ్చేవారు?"-- అని నేనన్నాను. వారి నమ్మకానికి స్వామీజీ పెట్టిన ప్రైస్ టేగ్ అది. ఇలా సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ కాలక్షేపం చేసాము.

మొన్న ఆరోతేదీ సాయంత్రం చంద్రకేతువుల డిగ్రీ సంయోగం వృషభరాశిలో జరిగింది.వివిధలగ్నాలమీద దాని ప్రభావాన్ని గురించి కాసేపు మాట్లాడుకున్నాం.సోమశేఖర్ లగ్నం సింహం అని నాకు గుర్తుంది.కనుక తన దశమ స్థానంలో జరిగిన ఈయుతివల్ల తనకు వృత్తిపరంగా ఏదోఒక హటాత్ సంఘటన ఆరోజున జరిగి ఉండాలి. అదేవిషయం అడిగితే అవును జరిగింది అని సోమశేఖర్ చెప్పాడు.అదే గ్రహయుతి శ్రీకాంత్ కు ద్వాదశంలో జరిగింది. చంద్రుడు రెండోఅధిపతి గనుక ఏదైనా అనుకోనివాదన ఎవరితోనైనా జరిగి ఉండాలి. లేదా ఏదైనానష్టం జరిగిఉండాలి.ఇదే విషయం తనను అడిగితే, నిన్న జరుగలేదుగాని ఈరోజు ఒక సంఘటన జరిగింది అని చెప్పాడు.నాకు వృషభం పంచమం అవుతుంది. కనుక ఒక మంచిమిత్రునితో ఆరోజు అనుకోకుండా ఒకఅపార్ధమూ చిన్నపాటి ఘర్షణా జరిగాయి. నావైపునుంచి నేను ప్రశాంతంగానే ఉన్నాను.తనవైపు నుంచి కొంత సంఘర్షణ కలిగింది. మాధవ్ ది మేషలగ్నం. కనుక గృహసంబంధ విషయాలలో ఏదోఒక హటాత్ వాగ్వాదం ఆరోజున జరిగి ఉండాలి. ఆక్వాగార్డ్ వాటర్ ప్యూరిఫైర్ మిషన్ సర్వీసువాడు ఎన్నిసార్లు కంప్లెయింట్ ఇచ్చినా రాకపోతుంటే అదేరోజున వాళ్ళ ఆఫీసుకెళ్ళి అరిచి తిట్టి మరీవచ్చాడు.ఇక్కడ చంద్రుడు చతుర్దాధిపతిగా రెండింట కేతుగ్రస్తుడయ్యాడు.కనుక అతనికి అలా జరిగింది. ఇంకొక వ్యక్తిది తులా లగ్నం, తనపనిలో ఆరోజున చాలా అలసట ఫీలయ్యే పరిస్తితి అనుకోకుండా ఎదురైంది. చంద్రుడు దశమాదిపతి అష్టమంలో కేతుయుతిలో ఉంటూ విసుగునూ చికాకునూ సూచిస్తున్నాడు.కనుక తనకు అలా జరిగింది.ఈవిధంగా  గ్రహప్రభావం ఖచ్చితంగా మనుషులమీద ఉండి తీరుతుంది. ఏరోజున అది జరుగుతుందో కూడా చెప్పవచ్చు.

ఇలాటి చర్చలు జరుగుతూ ఉండగా, అమెరికానుంచి విష్ణుభొట్ల రామన్నగారు ఫోన్ చేసారు. ఈరోజున నేను పుస్తకప్రదర్శనకు వస్తున్నానని పంచవటి గ్రూప్ లో ముందే వ్రాశాను గనుక, అదేసమయానికి ఆయన గుర్తుంచుకొని మరీ అమెరికానుంచి ఫోన్ చేసారు. నేనూ శ్రీకాంతూ ఆయనతో మాట్లాడాము. అంతదూరంనుంచి గుర్తుంచుకొని మరీ ఫోన్ చేసిన ఆయన స్నేహశీలతకు చాలా సంతోషం కలిగింది.

మన జ్యోతిష్య గ్రంధాలలో అనేకరహస్యాలు  కలగాపులగంగా ఉన్నాయి.అది ఒక స్టోర్ రూం లాగా ఉంది.అందులో ఉన్న వస్తువులు ఎలా ఉపయోగపడుతాయో ఎవరూ చెప్పరు.అన్ని వస్తువులూ అక్కడ ఉంటాయి.అలా విడమర్చి చెప్పే సూత్రాలూ పద్దతులూ ప్రస్తుతం నశించాయి. కనుక ఎవరి వ్యక్తిగత స్టైల్ వారు తయారు చేసుకోవాలి. ఎక్కువగా వర్క్ అవుట్ అయిన సూత్రాలను పట్టుకొని వాటిని వాడుకుంటూ మరింత పరిశోధనచేస్తూ ముందుకు సాగాలి.జ్యోతిష్యం యొక్క పరిశోధన అంతా స్థూలంనుంచి సూక్ష్మానికి సాగుతుంది. ఒక సంఘటన ఖచ్చితంగా ఫలానారోజున జరుగుతుంది అని చెప్పగలిగే నైపుణ్యతను జ్యోతిష్కుడు సాధించాలి. పరాశరులు దీనికోసం షడ్బలాలను,వర్గ చక్రాలను,దశలను వాడారు. జైమినిమహర్షి తనదైన విధానంలో ఆత్మకారకుని,కారకాంశను,ఉపపదాన్ని,రాశి దశలను,రాశిదృష్టులను,చరదశ మొదలైన ప్రత్యెకదశలను వాడాడు. తాచకవిధానంలో వర్షచక్రాన్ని,ముంథాను, పంచవర్గీయబలాన్ని,ముద్దదశ మొదలైన ప్రత్యెకదశలను వాడారు.కృష్ణమూర్తి పద్దతిలో కృష్ణమూర్తిగారు నక్షత్రాలను తొమ్మిదిముక్కలుగా విభజించుకుంటూ పోయాడు.సబ్ కూ సబ్ సబ్ కూ, రూలింగ్ ప్లానేట్స్ కూ  ప్రాధాన్యతనిచ్చాడు. ఈవిధంగా ఎవరు ఏ విధానాన్ని ఉపయోగించినా, అంతిమలక్ష్యం మాత్రం ఖచ్చితంగా ఫలానాసంఘటన ఫలానా నిమిషానికి జరుగుతుంది అని చెప్పగలగటమే. అలా చెప్పడం సాధ్యమే.కాని ఆయా విధానాలు అనేక కారణాలవల్ల నశించాయి.వాటిని తిరిగి ఉద్ధరించడం సాధ్యమే అని మనకున్న స్వల్పజ్ఞానంతో మనకు అర్ధమౌతుంది.ఆ దిశగా రీసెర్చి సాగాలి.ఈక్రమంలో ఎవరి వ్యక్తిగత స్టైల్ వారికి ఏర్పడుతుంది.ఈ విధంగా చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత ఇక సెలవు తీసుకుని ఎవరిదారిన వాళ్ళు తిరుగు ప్రయాణం కట్టాము.

పుస్తకప్రదర్శనలలో మనకు కనిపించిన ప్రతిపుస్తకాన్నీ కొనకూడదు. మనకు నిజంగా అవసరమైన పుస్తకాలు ఎక్కడో ఒక స్టాల్లో దాక్కొని ఉంటాయి. వాటిని వెతికి పట్టుకోవాలి. శ్రీకాంత్ ఒక మంచి పుస్తకాన్ని అలావెతికి మరీ పట్టుకున్నాడు. స్వామిని శారదాప్రియానందగారు  "స్త్రీలు - వైదికనియమాల" గురించి వ్రాసిన ఒక మంచి పుస్తకం అది. హైదరాబాద్ సంస్కృత సమితి వాళ్ళు వేసిన విద్యారణ్యుల "వేదాంత పంచదశి" కూడా మాకు కనిపించిన మంచి పుస్తకాలలో ఒకటి. పదిహేనో శతాబ్దంలో డుండిరాజు వ్రాసిన 'జాతకాభరణం' ఇంకొక మంచిపుస్తకం.దీన్ని గొల్లపూడి వీరాస్వామి వారు వేశారు. సేనాపతిగారు 'హస్తసాముద్రికం' మీద వ్రాసిన పుస్తకమూ బాగుంది. అభినవగుప్తుని తెలుగుప్రజలకు పరిచయం చేసిన దేవరకొండ శేషగిరిరావుగారు 'కంచి పరమాచార్యుల ప్రసంగాల'మీద వ్రాసిన పుస్తకాలూ అద్భుతంగా ఉన్నాయి.  శ్రీకాంత్ కు చాలామంది పబ్లిషర్స్ తెలుసు. వారు వేసిన, వేస్తున్న పుస్తకాలగురించి చాలా విషయాలు చెప్పగలడు. 

తిరుగుప్రయాణంలో రైల్లో వస్తున్నపుడు న్యూస్ పేపర్ చూస్తుంటే, ఒక విషయం కనిపించింది.ఎవరో వెంకాయమ్మ అనే గుంటూరుజిల్లా మనిషి శిలువ వేయించుకుందట. అలా వేయించుకోమని జోసెఫ్ తంబి అనేవాడు స్టౌ మంటల్లో కనిపించి చెప్పాట్ట.అదంతా చదివితే ఒళ్లంతా కంపరం పుట్టింది.మనిషి అజ్ఞానంలో ఏ స్థాయికి దిగజారిపోతున్నాడో అర్ధం కాలేదు.కొత్తగా మతం మారినవాళ్ళకు మహాపిచ్చి ఉంటుంది.వాళ్ళే ఇలా ప్రవర్తిస్తారు. వాడెవడో కనిపించి శిలువ వేయించుకోమని చెప్పడమేంటో, ఆమె రెడీ కావడమేంటో, కొంతమంది ఆమెను పడుకోబెట్టి చేతులకు మేకులు కొట్టటం ఏంటో, ఇదంతా చదువుతుంటే వీళ్ళసలు మానవజన్మకు అర్హులేనా అనిపించింది.పిచ్చి అనేక రకాలు.వాటిలో మతపిచ్చి మరీ భయంకరమైనది.అసలైన హిందూమతాన్ని సామాన్యజనానికి విడమర్చి చెప్పి వారిచేత ఆచరింప చెయ్యలేకపోతున్నందుకే ఇలాటివాళ్ళు ఎంతోమంది ఇతరమతాలలోకి మారిపోతున్నారు.తిక్క తిక్క పనులు చేస్తున్నారు.

ఇలాటివాళ్ళు ప్రస్తుత హిందూమతంలో కూడా ఉన్నారు. అయ్యప్ప సీజన్లో వాళ్ళు చేసే గోలకూడా ఇలాటిదే. కేరళలో ఎవరైనా అయ్యప్పదీక్ష తీసుకుంటే పక్కింట్లోవాళ్లకుకూడా వారుచేసే పూజ గురించి తెలీదు.మన ఆంధ్రాలో మాత్రం ఆ ఊరి ఊరంతటికీ వీళ్ళుచేసే భజనలు వినిపించాలి. అదొక ఈగో శాటిస్ఫేక్షన్. రాక్షసులలాగా అర్ధరాత్రి సమయంలోపూజలు, అర్ధరాత్రి పిశాచభోజనాలు,అయ్యప్పో అయ్యప్పో అంటూ అరుపులు పొలికేకలు, అసలు వీళ్ళు మనుషులో కొరివిదెయ్యాలో అర్ధంకాదు.ఇదేం పిచ్చో అర్ధం కాదు.లోకంలో ఎక్కడ ఏజాడ్యం పుట్టినా దాన్ని అంటిన్చుకోడంలో తెలుగువాడు ముందుంటాడు. 

"మతం మత్తుమందు" అని మార్క్స్ అన్నది నిజమే అని చాలాసార్లు అనిపిస్తుంది. గొడవలు లేకుండా ప్రశాంతంగా సాగే విదేశీమతాలను చూచి మార్క్స్ ఆ మాట అన్నాడంటే, ఇక సంతలో కొలుపుల మాదిరిగా నేలబారుగోలతో సాగే ఇలాటి దీక్షలను చూస్తే ఇంకేమాట అనేవాడో?

నేనిలా అంటే కొందరు హిందూసోదరులకు నచ్చదు. వారిలా అంటారు. "ఇలాటి దీక్షలవల్లే ఏదోరకంగా మన మతం కనీసం బతికిఉంది. అయ్యప్ప దీక్షలవల్లే హిందూమతం బతికి బట్టకడుతోంది. లేకపోతే వీళ్ళందరూ ఎప్పుడో క్రైస్తవంలోకి మారి ఉండేవారు".అంటారు. ఇలాటి పనికిమాలిన బట్టలు కట్టుకోకపోతే నష్టం ఏమీ లేదని  నేనంటాను. శుభ్రంగా మంచిబట్టలు కట్టుకోవాలిగాని ఇలాటి బికినీలు వేసుకొని ఉపయోగం ఏముంది? తుమ్మితే ఊడే ముక్కు ఎప్పుడో ఒకసారి ఊడకతప్పదు. చవకబారుదీక్షలు చేస్తూ అదే అసలైన హిందూమతం అన్న పిచ్చిలో ఉన్న మనుషుల్ని హిందూమతంలో ఉంచడానికి ఇలాటి దీక్షలు ప్రోమోట్ చెయ్యాల్సిన అవసరం ఏమాత్రం లేదని నా భావన. క్రమేణా ఇలా దిగజారబట్టే ప్రస్తుతం మన హిందూమతం యొక్క మౌలికస్వరూపం ఎవరికీ తెలీకుండా పోయినంత అజ్ఞానంలో మనంఉన్నాం. పిచ్చిపిచ్చి దీక్షలను ప్రోమోట్ చెయ్యడం కాదు మనం చెయ్యాల్సింది. హిందూమతం యొక్క నిజమైన సిద్ధాంతాలను అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం జరగాలి.  ఇటువంటి పిచ్చిదీక్షలవల్ల అదెప్పటికీ జరగదు.

శిలువేయించుకున్న వెంకాయమ్మ బ్రతికింది గనుక సరిపోయింది. లేకుంటే అక్కడొక చర్చి కట్టి, ప్రతేడాదీ ఆరోజున అందరూ శిలువలమీద పడుకొని మేకులు కొట్టించుకునే దీక్షలు మొదలుపెట్టి ఉండేవారు. చిన్న పిల్లల్ని వీళ్ళే పడుకోబెట్టి మరీ మేకులు కొట్టేవారు. ఇటువంటి మనుషులకంటే జంతువులు నయం. అసలు మనదేశంలో ఇతరులకు అసౌకర్యం కలిగించే మత సంబంధమైన సామూహిక తంతులన్నింటినీ నిషేధించాలి అని నా భావన. మతం వ్యక్తిగతం. అది సైలెంట్ గా తనకూ దేవునికీ మధ్యన ఉన్న వ్యవహారం. దాని బజార్న పెట్టి, మైకులు పెట్టి, గోలగోల చేసే ప్రతితంతునూ నిషేధించాలి.దానితో బోలెడంత శబ్దకాలుష్యమూ భావకాలుష్యమూ లేకుండా పోతుంది. మనుషుల్లో కొంచం మానవత్వమూ, వివేచనా అయినా పెరుగుతాయి.

హిందూమతంలో గాని, ఇతరమతాలలోగాని అలాటి మంచిమార్పు మన చెత్తసమాజంలో ఇప్పట్లో వస్తుందన్న నమ్మకం నాకైతే లేదు.