“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

18, సెప్టెంబర్ 2011, ఆదివారం

లండన్ అల్లర్లకు కారణాలేంటి?

ఆ మధ్య లండన్ లో దోపిడీలు అల్లర్లు జరిగాయి. దానికి కారణాలేంటో ఇదమిత్థంగా ఎవరూ తేల్చి చెప్పలేదు. కానీ కొందరి ద్వారా నేను విన్నదాన్ని బట్టి దాని కారణాలు ఇవి.

ఇంగ్లాండ్ లో దాదాపు పది శాతం జనాభాకి పనీ పాటా లేదు. ప్రభుత్వమే వారికి కన్సెషన్ రేట్ లో అన్నీ సమకూరుస్తుంది. అతి తక్కువ ధరలో ఇల్లూ, ఫుడ్ కూపన్లూ, హెల్త్ సర్వీసూ అన్నీ ప్రభుత్వం నుంచి ఫ్రీ గా అందుతాయి. కనుక వారికి పని చెయ్యవలసిన అవసరం లేదు. బోలెడంత సమయం ఉంటుంది. ఏమి చెయ్యాలో తెలియదు. కనుక విలాస జీవితాలు గడుపుతున్న సంపన్నుల మీద వారి కన్ను పడుతుంది. ఇంగ్లాండ్ లో ఇప్పటికీ అరిస్తోక్రాట్ కుటుంబాలకు కొదవే లేదు. వాళ్ళ విలాస జీవితాలను చూచిన ప్రీ సర్వీస్ గాళ్ళకు దోపిడీ మీద మనసు పోవడం ఖాయం కదామరి.

ప్రస్తుతం ఇంగ్లాండ్ లో పెద్ద గొప్పవిగా చెప్పుకోదగ్గ పరిశ్రమలు ఏమీ లేవు. ఉన్న కొన్నింటినీ విదేశీ కంపెనీలు హస్తగతం చేసుకుంటున్నాయి. ఇక ఇంగ్లాండ్ కు మిగిలింది టూరిజం ఒక్కటే. టూరిజం మీద వచ్చే ఆదాయమే ప్రస్తుతం ఇంగ్లాండ్ కు ఉన్న అతి పెద్ద ఏకైక ఆదాయ మార్గం. అందులో ఎంతమంది ఉద్యోగాలు చెయ్యగలరు? కనుక నిరుద్యోగుల సంఖ్య అక్కడ బాగా పెరుగుతున్నది. 

పేదా గొప్పల మధ్య అంతరం బాగా పెరిగిన ప్రతి సమాజంలోనూ నేరాలు తప్పకుండా జరుగుతాయి. వ్యవసాయపనులు మొదలైన సామూహికపనులు లేని సమయాలలో దొంగతనాలు పెరగడానికి కారణం కూడా ఇదే. అందులోనూ పోలీసు వ్యవస్థ బలహీనం అయితే ఇక చెప్పే పనే లేదు. మన దేశంలో నక్సలిజం ప్రారంభానికి ఈ ఆర్ధిక అసమానతే మూలకారణం. ప్రస్తుతం ఇంగ్లాండ్లో జరిగిన అల్లర్లవెనుకకూడా ఇవేకారణాలు కనిపిస్తున్నాయి. జమైకానుంచి వచ్చిన బ్లాక్స్ అయినా, పనిలేక ఊరకేఉంటున్న బ్రిటిషర్లు అయినా, అందరూ కలిసి ఈ అల్లర్లకు దోపిడీలకు కారకులయ్యారు. 

ఇవన్నీ చూస్తున్నప్పుడు -- అన్నిటినీ మించి, ఆర్ధిక స్తితిగతులే మానవసంబంధాలను ప్రభావితం చెయ్యడంలో ప్రముఖపాత్ర వహిస్తాయి -- అన్న కారల్ మార్క్స్ ఆలోచన చాలావరకూ సరియైనదే అని నమ్మకతప్పదు.

ధనవంతులూ దరిద్రుల  మధ్యన అంతరాన్ని బాగా తగ్గించడమూ, అందరికీ సరియైన పని కల్పించడమూ -- ఈ రెండుపనులను సమర్ధవంతంగా చెయ్యగలిగిన ప్రభుత్వాలు ఉన్నదేశంలో శాంతిభద్రతలతో కూడిన సమాజస్థాపన పెద్దసమస్య కానేకాదు. 

అవి చెయ్యలేని సమాజంలో శాంతి అనేది నేతిబీరకాయలో నెయ్యి లాంటిదే. ఆ సమాజం పైపైకి శాంతిగా కనిపించినా అది రగులుతున్న అగ్నిపర్వతమే. ఆర్ధిక విషయాలకు కులమతాలూ జాతులూ దేశాలూ  భాషలూ అన్న భేదం లేదు. అవి ఎక్కడైనా ఒకటే అని ఈ సంఘటనలు నిరూపిస్తున్నాయ్.

ఈ పోస్ట్ చదివి గడ్డిపాటి అరుణ్ చంద్రగారు( http://krishnaveniteeram.blogspot.com) వ్రాసిన మెయిల్ ను ఇక్కడ ఇస్తున్నాను.
" మీ టపాలో కేవలం ఆర్థిక కారణాలే ప్రధానం అల్లర్లకు అని వ్రాశారు. కానీ ప్రధాన కారణం జాతి వివక్ష. మీరు ఉదహరించిన సౌకర్యాలన్నీ ప్రభుత్వం సమకూరుస్తుంది నిజమే కానీ అవన్నీ పెక్కుశాతం శ్వేతజాతీయులే దక్కించుకుంటారు. ఇతర జాతులవారి పరిస్థితి దుర్భరం. కేవలం రెండుపూట్లా అన్నం పెడితే చాలు పనిచేయటానికి సిద్ధంగా నల్లజాతి ప్రజలున్నారు నేడు ఇంగ్లాండు సమాజములో. వారుండే చోట సరైన వసతులుండవు, వారికి సామాజిక భద్రత ఉండదు. ఉదారవాద వలస విధానాన్ని అనుసరించి ప్రపంచములో అన్ని ప్రాంతాల నుంచీ జనాన్ని ఆహ్వానించి ఇప్పుడు వారిని పొమ్మనకుండా పొగపెడుతున్న ఫలితమే అల్లర్లు. పోతే ప్రపంచములో అత్యంత బలమైన పోలీసు వ్యవస్థ ఉన్న దేశాల్లో యు.కె ఒకటి."

"నవ్వులాట" శ్రీకాంత్ గారు ఇంకొక కొత్త కోణాన్ని నిన్న అందించారు.
మొదట్లో జరిగిన గొడవల్లో ఇద్దరు బ్లాక్స్ ను పోలీసులు కాల్చి చంపారు. అప్పుడు కొన్ని ఘర్షణలు జరిగాయి. ఆ సమయంలో పోలీసులు కొంత అలసత్వాన్ని ప్రదర్శించి ఊరుకున్నారు. గట్టి చర్యలు తీసుకోలేదు. దాన్ని అలుసుగా తీసుకుని ఘర్షణలు చెలరేగాయి. వీటికి తోడు జాతి వివక్షా, సామాజిక అసమానతలు ఆజ్యం పోశాయి. లండన్ అల్లర్ల వెనుక ఒకే కారణం లేదు. ఈ విధంగా చాలా కోణాలున్నాయి.