“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

12, సెప్టెంబర్ 2011, సోమవారం

నా పాట లక్ష

షిర్డీసాయిబాబా పాదుకలు ఊళ్లోకోచ్చాయని జనం విరగబడి చూడటానికి వెళుతున్నారు. వాటిని నెత్తిమీద పెట్టుకొని మొయ్యటానికి వాళ్ళలోవాళ్ళు పోటీలుపడి వేలంపాటలేసుకొని  మరీ ఎగబడుతున్నారు. ఇదంతా చూస్తె నాకు భలే వింతగా ఉంటుంది. వెర్రివెర్రి  అంటే వేలంవెర్రి అని సామెత ఒకటి ఉంది. జీసస్ శిలువపైన మరణవేదన పడుతుంటే, ఆయన తొడుక్కున్న అంగీకోసం లాటరీ చీట్లు వేసుకున్న రోమన్ సైనికులు నాకు గుర్తొస్తున్నారు. ఈ తతంగమంతా అలా ఉంది. చివరికి వేలంపాటలో ఒకాయన లక్ష రూపాయలకు పాటపాడి పాదుకలు మోశాట్ట. ఎందుకిదంతా చేస్తున్నారు? అని వాళ్ళలో ఒకన్ని అడిగాను. "అలాచేస్తే మంచి జరుగుతుంది." అని జవాబు వచ్చింది. నువ్వు మంచిగాజీవిస్తే మంచి జరుగుతుందిగాని పాదుకలు మోస్తే మంచి ఎలా జరుగుతుంది? ఒకవేళ జరిగినా, నీవు కష్టపడి సంపాదించుకోకుండా తేరగా వచ్చే మంచి నీదేలా అవుతుంది? అని అడిగాను. జవాబు లేదు.

మాకు తెలిసిన ఒకాయన ఒక ఊళ్ళో సాయిబాబా గుడి కట్టించిన ప్రముఖులలో ఒకడు. ఆ కమిటీ మెంబర్లలో అతి ముఖ్యుడు. ముందు ఆ గుడిని ఒకచోట ప్లాన్ చేసారు. కట్టుబడి చాలావరకూ అయిపొయింది కూడా. ఆ తరువాత కమిటీ మెంబర్లలో  వాళ్ళలోవాళ్లకు గొడవలోచ్చి రెండు కులవర్గాలుగా విడిపోయారు.  ఒక వర్గం వేరొకచోట స్తలంకొని మళ్ళీ అక్కడ గుడి కట్టటం ప్రారంభించారు. పాతగుడి మధ్యలో అలాగే ఆగిపోయి ఇప్పటికీ అలాగే అఘోరిస్తోంది. కొత్తగుడి మంచి హంగుగా వచ్చింది. జనం కిటకిటలాడుతుంటారు (గురువారం మాత్రం). నేనూ ఒకరోజు వెళ్లి చూశాను. అక్కడి సోకాల్డ్ ప్రముఖుల వేషాలూ, జనం ఎదురుగా అతిభక్తి నటించటమూ చూసి మళ్ళీ ఆ ఛాయలకు వెళ్ళలేదు. 

ఇంతకీ చెప్పొచ్చేదేమంటే, మాకు తెలిసిన ఆ ప్రముఖుడు ఆఊళ్ళో పెద్ద వడ్డీవ్యాపారి. ఆఊళ్ళో కదిలిస్తే అతనంటే ఎవ్వరికీ సదభిప్రాయం లేదు. తరువాత విచారిస్తే తేలిందేమంటే, ఆ కమిటీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఘనచరిత్ర ఉంది. సామాన్యంగా నిత్యజీవితంలో సక్రమంగా ఉండనివాళ్ళే ఇలా గుళ్ళూ గోపురాలూ కడుతుంటారు. వాళ్ళ చీకటి జీవితాలను సమర్ధించుకోటానికి  ఇదొక దొంగదారి. ఇలాంటి వాళ్ళని  చాలామందిని నేనెరుగుదును. ఈ మధ్యలో తామరతంపరగా వస్తున్న సాయిబాబాగుళ్ళూ, అయ్యప్పగుళ్ళూ అన్నీ పెట్టుబడిలేని పక్కా వ్యాపార కేంద్రాలని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఇంకొక డాక్టరున్నాడు. సమాజంలో మంచి పేరుంది. కాని తన దగ్గరికి వచ్చిన పేషంటును పంచవర్షప్రణాళిక టైపులో తిప్పుకుంటూనే ఉంటాడు. ఆరోగం పూర్తిగా తగ్గదు. తగ్గినట్లే ఉంటుంది. కానీ పూర్తిగా తగ్గదు. క్లినిక్కు మాత్రం కిటకిట లాడుతూ ఉంటుంది. ప్రతి పేషంటుకూ ఒకమాట మాత్రం చెప్తాడు. "నేను ఫలానా ఊళ్ళో సాయిబాబా గుడి కట్టించాను. వెళ్లి దర్శనం చేసుకుని రండి" అని చెప్తాడు. రోగి ఇక్కడ చెల్లించే ముడుపు చాలక అక్కడికెళ్ళి గుళ్ళో కూడా ముడుపు కట్టి రావాలి. ఇదీ తంతు.

పనీపాటా ఉద్యోగం సద్యోగం వ్యాపారం లేనివాళ్ళేవరైనా  ఉంటే వాళ్లకు ఒక మంచి చిట్కా ఉంది. ఒక చెట్టునో, పుట్టనో, ఫుట్పాత్  మీద ఒక మంచి చోటునో ఎంచుకొని అక్కడ సాయిబాబా ఫోటో పెట్టి నెమ్మదిగా పూజా పునస్కారాలు మొదలుపెడితే చాలు. ఒక రెండేళ్లకు అక్కడ పెద్ద గుడి లేవడం ఖాయం. అది సరిగ్గా రోడ్డుమధ్యలో ఉంటే మరీ మంచిది. జనాలే పక్కకు తప్పుకొని పోతారు. లేకుంటే వేరే రోడ్డు వేసుకుంటారు. ప్రతిదానికీ భయపడే మన దద్దమ్మ ప్రజలు అంతకంటే ఇంకేం చెయ్యగలరు గనుక ?

గుడి కట్టించిన వడ్డీ వ్యాపారైనా, ట్రీట్మెంట్ సరిగ్గా చెయ్యకుండా భక్తిముసుగులో వ్యాపారం చేస్తున్న  డాక్టరైనా, పాదుకలు మొయ్యడానికి బ్లాక్ మనీతో వేలంపాట పాడుతున్న ప్రముఖులైనా, పాదుకలు నెత్తిన పెట్టుకుని ఊరేగితే మంచి జరుగుతుంది అని నమ్ముతున్న సామాన్యుడైనా -- ఎవరైనా సరే, వీరంతా మరచిపోతున్న విషయం ఒకటుంది.  పొద్దున్న లేచింది మొదలు కుళ్ళు జీవితాలు గడుపుతూ సాయిబాబా పాదుకలు మోస్తేనో, పార్ట్ టైం దీక్షలు చేస్తేనో, లేక తమ అక్రమార్జనతో దేవుళ్ళకు నగలు చేయిస్తేనో తాము చేసిన పాపాలు అన్నీ హుష్ కాకీ అన్నట్లు  ఎగిరిపోతాయని అనుకుంటే అంతకంటే పిచ్చి భ్రమ ఇంకొకటి ఉండదు.

మనం చెయ్యవలసిన పని సక్రమంగా చెయ్యకుండా దేవుడికి లంచం ఇవ్వబోతే దానికి ఆశపడి దేవుడు మనం చెప్పినట్లు ఆడతాడు అనుకోవడం మన దిగజారుడు ఆలోచనకు నిదర్శనం. అక్రమసంపాదనతో కట్టించిన గుళ్ళలో ఏ దేవుడూ ఉండడు. వ్యాపార దేవాలయాలలో దైవత్వమూ ఉండదు. అసలిదంతా "స్లేవ్ మెంటాలిటీ" అని నా ప్రగాఢ విశ్వాసం. "మమ్మీ" సినిమాలో తనను వెంటాడుతున్న మమ్మీకి ఒకడు రకరకాల మతాల గుర్తులున్న బంగారువస్తువులు లంచాలుగా ఇవ్వబోతాడు. అతని అవస్తలన్నీ మౌనంగా చూస్తున్న మమ్మీ "స్లేవ్ మెంటాలిటీ" అన్న ఒక్క మాట మాత్రం అంటాడు. నిత్య జీవితానికి సంబంధం లేని భక్తి భక్తికాదు. అది "స్లేవ్ మెంటాలిటీ" మాత్రమే.

అనునిత్యం రుజుమార్గంలో నడిచేవాడికి ఏ గుళ్ళూ గోపురాలూ అక్కర్లేదు, అటువంటి వాడు  ఏ పాదుకలూ మొయ్యనక్కర్లేదు. అతని హృదయమే ఒక దేవాలయం. వాని హృదయంలోనే దైవం ఎల్లప్పుడూ కొలువై ఉంటుంది. అలా నడవనివాడు ఎన్ని పాదుకలు మోసినా ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా ఏ ఉపయోగమూ ఉండదు.

మన అతితెలివిని గమనించలేనంత తెలివితక్కువవాడు దేవుడని అనుకోవడం మన తెలివితక్కువతనం. మానవుడిగా సక్రమంగా జీవించలేనివానికి దైవత్వం అందుతుంది అనుకోవడం మానవుల వెర్రితనం మాత్రమే. అదెన్నటికీ జరిగే పని కాదు.