“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

3, మార్చి 2011, గురువారం

డాక్టర్ భానుమతీ రామకృష్ణ జాతకంలో కొన్ని విశేషాలు


భానుమతి గారి నాన్నగారు నిష్టగా కొంతకాలం సూర్యోపాసనా, అరుణ పారాయణమూ, గాయత్రీ జపమూ చేసిన తరువాత ఆమె పుట్టిందట. అందుకే ఆమెకు సూర్యుని పేరు కలిసివచ్చేటట్లు భానుమతి అని పెట్టారట. ఆమె ఆదివారం నాడు పుట్టింది. అందుకే ఆమె సూర్యవరప్రసాదిని అని వారి నాన్నగారు చెప్పేవారు.

అందుకు రుజువేమో అన్నట్లు ఆమె జాతకంలో సూర్యుడు స్వస్థానమైన సింహ రాశిలో బలంగా ఉన్నాడు. పౌరుషానికికారకుడైన కుజునితో కలిసి శుక్ర నక్షత్రంలో ఉన్నాడు. అందుకే ఆమె ఎంతటి వారినైనా ధీమాగా పలకరించి మాట్లాడగలిగేది. ఆమెలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని చూచి కొందరు ఆమెకు చాలా టెక్కు అని అనుకునేవారు. కాని నిజం అది కాదు. ఆమెదెంత మంచి మనసో దగ్గరి వాళ్లకు తెలుసు.

సామాన్యంగా, సినిమా రంగంలోని వారికి శుక్ర బలం ఉండాలి. భానుమతి ఆత్మ కారకుడు శుక్రుడే. కాని వీరి జాతకంలో శుక్రుడు నీచలో ఉన్నాడు. అటువంటప్పుడు ఈమె సినిమా రంగంలో ఎలా రాణించింది అని సందేహం వస్తుంది. అంటే శుక్రునికి నీచభంగం అయిఉండాలి. చంద్ర లగ్నాత్ నీచభంగం జరుగలేదు. అంటే వీరి లగ్నం సింహ వృశ్చిక కుంభ వృషభాలలో ఒకటి అయిఉండవచ్చు. ఒకవేళ లగ్నాలు కాకపొతే శుక్రునికి నక్షత్ర పరంగా పైన వివరించినట్లు రవి కుజులవల్ల యోగం పట్టిఉండాలి. (జనన సమయం తెలియక పోవడం వల్ల లగ్నాన్ని లెక్కించడం లేదు).

కారకాంశలగ్నం సింహం అయింది. అక్కణ్ణించి కొంత విశ్లేషణ చేసి చూద్దాం. సినిమా రంగానికి కారకుడగు శుక్రుడు కుటుంబ స్థానంలో నీచలో ఉండటం వల్ల, కుటుంబ జీవితానికి ఆమె ఎక్కువగా ప్రాధాన్యతను ఇచ్చి మొదటినుంచీ సినిమాలలో వేషాలు వెయ్యటానికి ఇష్టపడేది కాదు. శుక్రునికి ఉన్న సంగీత కారకత్వం వల్లనే, ఆమె గొప్ప సంగీత విద్వాంసురాలై ఉన్నప్పటికీ వారి తండ్రిగారు ఆశించినట్లు సంగీత రంగంలో ధ్రువతారగా నిలవలేకపోయింది. ఘంటసాల గారు భానుమతి ఎదుట పాట పాడటానికి జంకేవారంటే ఆమె సంగీత జ్ఞానం ఎంత లోతైనదో అర్ధమౌతుంది. ఆమె సినిమాలలో త్యాగరాజ కృతి గానీ, సాంప్రదాయ కీర్తనలు గానీ ఏవో ఒకటి తప్పకుండా ఉండేవి. ఆమె పాడిన "నగుమోము గనలేని" కీర్తన ఒక్కటి చాలు ఆమె స్థాయి ఏమిటో చెప్పటానికి. ఇంత చక్కని సంగీత జ్ఞానం ఉండీ ఆమెకు ఆ రంగంలో సరైన పేరు ప్రఖ్యాతులు రాకపోవడానికి కారణం శుక్రుడు నీచ స్థితిలో ఉండటమే.

చంద్రునికి కేమద్రుమ యోగం ఉండటం కూడా ఈ జాతకానికి ఒక దోషమనే చెప్పాలి. చంద్రునిపైన గురు దృష్టి ఉన్నప్పటికీ ఆ గురువు వక్రించి బలహీనంగా ఉండటం వల్ల అదంతగా ఉపయోగించలేదనే అనుకోవాలి. చంద్రునితో గుళిక కలిసి ఉండటం వల్లకూడా ఆమెకు రావలసిన ఖ్యాతి రాకపోవడానికి ఒక కారణం. తొమ్మిదింట క్షీణచంద్రునివల్ల ఆమె తండ్రిగారికి కొంతనిరాశనే మిగిల్చినదని చెప్పాలి.

బుధాదిత్య యోగంవల్ల ఈమెకు చిన్నప్పుడే గంటకు వంద పద్యాలు వ్రాసే శక్తి ఉండేది. చిన్నప్పుడే కర్నాటక, హిందూస్తానీ సంగీతాలలో మంచి ప్రతిభ ఈమెకు ఉంది. సంగీతమూ, సాహిత్యమూ, నటనా శక్తీ సహజంగా ఈమెకు పట్టుబడ్డాయి.

ఇక వీరి జాతకంలో ఆధ్యాత్మిక యోగాలు చూద్దాం. ఆధ్యాత్మిక చింతనా కారకుడైన శని ఉచ్ఛస్థితిలో ఉండటము, ఆయనదృష్టి గురువు మీద, చంద్రుని మీద ఉండటం వల్ల మంచి ఆధ్యాత్మిక చింతన అలవడింది. విలాసాలు, డబ్బు కోసం అందరూఅర్రులు చాచే అవకాశాలు ఈమెకు వెతుక్కుంటూ వస్తే, వాటిని కాదనుకొని మామూలు మధ్యతరగతి గృహిణిగాఉండటాన్నే ఇష్టపడిన ధీర వ్యక్తిత్వం ఈమెది.జ్యోతిష్య కారకుడగు బుధుడు దశాంశలో ఉచ్ఛ స్థితి వల్ల ఈమెకు మంచిజ్యోతిష్య సాముద్రిక జ్ఞానం పట్టుబడింది. ఇవే కారణాలవల్ల ఈమెకు మంచి ఉపాసనా బలం కూడా ఉండేది.

వింశాంసలో రాహుకేతువుల వృశ్చిక స్థితివల్లా, గురు శనుల పరస్పర దృష్టి వల్ల ఈమెకు శ్రీ విద్యోపాసనా యోగం కలిగింది. అనేక జన్మల నుంచి ఈమె అమ్మవారి ఉపాసకురాలని ఈమెను చూస్తూనే శృంగేరి శంకరాచార్యులు చెప్పారు. ఆయనేపిలిచి మరీ బాలా మంత్రాన్నీ, నవాక్షరీ మంత్రాన్నీ ఉపదేశించారు. శ్రీ చక్ర పూజా విధానాన్ని నేర్పించారు.

భానుమతి గారి జ్యోతిష్య శక్తికి చాలా మచ్చుతునకలున్నాయి.

>>తమ యూనిట్లోని రాజు అనే టెక్నీషియన్ చేయ్యిచూచి అతని ఆయుష్య రేఖ మధ్యలోనే తెగిపోయి ఉండటం వల్ల ఆ విషయం అతనితో చెప్పకుండా తన గురువుతో ఇతరులతో చర్చించి ప్రమాదం ఉందని లీలగా సూచించారు. సైనస్ ట్రబుల్ తప్ప ఇంకే రోగమూ లేని అతను అలాగే హటాత్తుగా మరణించాడు. ఈ విషయం ఆమె వ్రాసిన ఆత్మకథ "నాలో నేను" లో చూడవచ్చు.

>> ఒక వ్యక్తి జాతకాన్ని చూచి అతనికన్నా వయసులో పెద్దదైన వ్యక్తి భార్యగా వస్తుందనీ ఆమె పేరు "ఉ" అన్న అక్షరంతో మొదలౌతుందనీ ఆమె చెప్పారు. అలాగే జరిగింది. ఇలాటి జోస్యాలు ఆమె ఎన్నో చెప్పారు. చాలా వరకు అవి నిజమయ్యేవి.

>>ఆమె తను మరణించబోయే సమయాన్ని ముందుగానే చెప్పారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. తానుమళ్ళీ పుడతానని కూడా చెప్పారు. తను పోయిన సమయంలో పక్కన ఉన్నవారికి ఒక జ్యోతి కనిపిస్తుందని చెప్పారు. అలాగే జరిగింది. ఆమెకు పుత్రసమానుడైన ఒక వ్యక్తి సమయంలో పక్కనే ఉన్నారు. మనం సినిమాలలో చూసేటట్లుగా ఒక జ్యోతి ఆమె శరీరంలోనుంచి బయటకు వచ్చి శూన్యంలో కలిసిపోవటం అతను చూచాడు. చెప్పినా ఎవరూ నమ్మరని ఆయన ఎవరికీ విషయం చెప్పలేదు.


సినిమా రంగంలో ఉండికూడా అటువంటి విశిష్ట జీవితం గడిపిన వాళ్ళు కొందరే ఉంటారు. అందులోనూ అటువంటిబహుముఖ ప్రజ్ఞావంతులు అరుదుగా ఉంటారు. పాతతరంలో అటువంటివాళ్ళు ఉండేవారు. తెలుగు భాష రాని, వత్తులుపలకని, ఇప్పటి చెత్త నటులకు ఇలాటి విషయాలు చెపితే కనీసం అర్ధం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. కొన్నాళ్ళు పొతే, విషయాలు అంతా మాయ మాటలని కొట్టి పారేస్తారేమో అనిపిస్తుంది. అలాటి స్థితికి సినిమా రంగం దిగజారింది. ఒకప్పుడు కళారంగంలో "ఆర్టిస్టిక్ జెయింట్స్" ఉండేవారు. ఇప్పుడో "కల్చర్ లెస్ పిగ్మీస్" కనిపిస్తున్నారు.

కళారంగానికి కళతప్పి పూర్తిగా డబ్బు, కులం, పైరవీలు, నటన చేతకాని నటులు, డైలాగు స్పష్టంగా చెప్పలేని హీరోలు, తెలుగు బొత్తిగారాని హీరోయిన్లు, పిల్లికూతల పాటగాళ్ళు, కాపీరైటర్లు, కోతిడాన్సర్లు, వెకిలిహాస్యగాళ్ళు ఇలాటి చెత్త మనుషులతో నిండిపోవటం, జనం కూడా అలాటి సినిమాలనే ఎగబడి చూస్తూ అవే కళాఖండాలని ఆరాధించటం చూస్తుంటే , వీళ్ళ చీప్ టేస్ట్ చూసి ఏడవాలో నవ్వాలో లేక అంతా కలిమాయ అని ఊరుకోవాలో అర్ధం కావటంలేదు మరి.