Love the country you live in OR Live in the country you love

28, మార్చి 2010, ఆదివారం

శ్రీ రామచంద్రుని జాతకం-వివాదాస్పద అంశాలు

శ్రీ రామచంద్రుని జాతక చక్రం మీద కొన్ని జ్యోతిష పరమైన వివాదాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన దాన్ని ఇప్పుడు పరిశీలిద్దాము.

రవి మేషరాశిలోనూ చంద్రుడు పునర్వసు నక్షత్రంలోనూ ఉండగా నవమి తిధి రాదు అనే వివాదం చాలా పాతవిషయం. విషయాన్ని కొందరు జ్యోతిష పరిశోధకులు మొదటిసారిగా ఎస్ట్రలాజికల్ మేగజైన్ లో నలభై ఏళ్ళ క్రితంరాశారు.

రవికి మేషరాశిలో 10 డిగ్రీలు పరమోచ్చ. ఒక తిధికి 12 డిగ్రీలు. ఎనిమిది తిధులు పూర్తి అయితే 96 డిగ్రీల దూరం రవిచంద్రులమధ్యన ఉంటుంది. రవి తన పరమోచ్చ బిందువులో ఉంటే వీరు చెప్పినట్లు 10+96= 106 డిగ్రీ అవుతుంది. ఇది పుష్యమి నక్షత్రం ఒకటో పాదంలో పడుతుంది. కనుక ఇది సాధ్యం కాదు.

రామాయణ కాలం కొన్ని వేల సంవత్సరాల క్రితం గడిచింది. అప్పటికి ఇప్పటికి కాల గమనంలో మార్పులు వచ్చాయి. ఋతువుల సమయాలు మారాయి. విషయాలు మనం రామాయణంలోని ఋతువర్ణనలు అప్పటి గ్రహస్థితులనుగమనిస్తె తెలుస్తుంది. దీనిమీద Dr Vartak గారి రీసెర్చి ఇక్కడ చూడవచ్చు. డాక్టర్ వర్తక్ గారు చాలా పరిశోధన చెసి 4-12-7323 BC శ్రీరాముని జనన తేదిగా నిర్ధారించారు. ఆ రోజున రవి మేష రాశిలో రెండు డిగ్రీలలో ఉన్నాడు. కనుక చైత్ర నవమి తిధి సంభవమే.

ప్రస్తుత గ్రహ గతులను స్థితులను బట్టి చూస్తే వాల్మీకి మహర్షి ఇచ్చిన చైత్ర నవమి తిథి అసంభవం అని తోచినా, రామాయణ కాలం నాటి గ్రహస్తితులని గమనిస్తే అది అసంభవం కాకపోవచ్చు.

తరువాత, ఇంకొక విషయం ఏమనగా, నేడు మనం కంప్యూటర్ ద్వారా వేస్తున్న జాతకచక్రాలు దృగ్గణిత రీత్యా గణిస్తున్నాము. ఈ విధానం ఈ మధ్యన వచ్చిన విధానం. ఇది రాక ముందు మన దేశంలో వాక్య పంచాంగముల ఆధారంగా గ్రహ గణితం చేసేవారు. నాడీ గ్రంధాలు అన్నీ వాక్య పంచాంగం ఆధారితములే. అందుకే వారిచ్చె కుండలికీ, కంప్యూటర్ కుండలికీ ముఖ్యంగా బుధుని విషయంలో తేడాలుంటాయి. మహర్షి వాల్మీకి కాలానికి వాక్య పంచాంగముల రీత్యా గణితం జరిగి ఉండవచ్చు. దాన్ని బట్టి ఈ గ్రహస్తితి సాధ్యం కావచ్చు.

ఇదంతా ఊహాగానం అని చెప్పలేము. ఎందుకనగా, మహర్షులు అసత్య వాదులు కారు. కనుక వారి మాటలను బట్టి మన లెక్కలు సవరించుకోవడం సరి అవుతుంది గాని తద్విరుద్ధం సరి కాదు.