“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

4, మార్చి 2010, గురువారం

కుహనా స్వాముల రాసలీలలు- గురు చండాల యోగం


నిన్న వెలుగులోకి వచ్చిన నిత్యానందస్వామి ఉదంతం అత్యంత బాధాకర మైన విషయం.ప్రస్తుతం అనేకఆశ్రమాలు,బాబాలు తామర తంపరగా పుట్టుకు వస్తున్నారు.గుడ్డిజనం కూడా వాళ్ళను గుడ్డిగా నమ్ముతున్నారు. చివరకు మోసపోతున్నారు. ఆశ్రమాలు దొంగ వ్యాపారులకు, డ్రగ్ మాఫియాలకు, హైక్లాస్ వ్యభిచారానికి నిలయాలుగా మారుతున్నాయి.అవినీతితో కుళ్ళిపోతున్న నేటి సమాజానికి ఇటువంటి అవినీతి గురువులే గతేమో అనిపిస్తున్నది.

ఆధ్యాత్మికత అనేది తేలికగా డబ్బులిచ్చి కొనుక్కునే వస్తువు కానేకాదు. అసలు దీనికి డబ్బుకు ఎటువంటి సంబంధమూలేదు.మచ్చలేని, నిరాడంబర జీవితం గడిపిన రామకృష్ణ పరమహంస,రమణమహర్షి వంటి బ్రహ్మజ్ఞులే నిజమైన జగద్గురువులు.ఆధ్యాత్మిక పురొగతి పొందటం అనేది ప్రపంచంలో అత్యంత కష్టమైన పని. అది ధనంతో దొరికేది కానే కాదు.డబ్బులిచ్చి కొనుక్కునే పాదపూజలు,దర్శనాల వల్ల అందే వస్తువు కాదు. అలా దొరికే పనైతే,బుద్ధుని వంటి మహారాజులు, రాజ్యాలు త్యజించి తపస్సు చెయ్యవలసిన అగత్యం లేదు. వివేకానందుని వంటి పవిత్రాత్ములు అంతగా కష్టపడి, తిండీ నీళ్ళూ మానుకుని, ఏళ్లకేళ్ళు సాధన చెయ్యనవసరం లేదు.

నేటి విలాసవంతమైన ఆశ్రమాలకు, ఆధ్యాత్మిక జీవితానికి ఎన్నటికీ పొత్తు కుదరదు.విలాస జీవితం గడుపుతూ,విగ్గులు ధరిస్తూ, జుట్టుకు గడ్డానికి రంగు వేసుకునే బాపతు నేటి గురువులు ఎన్నటికీ ఆధ్యాత్మిక ఔన్నత్యం పొందలేరు.స్త్రీ సాంగత్యం మనసా వాచా కర్మణా త్యజించనివాడు సాధకుడే కాలేడు ఇక గురువుగా ఎలా కాగలడు? ఇతరులకు మార్గదర్శనం అసలే చెయ్యలేడు.గురువు అనే మాటకు అర్హత సంపాదించలేడు.ఒక మహనీయ సాధువు ఏమి చెప్పారంటే, ఇటువంటి దొంగ గురువులు భయంకరమైన చెడు కర్మను పోగు చెసుకుంటున్నారు.వారికి భగవంతుని చేతిలో హీనమైన శిక్షలుంటాయి.వారి తరువాతి జన్మలు చాలా నీచంగా, దారుణమైన బాధలతో, మోస పూరిత జీవితాలతో కూడి ఉంటాయి.

భగవద్గీతను,వేదాలను బట్టీపట్టినంత మాత్రాన, స్టేజీలెక్కి ఉపన్యాసాలిచ్చినంత మాత్రాన ఎవడూ గురువు కాలేడు. పవిత్ర జీవితాన్ని గడపని వానికి ఆధ్యాత్మిక లోకంలో ప్రవేశం దొరకదు. వాటిలో ఉన్న విషయాలను జీవితంలో ఆచరించటం ముఖ్యం. ఒకడు గనుక ఈ గ్రంధాలేమీ చదువక పోయినా,వాటిలోని విషయాలను ఆచరిస్తున్నట్లైతే అతడు ఇటువంటి కుహనా గురువుల కంటే ఎంతో ఉన్నతుడు.

శ్రీ రామకృష్ణుని మాటలలో చెప్పాలంటే--భగవంతుని ముఖాముఖి దర్శించిన వాడే గురువు అనే పదానికి అర్హుడు. పరమహంస యోగానందగారి మాటలలో చూస్తే--సంకల్ప మాత్రాన సవికల్ప,నిర్వికల్ప సమాధి స్థితులను అందుకోగల సామర్ధ్యం ఉన్నవాడె నిజమైన యోగి మరియు సద్గురువు అనబడతాడు.

అటువంటి సామర్ధ్యం ఆషామాషీ వ్యవహారం కాదు. కోట్లమందిలో ఒకనికి మాత్రమే అది వీలవుతుంది. లేదా అదీ వీలు కాకపోవచ్చు.రమణ మహర్షిమాటలో చెప్పాలంటే-- నేను గురువును అన్న స్పృహ లేనివాడే గురువు అవగలడు.

నీ గురువుని పగలే కాదు రాత్రి కూడా నిశితంగా గమనించు, పరిశీలించు. అతడు మచ్చలేని ప్రవర్తన కలవాడని తెలిన తరువాతే అతనిని గురువుగ అంగీకరించు-- అని శ్రీ రామకృష్ణులు తన శిష్యుడైన యోగానందస్వామికి చెప్పారు.

నలభై ఏళ్ళక్రితం అమెరికాలో సిద్ధయోగం అన్న పేరుతో అనెక ఆశ్రమాలు స్థాపించి, చివరకు సెక్స్ కుంభకోణాలతో వివాదాస్పదుడైన నిత్యానంద పరమహంసకు, ప్రస్తుత కుర్రకుంక వారసుడు.అసలు నిత్యానందుడూ ఇటువంటి వాడే. ఇతగాడూ అటువంటివాడే. బహుశా ఇతడు గురువుని మించిన శిష్యుడు కావచ్చు.

ఈ సందర్భంగా ఒక జ్యోతిష విచిత్రాన్ని గమనించాను. మత గురువులకు సూచకగ్రహం గురువు.పోయినేడాది గురువు మకరరాశిలో నీచస్థితిలో ఉన్నపుడు,మంత్రాలయం మఠం మునిగిపోయింది.కాని అది సత్సాంప్రదాయ మఠం. సద్గురువైన శ్రీరాఘవేంద్రుని ఆలయస్థానం.ఆ సమయంలో కుహనా గురువుల లీలలు బయట పడలేదు.ఎందుకనగా,మకరరాశిలో ఉత్తరాషాఢ,శ్రవణం,ధనిష్టా నక్షత్రాలున్నాయి.ఇవి రాహు నక్షత్రాలు కావు. కనుక కుహనా గురువుల బండారాలు బయటపడలేదు. మంచి గురువులకే బాధలు,కష్టాలు వచ్చాయి.

కాని ప్రస్తుతం గురువు, రాహు నక్షత్రమైన శతభిష లో సంచారం చెస్తున్నాడు. గురువుకు,రాహుసంబంధం కలిగితే అది గురుచండాలయోగం అనబడుతుంది. ప్రస్తుతం అది నక్షత్రపరంగా ఉంది.ఈ సమయంలోనే కుహనా గురువులగురించి చండాలమైన విషయాలు బయటపడుతున్నాయి. సమాజం మీద గ్రహప్రభావానికి ఇది ఒక ఉదాహరణ. ఇది మేదినీ జ్యోతిష పరంగా ఒక గమనిక.

ప్రస్తుతం, ఫిబ్రవరి పద్దెనిమిదో తారీకు నుంచి నిన్నటివరకూ గురువు కుంభరాశిలో అయిదవ నవాంశలో సంచరిస్తున్నాడు.ఈరోజు ఆరవ నవాంశలో ప్రవేశించాడు. అయిదవ నవాంశ అనగా, కుంభ వర్గోత్తమాంశ అవుతుంది. ఈ రోజునుంచి మీననవాంశలోకి ప్రవెశించాడు. కనుక నిన్నటి వరకూ శనిరాశిలొ శనినవాంశలో,రాహు నక్షత్రంలోఉన్నాడు కనుక నవాంశ మారబొయే ముందు అనగా 3-3-10 న కుహనా గురువుల జుగుప్సాకర వ్యవహారం బయటపెట్టాడు. ఈ రోజునుంచి స్వనవాంశలోకి ప్రవేశం కనుక ఆ అవకాశం లేదు. కనుకనే నిన్న ఈ విషయం బయట పడింది.

కలియుగంలో ఇటువంటి నీచగురువులు ఎక్కడ పడితే అక్కడ తయారౌతారని మన పురాణగ్రంధాలలో వ్యాస భగవానుడు చెప్పాడు. బ్రహ్మంగారు కూడా తన కాలజ్ఞానంలో చెప్పారు. నిజమైన గురువులు, నిజమైన శిష్యులు నేటి కాలంలో చాలా అరుదు. నిజమైన డైమండ్ అరుదుగా ఉంటుంది.విలువలేని అమెరికన్ డైమండ్స్ ఎక్కడ పడితే అక్కడే దొరుకుతాయి.కాని ఈ పతనం ఆధ్యాత్మికలోకానికి కూడా సోకటం, సమాజంలో అన్నీ కల్తీ అవుతున్నట్లే ఈ రంగమూ కావటం బాధాకరం అయిన విషయం.