“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

21, మార్చి 2010, ఆదివారం

వికృతి నామ సంవత్సరం-తిథి ప్రవేశ కుండలి

మన వైదిక పంచాంగంలో రోజు అనేది సూర్యోదయంతో మొదలౌతుంది. కనుక ముందటి పోస్ట్ లొ సూర్యోదయ కాలపు గ్రహ స్తితిని పరిగణనలోకి తీసుకున్నాను. బీవీ రామన్ గారు కూడా దేశ జాతకాలను ఇలాగే వివరించేవారు.

కొన్ని ఇతర పద్ధతులలో తిధి ప్రవేశ కుండలి ప్రామాణికంగా తీసుకుంటారు. ఇది కూడా ఒక సరియైన విధానమే. తిథి అనేది సూర్య చంద్రుల మధ్య దూరం.కొత్త సంవత్సరం చైత్ర శుక్ల పాడ్యమి తో మొదలౌతుంది. సమయం ఎప్పుడైనా మొదలు కావచ్చు. సూర్యోదయంతోనే మొదలు కావాలని నియమం లేదు. ప్రస్తుతం, పదిహేనో తేదీ రాత్రి తెల్లవారితే పదహారో తేదీన 2.31.45 గం-ని-సెకన్లకు హైదరాబాదులో కొత్త తిథి మొదలైంది. సమయానికి గ్రహస్తితి ఇక్కడ ఇచ్చాను.

ఏడాదికి కుదించిన వింశోత్తరీ దశ ఇలా ఉంది.

మార్చి 16 నుంచి మార్చి 23 వరకు --గురు/రాహు దశ: దశాచిద్రం కనుక నాయకులు మోసాలు చెయ్యటం,మోసగించబడటం ఉంటుంది. ఉగ్రవాదులు రాజధానిలో తిష్ట వెయ్యవచ్చు.

మార్చ్ 23 నుంచి మే 23 వరకు--శని దశ: దశమంలోని వక్ర శని వల్ల పరిపాలన కుంటుపడుతుంది. నిమ్న వర్గాలు,ప్రజలు ప్రభుత్వం మీద తీవ్ర వత్తిడులు తెస్తారు. అంటే తెలంగాణా ఆందోళన మళ్ళీ ఉధృతం కావచ్చు. మూడో దృష్టివల్ల విపరీత ఖర్చులు ఉంటాయి. సప్తమ దృష్టివల్ల, సుఖ స్థానంలో ఉన్న నాలుగు గ్రహాల కూటమి బాధింపబడుతుంది. బుధుని నీచ వల్ల,అధికారుల ప్లానింగ్ దెబ్బతింటుంది. కొన్ని వర్గాల ప్రజలకు అమితానందం కలుగుతుంది. పదో దృష్టివల్ల లగ్న సప్తమ రాహు కేతు ఇరుసు బాధింపబడుతుంది. కుండలి రెండుగా చీలిపోతుంది. అంటే తెలంగాణా వచ్చే సమయం ఇదేనా? ఏప్రియల్ 14 అమావాస్య, 28పూర్ణిమ,మే14అమావాస్యలకు కొంచం అటూఇటూగా ఈ సంఘటనలు జరుగవచ్చు.

మే 23 నుంచి జూలై 14 వరకు--బుధ దశ: నీచ బుధుని వల్ల, అధికారుల,ప్రతిపక్షాల, నాయకుల నీచపు ప్లానులు అమలవుతాయి.

జూలై 14 నుంచి ఆగష్టు 5 వరకు--కేతు దశ: ప్రతిపక్షాలు ఇబ్బందికర స్తితిలో పడతాయి. అనుకోని హటాత్ సంఘటనలు,ప్రమాదాలు జరుగుతాయి.

ఆగష్టు 5 నుంచి అక్టోబర్ 5 వరకు--శుక్ర దశ: ఉచ్చ శుక్రుని వల్ల, ప్రజా జీవనం కుదుట పడుతుంది. సమాజంలో ప్రెమ వ్యవహారాలు, అక్రమ సంబంధాలు ఊపందుకుంటాయి.విలాసాలు,విందులు,వృధా ఖర్చులు ఎక్కువ అవుతాయి. మార్కెట్ పరిస్తితి బాగుంటుంది.

అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 23 వరకు--రవి దశ: ఒక ప్రముఖ నాయకుని ఆరోగ్యం దెబ్బతినటం, లేదా మరణం సంభవిస్తుంది. అది జలప్రమాదం వల్ల, లెదా ఊపిరితిత్తుల వ్యాధివల్ల కావచ్చు.

అక్టోబర్ 23 నుంచి నవంబర్ 23 వరకు--చంద్ర దశ:ప్రజాజీవనంలో సుఖం లోపిస్తుంది. అనేక ఆటుపోట్లకు సమాజం గురవుతుంది.

నవంబర్ 23 నుంచి డిశెంబర్ 14 వరకు--కుజ దశ: అగ్ని ప్రమాదాలు,జల ప్రమాదాలు జరుగుతాయి. ఉత్తరాన రహస్య కుట్రలు,ఉగ్ర వాద చర్యలు జరుగవచ్చు.

డిశెంబర్ 14 నుంచి ఫిబ్రవరి 8 వరకు--రాహు దశ:మళ్ళీ నాయకుల, అధికారుల కుట్రలు కుతంత్రాలు ఊపందుకుంటాయి.సమాజంలో మోసాలు తాండవిస్తాయి.

ఫిబ్రవరి 8 నుంచి మళ్ళీ ఉగాది వరకు: గురుదశా శేషం: ప్రజల్తో నాయకుల సంబంధాలు మెరుగు పడతాయి. కాని నాయకత్వంలో నిరాశా నిస్పృహలు ఆవరిస్తాయి.

పైన సూచించిన ఘటనలు ఆయా నెలలలో అమావాస్య,పౌర్ణమి లకు అటూ ఇటూగా జరుగవచ్చు.