“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

26, జనవరి 2009, సోమవారం

కాల సర్ప యోగం- ముఖ్య సమాచారం

జ్యోతిష్యానికి ఆద్యులైన భ్రుగు,కశ్యప,గర్గ, పరాశర, జైమిని ఇత్యాది మహర్షులు గాని తరువాత ఎన్నో వేల ఏండ్ల కు వచ్చిన సత్యాచార్యాది ఆచార్యులు గాని, జైన గురువులు గాని, వరాహ మిహిరుడు గాని, తరువాతి వారైన మంత్రేస్వరుడు, కళ్యాణ వర్మ, వైద్యనాథ దీక్షితుడు, వెంకటేశ దైవజ్ఞుడు, కాళిదాసు ఇత్యాది దైవజ్ఞులు తమ తమ గ్రంధాలలో వందల కొలది రాజ యోగాలను, భాగ్య యోగాలను, దరిద్ర యోగాలను, నాభస యోగాలను, మహాపురుష యోగాలను, ఆయుర్ యోగాలను చర్చించారు. కాని ఒక్కరు కూడా కాల సర్ప యోగాన్ని గురించి ఎక్కడా చెప్పలేదు. ఒక్క వరాహ మిహిరుడు మాత్రమె దీన్ని ఒక శ్లోకం లో చెప్పాడు. అది ఇంతకూ ముందు పోస్ట్ లో రాసాను. ఆయన కూడా "రాజా రాష్ట్ర వినాశనం" అని దేశానికి జరుగబోయే ఫలితమే చెప్పాడు గాని ఎక్కడా ఇది వ్యక్తీ గత జాతకాలలో పని చేస్తుంది అని చెప్పలేదు. అంత మాత్రం చేత దీనిని పూర్తిగా పక్కన పెట్టమని చెప్పటం లేదు. అతి ప్రాముఖ్యతా ఇమ్మని చెప్పడం లేదు. ఇంత మంది మహర్షులు, దైవజ్ఞులు ఒక్కరు గూడా ఈ యోగాన్ని చెప్పలేదు. నేటి కుహనా జ్యోతిష్కులు ఎందుకు ఇంత గొడవ చేస్తున్నారో వారికే ఎరుక. నిజానికి రాహు కేతువులు గ్రహాలు కాదు. గణిత బిందువులు మాత్రమె. కానీ వాటికున్న ప్రభావ రీత్యా గ్రహాల స్థానం కల్పించబడింది. అందుకే వాటిని చాయా గ్రహాలన్నారు. వాటికి సొంత ఇల్లు లేదు. కాని తరువాతి వారెవరో స్వక్షేత్రాలు, ఉచ్చ నీచాలు, మూల త్రికోనాలు కల్పించారు. ఉచ్చ నీచలలో కూడా భేదాభిప్రాయాలు ఉన్నవి. కొందరు వృషభం కొందరు మిథునం అంటారు రాహువుకు. సాధారణ సర్ప దోషం లో కూడా పంచమానికి రాహువుతో బాటు కుజ సంబంధం ఉంటేనే అది దోషం. ఉత్త రాహువు ఏమీ చెయ్యదు. పరాశర మహర్షి వీరి గురించి చెబుతూ వారు ఉన్న రాసిని బట్టి, కలసి ఉన్న గ్రహాలను బట్టి ఫలితాలు ఇస్తారు అన్నాడు. మన కున్న వారాలు ఏడే, అలాగే గ్రహాలు ఏడే. రాహు కేతువులు చాయా గ్రహాలు మాత్రమె. పరాశర మహర్షి ఇంకా చెప్పారు. రాహు కేతువులు కేంద్ర కోణ అధిపతుల సంబంధంతో రాజ యోగాన్ని ఇస్తారని. కాల సర్ప యోగ జాతకులలో చాలా మంచి లక్షణాలు ఉంటాయి. ఉదాహరణకి: కష్ట పడి పని చేసే తత్వం, ఇతరుల బాధలకు చలించే తత్వం, విశాల దృక్పథం, విధి కి ఎదురీదే పట్టుదల ఇత్యాది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే కాల సర్ప యోగం ఒక బూచి కాదు. దానికి పరిహార క్రియలు ఎవరి ఇష్టానుసారం వారు చేస్తున్నారు కాని ఆధారాలు లేవు. ట్రయల్ ఎండ్ ఎర్రర్ పద్దతిలో నేటి జ్యోతిష్కులు మనుషుల మీద ప్రయోగాలు చేస్తూ నేర్చుకుంటున్నారు. అందరూ కాదు లెండి కొందరు. కనుక కాల సర్ప యోగాన్ని దాని పనికి దాన్ని ఒదిలి మిగిలిన యోగాలు, గ్రహ బలాలు, దశలు, గోచారం వీటిని బట్టి పరిహారాలు చేస్తే ఆయా జాతకుల బాధలు తప్పక తీరుతవి. కాల సర్ప యోగాన్ని బూతద్దంలో చూపుతూ అనవసర రాద్ధాంతం పనికి రాదనీ మాత్రమె నేను చెప్పేది.