“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

22, జనవరి 2009, గురువారం

కాల సర్ప యోగం-౨

కాలసర్పయోగంలో జన్మించిన జాతకులు చాలా బాధలు పడతారు. కాని ఇతర యోగాలు ఉంటే చాలావరకు దీని ప్రభావం తగ్గుతుంది.శుభ యోగాలు ఉన్నా అవి నలభై రెండు ఏళ్ల తర్వాత గాని దశలుగా రావు. కొందరికి 33 ఏళ్లకు ఈ యోగం వదలడం మొదలు పెడుతుంది. వీరికి పూర్వ జన్మ లో చాలా తీరని కర్మలు ఉంటాయి. అందువల్ల ఇతరులపరంగా వీరి జీవితం చాలా ఒడి దుడుకులు పడుతుంది. ప్రతిదీ లేటైతుంది.

ఇక పొతే రెమెడీస్ గురించి.

తీవ్ర కాలసర్పయోగం ఉన్నప్పుడు వీరికి సహాయం చెయ్యాలి అనుకున్న జ్యోతిష్కుడు శక్తి చాలని వాడైతే యమబాధలు పడతాడు.ఎందుకంటే వీరికి సర్పశాపం ఉంటుంది. పూర్వజన్మలలో గాని, లేదా వీరి వంశంలో ఎవరోగాని జాతి సర్పాలను చంపి వుంటారు. లేదా పాము గుడ్లను నాశనం చేసి వుంటారు. పాము పుట్టలను తవ్వించి వాటిలో ఉన్న పాములను చంపి వుంటారు.

అటువంటి సందర్భాలలో ఈ జాతకులు చాలా బాధలు పడాల్సి ఉంటుంది. వీరికి జీవితంలో ఏదీ కలసిరాదు. మంచి శక్తివంతమైన రెమెడీస్ చెయ్య గలిగితే ఇది కొంతవరకు తగ్గుతుంది. కాని ఈ ఫలితాలను తప్పక జ్యోతిష్కుడు అనుభవించవలసి ఉంటుంది.

ఈ రోజులలో రెమెడీస్ చేస్తామని టీవీలలో ప్రచారం చేసుకునే వారు నిజానికి శక్తిహీనులు.వారు పడే బాధలు దేవుని కెరుక. వీరిలో కొందరు పాము కాటుతో మరణిస్తారు కూడా. జాతకాన్ని మార్చాలంటే గొప్ప తపశ్శక్తి ఉండాలి. దానికి బ్రహ్మచర్యశక్తి కావాలి. డబ్బు మీద ఆశ ఉండరాదు. పూర్తిగా నిస్వార్థం గా చెయ్యాలి. అప్పుడే ఫలితం ఉంటుంది.

అంతేగాని నేటి కుహనా జ్యోతిష్కులవలె దీనికింత అని రేట్లు పెట్టి చేస్తే ఫలితం ఉండదు. సరిగదా వీరు వారి కర్మను పంచుకోవలసి ఉంటుంది. దానివల్ల కుటుంబంలో చావులు, అనేక చికాకులు జ్యోతిష్కుడు అనుభవిస్తాడు. ఆ తరువాత ఈ రేమేడీలు ఎందుకు చేశానా అని పరితపిస్తాడు.

రెమెడీస్ చేసే జోతిష్కులకు కుటుంబాలు ఉండరాదు. ఉన్నా పైకి ఎక్కి రావు. కనుక నాలుగు పుస్తకాలు చదివి జాతకాలతో రెమెడీలతో ఆటలాడితే ఫలితాలు దారుణంగా ఉంటాయి.

చిన్న ఉదాహరణ.

బీవీ రామన్ గారు మైసూరు మహారాజుకు పుత్రదోషం ఉంటే దానికి రేమేడీ చేయించారని అంటారు. ఫలితంగా రాజాగారికి పుత్ర జననం జరిగింది. కాని రామన్ గారికి ఎదిగిన కొడుకు సూర్యప్రకాష్ అకస్మాత్తుగా మరణించాడు. తరువాత ఆయన వ్యక్తిగత జాతకాల జోలికి పోకుండా పత్రిక నడుపుకుంటూ కాలక్షేపం చేసారు. ఆయన గొప్ప గాయత్రి ఉపాసకుడై ఉండీ కూడా శక్తి చాలక కర్మఫలితం అనుభవించాడు.

కాబట్టి మంత్రసిద్ధి లేనివారు రెమెడీస్ జోలికి పొతే మాడు పగులుతుంది. తన కర్మను తనే బాగు చేసుకోలేనివారు ఇతరుల కర్మను ఎలా తీర్చగలరు?తీర్చలేరు.

కనుక కుహనా జ్యోతిష్కులూ తస్మాత్ జాగ్రత.