“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

6, జనవరి 2009, మంగళవారం

యోగమంటే-౧

భారత దేశపు మూల మతములని చెప్పదగిన షడ్ దర్శనములలో యోగ దర్శనం ఒకటి. దీనికి ఆద్యుడు పతంజలి మహర్షి. పతంజలి మహర్షికి ముందు యోగం లేదా అంటే ఉన్నట్లుగానే ఆధారాలున్నాయి. కాని దానిని ప్రామాణీకరించిన వానిగా ఆయనను తలుచుకోవచ్చు. అదీ గాక ఆయన ఉన్న కాలాన్ని గురించి అనేక వాదాలున్నాయి. అదలా ఉంచితే అసలు యోగమనే పదానికి అర్ధము కలుపుట లేక జోడించుట అని. మూల అర్ధము జీవాత్మను పరమాత్మ తో కలిపే ప్రక్రియను లేక విధానాన్ని యోగమంటారు. ఈ పని అనేక మార్గాలలో చెయ్యవచ్చు కనుక అనేక యోగాలున్నాయి. సాంప్రదాయికంగా చెప్పేవి నాలుగు అవి హఠ, రాజ, మంత్ర, లయ యోగములు. ఇవి గాక కర్మ, భక్తి, జ్ఞాన యోగములు కూడా ఉన్నవి. బుద్ధుడు కూడా యోగ ప్రక్రియతోనే జ్ఞానాన్ని పొందినాడు గనుక బౌద్ధానికి మూలం యోగమేనని కొందరంటారు. పతంజలి మహర్షి అస్మిత మొదలగు కొన్ని బౌద్ధ పదములను వాడినాడు గనుక ఈయన బుద్ధుని తరువాతి వాడని ఒక వాదన ఉంది. యోగమనే పదము చాలా విశాలమైనది. దాని క్రిందకు అనేక విధానాలు ఒస్తాయి. ఇతర మతములనుసరించే ప్రార్ధన కూడా యోగమే. ఈ పదానికి పతంజలి మహర్షి ఇచ్చిన నిర్వచనం -యోగశ్చిత్త వృత్తి నిరోధః అని. చిత్తము యొక్క వృత్తులను అనగా ఆలోచనలను నిరోధించుటే యోగమని ఆయన మాట. అనగా ఆలోచనా రహిత స్థితి. ఇది ఒకేసారి రాదు గనుక అష్టాంగ యోగమనబడే ఎనిమిది మెట్లను ఆయన చెప్పినాడు. అవి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణా, ధ్యాన, సమాధి. యమమంటే అహింస, సత్యము, అస్తేయం, బ్రహ్మచర్యము, అపరిగ్రహము అనే అయిదు నియమాలు. నియమమంటే శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము అనబడే అయిదు. ఇట్లా ప్రతి మెట్టునూ నిర్వచనం ఇచ్చి మరీ స్థిర పరిచినవాడు పతంజలి మహర్షి. ఉదాహరణకు స్థిర సుఖ మాసనం అంటూ ఆసన విధిని నిరూపించాడు. ప్రాణాయామమంటే మన శరీరాన్ని నడుపుతున్న ప్రాణ శక్తిని స్వాధీన పరచుకొనుట. ప్రత్యాహారం అనగా బాహ్య ముఖములైన ఇంద్రియములు, మనస్సులను అంతర్ముఖములు చేయుట, ధారణా అనగా మనస్సును ఒకే ప్రదేశంపైన ఏకాగ్రం చేయుట, ధ్యానమనగా తైల ధార మాదిరిగా ఎడతెగని ఏకాగ్రత, చివరిదగు సమాధిలో తిరిగి సంస్కార సహితమైనది సవికల్ప మనీ , రహిత మైన స్థితి నిర్వికల్ప మనీ రెండు రకములు చూపించాడు. నిర్వికల్ప సమాధి అనేది యోగము యొక్క పరమ గమ్యమని చెప్పవచ్చు. ఇది అనేక సంవత్సరముల తీవ్ర కృషి ఫలితంగా వస్తుంది. చాలా మందికి కొన్ని జన్మలు కూడా పడుతుంది. వివేకానంద స్వామికి ఇట్టి స్థితి ఇరవై మూడు సంవత్సరముల వయస్సులో కలిగింది. అనేక రకములుగా ఉన్న యోగమును క్రోడీకరించి ఒక రూపాన్నిచ్చి మెట్లు మెట్లు గా విభజించి యోగ దర్శనంగా రూపొందించిన ఘనత పతంజలి మహర్షిది.