Love the country you live in OR Live in the country you love

25, డిసెంబర్ 2022, ఆదివారం

మూడవ అమెరికా యాత్ర - 73 (మా క్రొత్త పుస్తకం 'Medical Astrology Part - 2' విడుదల)


నా కలం నుండి వెలువడుతున్న 57 వ పుస్తకంగా ఒక అద్భుతమైన రీసెర్చి గ్రంధాన్ని అమెరికానుండి నేడు విడుదల చేస్తున్నాను. కేవలం పదిరోజులలో నూరు జాతకాలను సమగ్ర విశ్లేషణ చేసి 360 పేజీల ఈ గ్రంధాన్ని పూర్తిచేశాను. అమెరికా వచ్చాక నేను వ్రాసిన ఏడవ పుస్తకం ఇది.

మీకు గుర్తుండే ఉంటుంది. రెండేళ్ల క్రితం Medical Astrology Part-1 అనే పుస్తకం నా కలం నుండి విడుదలైంది. అందులో నూరు జాతకచక్రాలను విశ్లేషించి, జలుబు నుంచి ఎయిడ్స్ వరకూ ఉన్న వివిధరోగాలు ఎలా కలుగుతాయి? జాతకం ప్రకారం వాటిని ఎలా తెలుసుకోవచ్చు? ఏయే జాగ్రత్తలు తీసుకుని వాటిని ఎదుర్కోవచ్చు? మొదలైన విషయాలను అందులో వివరించాను. తరువాత అది 'వైద్యజ్యోతిష్యం మొదటి భాగం' అనే పేరుమీద తెలుగులో కూడా వచ్చింది. ఈ రెండు పుస్తకాలూ 'ఈ బుక్స్' గాను, ప్రింట్ బుక్స్ గా కూడా విడుదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణను పొందాయి. పొందుతున్నాయి.

నేడు దీని రెండవభాగాన్ని అమెరికా నుండి విడుదల చేస్తున్నాను. ఇందులో మరొక నూరుజాతకాల విశ్లేషణను మీరు చూడవచ్చు. దీనిలో కూడా నూరురకాలైన మొండి రోగాల గురించి జ్యోతిష్యపరంగా ప్రాక్టికల్ గా వివరించాను.

ప్రస్తుతానికి ఇది 'ఈ బుక్' మాత్రమే అయినప్పటికీ, త్వరలో ప్రింట్ బుక్ గా కూడా వస్తుంది. తెలుగులోకి కూడా అనువాదం జరుగుతుంది.

ఈ రెండుపుస్తకాలు, జ్యోతిష్యవిద్యార్థులకు, పండితులకు కూడా టెక్స్ట్ బుక్స్ గా ఉపయోగపడతాయి. అటువంటి అద్భుతమైన రీసెర్చి వీటిలో ఉంది. ఈ రెండు వందల జాతకాలకు నేను చేసిన విశ్లేషణను బాగా అర్ధం చేసుకుంటే, జాతకంలోని రోగాలను, వాటికి కారణమైన జాతకుని గతకర్మను, వాటి పరిహారాలను సమస్తాన్నీ మీరు అర్ధం చేసుకోగలుగుతారు.'

జ్యోతిష్యప్రపంచంలో ఇటువంటి పుస్తకాలు ఇంతవరకు రాలేదని, ఇకముందు కూడా రాబోవని సగర్వంగా చెబుతున్నాను.

మహాసముద్రంలాంటి జ్యోతిష్యశాస్త్రాన్ని అర్ధం చేసుకోలేక, రకరకాల సిస్టమ్స్ ను కలగలిపి, చివరికి ఏదీ పూర్తిగా అర్ధంకాక, గందరగోళానికి లోనౌతున్న నేటి జ్యోతిష్యపండితులకు, విద్యార్థులకు, అభిమానులకు, స్పష్టమైన దిశానిర్దేశాన్ని ఈ పుస్తకాలద్వారా చేస్తున్నాను.

అద్భుతమైన భారతీయ జ్యోతిష్యశాస్త్రానికి స్పష్టతను తేవడానికి నేను చేస్తున్న కృషిలో భాగంగా ఈ గ్రంధములు విడుదల చేస్తున్నాను. ఇవి ఊకదంపుడు అనువాదాలు కావని, రీసెర్చి గ్రంధాలని గమనించండి.

అంతేకాదు, ముందుముందు రాబోతున్న నా జ్యోతిష్య పరిశోధనా గ్రంధాలలో - వివాహ సమస్యలు, విద్యాసమస్యలు, సంతానసమస్యలు, ఉద్యోగసమస్యలు, ఆధ్యాత్మిక జాతకాలు, ఈ విధంగా వందలాది జాతకాలను ప్రాక్టికల్ గా విశ్లేషిస్తూ ఇంకా మరిన్ని పుస్తకాలను విడుదల చేయబోతున్నాను.

ఋషిప్రోక్తము, వేదాంగమైన జ్యోతిష్యశాస్త్రానికి పట్టిన కలిపీడను వదిలించి, దానికి స్పష్టతను కలిగించి, లోకానికి దాని ఘనతను ప్రాక్టికల్ గా అర్ధమయ్యేలా చేయడమే, 'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్' ద్వారా సనాతనధర్మానికి నేను చేస్తున్న అనేక సేవలలో ఒక సేవ.

ఈ పుస్తకం వ్రాయడంలో కూడా నాకు తోడునీడలుగా నిలిచిన నా శ్రీమతి సరళాదేవి, నా శిష్యురాళ్ళు అఖిల, లలితలు, శిష్యులు శ్రీనివాస్ చావలి, ప్రవీణ్ లకు నా కృతజ్ఞతలు, ఆశీస్సులు.

ఈ పుస్తకం కూడా Google Play Books నుండి ఇక్కడ లభిస్తుంది.

జ్యోతిష్యశాస్త్ర అభిమానులకు ఈ గ్రంధం ఒక విందుభోజనం వంటిది. ఆదరిస్తారని భావిస్తున్నాం.