నిజమైన అదృష్టవంతులు మాత్రమే మాతో చేయి కలుపుతారు

16, ఫిబ్రవరి 2022, బుధవారం

శ్రీమద్రామానుజాచార్యుల వారి జాతక విశ్లేషణ - 7

1049 AD లో 32 ఏళ్ల వయసులో సన్యాసం స్వీకరించిన తర్వాత కొంతకాలం పాటు ఆయన శ్రీరంగంలోనే ఉన్నారు. సమయంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలలో ఒకటి, ఒకప్పటి తన గురువైన యాదవప్రకాశుడు వైష్ణవమతాన్ని స్వీకరించి రామానుజులవారి శిష్యుడుగా మారడం.

సన్యాసం స్వీకరించిన అతి త్వరలోనే రామానుజులవారి కీర్తి దేశమంతటా వ్యాపించడం మొదలైంది. కులభేదాలను, వర్గభేదాలను చూడకుండా విష్ణుభక్తిని అందరికీ సమానంగా బోధించడం ఆయన ప్రత్యేకత. ఇది కొందరి కినుకకు కారణమైనప్పటికీ, నిజమైన జిజ్ఞాసువులకు మాత్రం అమృతప్రాయంగా తోచింది. వారి చుట్టూ అనేకమంది శిష్యులు పోగవ్వడం మొదలుపెట్టారు. ఆయన చెప్పే బోధలను వింటూ,  శాస్త్రచర్చలను చేస్తూ, జీవితాలను పునర్నిర్మించుకుంటూ వారు ఉండేవారు.

ఇదిలా ఉండగా, ఒకరోజున యాదవప్రకాశుడు వరదరాజస్వామి ఆలయానికి వచ్చినపుడు, అక్కడ రామానుజులు తన శిష్యులకు జ్ఞానబోధ చేయడం గమనించాడు. యాదవప్రకాశుడు స్వతహాగా మంచివాడే, కానీ పండితాహంకారమూ, గురువుననే అహంకారమూ ఆయన కళ్ళకు పొరలను కమ్మించాయి. అయితే, చీకటిజాడలు మానవుని హృదయంలో  ఎల్లకాలం ఉండలేవు. మానవుడు వెలుగు వైపు ప్రయాణించవలసిందే. అది ఈరోజు కాకపోతే రేపు. కానీ ఏదో ఒక రోజున అతడా పనిని చేయక తప్పదు. ఇది  ప్రకృతిశాసనం.  ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మనం ఎన్నాళ్లయినా వాయిదా వేస్తూ పోవచ్చు, కానీ దానిని పూర్తిగా తప్పించుకోలేము. అదెవ్వరికీ సాధ్యం కాదు. యాదవప్రకాశునిలో అంతర్మధనం మొదలైంది. ప్రస్తుతం పశ్చాత్తాపం ఆయనను దహిస్తోంది. దానికి తోడుగా, వారి తల్లిగారు కూడా, రామానుజుల బాటలో నడవమని ఆయనకు హితబోధ చేయసాగింది.

ఒకరోజున ఆయన కాంచీపూర్ణుని కలుసుకుని విధంగా అన్నారు.

'మహానుభావా ! నీవు పిలిస్తే నారాయణుడు పలుకుతాడని అందరూ అనుకుంటారు. రామానుజులకు నేను చేసిన ద్రోహం నన్ను లోలోపల  కాలుస్తున్నది. నాకు నిద్ర పట్టడం లేదు. బాధనుంచి బయటపడే మార్గమేంటో నాకు ఉపదేశించండి'

శూద్రుడంటూ ఒకప్పుడు తానే దూరం ఉంచిన కాంచీపూర్ణుని దగ్గరకు స్వయానా ఒక సాంప్రదాయానికి గురువైన యాదవప్రకాశుడు వెళ్లి, విధంగా వినయపూర్వకంగా ఆయనను అడగడమే, ఆయన పైన దైవానుగ్రహం వర్షించడం మొదలైందనడానికి గుర్తు !

ఆయనతో కాంచీపూర్ణుడిలా అన్నాడు.

'అయ్యా ! మీ బాధ నాకర్ధమైంది. ప్రస్తుతం మీరు ఇంటికి వెళ్ళండి. నేను వరదరాజస్వామిని ప్రార్ధిస్తానుఆయన కరుణామయుడు. నీకు సమాధానం దొరుకుతుంది'

అదే రోజు రాత్రి చాలాసేపు నిద్రపోకుండా గతాన్ని గురించి, తన కుట్ర గురించి, రామానుజులవారి సత్ప్రవర్తన గురించి ఆలోచిస్తూ, కుమిలిపోతూ గడిపిన యాదవప్రకాశునికి మాగన్నుగా నిద్ర పట్టింది. కలలో ఆయనకు నారాయణుని దర్శనమైంది. రామానుజులవారి శిష్యునిగా మారమనిన మార్గనిర్దేశం ఆయనకు లభించింది.

నిద్రలేచిన యాదవప్రకాశుడు రోజంతా ఆలోచించి, సాయంత్రానికి రామానుజుల వారి దర్శనానికి వచ్చాడు. శాస్త్రాలపరంగా తనకున్న సందేహాలను ఆయన ముందుంచాడు. అప్పుడు రామనుఁజులవారు వినయంగా ఇలా అన్నార్థు.

'ఈ సందేహాలను నేను తీర్చనవసరం లేదు. ఇతను కూరేశుడనే నా శిష్యుడు. ఇతను మీ సందేహాలను తీరుస్తాడు'

అప్పుడు కూరేశుడు, వేదోపనిషత్తుల నుంచీ, పురాణేతిహాసాల నుండీ యుక్తి యుక్తములైన ప్రమాణాలను పుంఖానుపుంఖాలుగా వల్లిస్తూ, భక్తిమార్గం యొక్క ఔన్నత్యాన్ని గురించి మాట్లాడి, ఆయన సందేహాలను పటాపంచలు గావించాడు. యాదవప్రకాశులకు విషయం అర్ధమైంది. ఆయనకు పట్టి ఉంచిన పండితాహంకారం పటాపంచలైంది.

తన తప్పులను ఒప్పుకుని, రామానుజులవారి పాదాలపైన పడి ఏడుస్తూ యాదవ ప్రకాశుడిలా అన్నాడు.

' యతిరాజా ! గర్వం తలకెక్కి విధంగా ప్రవర్తించాను. తప్పు చేశాను. నీకు ద్రోహం తలపెట్టాను. ప్రతిరోజూ నిన్ను నా ముందు చూస్తూ కూడా నీ ఔన్నత్యాన్ని తెలుసుకోలేకపోయానునీచేత సేవలను చేయించుకున్నాను. ప్రస్తుతం నా కళ్ళు తెరుచుకున్నాయి. పశ్చాత్తాపం నన్ను దహిస్తోంది. నన్ను నీ శిష్యునిగా స్వీకరించు. నాకు దారిని చూపించు, నన్నుద్ధరించు'.

విధంగా తపిస్తూ, తన పాదాలపైన పడి క్షమార్పణ కోరిన ఆయనను రామానుజులవారు ప్రేమగా లేవనెత్తి దగ్గరకు తీసుకుని ఓదార్చారు. వైష్ణవధర్మమంటే ఆయనకున్న ఇతర సందేహాలను  తీర్చి, 'గోవిందదాసుడ'ని నామకరణం చేసి, వైష్ణవమార్గంలోకి ఆయనను స్వీకరించారు. క్రొత్త జీవితాన్ని మొదలుపెట్టిన యాదవప్రకాశుడు , అతి త్వరలోనే తన తప్పులను అధిగమించి ఆధ్యాత్మికమార్గంలో శరవేగంతో పురోగమించసాగాడు. నిజాయితీగా ప్రయత్నిస్తే అంతరికమార్గంలో అడ్డంకులన్నీ క్షణాలలో దూదిపింజలలాగా తేలిపోతాయి. తన భక్తులను ఉద్ధరించకుండా భగవంతుడు మాత్రం ఎలా ఉండగలడు?

ఇదంతా, శని/శుక్ర/కేతుదశలో 1051 AD లో నవంబర్, డిసెంబర్ నెలలలో జరిగింది. చంద్ర లగ్నాత్ శని, గురువును సూచిస్తున్నాడు. శుక్రుడు పంచమాధిపతిగా శిష్యునికి సూచకుడు. కేతువు లగ్నాత్ పంచమంలో ఉచ్ఛస్థితిలో ఉన్నాడు.  శని, వక్రియై ఆయనను కలుస్తున్నాడు. ఈ కారణాల వల్ల ఈ దశలో గురువే శిష్యుడయ్యాడు.

కాలక్రమంలో గోవిందదాసుని అంతరిక పురోగతిని గమనించిన ఆచార్యులు ఇలా అన్నారు.

'గోవిందదాసా ! నీ మనస్సు ఇప్పుడు అత్యంత పరిపక్వమైంది. పరిశుద్ధతను పొందింది. నీలో కల్మషాలు  మాయమయ్యాయి. కానీ, నీవు గతంలో చేసిన పాపాలు మొత్తం మాయం కావాలంటే, వైష్ణవధర్మాలను వివరిస్తూ నీవొక గ్రంధాన్ని వ్రాయి. అప్పుడు నీ గతకర్మ కూడా భస్మమౌతుంది'

మాటలను శిరసావహించిన గోవిందదాసుఁడు, 'యతిధర్మ సముచ్ఛయము' అనే ఒక అద్భుతమైన గ్రంధాన్ని రచించాడు. వైష్ణవసాధువులకు ఈనాటికీ వారి ఆశ్రమ విధులలో ఒక కరదీపికలాగా ఈ గ్రంధం ఉపయోగపడుతున్నది.

సమయానికి యాదవప్రకాశులకు 80 ఏళ్ళు దాటాయి. తరువాత కొంతకాలానికే, రామానుజులవారి సమక్షంలో ఆయన ప్రశాంతంగా దేహత్యాగం చేసి నారాయణుని పాదసన్నిధికి చేరుకున్నాడు.

విధంగా, రామానుజులవారి ఒకప్పటి గురువే, చివరకు ఆయనకు శిష్యుడయ్యాడు. ఇటువంటి అద్భుతాన్ని మళ్ళీ శ్రీ రామకృష్ణుల వారి జీవితంలో మాత్రమే మనము గమనించవచ్చు. ఆయనకు  గురువులైన వారందరూ, చివరకు ఆయన దగ్గరే నేర్చుకుని,  ఆధ్యాత్మిక జీవితంలో మరింత ఔన్నత్యాన్ని పొందారు. ధన్యులయ్యారు.

(ఇంకా ఉంది)