Spiritual ignorance is harder to break than ordinary ignorance

7, ఫిబ్రవరి 2022, సోమవారం

శ్రీమద్రామానుజాచార్యుల వారి జాతక విశ్లేషణ - 3

ఆచార్యులవారిది పూర్ణాయుర్దాయ జాతకం. రాహుమహర్దశలో పుట్టిన ఈయన మళ్ళీ రాహుమహర్దశలోనే దేహత్యాగం చేశారు. అప్పుడే 120 సంవత్సరాల వింశోత్తరీ దశ పూర్తి అవుతుంది. ఇలాంటి వరం ఉండాలంటే ఎంతో పుణ్యబలం ఆ జాతకంలో ఉండాలి. ముందుగా వీరి జాతకం లోని ఆయుర్యోగాలను గమనిద్దాం.

పరాశరమహర్షి తన 'బృహత్పరాశర హోరాశాస్త్రము' 44 వ అధ్యాయంలో కొన్ని ఆయుర్యోగాలను ఇచ్చారు. మానవుల ఆయుష్షును ఆయన ఏడు విభాగాలుగా చెప్పారు. అవి, బాలారిష్ట ఆయువు, యోగజారిష్ట ఆయువు, అల్పాయువు, మధ్యాయువు, పూర్ణాయువు, దివ్యాయువు, అమితాయువు. వీటి అంతిమ అవధి వరుసగా 8, 20, 30, 60, 120, 1000 ఏళ్ళుగా ఉంటాయి. చివరిది అంతులేకుండా ఉంటుంది. అది మానవులకు దుర్లభం. దివ్యాయువు దేవతలకు ఋషులకు మాత్రమే ఉంటుంది. సామాన్య మానవులకు మిగతా ఐదూ ఉంటాయి. ఉదాహరణకు, నిన్న చనిపోయిన ప్రసిద్ధ గాయని లతా మంగేష్కర్ కూడా 93 ఏళ్ళు బ్రతికింది. ఈమె కూడా పూర్ణాయుష్కురాలే. లోకాచారంలో, 33, 66, 99 అనేవాటిని అల్ప, మధ్య, పూర్ణాయుష్షులకు పై లిమిట్స్ గా ప్రస్తుతం చూస్తున్నాం.

60 నుంచి 120 వరకూ పూర్ణాయువు గనుక, దీనిని ఈ క్రింది విధమైన మూడు భాగాలుగా విభజించవచ్చు.

  • 60 నుండి 80 లోపు - పూర్ణాయుష్కులలో క్రింది తరగతి.
  • 80 నుండి 100 లోపు - పూర్ణాయుష్కులలో మధ్య తరగతి.
  • 100 నుండి 120 లోపు - పూర్ణాయుష్కులలో పై తరగతి.

అంటే, బాలారిష్ట ఆయువైతే ఎక్కువలో ఎక్కువగా ఎనిమిదేళ్లు బ్రతుకుతారు. అల్పాయుష్కుడైతే ఎక్కువలో ఎక్కువగా 30 ఏళ్ళు బ్రతుకుతాడు. మధ్యాయువైతే ఎక్కువలో ఎక్కువగా 60 ఏళ్ళు బ్రతుకుతారు. ఈ విధంగా అర్ధం చేసుకోవాలి. ఆచార్యులవారు 120 ఏళ్ళు బ్రతికారు గనుక ఈయనది పూర్ణాయువులో పై తరగతి.

పరాశరమహర్షి ఇంకొక సూత్రాన్ని కూడా చెబుతూ, జాతకంలో లగ్నం బలంగా ఉంటే అంశాయువిధానాన్ని బట్టి, సూర్యుడు బలంగా ఉంటే పిండాయువిధానాన్ని బట్టి, చంద్రుడు బలంగా ఉంటే నైసర్గికాయుర్విధానాన్ని బట్టి ఆయుస్సును లెక్కించమని చెప్పారు. సత్యాచార్యులవారు అంశాయుర్దాయానికి ఎక్కువ ప్రాముఖ్యత నిచ్చారు. వరాహమిహిరాచార్యుల వారు కూడా సత్యాచార్యుని పద్ధతిని శ్లాఘించారు. అది చాలా సరిగా ఫలితాన్నిస్తుందని అన్నారు. ఆయా విధానాలు గణితంతో కూడుకున్నవి గనుక వాటినిక్కడ చెప్పబోవడం లేదు. 

గణితంలోకి పోకుండా, స్థూలమైన విధానంలో చూచినప్పుడు, లగ్న అష్టమాధిపతుల బలాబలాలను బట్టి ఆయుస్సును ఉజ్జాయింపుగా లెక్కవేయవచ్చు.

లగ్నాధిపతి చంద్రుడు నవమాధిపతి గురువుతో కలసి గజకేసరీయోగంలో ఉన్నాడు. అయితే ఇది ద్వాదశమైంది. కనుక బలం తగ్గింది. ప్రాణగండాలు ఎదురయ్యాయి.  అష్టమాధిపతి శని పంచమకోణంలో ఉచ్చకేతువుతో కలసి ఉన్నాడు. తృతీయాధిపతి బుధుడు దశమకేంద్రంలో ఉచ్ఛసూర్యునితో కలసి ఉన్నాడు. కనుక పూర్ణాయుర్దాయం పట్టింది. కానీ కేతువు కుజుణ్ణి సూచిస్తున్నందువలన, బుధుని వక్రత్వం వల్ల, శని వక్రత్వం వల్ల, ఈయన పైన చాలా హత్యాప్రయత్నాలు జరిగాయి.

చంద్రలగ్నం నుంచి, లగ్నంలోనే గజకేసరీయోగం ఉంది. అష్టమాధిపతి శని సప్తమకేంద్రంలో కోదండశనిగా ఉండి, గురుచంద్రులచేత చూడబడుతున్నాడు. తృతీయాధిపతి సూర్యుడు లాభస్థానంలో ఉచ్ఛస్థితిలో ఉన్నాడు. కనుక పూర్ణాయుర్దాయమైంది. కానీ, శని వక్రత వల్ల, సూర్యునితో బుధశుక్రుల కలయిక వల్ల ప్రాణగండాలు ఎదురయ్యాయి.

సూర్యలగ్నం నుంచి, లగ్నాధిపతి కుజుడు చతుర్ధకేంద్రంలో నీచస్థితిలో ఉన్నాడు. చంద్రునినుంచి నీచభంగమైంది. అష్టమాధిపతి కూడా కుజుడే అయ్యాడు. తృతీయాధిపతి బుధుడు లగ్నకేంద్రంలోనే ఉచ్ఛసూర్యునితో కలసి ఉన్నాడు. కనుక పూర్ణాయుర్దాయం పట్టింది. కానీ బుధుని వక్రత వల్ల, కుజుని నీచదోషం వల్ల గండాలెదురయ్యాయి.

ఈ విధంగా, పైపైన చూచినప్పటికీ, వీరి జాతకంలో పూర్ణాయుర్దాయము, ప్రాణగండాలు కలసిమెలసి కనిపిస్తున్నాయి. పైగా, తపశ్శక్తి సంపన్నులకు కావాలంటే ఆయుస్సు పెరుగుతుందని చెప్పబడింది. మహనీయుల ఆయుస్సు వారిచేతిలో ఉంటుంది. కావాలంటే ఇంకా కొన్నేళ్లు ఉండగలరు, పోవాలంటే ఈ క్షణమే పోగలరు. అది వారు వచ్చిన పనిని బట్టి, అది నెరవేరే క్రమాన్ని బట్టి ఉంటుంది. వచ్చిన పని అయిపోయిందని అనుకున్నపుడు, 39 ఏళ్లకే వివేకానందస్వామి దేహత్యాగం చేసినరీతిలో అది ఉంటుంది.

ఆచార్యులవారి జీవితంలో ఈ క్రింది దశలు నడిచాయి.

జననకాలదశ - రాహు/బుధ/కుజదశ

జననకాల రాహు మహాదశా శేషం - 8 సం - 9 నె - 20 రోజులు

రాహుదశ - 10-4-1017 నుండి 1-1- 1026 వరకు
గురు దశ     - 1-1-1042 వరకు
శని   దశ      - 1-1-1061 వరకు
బుధ దశ     - 1-1-1078 వరకు
కేతు  దశ     - 1-1-1085 వరకు
శుక్ర  దశ     - 1-1-1105 వరకు
రవి   దశ     - 1-1- 1111 వరకు
చంద్రదశ   - 1-1-1121 వరకు
కుజ దశ      - 1-1-1128 వరకు
రాహుదశ  -   1-1-1146 వరకు

ఈ దశమధ్యలో 10-2-1137 మాఘశుక్ల దశమి రోజున ఆచార్యుల వారి దేహత్యాగం జరిగింది. 2022 వ సంవత్సరంలో ఇది ఫిబ్రవరి 10 వ తేదీన వస్తున్నది.

వచ్చే పోస్ట్ లో ఆచార్యులవారి జీవిత సంఘటనలను పైపైన గమనిద్దాం.

(ఇంకా ఉంది)