“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

5, ఫిబ్రవరి 2022, శనివారం

శ్రీమద్రామానుజాచార్యుల వారి జాతక విశ్లేషణ - 1

ఈరోజు శ్రీపంచమి. చదువులతల్లి,  బుద్ధిప్రదాయిని, జ్ఞానప్రదాయిని అయిన  సరస్వతీమాత యొక్క పూజను ఈరోజున మనం జరుపుకుంటాం. ఈ ఏడాది ఈ రోజుకు ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. సమానత్వ ప్రతిమ (స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ) పేరుతో శ్రీమద్రామానుజాచార్యులవారి విగ్రహాన్ని హైదరాబాద్ చిన్నజియ్యర్ గారి ఆశ్రమ ఆవరణలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీగారు నేడు ఆవిష్కరిస్తున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం.

'స్టాట్యూ ఆఫ్ లిబర్టీ' అమెరికాలో ఉంది. నేడు 'స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ' మన దేశంలో వచ్చింది. ఎవరు దీనిని ఎంచుకున్నారోగాని, ఈ పేరు చాలా బాగుంది. 

మనలో చాలామందికి మన మతం గురించి తెలీదని నేను చెప్పే మాట అబద్దం కాదు. వేదములు, ఉపనిషత్తులు, తంత్రములలో ఏముందో తెలియకపోయినా కనీసం త్రిమతాచార్యులైన శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యుల గురించైనా హిందువులకు తెలియాలి. వీరు చెప్పిన అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత సిద్ధాంతాల గురించి తెలియాలి.  లేదంటే హిందూమతంలోని తాత్విక చింతనలు అర్ధం కావు.

వీరిని గురించి వీరి అనుయాయులకు మాత్రమే కొద్దో గొప్పో తెలుస్తుంది. అది కూడా పైపైన మాత్రమే. సిద్ధాంతపరంగా వారు చెప్పినదేమిటి? వీరిమధ్యన ఉన్న భేదాలేమిటి? అన్న విషయం యొక్క లోతుపాతులు ఆయా సాంప్రదాయాలను పాటించేవారికి కూడా తెలియవు. ఎవరికి వారు 'మా సాంప్రదాయం గొప్ప, మా సంప్రదాయం గొప్ప' అనుకుంటే సరిపోదు. ఆయా సాంప్రదాయాల లోతుపాతులను తెలుసుకోవలసిన అవసరం వారికి ఉన్నది. ఇవి తెలియకపోబట్టే, సగటు హిందువులు మతాలు మారుతున్నారు. దానికి కారణమేమంటే, 'కులవ్యవస్థ' అంటారు. ఇది బ్రిటిష్ వాడు మనకెక్కించి పోయిన పైత్యపువిషం తప్ప ఇంకేమీ కాదు. పైగా డబ్బును ఎరవేసి, కులద్వేషాన్ని ఎగదోసి, మతాలు మార్చడం ఒక బిజినెస్ కదా మన దేశంలో !

కులవ్యవస్థ ప్రతి దేశంలోనూ ఉంది. అయితే, మనదేశంలో ఉన్న ఇదే పేర్లతో, ఇదే రూపంలో లేకపోవచ్చు. వేరే రూపాలలో ఉంది. రేసిజం అన్నది ఒక విధమైన కులపిచ్చే. 'మనుషులంతా ఒక్కటే'  అని ఎంతమంది ఎలా అరిచినా, అది వాస్తవం కాదన్నది అలా అరిచేవారికి కూడా తెలుసు. 'మమ్మల్ని అణగదొక్కుతున్నారు' అంటూ అరిచే కులాలు కూడా, అవి బలపడినప్పుడు, వాటి క్రింద కులాలను అవీ అణగద్రొక్కడం మన కళ్ళ ముందు చూస్తున్న వాస్తవం. 'అందరూ ఒక్కటే' అని అరిచిన కమ్యూనిస్టులు, రాజ్యాధికారాన్ని చేబట్టిన తర్వాత వాళ్ళే సరిక్రొత్త బూర్జువాలై, నియంతృత్వ పోకడలతో జనాన్ని అణగదొక్కినదీ రష్యాలో చైనాలో చూశాం. కమ్యూనిజం చాటున కోట్లు వెనకేసుకున్నవారినీ చూశాం. 

కనుక, ప్రకృతిలో సమానత్వం లేదు. సృష్టిలో సమానత్వం లేదు. 'దేవుడు అందరినీ సమానంగా సృష్టించాడు' అన్నది నిజం కాదు. అది ఉత్త స్లోగన్ మాత్రమే. సృష్టిలో విభిన్నత్వం ఉంది. దాని అంతర్లీనంగా ఏకత్వం ఉంది. విభిన్నత్వం తప్పు కాదు. దానిని సరిగ్గా అర్ధం చేసుకోలేకపోవడం తప్పు. తాను బలపడినాక క్రిందివాళ్లను అణగద్రొక్కడం తప్పు. కులవ్యవస్థ తప్పు కాదు, దానిని సరిగ్గా అర్ధం చేసుకోలేకపోవడం తప్పు.

పాతకాలంలో అన్ని కులాలూ సమానంగా కలసిమెలసి జీవించాయి. ఎవరి కులం వారికి గొప్ప. సమాజంలో అని కులాలూ అవసరమే. అందరూ కలసిమెలసి ఎవరి హద్దులలో వారు జీవించేవారు. మధ్యయుగాలలో ఈ పరిస్థితి మారిపోయింది. భూస్వాములైన కులాలు మిగిలిన కులాలపైన ఆధిపత్యం సాగించడం మొదలైంది. డబ్బులున్న కులాలు తక్కినవారిని తక్కువగా చూడటం మొదలైంది. మతమనేది బ్రాహ్మణుల చేతులలో ఉండటంతో వారు తమకంటూ ఒక గొప్పతనాన్ని ఆపాదించుకోవడం మొదలైంది. ఈ పెడపోకడలు అతి ప్రాచీనకాలంలో లేవు. మధ్యయుగాలలో పుట్టాయి.  దానికి కారణం తురకల దండయాత్రలు, వారి విధ్వంసాలు,దండయాత్రల సమయంలో రాజుల సైన్యాలతో వచ్చి ఇక్కడ సెటిలైపోయిన వారితో, హిందూమతంలో అప్పటిదాకా లేని బాల్యవివాహం, సతీసహగమనం వంటి అనేక ఆచారాలు కట్టుబాట్లు పుట్టుకొచ్ఛాయి. దానికి కారణం, మన ఆడపిల్లలను తురకల బారిన పడకుండా కాపాడుకునే ఉద్దేశమే.

800 ఏళ్ల తురకల పరిపాలన మన దేశాన్ని మతపరంగా, సామాజికపరంగా చిన్నాభిన్నం చేసింది. ఆ తరువాత, రెండొందల ఏళ్ళు మన దేశాన్ని దోచుకున్న బ్రిటిష్ వాళ్ళు పోతూ పోతూ, భారతీయ సమాజంలో కులాల మధ్యన విద్వేషాన్ని రగిల్చి పోయారు. అది నేటికీ రాజుకుంటూనే ఉంది. దానిని దోపిడీకీ, సమాజాన్ని అస్థిరం చేయడానికీ ఒక మంచి ఎత్తుగడగా అర్ధం చేసుకున్న కొన్ని వర్గాలు, అదే పనిగా బ్రాహ్మణులను, ఇతర అగ్రవర్ణాలను ఆడిపోసుకోవడాన్ని గ్రుడ్డిగా అనుసరిస్తున్నాయి. ప్రజల మధ్యన చిచ్చు పెట్టి పబ్బం గడుపుకునే బ్రిటిష్ వారి కుట్రను కొన్ని రాజకీయ పార్టీలు దశాబ్దాలుగా పెంచి పోషించాయి. ఫలితంగా స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటుతున్నా, సామాజిక విభేదాలు సమసిపోకపోగా ఇంకా బలపడుతున్నాయి. వారి స్వలాభం కోసం మతమార్పిడులు చేసే కొన్ని మతాలు, వాటికి కొమ్ము కాసే రాజకీయ పార్టీలు కలసి బ్రిటిష్ వాటి ఈ కుట్రను ఇప్పటికీ పెంచి పోషిస్తూ ఉండటమే. ఈ విషయం సామాన్య ప్రజలకు అర్ధం కావడం లేదు.

అతి ప్రాచీనకాలం నుంచీ, ఆయా సమయాలలో ఉన్న సామాజిక అసమానతలను అగ్రవర్ణాలలో కొందరు, ముఖ్యంగా బ్రాహ్మణులలో కొందరు, ప్రశ్నిస్తూనే వచ్చారు. వారిలో ఋషులున్నారు, మేధావులున్నారు, ఆచార్యులున్నారు. కానీ అలాంటి వారిని పక్కన పెట్టి, కులద్వేషాన్ని ఇంకా రెచ్చగొడుతూ, అంబేడ్కర్ వంటి కొంతమంది సంస్కర్తల  పేర్లను మాత్రమే కోట్ చేస్తుంటారు కొందరు కుహనా మేధావులు. అంబెడ్కర్ నిజంగా చాలా గొప్పవాడూ, మేధావీ కూడా. కానీ, అందరు గొప్పవారిలాగే ఆయన కూడా వక్రీకరింపబడి, రాజకీయుల చేతులలో వాడుకోబడుతున్నాడు. అది వేరే విషయం, కాసేపు దాన్ని ప్రక్కన ఉంచుదాం.

వెయ్యి సంవత్సరాల క్రిందటే, సమాజాన్ని మతపరంగా సంస్కరించాలని ప్రయత్నించిన సాంప్రదాయ ఆచార్యులు మన దేశంలో ఉన్నారు. వారిలో ప్రముఖుడు, చాలా మహనీయుడు శ్రీమద్రామానుజాచార్యులవారు. కానీ ఆయన్ను గురించి నేటి తరానికి మళ్ళీ ఏమీ తెలియదు. అలా తెలియకుండా ఈ 75 ఏళ్ళనుంచీ సోకాల్డ్ సెక్యులర్ వాదులు, కమ్యూనిస్టులు ప్రజలను తప్పుదారి పట్టిస్తూ వచ్చారు. వెయ్యి సంవత్సరాల క్రితమే, వేలాదిమంది బ్రాహ్మణేతరులనూ బడుగువర్గాలవారనీ చేరదీసి వైష్ణవధర్మంలోకి ఆహ్వానించిన ఘనుడాయన.  దీనికి ప్రతిగా ఆయన రాజులతో విరోధం పెట్టుకున్నాడు. హత్యాప్రయత్నాలకు  గురయ్యాడు. పుట్టిన గడ్డను ఎన్నో ఏళ్ళు వదలిపెట్టి, వేరే రాష్ట్రంలో  తలదాచుకున్నాడు. ఎన్నో బాధలకు గురయ్యాడు.

సమాజసంస్కరణాపరంగా చూస్తే, నవీనులైన రాజారామ్మోహనరాయ్, వివేకానంద, అంబెడ్కర్  ల కంటే రామానుజాచార్యులవారు వెయ్యేళ్ళు ముందటివాడు. వారు నిన్నా మొన్న చెప్పినవాటిని ఆయన వెయ్యేళ్ళ క్రితమే చెప్పాడు. తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ తన సిద్ధాంతాలను ప్రచారం చేశాడు.

అంతటి మహనీయుడు రామానుజాచార్యులవారు.

కనీసం నేడైనా ఆయనను స్మరించుకునే అవకాశం చిన్నజీయర్ స్వామి ద్వారా భారతదేశానికి కలిగింది. ప్రధానమంత్రి మోడీగారి రాక ద్వారా దేశమంతా మరొక్క సారి, రామానుజాచార్యుల వారి గురించి తెలుసుకుంటుంది. కనీసం, ఆయన పేరుమీద గూగుల్ సెర్చ్ అయినా జరుగుతుంది.  ఈ పరిణామం మంచిదే.

మతమంటేనే మత్తుమందనీ, మతవాదులందరూ కులగజ్జిగాళ్ళేననీ, మతమంటేనే దోపిడీ అనీ భావించే అజ్ఞానులు కనీసం ఈ రోజైనా రామానుజాచార్యుల గురించి కొంత  తెలుసుకుంటారు. అగ్రవర్ణాలందరూ దుర్మార్గులు కారనీ, నిమ్నవర్ణాలందరూ మంచివాళ్ళూ కారనీ గ్రహిస్తారు.  వారి ద్వేషపూరిత భావనలలో సత్యం లేదని గ్రహిస్తారు. కనీసం ఇంతవరకూ  మంచి మార్పే ! సంతోషం ! వర్ణానికీ మంచితనానికి సంబంధం ఉందా అసలు?

ఇకపోతే, శ్రీమద్రామానుజులు 120 ఏళ్ళు జీవించారు. చరిత్రకు తెలిసిన మహాపురుషులలో శ్రీకృష్ణుడు మాత్రమే 120 ఏళ్ళు బ్రతికిన వ్యక్తి. మళ్ళీ శ్రీమద్రామానుజులు ఆ విధంగా 120 ఏళ్ళు బ్రతికారు, అయితే, చరిత్రను సరిగ్గా రికార్డ్ చెయ్యని మన చెడ్డ అలవాటును ఈయన పట్ల కూడా మనం చూపించాం. ఈయన జననం గురించి దొరికిన సమాచారం చాలా గందరగోళంగా ఉంది. దానినాధారంగా చేసుకుని, ఆచార్యులవారి జాతకాన్ని ఇప్పటివరకూ వేసిన ఘనజ్యోతిష్కులందరూ పప్పులో కాళ్లేశారు. చివరకు B.V Raman వంటి ఘనాపాఠీ కూడా, ఆచార్యులవారి జననతేదీ విషయంలో పొరపాటు పడ్డారు. దానినంతా సరిచేసి, ఆచార్యులవారి జననతేదీని సరిదిద్ది, ఆయన జీవిత సంఘటనలతో పోల్చి సంస్కరించే పనిని ఈ రోజున తలపెట్టాను.

అదంతా ఎలా చేశానో వచ్చే పోస్టులలో చదవండి.

(ఇంకా ఉంది)