“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

8, ఫిబ్రవరి 2022, మంగళవారం

శ్రీమద్రామానుజాచార్యుల వారి జాతక విశ్లేషణ - 4

ఆచార్యులవారి రూపం మంచి పసిమిరంగుతో చాలా మనోహరంగా ఉండేది. ఆయనను చూచినవారెవరైనా సరే మొదటి చూపులోనే ముగ్దులైపోయేవారు. దానికితోడుగా, మెత్తని స్వభావం, నెమ్మదైన తీరు, మానవతాభావాలు, భక్తిపూరితమైన మనస్తత్వం ఇవన్నీ ఆయనలో కలసిమెలసి ఆయన యొక్క ఆకర్షణాశక్తిని ఎన్నోరెట్లు పెంచాయి.

ఆచార్యులవారు రాహు/బుధ/కుజదశలో జన్మించారని క్రిందటి పోస్టులో వ్రాశాను. రాహువు వీరి జాతకంలో ఉచ్ఛశుక్రుని సూచిస్తున్నాడు. శుక్రుడూ, బుధుడూ కలసి ఉచ్చసూర్యునితో ఉన్నారు. కనుక ఆచార్యులవారి రూపం చాలా అందంగా ఆకర్షణీయంగా ఉండేది. నీచభంగం పట్టిన కుజుడు లగ్నంలో ఉండటం దీనికి విలక్షణతను జోడు చేస్తుంది.

వీరికి లక్ష్మణుడని జన్మనామం ఇవ్వబడింది. తన 32 వ ఏట సన్యాసం తీసుకునేవరకూ లక్ష్మణాచార్యులని, లక్ష్మణముని యని వీరిని అందరూ పిలిచేవారు.

దశలవారీగా ఆచార్యులవారి జీవితంలోని సంఘటనలను పరిశీలిద్దాం.

రాహు మహాదశ

ఆర్ద్రానక్షత్రం మూడవపాదంలో జన్మించడంతో, జననసమయం నుండి ఎనిమిదేళ్ల వరకూ ఆచార్యులవారి జాతకంలో రాహుమహాదశ జరిగింది. ఉచ్ఛరాహువు ఈ జాతకంలో ఉచ్చశుక్రుని సూచిస్తున్నాడు. జననసమయంలో వృషభరాశిలో రాహువున్నవారిలో సహజంగానే ఒక విధమైన ఆకర్షణాశక్తి ఉంటుంది.

మామూలుగా ఆటపాటలతో ఎనిమిదేళ్లవరకూ ఆచార్యులవారి బాల్యం తండ్రిగారి శిక్షణలో గడిచింది.

గురుమహాదశ

ఎనిమిదో ఏట అంతమైన రాహుదశ తర్వాత, వీరి జీవితంలో 16 ఏళ్ల గురుమహర్దశ మొదలైంది. దానిలో సగభాగం తల్లిదండ్రుల సమక్షంలో శ్రీపెరంబుదూరులోనే గడిచింది. మిగిలిన సగభాగం, యాదవప్రకాశులవారి శిష్యరికంలో గడచిపోయింది. కానీ ఈ దశ, గురువుతో విభేదాలను కొనితెచ్చింది. చివరకు ఆ గురువును విడచిపెట్టేలా చేసి, తన మనసుకు నచ్చిన యామునాచార్యులవారి పాదాల దగ్గరకు ఆయనను చేర్చింది.

తండ్రిగారి ఆరోగ్యం క్షీణిస్తున్నది. ఏ తండ్రైనా ఏమనుకుంటాడు? కుమారునికి వివాహం చేయాలనుకుంటాడు. అదే చేశారు రామానుజుల తండ్రిగారు. తన 16 వ ఏట రామానుజులకు వివాహమైంది. ఆ సమయంలో ఆయన జాతకంలో గురు/శుక్ర దశ నడిచింది.

గురువు వివాహానికి సూచికైన ద్వాదశస్థానంలో ఉన్నాడు. సప్తమాధిపతి శని చూస్తున్నాడు. శుక్రుడు  సుఖస్థానాధిపతి. కళత్రకారకుడు. కనుక వీరి దశాంతర్దశలలో వివాహం జరిగింది. చంద్రలగ్నం చూచినప్పుడు, సప్తమాధిపతి గురువు లగ్నంలోనే ఉన్నాడు. లాభస్థానంలో శుక్రుడు లగ్నాధిపతి అయిన బుధునితో, పితృకారకుడైన సూర్యునితో కలసి ఉన్నాడు. కనుక తండ్రిగారి బలవంతంతో వివాహం జరిగింది. కానీ వివాహమైన నెలా రెండు నెలలలోపే తండ్రిగారు మరణించారు. తల్లి, ఇద్దరు చెల్లెళ్ళు, భార్యతో బాధ్యతలను నెత్తిన వేసుకున్నారు ఆచార్యులవారు.

దశమస్థానం నుంచి ఆయు:స్థానమైన ద్వాదశంలో గురువు పాపార్గళానికి లోనయ్యాడు. దశమాధిపతి కుజుడు దశమం నుంచి చతుర్దంలో నీచస్థితిలో ఉంటూ గుండెజబ్బును సూచిస్తున్నాడు. మేషానికి శుక్రుడు మారకుడు. ఈ కారణాలవల్ల గురు/శుక్ర దశలో తండ్రిగారి మరణం సంభవించింది. 

అయితే, సప్తమాధిపతి శని షష్ఠంలో ఉండటంతో ఈయన సంసారం సజావుగా సాగలేదు. భార్యకు ఆచార్యులవారి ధోరణి నచ్చేది కాదు. కళత్రకారకుడైన శుక్రుడు కూడా అస్తంగతుడవడంతో వీరి సంసారజీవితం విఫలమైపోయింది. 32 వ ఏడు వరకూ కలిసి సంసారం చేసినా, వారిది అన్యోన్య దాంపత్యం కాదు. దీనిని బలపరుస్తూ, నవాంశ చక్రంలో కుటుంబస్థానంలో నాలుగు గ్రహాలుంటూ సన్యాస యోగాన్నిస్తున్నాయి.

అప్పట్లో కాంచీపురం దగ్గరలోని ఒక పల్లెటూరిలో యాదవప్రకాశుడనే ఒక అద్వైత సాంప్రదాయపు గురువు ఉండేవారు. ఈయన శంకరాచార్యులవారి అద్వైతసాంప్రదాయంలో మంచి పండితుడే గాక, మంత్రతంత్రాలలో పేరున్న మాంత్రికుడు కూడా. దయ్యాలను భూతాలను వదలించడంలో ఈయనకు మంచి పేరుండేది. వేదాంతాధ్యయనం చేయాలని సంకల్పించిన రామానుజులవారు కుటుంబాన్ని గురువుగారి ఊరికి మార్చి, ఆయన గురుకులంలో శిష్యునిగా చేరారు. ఈయన దగ్గర 16వ ఏట నుండి 24వ ఏడువరకూ రామానుజులు వేదాధ్యయనం చేశారు.

గ్రహప్రభావాలు చాలా విచిత్రమైనవి. అవి సామాన్యుడినీ వదలవు. మహనీయులనూ వదలవు.  ఈ భూమిపైన పుట్టిన ప్రతివారి జీవితమూ గ్రహప్రభావానుసారమే జరుగుతుంది. ఇంకా సరిగ్గా చెప్పాలంటే, వారి పూర్వకర్మానుసారమే జరుగుతుంది. దీనికి మినహాయింపు ఎవరూ ఉండరు. అవతారమూర్తులైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీరామకృష్ణులకే ఇది తప్పలేదంటే, ఇక మామూలు మనుషుల మాట చెప్పేదేముంది? మన అహంకారంతో పొగరెక్కి, 'జాతకాలు గీతకాలు అన్నీ ట్రాష్. ఏమీ లేవు. అంతా మన చేతుల్లోనే ఉంది' అని విర్రవీగవచ్చు గాని, సమయం వచ్చినపుడు ఆ విర్రవీగుడు ఏమౌతుందో అప్పుడు తెలుస్తుంది !

అనేకమంది గురువుల వద్ద శిష్యరికం చేసిన చరిత్ర చాలామంది ప్రసిద్ధుల జీవితాలలో గోచరిస్తుంది. అవైదిక మతాలలో చూస్తే, బుద్ధుడు కనీసం ఇద్దరు గురువుల దగ్గర శిష్యరికం చేశాడు. ఇంకా ఎక్కువకూడా కావచ్చు. వైదికమతాలలో, రామానుజాచార్యులవారు ఇద్దరు గురువులను సేవించారు. అభినవగుప్తులవారికి దాదాపు పదిహేను మంది గురువులున్నారు. శ్రీరామకృష్ణులవారికి అరడజనుమంది గురువులున్నారు. మెహర్ బాబాకు ఇద్దరు గురువులున్నారు. ఈ విధంగా చాలామంది మనకు గోచరిస్తారు. అయితే, ఒక్కరు కూడా గురువుగా లేని రమణమహర్షి, జిల్లెళ్ళమూడి అమ్మగార్ల వంటి మహనీయులు కూడా చరిత్రలో ఉన్నారు.

పరిమితమైన జ్ఞానంతో సంతృప్తి పడకుండా, పరిపూర్ణజ్ఞానాన్ని కోరుకునేవారు అనేకమంది గురువులను సేవించవచ్చని అభినవగుప్తులవారు అన్నారు.

ఆచార్యులకు తమ గురువైన యాదవప్రకాశునితో విభేదాలు మొదలయ్యాయి. కారణం? యాదవప్రకాశుడు మాయావాది. శంకరాద్వైతాన్ని అనుసరిస్తాడు. రామానుజులు విష్ణుభక్తుడు. భక్తిమార్గాన్ని అనుసరించేవారు. కనుక, త్వరలోనే వీరికి గొడవలు ప్రారంభమయ్యాయి. ఉపనిషత్తుల శ్లోకాలకు అర్ధాలను చెప్పే క్రమంలోనే ఈ గొడవలన్నీ జరిగేవి. ఈ క్రమంలో, వైష్ణవ గ్రంధాలలో చెప్పబడిన ఈ సంఘటన ప్రసిద్ధమైనది.

యాదవప్రకాశుడు ఒకరోజున ఛాందోగ్యోపనిషత్తులోని ఈ మంత్రానికి అర్ధాన్ని వివరించి శిష్యులకు చెబుతున్నాడు.

'అధ య ఏషో అంతరాదిత్యే హిరణ్మయ: పురుషో దృశ్యతే హిరణ్యశ్మశ్రుర్హిరణ్యకేశ ఆ ప్రణభాత్సర్వ ఏష సుపర్ణ: తస్య యథా కప్యాసం పుండరీకమేవాక్షిణీ తస్యోదితి నామ స ఏష సర్వేభ్య పాష్మభ్య: ఉదిత ఉదేతి హ వై సర్వేభ్య: పాష్మభ్యో య ఏవం వేద'

ఈ వేదమంత్రం యొక్క అర్థమేమిటి?

'ఉదయిస్తున్న సూర్యునిలో బంగారురంగు గల పురుషుడున్నాడు. ఆయన యొక్క గడ్డము, మీసము, జుట్టు, చివరకు కాలిగోరువరకూ అంతా బంగారుమయమే. నీటిని త్రాగే కమలం లాగా ఆయన కన్నులు ఎర్రనిరంగులో ప్రకాశిస్తున్నాయి. సమస్తపాపములకూ ఆయన అతీతుడై ఉదయిస్తున్నాడు. ఆయనను ధ్యానించేవాడు కూడా పాపములను దాటిపోతాడు'

వేదకాలంలో సూర్యుని బ్రహ్మముగా ఆరాధించేవారు. గాయత్రీమంత్రం అదే. ఈ మంత్రం ఎంతో శక్తివంతమైనది. ఈ ధ్యానం కూడా ఎంతో శక్తివంతమైనది. కానీ, సంస్కృతం లోని పదాలకు అనేక అర్ధాలుండటమే తప్పై కూచుంది. ఈ మంత్రంలోని 'కప్యాసం' అనే పదానికి అనేక అర్ధాలున్నాయి. కనీసం ఆరువిధాలైన అర్ధాలు ఈ పదానికున్నాయి. వాటిలో కపి = కోతి, ఆసం =పిర్రలు, కనుక 'కోతిపిర్రలవలె' అనేది ఒక క్షుద్రమైన అర్ధం. కం = నీరు, పిబతి = త్రాగునది, కం పిబతి ఇతి కపి:, నీటిని త్రాగునది కపి (కమలం లేదా సూర్యుడు) అనేది ఇంకొక అర్ధం. కపయః ఆసం కప్యాసం, సూర్యునిచేత వికసింపబడునది (కమలం) అని ఇంకొక అర్ధం.

సంస్కృతంలో 'వృషాకపి' అని ఒక పదం ఉన్నది. విష్ణుసహస్రనామాలలో కూడా 'వృషాకపిరమేయాత్మా సర్వయోగవినిస్మృత:' అనే నామమున్నది. ఇది, విష్ణువునూ, రుద్రుడినీ, ఇంద్రుడిని, అగ్నిని, సూర్యుడినీ సూచిస్తుంది. పెద్దకోతి అని కూడా ఈ మాటకు అర్ధం వస్తుంది. ఆ మాటను వాడుతున్న సందర్భాన్ని బట్టి ఆయా అర్ధాలను తీసుకోవాలి. అంతేగాని, సందర్భానికి అతకని అర్ధాన్ని తీసుకుంటే పెడర్ధం వచ్చే ప్రమాదం ఉన్నది. 

సర్వోత్కృష్టుడైన బ్రహ్మమును గురించి చెప్పేటప్పుడు ఈ అర్ధాలలోని 'కోతిపిర్రలవంటి ఎర్రని కన్నులు కలిగినవాడు' అనే క్షుద్రమైన అర్ధాన్ని చెప్పకూడదు. ఎందుకంటే, ఈ సందర్భానికి ఈ అర్ధం పొసగదు. 'కమలములవలె  ఎర్రని కన్నులు కలిగినవాడు' అనే ఉత్తమమైన అర్ధాన్ని చెప్పాలి. నారాయణునకు 'కమలాక్ష' అనే నామముంది. శంకరాచార్యులవారు కూడా, ఉత్తమమైన అర్ధాన్ని మాత్రమే ఈ పదానికి చెప్పాలని తన భాష్యంలో వ్రాశారు.

ఆ రోజున ఈ మంత్రానికి అర్ధాన్ని చెబుతూ యాదవప్రకాశుడు, 'భగవంతుడు కోతిపిర్రలవంటి ఎర్రనికన్నులు కలిగినవాడు' అనే  క్షుద్రమైన  నీచమైన  అర్ధాన్ని చెప్పాడు. అది ఆయనయొక్క అజ్ఞానానికీ అహంకారపూరిత దృక్పధానికీ నిదర్శనం. దీనిని వింటూ రామానుజులవారు ఆయన దేహానికి నూనె పూస్తున్నాడు. ఆ రోజులలో గురువుగారికి శిష్యులు ఆ విధంగా సేవ చేసేవారు. గురువుగారు చెప్పిన ఈ క్షుద్రమైన అర్ధాన్ని విని రామానుజులవారు ఎంతో బాధపడ్డారు. వారి కన్నులలో ఉబికిన నీళ్లు యాదవప్రకాశుని భుజాల పైన పడ్డాయి. శిష్యుని కన్నీటిని చూచిన యాదవుడు కారణం అడిగాడు.

'ఈ వేదమంత్రానికి మీరు చెప్పిన అర్ధం సరియైనది కాదు. ఇలాంటి ఉత్తమమైన మంత్రానికి ఇలాంటి క్షుద్రమైన అర్ధాన్ని మీరు చెప్పడం విని నాకు ఎంతో బాధకలిగింది. అందుకే కన్నీరు ఉబికింది' అని జవాబిచ్చారు రామానుజులవారు.

'సరే అయితే, నీ అర్ధం ఏమిటో చెప్పు' అని గద్దించారు యాదవప్రకాశులు.

ఆ మంత్రానికి గల నాలుగు ఉత్తమములైన అర్ధాలను వివరిస్తూ, 'వికసించిన కమలములవంటి ఎర్రని తేజోవంతములైన కన్నులు కలిగినవాడు సూర్యమండలాంతర్వర్తియైన భగవంతుడు' అనే అర్ధాన్ని చెప్పారు రామానుజులవారు.

శిష్యుని సంస్కృతపాండిత్యానికి, భగవంతునిపట్ల ఆయనకు గల భక్తికి ఆశ్చర్యపోయాడు యాదవప్రకాశుడు.

ఈ తప్పుడు భాష్యాన్ని ఆదిశంకరులకు కొందరు అద్వైతద్వేషులు ఆపాదించారు. ఇది పూర్తిగా తప్పు. శంకరుల వంటి జ్ఞాని ఇటువంటి తప్పుడుభాష్యాన్ని సమర్ధించరు. ఆ పదానికి ఉన్న ఉత్తమమైన అర్ధాన్ని మాత్రమే చెప్పాలని శంకరులు తమ భాష్యంలో అన్నారు. దీనిని గమనించాలి. 

ఒక ఉత్తమమైన దానిని వివరిస్తున్నపుడు, దానికి పోలికగా ఉత్తమమైన ఉదాహరణను మాత్రమే ఇవ్వాలి గాని, నీచమైన ఉదాహరణతో దానిని వివరించే  ప్రయత్నం చేయకూడదు. ఇది కావ్యాలంకారజ్ఞానం ఉన్నవారికి ఎవరికైనా తెలిసిన విషయమే.     

ప్రతిరోజూ ఇలాంటి చర్చలు వాదోపవాదాలు ఎన్నో వీరిద్దరి మధ్యనా జరుగుతూ ఉండేవి. ప్రతిసారీ తర్కానికి నిలిచే విధంగా, ఉత్తమమైన వ్యాఖ్యానాన్ని రామానుజులవారు ఇచ్చేవారు. ఇలాంటిదే ఇంకొక సంఘటనను చెబుతాయి గ్రంధాలు.

'సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ' మని వేదం చెబుతున్నది. ఇది తైత్తిరీయోపనిషత్తులో ఉన్న మంత్రం. దీనిని వ్యాఖ్యానిస్తూ యాదవప్రకాశుడు, 'సత్యమే బ్రహ్మము, జ్ఞానమే బ్రహ్మము, అనంతత్వమే బ్రహ్మమ'ని సామాన్యార్ధాన్ని చెప్పాడు. దీనిని రామానుజులు వినయంగా ఖండిస్తూ, 'ఈ మూడూ భగవంతుని లక్షణాలని, భగవంతుడు వీటికి విభిన్నుడ'ని అన్నారు. ఈ విధంగా ప్రతి సందర్భంలోనూ గురుశిష్యులకు తేడాలు వస్తూ ఉండేవి.

యాదవప్రకాశుడు మాయావాది. 'బ్రహ్మమే సత్యము, జగత్తు మిధ్య' యనేది వారి వాదం. ఒకానొక అనుభవపరంగా అది సత్యమే కావచ్చు. కానీ నిత్యజీవితంలో అద్వైతం పొసగదు. అద్వైతికూడా నిత్యజీవితంలోకొచ్చేసరికి భక్తిని ఆశ్రయించవలసిందే. రామానుజులు భక్తులు. వారికి జగత్తు మిథ్యకాదు, సత్యమే. దండలోని పూసలవంటివారు జీవులు. వారిని ఏకంగా కలిపి ఉంచుతున్న అంతర్యామియే బ్రహ్మమని, ఆయనను నారాయణునిగా ఆరాధించి ధ్యానించాలని ద్వైతమార్గప్రబోధకులైన భక్తి ఆచార్యులు అంటారు. ఈ విధమైన అర్ధాలను రామానుజులవారు ఇచ్చేవారు.

జాతకపరంగా ఆచార్యులవారి జీవితంలో అసలిలాంటి గొడవలు ఎందుకు వచ్చాయి?

నవమాధిపతి అయిన గురువు, రహస్యస్థానమైన ద్వాదశంలో, మనస్సుకు సూచకుడైన లగ్నాధిపతి చంద్రునితో కలసి ఉండటం, షష్ఠంలో ఉన్న శనితో చూడబడటం వల్ల, గురువుతో సిద్ధాంతపరమైన విభేదాలు వచ్చాయి.

(ఇంకా ఉంది)