“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

14, ఫిబ్రవరి 2022, సోమవారం

శ్రీమద్రామానుజాచార్యుల వారి జాతక విశ్లేషణ - 6

యాదవప్రకాశులవారి శిష్యరికం నుండి బయటపడిన రామానుజులు ఇంటివద్దనే ఉంటూ, స్వంతంగా శాస్త్రాధ్యయనం చేస్తూ కాలం గడపసాగారు. తనకు ఎవరు దారిచూపుతారా అని అని ఆయన ఎంతో తపనపడుతూ ఉండేవాడు. అటువంటి తపనకు సమాధానం ఇవ్వకుండా భగవంతుడెలా ఉండగలడు?

వారి తండ్రిగారు బ్రతికి ఉన్న రోజులనుంచీ వారింటికి కాంచీపూర్ణుడనే ఒక భక్తుడు వస్తూ ఉండేవాడు. ఈయన బ్రాహ్మణకుటుంబంలో పుట్టకపోయినప్పటికీ, ఉత్తమములైన సంస్కారములున్న మహాభక్తుడు. వీరిది వ్యాపారకుటుంబం. వ్యాపారవ్యవహారాలలో తలదూర్చకుండా, ఎంతసేపూ దైవభక్తిలో మునిగి ఉండే ఈయనను ఈసడించుకున్న అన్నదమ్ములు, ఆస్తి పంపకాలు చేసి, ఇతనిని వేరు కాపురం పెట్టించారు. ఆ డబ్బుతో కొంత పొలాన్ని కొని, అక్కడ ఒక పూలతోట సాగుచేసి, ఆ పూలను రోజూ తీసుకుని వచ్చి కంచిలో వరదరాజస్వామివారి ఆలయంలో, స్వామి అలంకరణ కోసం ఇస్తూ ఉండేవాడు. వారి ఊరినుంచి వచ్చి పోయే దారిలో రామానుజుల ఇల్లు ఉండేది. అక్కడ కాసేపు సేదదీరి, సద్గోష్ఠిలో కాలం గడిపి, పోతూ ఉండేవాడు.

ఈయన ధ్యానతత్పరుడు. సాక్షాత్తు నారాయణుని దర్శనం ఈయనకున్నదని, స్వామి ఈయనతో మాట్లాడతాడని అందరూ అనుకునేవారు. ఆయన ప్రవర్తన కూడా ఎంతో ఉన్నతంగా ఉండేది. ఈయనను గురువుగా భావించిన రామానుజులు తన పరిస్థితిని ఆయనకు చెప్పారు. మొదట్లో, 'శూద్రుడనైన తాను మీకెలా గురువునౌతాన'ని ఆయన నిరాకరించాడు. నిత్యమూ భగవద్ధ్యానంలో మునిగి ఉండే మీకంటే ఉత్తములు బ్రాహ్మణులలో నైనా ఎవరు దొరుకుతారని రామానుజులు జవాబిచ్చారు. భగవంతుడు ఏదో ఒక దారి చూపే వరకు, కోయదంపతులు తనకేదైతే బావిలోనుంచి నీరు కావాలని అడిగారో, ఆ బావిలో నుంచి రోజూ బిందెలతో నీరు తీసుకు వచ్చి, ఆలయంలో స్వామివారి పూజలకు ఇస్తూ ఉండమని, 'అదే ప్రస్తుతానికి స్వామికి నీవు చేయగలిగిన సేవ' అని ఆయన చెప్పారు. రామానుజులవారు అదే చేస్తూ ఉండేవారు.

ఈ విధంగా, భవిష్యత్తు సూచనలు చాలామంది జీవితాలలో ముందుగానే గోచరిస్తూ ఉంటాయి.  భక్తులు, యోగుల విషయంలో ఇది ఇంకా ఖచ్చితంగా జరుగుతుంది. భావి పోకడలు చిన్నప్పుడే కనిపిస్తాయని పెద్దవాళ్ళు ఊరకే అనలేదు మరి ! కోయవనిత దాహమంటూ అన్నిసార్లు బావినుంచి నీటిని తోడించడమే గుర్తు, 'ముందు ముందు నువ్వు ఇదే పనిని చేయవలసి ఉంటుంద'ని చెప్పడానికి !

ఈ వ్యవహారమంతా రామానుజుల భార్యకు నచ్చేది కాదు. డబ్బును సంపాదించకుండా, ఎంతసేపూ శాస్త్రాలను చదవడం, భక్తి, ధ్యానం అంటూ పొద్దుపుచ్చడం, బావి నుంచి నీళ్ళబిందెలను మోసుకుని పోయి గుడిలో తొట్టి నింపుతూ ఉండటం, ఇదంతా ఆమెకు కంటగిపుగా ఉండేది. పైగా, ఆమె చాలా ఆచారపు కుటుంబంలో పుట్టి పెరిగిన మనిషి. కులాన్ని లెక్కించకుండా, గుణాన్ని భక్తిని మాత్రమే చూచే రామానుజులవారి ధోరణి ఆమెకు మ్రింగుడు పడేది కాదు. బ్రాహ్మణేతరుడైన కాంచీపూర్ణుని కాళ్లకు రామానుజులు మ్రొక్కడం ఆమె సహించలేకపోతూ ఉండేది.

శనిమహర్దశలో శని దశ 3 ఏళ్ళుంటుంది. ఆచార్యులవారి జీవితంలో కళత్రభావపరంగా శని ప్రభావం క్రిందటి పోస్టులలో వివరించాను. కనుక కుటుంబపరమైన ఆ బాధలన్నీ ఆచార్యులవారు ఈ సమయంలో పడుతూ వచ్చారు. ఆమెవైపునుంచి ఆమె సరియైనదే. ఈయనవైపునుంచి ఈయనా సరియైనవాడే. ఇద్దరి మధ్యనా ఆలోచనాపరంగా చాలా స్థాయీభేదం ఉన్నది. మరి అలాంటివారు వివాహం చేసుకోకూడదు. కానీ చేసుకోవలసి వచ్చింది. అదే విధివిచిత్రం !  

ఇదిలా ఉండగా, శ్రీరంగంలో ఉన్న ప్రముఖ వైష్ణవాచార్యుడైన యామునాచార్యులవారికి కాలం సమీపించింది. తన సాంప్రదాయానికి రామానుజులవారు వారసుడైతే బాగుంటుందని ఆయన ఆశ. అందుకని, రామానుజులవారిని తీసుకురమ్మని తన శిష్యుడైన మహాపూర్ణుడిని కంచికి పంపించాడాయన.

యామునాచార్యులవారి గురించి, నాధముని గురించి చెప్పుకోకుండా రామానుజులవారి చరిత్ర సంపూర్ణం కాదు.

యామునాచార్యులవారు 12 ఏళ్ల వయసులో పాండ్యదేశానికి రాజయ్యాడు. తనకు దాదాపుగా నడివయసు వచ్చేవరకూ రాజ్యం చేశాడు. తరువాత, నాధముని శిష్యుడైన రామమిశ్రులవారి ఉపదేశంతో విరక్తుడై, లౌకికజీవితాన్ని, తన రాజ్యాన్ని త్యజించి సన్యాసం స్వీకరించాడు. ఎక్కువగా శ్రీరంగంలో ఉంటూ ఉండేవారు. రాజుగా ఉంటూ అన్నీ త్యజించిన వారిలో బుద్ధుడిని ప్రధానంగా చెబుతారు. కానీ, బుద్ధుడు రాజు కాలేదు. యువరాజుగా ఉన్నప్పుడే సన్యాసి అయ్యాడు. ఈ వరుసలో యామునాచార్యులవారు కూడా ఉన్నారు. ఆయన రాజుగా ఉంటూ ఆ భోగాలను త్యజించి సన్యాసి అయ్యాడు. ఆయనదొక అద్భుతమైన జీవితం. అయితే, మన ప్రస్తుతవిషయం అది కాదు గనుక, దానిని వ్రాయడం లేదు.

1042 లో 25 ఏళ్ల వయసులో ఉన్న రామానుజాచార్యులవారు, మహాపూర్ణుని వెంట వెళ్లి శ్రీరంగంలో ఉన్న యామునాచార్యులను దర్శించారు. కానీ ఆ సమయానికి యామునాచార్యులవారు చనిపోయారు. వారి భౌతికదేహాన్ని మాత్రమే రామానుజులు దర్శించగలిగారు. అది వారిని చాలా దుఃఖంలో ముంచివేసింది. వారి అంత్యక్రియలలో పాల్గొన్న రామానుజులు  ఒక వింత విషయాన్ని గమనించారు.

యామునాచార్యుల వారి కుడిచేతి వ్రేళ్ళు మూడూ, ముడుచుకొని ఉండటాన్ని ఆయన చూచారు. ఆయన చేయి మొదటినుంచీ అదే విధంగా ఉండేదా? అని అక్కడివారిని అడుగగా అలాంటిదేమీ లేదని, ఆయన వ్రేళ్ళు బాగానే ఉండేవని వారు జవాబిచ్చారు. అలా అయితే, వారికి ఏవో మూడు తీరని కోరికలు మిగిలిపోయాయి, అందుకనే ఆ మూడు వ్రేళ్లూ అలా ముడుచుకుని ఉన్నాయని రామానుజులంటూ, ఆ మూడు కోరికలూ ఏమిటో ఎవరికైనా తెలుసునా? అని యామునాచార్యులవారి అంతరంగ శిష్యులను అడిగారు. దానికి వారు, ఇలా చెప్పారు.

1.'బ్రహ్మసూత్రములకు శంకరులవారి అద్వైతప్రధానమైన వ్యాఖ్య ఇప్పటికే ఉన్నది. దానికి భక్తిప్రధానమైన వ్యాఖ్యను వ్రాయాలని ఆయన అనుకునేవారు. ఇది తీరలేదు'. దానిని వినిన రామానుజులవారు, 'ఈ పనిని నేను చేస్తాను. బ్రహ్మసూత్రాలకు భక్తిప్రధానమైన వ్యాఖ్యానమును నేను వ్రాస్తాను' అన్నారు. వెంటనే, యామునాచార్యుల కళేబరం చేతి వ్రేళ్ళతో ఒక వేలు తెరుచుకుంది.

2.'యామునాచార్యులవారికి విష్ణుపురాణమంటే చాలా ఇష్టం. దానిని రచించిన పరాశరమహర్షి అన్నా, వారి తనయుడైన వ్యాసమహర్షి అన్నా వారికి అమితమైన గౌరవం ఉండేది. వారిద్దరి పేర్లను చిరస్థాయిగా లోకంలో నిలిపే పనిని చేయాలని ఆయననేవారు. ఇదికూడా ఆయన తీరని కోరికలతో ఒకటి' అన్నారు. వెంటనే రామానుజాచార్యులవారు, 'ఈ పనిని కూడా నేను నెరవేరుస్తా' నన్నారు. వెంటనే కళేబరం యొక్క రెండవవ్రేలు కూడా తెరుచుకుంది.

3.'నమ్మాళ్వార్ అనే వైష్ణవమహనీయుడు రచించిన ద్రావిడ వేదం (పాశురాలు), ఆలయాలలో పాడబడాలని, దానికి సరియైన వ్యాఖ్యానం వ్రాయబడాలని యామునాచార్యులవారు  అనుకునేవారు. ఇది కూడా వీరి తీరని కోరికలలో ఒకటి' అన్నారు.  ఆ పనిని కూడా తాను నెరవేరుస్తానని రామానుజాచార్యులవారు శపథం చేశారు.  వెంటనే కళేబరం మూడవవ్రేలు కూడా తెరచుకుని, యామునాచార్యులవారి చేయి మామూలుగా అయిపోయింది.

ఈ వింతను చూచి, అక్కడ గుమిగూడిన ప్రజలు నివ్వెరపోయారు. ఈ విధంగా, యామునాచార్యులవారి మూడు తీరని కోరికలను తీర్చే పనిని రామానుజాచార్యులవారు నెత్తిన వేసుకున్నారు.  అప్పటికి ఆయనకు 25 ఏళ్ళు మాత్రమే.

ఆ సమయంలో ఆయన జాతకంలో, శని/శని దశ జరిగింది. చంద్రలగ్నాత్ శని నవమాధిపతిగా గురువును సూచిస్తున్నాడు. కానీ షష్ఠమంలో కుజుని సూచిస్తున్న ఉచ్చ కేతువుతో కలిశాడు. కనుకనే ఆయనకు గురువు యొక్క కటాక్షం భౌతికంగా ఆ సమయంలో దొరకలేదు. దేహం చాలించిన తర్వాత మాత్రమే యామునాచార్యులవారిని ఆయన చూడగలిగారు.

తిరిగి కంచికి వచ్చేసిన రామానుజులు, యధావిధిగా బావినుండి నీళ్ళబిందెలను మోస్తూ, కాంచీపూర్ణునితో ఆధ్యాత్మిక సంభాషణలలో కాలం గడుపుతూ ఉన్నారు. ఇంతలో 1045 వ సంవత్సరంలో వారి తల్లిగారు గతించారు. అది శని/బుధదశ కావచ్చు. చంద్రలగ్నాత్ బుధుడు చతుర్ధాధిపతిగా వక్రించి ద్వాదశంలోకి వస్తున్నాడు. ఉచ్చరాహువుతో కలుస్తున్నాడు. చతుర్ధం నుంచి శని రోగస్థానాధిపతియై, ఆయుస్థానంలో ఉన్న ఉచ్చకేతువును కలుస్తున్నాడు.  ఆ కేతువు అష్టమాధిపతి అయిన కుజుడిని సూచిస్తున్నాడు. గోచారశని ధనుస్సులో సంచరించాడు. అది, చతుర్ధం నుంచి చతుర్ధం అవుతూ, తల్లిగారికి అర్ధాష్టమం అయింది. కనుక ఆ సమయంలో తల్లిగారి మరణం సంభవించింది.

రామానుజులవారి బంధాలు ఒక్కొక్కటిగా తెగిపోతున్నాయి. సంసారంజీవితమంటే ఆయనకు విరక్తి కలుగుతూ ఉంది. ఆయనకు భార్యపైన విరక్తి పెరగడానికి జరిగిన సంఘటనలలో ఈ క్రింది సంఘటన కూడాఒకటి.

తన మిత్రుడు, గురుసమానుడు అయిన కాంచీపూర్ణుడిని ఒకరోజున తన ఇంటికి భోజనానికి ఆహ్వానించారు రామానుజులవారు. చెప్పిన సమయానికి ఆయన రాకపోతే ఎదురువెళ్లి తీసుకువద్దామని రామానుజులవారు ఎదురు వెళ్లారు. అదే సమయంలో ఇంకొక వీధి నుంచి  కాంచీపూర్ణులవారు వచ్చారు. ఆయన శూద్రుడు గనుక, ఇంటిలోకి  పిలువకుండా, వరండాలోనే  ఆయనకు భోజనం వడ్డించింది రామానుజులవారి భార్య. అది పెద్ద అవమానమే ! కానీ ఆరోజులలోని ఆచారం అలా ఉండేది. అయితే, తన భర్త అంతగా గౌరవించే ఆయనను ఆ విధంగా అవమానించవలసిన అవసరం లేదు. ఆమె ఆచారపరాయణురాలు. నిజమైన ఆధ్యాత్మికత ఆమెకు అర్ధం కాలేదు.

నిజమైన భక్తులు, యోగులు, జ్ఞానులు, మహనీయులు, ఆ రోజులలో కూడా కులాన్ని పాటించేవారు కారు. వారు మనిషి హృదయాన్ని మాత్రమే చూచేవారు. అంతరిక పరిపక్వతను మాత్రమే గమనించేవారు. 'భక్తేర్ జాతి నోయ్ (భక్తులలో కులం లేదు)' అని శ్రీ రామకృష్ణులు తరచుగా అనేవారు.

ఈమె ధోరణి బాగా అర్ధమైన కాంచీపూర్ణులవారు, మారు మాట్లాడకుండా వరండాలోనే భోజనం ముగించి వెళ్లిపోయారు. ఊరంతా ఆయనకోసం వెదకి వచ్చిన రామానుజులవారికి ఈ విషయం తెలిసి  చాలా బాధపడ్డారు. పోనీ, ఆయన తినగా మిగిలిన వంటను ఆయన ప్రసాదంగా  తిందామని రామానుజులు భావిస్తే, దాన్నంతా పారేసింది ధర్మపత్ని. మళ్ళీ ఆయనకు వంట ప్రారంభించింది. ఇది రామానుజులవారికి మరీ బాధను కలిగించింది. భార్యపైన విరక్తిని పెంచింది. ఇటువంటి సంఘటనలు రోజువారీగా చాలానే జరుగుతూ ఉండేవి.

కాలం గడుస్తున్నది రామానుజులవారికి 32 ఏళ్ళు వచ్చాయి.

యామునాచార్యులవారి దగ్గరకు తనను చేర్చిన మహాపూర్ణుని మళ్ళీ ఒకసారి కలుసుకొని, ఆయన ద్వారా  దీక్షాస్వీకారం చేయాలని భావించారు రామానుజులు. ఎన్ని శాస్త్రాలను చదివినా, ఎంత వేదాంతం అర్థమైనా, ఒక సిద్ధగురువు వద్ద ఉపదేశం పొంది సాధన చేయకపోతే  అదంతా వృధానే అవుతుంది. ఆ పుస్తకజ్ఞానం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు.  ఈ విషయాన్ని బాగా గ్రహించిన రామానుజులవారు గురువును వెదుక్కుంటూ బయలుదేరారు. 

అదే సమయంలో, ఏదో ప్రేరేపణ కలిగినట్లు, మహాపూర్ణులవారు కూడా శ్రీరంగంలో బయలుదేరి ధర్మపత్నీసమేతంగా కాంచీపురం వస్తున్నారు. దారిలో మధురాంతకం అనే ఊరిలో వారు కలుసుకున్నారు. ఆ ఊరిలోని రామాలయంలో, నారాయణ మహామంత్రోపదేశం చేసి రామానునులవారికి దీక్షనిచ్చారు మహాపూర్ణులవారు. తన జన్మ ధన్యమైనట్లు భావించారు రామానుజులు. అందరూ కలసి కంచికి వచ్చేశారు.

మహాపూర్ణులవారిని ఆయన భార్యను చూచిన రామానుజులవారి ధర్మపత్నికి కోపం ఇంకా ఎక్కువైపోయింది.  వీళ్ళు తమ ఇంటిలో అతిధులుగా ఉంటారని గ్రహించగానే తన అక్కసంతా  వారిపైన చూపసాగింది. దానిని పట్టించుకోకుండా వారిద్దరూ రామానుజులవారి అభ్యర్ధన మేరకు  వారి అతిధులుగా ఉండసాగారు. కొన్నాళ్లకు రామానులవారి సతీమణి ఆగడాలు మరీ మితిమించాయి. ఒకరోజున మహాపూర్ణులవారి భార్యను నానామాటలూ అని దూషించింది. దానికి కారణమేంటో తెలిస్తే నవ్వొస్తుంది.

ఆరోజున రామానుజులవారి ధర్మపత్ని, నీటికోసం బిందెను తీసుకుని బావివద్దకు వెళ్ళింది. అదే సమయానికి మహాపూర్ణులవారి సతీమణి కూడా నీరు తోడుకుంటోంది. ఆమె బిందెలో నుంచి కొన్ని నీళ్లు రామానుజులవారి భార్య బిందెలో చిలికాయి. దానితో ఆమె కోపం నషాళానికెక్కింది.

'నువ్వు నా భర్త గురుపత్నివైనంత మాత్రాన ఏదో గొప్పదాన్నని అనుకుంటున్నావా? మా వంశం ఆచార్యవంశం. మా పూర్వీకులు చాలా ఆచారసంపన్నులు. మీ వంశం అంత పవిత్రమైనది కాదు.  అందుకే నీకంత అహంకారం. నీ బిందెలో నీళ్లు నా బిందెలో పడ్డాయి.  ఇప్పుడు నా బిందె నీళ్ళూ వృధా  అయిపోయాయి. వీటిని నేను పారబోయాలి. మళ్ళీ తోడుకోవాలి' అంటూ ఆమెను తిట్టిపోసింది. ఇద్దరూ సదాచార సంపన్నులైన బ్రాహ్మణవనితలే అయినప్పటికీ, వంశాలలోని గొప్పలు బాగా తలకెక్కి ఆమె అలా మాట్లాడింది. ఆమె మాటలకు బాగా బాధపడిన మహాపూర్ణుని ఇల్లాలు కన్నీరు కారుస్తూ ఉండిపోయింది.

ఈ సంఘటన జరిగిన తర్వాత, ఇక అక్కడ ఉండలేని భావించిన ఆ మహాదంపతులు చెప్పా పెట్టకుండా ఆ ఇంటిని వదలిపెట్టి  ఒకరోజున శ్రీరంగానికి వెళ్లిపోయారు. 

ఈ సంఘటనతో రామానుజులవారి మనస్సు చాలా చీకాకు పడింది. తన గురువుకే ఇంత అవమానం జరిగినప్పుడు ఇటువంటి భార్యతో సంసారం అవసరమా? అన్న బాధ ఆయనలో రేగింది. తన దారిని అర్ధం చేసుకోకుండా ఈ విధంగా  అడ్డంకులు సృష్టిస్తున్న భార్య తనకెందుకు? పైగా, ఇంటికి అతిధులుగా వచ్చిన  మహనీయులను కూడా ఇష్టం వచ్చినట్లు ఈ విధంగా దూషిస్తూ ఉంటే ఈ కాపురం ఎలా సాగాలి? పదిహేనేళ్ల నుంచీ ఈ భార్యను భరిస్తున్నాడు. ఇంకో పదిహేనేళ్లయినా ఈమె మారదు. ఈలోపల తన జీవితం వృధా అయిపోతుంది. దైవసాక్షాత్కారం పొందకుండానే తాను ఈ లోకాన్ని వదలి పోవలసి వస్తుంది. అదెంతవరకు సమర్ధనీయం? అని తీవ్రంగా ఆలోచించారు. ఒక నిశ్చయానికి వచ్చారు.

తన చిన్నకూతురికి పెళ్లి నిశ్చయమైనదని, అందుకని పెళ్లిపనులకోసం తన పెద్దకూతురిని వెంటనే తన ఇంటికి పంపమని, మామగారు వ్రాసినట్లుగా ఒక ఉత్తరం వ్రాసి ఒక బ్రాహ్మణుని చేత తన ఇంటికి పంపారు రామానుజులు. అది చూచిన భార్య, చాలా సంతోషపడి, వెంటనే బయలుదేరి తమ పుట్టింటికి వెళ్ళింది. రామానుజులవారు వెంటనే సన్యాసం స్వీకరించి  ఆ ఇంటిని వదలిపెట్టేశారు. ఆయన సంసారజీవితం ఆ విధంగా ముగిసింది. అప్పటికాయనకు 32 ఏళ్ళు. అది 1049 వ సంవత్సరం. తాను నివసించిన అదే కాంచీపట్టణంలో భిక్షాటన చేస్తూ, వరదరాజస్వామి ఆలయంలో నివసిస్తూ, దైవధ్యానంలో, శాస్త్రాధ్యయనంలో, సద్గోష్ఠిలో ఆయన కాలం గడపసాగారు.

ఆ సమయంలో ఆయన జాతకంలో శని/శుక్రదశ నడిచింది. రవి విదశ అయి ఉంటుందని భావిస్తున్నాను. చంద్రలగ్నాత్ సప్తమంలో ఉన్న శని వివాహజీవితం నుంచి వెనుకకు మరలుతున్నాడు. పంచమ, ద్వాదశాధిపతి అయిన శుక్రుడు ఆధ్యాత్మికచైతన్యాన్ని రగులుస్తున్నాడు. ఉచ్చలో ఉన్న సూర్యుడు వైరాగ్యాన్ని జ్వలింపజేస్తున్నాడు. కనుక ఈ సమయంలో ఆయన సన్యాసాన్ని స్వీకరించాడు.

ఉత్తరకాలామృతంలో కాళిదాసు ఇచ్చిన సూత్రం కూడా ఇక్కడ నిజం కావడం గమనించవచ్చు. శని శుక్రులు యోగకారకులైన జాతకంలో వీరి దశాంతర్దశలలో ఆ జాతకుడు రాజైనా సరే,  అతడిని ఈ గ్రహాలు బిచ్చగాడిగా మారుస్తాయని ఆయనన్నాడు. ఈ సూత్రాన్ని ఇంతకుముందు ఎన్నో జాతకాలలో వ్రాసి నిరూపించి ఉన్నాను. ఇది మళ్ళీ ఇక్కడ కూడా నిజం కావడాన్ని చూడండి. 

చంద్ర లగ్నాత్ శనిశుక్రులు యోగకారకులే. కనుక శని/శుక్ర దశలో, ఏ ఊరిలో అయితే ఒక సాంప్రదాయగృహస్థుగా గౌరవంగా బ్రతికాడో, అదే కంచిలో భిక్షాటన చెయ్యడం మొదలుపెట్టాడు. ఇల్లు వదిలేసి ఆలయంలో నివసించడం మొదలుపెట్టాడు. ఇది గ్రహప్రభావమేగా మరి  !

కాలం కలిసిరాక చేసినా, కావాలని వరించి చేసినా జీవితం అదే దారిలోనేగా నడుస్తున్నది !

(ఇంకా ఉంది)