“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

9, మార్చి 2018, శుక్రవారం

ఏసీ బోగీలో పందికొక్కులు

నేను తరచూ ప్రయాణాలు చేస్తూ ఉండటంతో రకరకాల మనుషులు నాకు తారసపడుతూ ఉంటారు. వాళ్ళ మనస్తత్వాలు గమనిస్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే చాలా సరదాగా ఉండటమే గాక, మనుషుల తీరుతెన్నులు బాగా అర్ధమౌతూ ఉంటాయి.

మొన్నీమధ్య ఏదో పనిమీద వెళుతూ ఒక రైలెక్కాను. రెండుగంటల ప్రయాణమే. 'A-1 లో 1, 3 బెర్తులు మీవి. అందులో కూచోండి సార్' అని కండక్టర్ చెప్పాడు.

లోపలకెళ్ళి చూస్తే అప్పటికే వాటిల్లో ఒక ముగ్గురు కూచోని కనిపించారు. అందరూ బాగా సీరియస్ గా ఏదో యుద్ధానికి పోతూ, వెనక్కు తిరిగి వస్తామో రామో అన్నట్లు గంభీరంగా ముఖాలు పెట్టుకుని ఉన్నారు. ఆ ముఖాలు చూస్తూనే భలే నవ్వొచ్చేసింది. 'మీ ఖర్మ పాడుగాను ! ఏసీలో కూడా అలా చెమటలు కక్కుతూ చిటపటలాడుతూ కూచున్నారేంట్రా? ప్రయాణం కూడా సుఖంగా చెయ్యలేరు. ఏంటో ఈ మనుషులు ? ' అని జాలిపడుతూ నేనూ అక్కడే కూచున్నాను.

సామాన్యంగా బయట ప్రపంచంలో చిటపటలాడుతూ ఉండేవారికి ఫేమిలీలో చాలా సమస్యలుంటాయి. ఎక్కువగా ఇలాంటివాళ్ళు భార్యా బాధితులై ఉంటారు. లేకపోతే వారి కుటుంబాలలో తీరని సమస్యలుంటాయి. అందుకని అక్కడ ఏమీ చెయ్యలేక ఆ కోపమంతా బయట లోకంలో చూపిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళను చాలామందిని నేను చూచి ఉండటంతో ఇవాళ మంచి కాలక్షేపం ఉందనీ, వీళ్ళను బాగా ఆడుకోవచ్చనీ లోలోపల సంతోషించాను.

నా పక్కనాయన ఏదో ఒక అఫీషియల్ లాగా కనిపించాడు. రిజర్వుడుగా దర్పంగా కూచుని ఉన్నాడు. ఎదురుగా ఒక యువకుడు మామూలుగా కూచుని ఉన్నాడు. ఆ యువకుడి పక్కనాయన మాత్రం చాలా తేడాగా కనిపించాడు. ఆయనకు అరవై ఉంటాయి. కానీ ఇంకా ఏదో ఉద్యోగమో వ్యాపారమో వెలగబెడుతున్న శాల్తీలా కన్పిస్తున్నాడు. చాలా అసహనంగా చిటపటలాడుతూ ఏదో పేపర్ చదువుతూ మధ్య మధ్యలో మావైపు 'వీళ్ళంతా ఇక్కడకు ఎందుకొచ్చారు?' అన్న ధోరణిలో చూస్తున్నాడు.

వాతావరణం చాలా ఇబ్బందికరమైన నిశ్శబ్దంతో కూడుకుని ఉంది. రెండు నిముషాలలో కదలవలసిన రైలు పని నిముషాలైనా ఇంకా కదలలేదు. ఏదో సమస్య వచ్చిందని నాకర్ధమైంది.

సామాన్యంగా ఇలాంటి సందర్భాలలో ఈ ఐస్ ను బ్రేక్ చెయ్యడానికి ఏదో ఒక సంఘటన ట్రిగ్గర్ లాగా ఉపయోగపడుతుంది. ఏం జరుగుతుందా అని నేను ఉత్సుకతతో చూస్తున్నాను.

ఇంతలో వాడి ఖర్మకాలి బెడ్ రోల్ కుర్రాడు మా దగ్గరకొచ్చాడు. 'సార్! మీకు బెడ్రోల్ కావాలా?' అని నన్నడిగాడు. అలా అడగమని కండక్టర్ అతనికి చెప్పి పంపాడని నాకర్ధమైంది.

'వద్దు. నా ప్రయాణం జస్ట్ రెండు గంటలే. అవసరం లేదు.' అని చెప్పాను.

''నేను విజయవాడ నుంచీ వస్తున్నాను. ఇంతవరకూ నన్ను ఎవరూ పట్టించుకోలేదు. వాళ్ళు ఇప్పుడు ఎక్కారు. వెంటనే వాళ్ళను అడిగి మర్యాదలు చేస్తున్నావు. వాళ్ళు రైల్వేవారా?' అని ఎదురు బర్త్ ఆయన కల్పించుకుని ఆ కుర్రాడిని అరిచాడు.

'సార్ ! మీ బెడ్రోల్స్ అవిగో పైనున్నాయి. మీరు చూసుకోకుండా మమ్మన్లంటే ఎలా? ఇంతకీ మీ సీట్ నంబర్ ఏంటి?' అన్నాడు బెడ్రోల్ కుర్రాడు.

'నా సీట్లో ఒకామె పడుకొని ఉంది. నాకేమో పైబెర్తు వచ్చింది. నేనెక్కలేను.' మళ్ళీ అరిచాడు ఎదురుసీటు శాల్తీ.

'అందుకని మీరు వేరే వాళ్ళ సీటులో కూచుంటే ఎలా?' అన్నాడు బెడ్రోల్.

'ఏం? అసలు మీ రైల్వే వారు సీట్ ఎలాట్మేంట్ ఎలా చేస్తున్నారు? ముందు చేసుకున్నవారికేమో పై బెర్తు ఇస్తారు. తర్వాత చేసుకున్నవారికి క్రింద బెర్తు ఇస్తారు. ఏంటి అసలు మీ లాజిక్? నేనూ డబ్బులు కట్టాను నా సీటుకి.' ఇంకా పెద్దగా అరిచాడు శాల్తీ. 

'ఓహో! ఇదేదో మెంటల్ కేసులాగుంది' అనుకుని -'సర్లేమ్మా. నువ్వెళ్ళు' అని ఆ కుర్రాడిని పంపించేశాను.

రైలు ఇంకా కదల్లేదేంటా అని చూస్తుండగా, కండక్టర్ లోపలికొచ్చాడు.

'పక్క బోగీలో బొద్దింక ఉందని వాళ్ళు కంప్లెయింట్ చేశారు. అందుకని క్లీనింగ్ వారిని పిలిపించి ఆ బోగీ అంతా స్ప్రే చేయించేసరికి లేటయింది సార్. అందుకే రైలు ఇంకా కదలలేదు.' అని నాతో చెప్పాడు.

వింటున్న అసహన శాల్తీ - 'మీ బోగీలలో బొద్దింకలే కాదు. పందికొక్కులు కూడా ఉంటాయి. ఒకసారి నా ఎదురుగానే నా కో పాసింజర్ బ్యాగ్ కొరికేశాయి' అన్నాడు అనవసరంగా కల్పించుకుంటూ.

మేమాయన్ను పట్టించుకోలేదు.

'ఓ! అదా సంగతి. అందుకు లేటయిందా? సరే మీరు వెళ్ళండి.' అని ఆ కండక్టర్ ను పంపేశాను.

మౌనంగా ఊర్కుంటుంటే వీడి గోల మరీ ఎక్కువౌతోందని శాల్తీ వైపు తిరిగి -'మీరు గతాన్ని వదిలి వర్తమానంలోకి రాలేకపోతున్నారల్లే ఉంది?' అన్నాను మర్యాదగా.

అతను స్టన్ అయ్యాడు.

'అదేంటి అలాగంటారు?' అన్నాడు.

'అవును. ప్రస్తుతం మేం మాట్లాడుకుంటున్నది బొద్దింక గురించి. మీరు ఎప్పుడో గతంలో పందికొక్కు గురించి చెబుతారేంటి?' అన్నా.

'అది నా అనుభవం' అన్నాడు శాల్తీ.

'ఏడ్సినట్టుంది నీ పందికొక్కు అనుభవం !' అని మనసులో అనుకుని 'రైల్లో పందికొక్కులుంటే తప్పేముంది? దేశం నిండా అవే ఉన్నప్పుడు !' అన్నా ఘాటుగా.

'ఓహో ! అయితే మీరు రైల్వే వారా? ఏం చేస్తుంటారు రైల్వేలో?' అన్నాడు.

చెప్పాను.

'మీరు?' అన్నాడు నా పక్కాయన్ని.

'నేను చీఫ్ ఇంజనీర్ని' అని ఆయన చెప్పాడు.

ఇక శాల్తీ ప్రశ్నల పరంపర మొదలు పెట్టాడు.

'అసలూ - రైళ్ళు లేటుగా ఎందుకు నడుస్తాయి? బోగీలలో శుభ్రత ఎందుకు ఉండదు? క్యాటరింగ్ లో నాణ్యత ఎందుకు ఉండదు? స్టేషన్లు అపరిశుభ్రంగా ఎందుకు ఉంటాయి? ఇన్ని ఏళ్ళైనా రైల్వేలో ఏమీ డెవలప్మెంట్ లేదేంటి?' ఇలాంటి మామూలు ప్రశ్నలు చాలా చాలా అనర్గళంగా సంధించాడు.

నేను చెప్పేలోపే నా పక్కనున్న CE అందుకుని వాటికన్నీ జవాబులు చెప్పాడు.

రైల్వేలకు ప్రస్తుతం కావలసింది కొత్త రైళ్ళు కాదు. కొత్త లైన్లు. ఉన్నచోట పెంచాలి. కొత్తవి వెయ్యాలి. ఈ రెంటికీ బడ్జెట్లో సరిపడినంత డబ్బు ఇవ్వరు. ఇచ్చినా కొన్ని రాష్ట్రాలకో ప్రాంతాలకో అభివృద్ధి పరిమితం అవుతుందిగాని అన్నిచోట్లకూ సమంగా రాదు. ఏదో చేశామని చూపించడం కోసం, ఉన్న లైన్లలోనే కొత్తకొత్త రైళ్ళు ప్రవేశ పెడుతూ ఉంటారు. సూపర్ శాచురేషన్ వల్ల మరి లేటవక ఇంకేం అవుతాయి? ఇప్పుడు స్వచ్చభారత్ పుణ్యమా అని ప్రతి స్టేషనూ చాలా శుభ్రంగానే ఉంటున్నది. క్యాటరింగ్ కూడా ఎంతో ఇంప్రూవ్ అయింది. రైల్వేలో డెవెలప్మెంట్ ఎందుకు లేదు? సీ చేంజ్ ఉంది.' అంటూ ఆయనకు ఉదాహరణలతో సహా చెప్పుకొచ్చాడు.

అయినా ఆ శాల్తీ సంతృప్తి చెందలేదు. రైల్వేని వదిలేసి దేశ రాజకీయాలు మాట్లాడటం మొదలుపెట్టాడు. రాజకీయ నాయకుల్నీ, వ్యవస్థనీ తిట్టడం మొదలైంది. ఇలా ఒక గంట గడిచాక, చివరగా - 'మన దేశంలో రైల్వే లాంటి వ్యవస్థలన్నీ వైట్ ఎలిఫెంట్ లే' అన్నాడు.

వ్యక్తిగత జీవితంలో వీడొక ఫెయిల్యూర్ కేసని నాకర్ధమైపోయింది.

'ఇంతకీ మీరేం చేస్తుంటారు?' అడిగాను కూల్ గా.

'నేను బాంబే I.I.T లో పని చేస్తుంటాను.' అన్నాడు దర్పంగా.

'అవునా? ఏ డిపార్ట్మెంట్? ఎందుకంటే మా బావమరిది కూడా అక్కడే ఫిజిక్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నాడు.' అన్నా నేను.

శాల్తీ వెంటనే మాట మార్చి - 'అంటే, నేను కెమిస్ట్రీ బ్రాంచ్ లో చేశాను. అదికూడా ఇప్పుడు కాదు. పదిహేనేళ్ళ క్రితం' అంది.

'ఇప్పుడేం చేస్తున్నారు?' అడిగాను.

'నేను సైంటిస్ట్ ని. హైదరాబాద్ లో' అంది శాల్తీ.

'దొరికావ్ రా బిడ్డా' అని మనసులో అనుకుని, 'సైన్సు మీద నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి' అన్నాను.

'చెప్పండి' అన్నాడు సైంటిస్ట్.

'మనకు స్వతంత్రం వచ్చాక ఇప్పటివరకూ మీ సైంటిస్ట్ లు మన దేశానికీ, మన సమాజానికీ, మన పరిస్థితులకీ పనికొచ్చేలా చేసిన ఒక పది ఆవిష్కరణలు చెప్పండి.వింటాను.' అన్నాను.

'చాలా ఉన్నాయి' అన్నాడు.

'నాకు 'చాలా' అక్కర్లేదు. ఒక పది చెప్పండి చాలు. విదేశీ సైంటిస్ట్ లను కాపీ కొట్టకుండా మీ అంతట మీరు స్వతంత్రంగా చేసిన ఆవిష్కరణలు నాకు కావాలి. వాటివల్ల మన దేశానికి సమాజానికి స్పష్టమైన మేలు జరిగి ఉండాలి. అలాంటివి చెప్పండి' అన్నాను.

'అవీ... అవీ...' అని నీళ్ళు నములుతున్నాడు.

'పోనీ మీకు గుర్తు లేకపోతే, తీరిగ్గా గుర్తు తెచ్చుకుని చెప్పండి. ఈలోపల ఇంకో ప్రశ్న? అడగనా?' అన్నాను.

ఈ సారి ఆయనలో మునుపటి దూకుడు లేదు. ఏం అడుగుతానా అని ఊరకే చూస్తున్నాడు.

'నోబుల్ ప్రైజు పెట్టాక మీ కెమిస్ట్రీ బ్రాంచ్ లో మన దేశానికి ఎన్ని నోబుల్ ప్రైజులు వచ్చాయో కాస్త చెప్పండి వింటాను' అన్నాను.

దానికీ సైంటిస్ట్ గారి దగ్గర జవాబు లేదు. దిక్కులు చూస్తున్నాడు.

'ఇందాకంటినుంచీ మీరు రైల్వేనీ దేశాన్నీ వ్యవస్థలనూ తెగ విమర్శిస్తున్నారు కదా ! మరి మీ సైంటిఫిక్ కమ్యూనిటీ చేస్తున్నది ఏంటి? మీరు వైట్ ఎలిఫెంట్ కాదా? మీవల్ల మన దేశానికి ఉపయోగం ఏంటి? మన దేశానికి ఉపయోగపడే ఆవిష్కరణలు మీరు చేసినవి ఏమున్నాయసలు? అంతర్జాతీయ రంగంలో మీ విలువ ఏంటి? ఒక్క నోబెల్ ప్రైజ్ అయినా మీకెందుకు రావడం లేదు? ఎంతసేపూ విదేశీయులు చేసిన డిస్కవరీస్ ని కాపీ కొట్టి క్లాసుల్లో పాఠాలు చెప్పడమే కదా మీరు చేస్తున్నది? మీరు సొంతంగా కనిపెట్టింది ఏముంది? గుండుసూది నుంచీ, బాల్ పాయింట్ పెన్ను నుంచీ, ప్రతీదీ విదేశీయుల ఆవిష్కారమే. మీదేముంది అసలు? మీరు ఇందాకటినుంచీ మాట్లాడుతున్నది కరెక్ట్ కాదేమో? ఆలోచించండి.' అన్నాను.

సైంటిస్ట్ పూర్తిగా మెత్తబడి పోయాడు.

'అది కాదండి. పొలిటికల్ లీడర్స్ ఈ దేశాన్ని పాడు చేస్తున్నారు. మాకు తగినన్ని నిధులిస్తే మేము కూడా ఎన్నో ఆవిష్కరణలు చెయ్యగలం. మాకు ఫండ్స్ లేవు.' అన్నాడు చివరికి.

'మాదీ అదే పరిస్థితి. దేశం మొత్తం ప్రతి స్టేషనులోనూ నాలుగైదు పట్టాల లైన్లు, కరెంట్ లైన్లు వేసి, లేటెస్ట్ ఇంజన్లూ బొగీలూ ఇస్తే మేమూ ప్రపంచరైల్వేలతో ధీటుగా రైల్వేని నడపగలం. ఇప్పుడున్న వనరులతో ఇలా నడపడం ప్రపంచంలో ఏ సంస్థకూ సాధ్యం కాదు. మేం కాబట్టి చేస్తున్నాం. రైల్వే చాలా పటిష్టమైన వ్యవస్థ. దీని పనితీరు కూడా ఆర్మీలా చాలా పకడ్బందీగా ఉంటుంది. ఆ సంగతి లోపలున్న మాకు తెలుసు. బయటనుంచి చూచే మీకర్ధం కాదు. మాకూ తగినన్ని ఫండ్స్ లేవు. మీ సైన్స్ వ్యవస్థ సంగతీ అంతే. అన్నీ ప్రభుత్వం క్రింద పనిచేసే సంస్థలే. మీ సమస్యలే మాకూ ఉంటాయి. కానీ ఒక్కటేంటంటే, ఇన్నేళ్ళ అనుభవంతో రిటైర్ కూడా అయిన మీరుకూడా విషయాన్ని ఈ మాత్రం అర్ధం చేసుకోలేక పోవడం వింతగా ఉంది.

బైదిబై మీకు బీపీ చాలా ఎక్కువగా ఉందని నా అనుమానం. ఏమనుకోకపోతే ఒక్కసారి చెక్ చేసుకొండి. ఇంకో విషయం. మీకు బీపీ ఎక్కువైపోయి ఏదైనా ప్రాబ్లం అయితే ఇదిగో ఈ నంబర్ కి ఎస్సెమ్మెస్ చెయ్యండి. వచ్చే స్టేషన్లో డాక్టర్ వచ్చి అటెండ్ అవుతారు. రైల్వేలో వచ్చిన డెవెలప్ మెంట్ కి ఇదే మీకు నిదర్శనం. మోడరన్ టెక్నాలజీని వాడుకుంటూ ఇంకా చాలా మార్పులు మాకు వచ్చాయి. అవన్నీ మీకిప్పుడు చెప్పే సమయం లేదు. ఎందుకంటే నేను దిగాల్సిన స్టేషన్ వచ్చేసింది. ఉంటా. ఆరోగ్యం జాగ్రత్త.' అని చెప్పి నా స్టేషన్లో దిగేశాను.

పాపం సైంటిస్టు ! జాలేసింది ! ఇలాంటివాళ్ళు చాలామంది 'దేశం పాడైపోతోంది' అని తెగ లెక్చర్లు ఇస్తూ ఉంటారు. కానీ వాళ్ళ కాళ్ళక్రింద ఏముందో చూసుకోరు.

ఏసీ బోగీలో పందికొక్కులంటూ ఈయన ఒక మంచిమాట చెప్పాడు. నిజమే ! మన దేశం కూడా ఒక ఏసీ బోగీ లాంటిదే. కానీ అందులోకి పందికొక్కులు ప్రవేశించాయి. ఒకప్పుడు తెల్లవి ఉండేవి. ఇప్పుడు నల్లవి తయారయ్యాయి. ఏ మందేసినా అవి చావడం లేదు. ఒకటి కాకపోతే ఇంకోటి, తరతరాలుగా దేశాన్ని కొరుక్కు తింటున్నాయి. వోటర్స్ కేమో చాయిస్ లేని పరిస్థితి !

ఏం చేస్తాం ! సమాజం మొత్తం ఇలాగే ఉంది. సూడో పాలిటీషియన్స్!  సూడో ఇంటలెక్చువల్స్ !! దటీజ్ ఇండియా !