“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

14, మార్చి 2018, బుధవారం

నువ్వే నాక్కావాలి

కళ్ళెదురుగా నిన్ను కాంచలేనివాడే
గుడికెళ్ళి గుండు చేయించుకుంటాడు
ఘోరంగా నీతో బేరాలాడేవాడే
హుండీలో దండిగా డబ్బులేస్తాడు
ఆ గ్రుడ్డితనమూ నాకొద్దు
ఈ బేరసారాలూ నాకొద్దు
నువ్వే నాక్కావాలి

భయంతో వణికేవాడే
బాగా సంపాదించాలనుకుంటాడు
గర్వంతో పొంగేవాడే
ఘనంగా బ్రతకాలనుకుంటాడు
ఆ భయమూ నాకొద్దు
ఈ గర్వమూ నాకొద్దు
నిజమైన బ్రతుకు నాక్కావాలి

జీవితంలో నీ ఆటను చూడలేనివాడే
పూజల్లో నిన్ను వెదుకుతాడు
దేవుడి పేరుతో మోసం చేసేవాడే
సోమరిగా బ్రతుకుతాడు
ఆ అజ్ఞానమూ నాకొద్దు
ఈ సోమరితనమూ నాకొద్దు
నిజమైన వెలుగు నాక్కావాలి

ఒకప్పుడు దోచుకున్నవాడే
ఇప్పుడు సేవ చేస్తానంటాడు
లోకంకోసం అని చెబుతూ
తనకోసమే తను చేసుకుంటాడు
ఆ దోపిడీ నాకొద్దు
ఈ సేవా నాకొద్దు
నిజమైన తృప్తి నాక్కావాలి

నువ్వంటే తెలియనివాడే
నీమీద ఉపన్యాసాలిస్తాడు
దారేంటో తెలియనివాడే
ఇతరులకు దాన్ని బోధిస్తాడు
ఆ వాగుడూ నాకొద్దు
ఈ బోధలూ నాకొద్దు
నువ్వే నాక్కావాలి

ఎందుకు పుట్టానో తెలియనివాడు
ఇతరులకు మార్గదర్శనం చేస్తుంటాడు
ఎటు పోవాలో తెలియని వాడు
ఎలా పోవాలో చెబుతుంటాడు
ఆ చీకటీ నాకొద్దు
ఈ బాధ్యతా నాకొద్దు
నువ్వే నాక్కావాలి

పేరుప్రతిష్టలు కోరేవాడే
గుళ్ళు కట్టి నిన్ను రాయిని చేస్తాడు
గుండె బండగా మారినవాడే
బండరాళ్ళను పూజిస్తాడు
ఆ గుళ్ళూ నాకొద్దు
ఈ పూజలూ నాకొద్దు
నువ్వే నాక్కావాలి

నిన్ను పట్టుకోలేనివాడు
తానే నువ్వంటూ వేషం వేస్తుంటాడు
నీ నగ్నత్వం తెలియనివాడు
నీకు వేషాలేసి మోసం చేస్తుంటాడు
ఆ వేషాలూ నాకొద్దు
ఈ మోసాలూ నాకొద్దు
నువ్వే నాక్కావాలి...