The secret of spiritual life lies in living it every minute of your life

1, మార్చి 2018, గురువారం

కంచి శంకరాచార్య జయేంద్ర సరస్వతి స్వామి - జాతక పరిశీలన

చాలామంది జాతకాలలో సన్యాసయోగాలుంటాయి. కానీ అవి ఫలించవు. ఎందుకంటే అలా ఫలించకుండా ఇతర యోగాలు అడ్డుపడుతూ ఉంటాయి. అలాంటప్పుడు అవి ఆధ్యాత్మిక చింతనగా పరిణమిస్తూ ఉంటాయి. అంటే, ఆ వ్యక్తి సన్యాసి కాకపోయినా, ఆధ్యాత్మిక పరమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు.ఇంకొంతమందిలో ఇవి మానసిక అసమతుల్యతలుగా తయారౌతాయి.

ఒక శక్తివంతమైన పరివ్రాజక యోగం లేదా సన్యాసయోగం అనేది మహారాజయోగంతో సమానమైనది. బుద్ధుడు పుట్టిన సమయంలో రాజజ్యోతిష్కులు ఇదే చెబుతారు. ఇతను అయితే మహా చక్రవర్తి అవుతాడు. లేదా ఒక కొత్త పంధాను సృష్టించే ప్రవక్తా సన్యాసీ అవుతాడు అని వాళ్ళు అంటారు. అంటే రెండూ సమానమైన యోగాలేనని వాళ్ళు 2500 ఏళ్ళ క్రితమే చెప్పారు.

ఇంకా చెప్పాలంటే, మహారాజయోగం కంటే కూడా మహాపరివ్రాజక యోగం గొప్పది. ఎందుకంటే, రాజు కూడా గురువుకు ప్రణామం చేస్తాడు. కానీ ఒక ఆచార్యుడు రాజుకు ప్రణామం చెయ్యడు. ఆశీర్వాదం ఇస్తాడు. రాజుకు వైభోగం ఉంటుంది. అధికారం ఉంటుంది. కానీ ఆధ్యాత్మికయోగం ఉండదు. కానీ ఒక సాంప్రదాయ పీఠానికి అధిపతి అయిన ఆచార్యునికి మహారాజభోగమూ, ఆధ్యాత్మికయోగమూ రెండూ కలసి ఉంటాయి. కనుక రాజుకంటే కూడా ఈయన జాతకమే బలమైనది.

కంచి శృంగేరి వంటి మఠాలకు నేతృత్వం వహించాలంటే ఆ జాతకంలో ఎంతో గొప్పదైన పుణ్యబలం ఉండాలి. అలాంటి జాతకాలలో ఒకటి నిన్న గతించిన జయేంద్ర సరస్వతి గారి జాతకం.

ఈయన జాతకంలో సంప్రదాయమూ, సేవా దృక్పధమూ రెండూ కలసి మెలసి ఉన్నాయి. అందుకే, బ్రాహ్మణేతర కులాలకు కూడా వేదాన్ని నేర్పించి కేరళలోని దేవాలయాలలో పూజారులుగా అనేకమందిని ఈయన ఏర్పాటు చేశాడు. దళిత కుటుంబాలలోకి కూడా మన సాంప్రదాయ ఆధ్యాత్మికతను తీసుకెళుతూ అనేక కార్యక్రమాలు రూపొందించి, స్వయంగా తానే వాడవాడలా పర్యటించి, ఒక వ్యక్తిగా చేతనైనంత చేశాడు. విద్య, వైద్యరంగాలలో సమాజసేవ, అన్ని కులాలనూ కలుపుకుని పోవాలనే ఉదారతత్త్వం ఈయన ప్రత్యేకతలు.

ఈయన 18-7-1935 న తమిళనాడులోని ఇరుల్ నీకి అనే ఊరిలో జన్మించాడు. ఈయన జాతకాన్ని గమనిద్దాం.

రాశి నవాంశలలో రాహుకేతువుల స్థితివల్లా, శనీశ్వరుని వక్రత్వస్థితి వల్లా లోకులతో బలీయమైన కర్మసంబంధం ఉన్న జాతకం అని తెలుస్తున్నది. ఆధ్యాత్మిక జాతకాలలో సామాన్యంగా ఉండే శనిచంద్ర సంయోగం ఈ జాతకంలో గమనించవచ్చు. చంద్రలగ్నాత్ మంత్రస్థానంలో బుధకేతువుల యోగంవల్ల మంత్రసిద్ధి కనిపిస్తున్నది. సప్తమంలో శుక్రస్తితివల్ల 'కారకో భావనాశక:' సూత్రానుసారం వివాహభావం చెడిపోయింది. నవమంలో గురుకుజుల యోగం పీఠాధిపత్యాన్నిచ్చింది. నవాంశలో చంద్రమంగళయోగం పట్టుదలతో కూడిన మనస్సును సూచిస్తోంది. లాభస్థానంలో గురురాశిలో ఉన్న నీచరాహువు వల్ల తిరుగుబాటుదారులూ, దుందుడుకు స్వభావం కలిగిన అనుచరులూ, ఆశ్రమ శిష్యులూ కనిపిస్తున్నారు. అంతేగాక ఈయనలోని సాంప్రదాయవిరుద్ధ ధోరణులకు కూడా ఈ రాహువు యొక్క స్థితే కారణం.

మహనీయులు కూడా గ్రహప్రభావానికి అతీతులు కారన్న సూత్రానికి అనుగుణంగానే ఈయనకూడా జననకాల సూర్యుని మీదకు గోచార రాహువు సంచరిస్తున్న సమయంలోనే శ్వాస ఇబ్బందులవల్లా, గుండెపోటు వల్లా మరణించారు. కర్కాటకం ఈ రెంటినీ సూచిస్తుంది.

కోర్టు ఈయన్ను నిర్దోషిగా ప్రకటించినప్పటికీ, శంకర్ రామన్ హత్యకేసు మాత్రం ఈయన జీవితంలో ఒక రహస్యంగా మిగిలిపోయింది, పుట్టపర్తిలో విద్యార్ధుల హత్యలలాగే ! ఈయన జాతకంలో రాశి నవాంశలలో నీచస్థితులలో ఉన్న రాహుకేతువులు ఈ రహస్య కోణాన్ని సూచిస్తూనే ఉన్నారు.


2004 నవంబర్లో ఈయన అరెస్ట్ కాబడినప్పుడు, గోచార యురేనస్ జననకాల చంద్రలగ్నం మీద సంచరించాడు. అదే విధంగా నవమ స్థానంలో నీచరవి, కేతుగ్రస్తుడై ఉంటూ మతపరమైన అగౌరవాన్నీ పరువు పోవడాన్నీ సూచించాడు. అష్టమంలో గురు, కుజ,నీచ శుక్రులుంటూ బంధనయోగాన్నీ రహస్య అభియోగాలనూ సూచిస్తున్నారు. అదే సమయంలో కొందరు మహిళలచేత ఈయనమీద బురద చల్లించాలని కొన్ని వర్గాలు ప్రయత్నించినా అవి సఫలం కాలేదు. ఇది నీచశుక్ర, కుజుల ప్రభావం. తమిళనాడులో ఉన్న సాంప్రదాయ వ్యతిరేక వర్గాలే కొందరు మహిళల చేత ఈ పని చేయించాయనీ, కానీ అవి నిజాలు కావనీ, కొందరి కధనం.


ఈ అభియోగాలనుంచి ఈయన నవంబర్ 2013 లో విముక్తుడయ్యాడు. ఆ సమయంలో పంచమంలో గురువు సంచరిస్తూ దైవానుగ్రహాన్ని సూచిస్తున్నాడు. ఈ సంఘటన జరిగినప్పుడున్న స్థితికి రాహుకేతువులు 9 ఏళ్ళ తర్వాత సరిగ్గా రివర్స్ పొజిషన్ లోకి వచ్చి ఉండటం చూడవచ్చు. నవమంలో మళ్ళీ నీచసూర్యుడు ఉన్నప్పటికీ, చంద్రలగ్నాధిపతి అయిన శనీశ్వరుని ఉచ్చస్థితి ఈయన్ను కాపాడి కేసునుంచి బయట పడేసింది. ఈ విధంగా మనిషి జీవితం గ్రహాల అదుపులో ఉంటూనే ఉంటుంది. జరిగే సంఘటనలన్నీ గ్రహచారం ప్రకారమే జరుగుతాయని మళ్ళీ ఈ జాతకం నిరూపిస్తున్నది.

ఏదేమైనా, మతపరంగా ఒక సాంప్రదాయ ఆచార్యునిగా కోట్లాదిమంది గౌరవాన్ని పొంది, చాలామంది గురువుల లాగా 'నా ఆశ్రమం' అంటూ గిరిగీసుకుని కూచోకుండా, సమాజంలోకి వచ్చి అందరితో కలసి మెలసి పనిచేసి, హిందూమతంలో ఉన్న కొన్ని లోపాలను సరిదిద్దాలని దీక్షగా పనిచేసిన పీఠాధిపతులలో ఒకరుగా ఈయన భారతీయుల స్మృతిపధంలో ఎప్పటికీ మిగిలిపోతారు.