“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

9, నవంబర్ 2016, బుధవారం

స్వామి యదునాధానంద గారితో సంభాషణ - 3 (రిచువల్స్ ఎంతవరకు?)

ఇంటికొచ్చేసరికి మధ్యాన్నం రెండున్నరైంది.

'ప్రయాణంతో అలసిపోయి ఉంటారు.ఒక గంట విశ్రాంతి తీసుకోండి' అంటూ అప్పటికే సిద్ధం చేసిన ఒక గదిని ఆయనకు చూపించాను.

'అలాగే' అన్నాడాయన ఆ గదిలో తన సంచిని ఉంచుతూ. భుజానికి వేలాడుతున్న గుడ్డ సంచి ఒక్కటే ఆయన లగేజి.

'మీరు సాయంత్రం స్నాక్స్ ఏవైనా తీసుకుంటారా? కాఫీ టీ పాలు వగైరా ఏవైనా త్రాగుతారా? ఎన్ని గంటలకు తీసుకుంటారు? అని అడిగాను.

'అవేవీ వద్దు. ఒక కప్పు టీ మాత్రం నిద్ర లేచాక తీసుకుంటాను.చాలు.' అన్నాడాయన.

నేనూ నా గదిలోకి వెళ్లి నడుం వాల్చాను. పెద్దగా అలసట లేకపోవడంతో నిద్రేమీ పట్టలేదు. ఒక గంటన్నర సేపు పక్కమీదే పడుకుని మహామంత్రజపం చేస్తూ ఉన్నాను. ఆ తదుపరి, సమయం చూచేసరికి నాలుగైంది.

ఇంతలో స్వామీజీ లేచి హాల్లోకి వచ్చిన అలికిడైంది. నేనూ లేచి ముఖం కడుక్కుని హాల్లోకి వచ్చి కూచున్నాను.

'రెస్ట్ తీసుకున్నారా? నిద్ర పట్టిందా బాగా?' అడిగాను.

'నిద్ర పట్టలేదు. జపం చేస్తూ పడుకుని ఉన్నాను.' అన్నాడాయన.

శ్రీమతి వైపు చూచాను.

'నేనూ అదే చేస్తున్నా గంటన్నర నుంచీ.ఇప్పుడే నాలుగౌతుంటే లేచి మీకు 'టీ' రెడీ చేశా.' అందామె.

'Birds of same feather' - అనుకున్నా మనసులో.

'మీరు దీక్ష స్వీకరించారా? గురుమహరాజ్ మంత్రాన్ని?' అడిగాడాయన.

శ్రీ రామకృష్ణులను 'గురుమహరాజ్' అనీ, 'ఠాకూర్' అనీ ఆయన భక్తులు పిలుస్తారు.

'అవును.శారదా మఠంలో దీక్ష తీసుకున్నాను.' అందామె.

గోడకు ఉన్న ఫోటో వైపు చూస్తూ 'మరి మీ పిల్లలు కూడా తీసుకున్నారా?' అడిగాడాయన.

'అవును.వాళ్లకు నేనే ఇచ్చాను.అబ్బాయికి చిన్నప్పుడే ఉపనయనం అయింది.గాయత్రీ మహామంత్రోపాసన ఎలా చెయ్యాలో నేనే వాడికి నేర్పించాను.దానికి తోడు తాంత్రిక దేవీ మంత్రాన్ని ఉపదేశించాను.అమెరికాలో ఉన్నా సరే రెగ్యులర్ గా చేస్తూ ఉంటాడు.అమ్మాయి కూడా అంతే.తను మెడిసిన్ చదువుతున్నా సరే, నిష్టగా జపం ధ్యానం చేస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరికీ దక్షినేశ్వర్ కాళీ ఆలయంలోనే అమ్మ సమక్షంలో దీక్ష ఇచ్చాను.' అన్నాను.

'బాగుంది' అన్నాడాయన.

'అయితే,నా విధానం వేరుగా ఉంటుంది.నేను స్నానం, మడీ, పూజా,అభిషేకాలూ,అలంకరణా,గుళ్ళూ గోపురాల చుట్టూ తిరగడం మొదలైన రిచువల్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వను. నాదంతా అంతరిక సాధన. వాళ్ళకూ అదే నేర్పాను.' అన్నాను.

'అదే అసలైన పద్ధతి. నేనూ అంతే. మీరిది చెబుతుంటే నాకు ఒక సంగతి గుర్తొస్తోంది.' అంటూ మొదలెట్టాడు ఆయన.

ఒకసారి చెన్నైలో ఒక భక్తుని ఇంటికి వెళ్లాను.అప్పటికే ఆయనకు 60 ఏళ్ళుంటాయి. నేను వెళ్లేసరికి ఆయన పూజలో ఉన్నారని ఆయన భార్య చెప్పింది. వేచి చూస్తూ కూచున్నాను. దాదాపు రెండు గంటల వెయిటింగ్ తర్వాత ఆయన పూజగది నుంచి బయటకు వచ్చాడు.

'సారీ స్వామీజీ. నేను పూజలో కూచుంటే అది అయ్యేవరకూ బయటకు రాను' అన్నాడు.

'మంచిదే.అటువంటి నిష్ఠ సాధనలో తప్పకుండా ఉండాలి. అయితే రెండుగంటలు జపధ్యానాలు చేస్తారన్నమాట. ' అని మెచ్చుకోలుగా అన్నాను.

'అబ్బే అదేం లేదు స్వామీజీ' అన్నాడు.

నాకు ఆశ్చర్యం వేసింది.

'అదేం లేదా? మరి అంతసేపు ఏం చేస్తారు' అని అడిగాను.

'పూజగది నిండా దేవుళ్ళ పటాలున్నాయి.వాటిని ఒక గుడ్డతో శుభ్రంగా తుడుస్తాను.దానికే ఒక గంట సరిపోతుంది.ఆ తర్వాత వాటికి గంధమూ కుంకమూ బొట్లు పెట్టి,పూలు పెడతాను.ఆ తర్వాత ధూప దీపాలతో పూజ చేసి నైవేద్యం పెట్టి బయటకు వస్తాను.ఇదంతా అయ్యేసరికి రెండు గంటలు పడుతుంది.' అన్నాడాయన.

ఆయన్ని చూస్తె నాకు జాలేసింది.

'మీరు చేస్తున్న పూజ అంతా వేస్ట్.దానివల్ల మీకు ఏమీ రాదు' అని మొఖాన చెప్పేసాను.

ఆయన నిర్ధాంత పోయాడు. కోపం కూడా వచ్చింది.

'అదేంటి స్వామీ అంత మాట అనేశారు? నేనీ పూజను ముప్పై ఏళ్ళ నుంచీ చేస్తున్నాను. అయితే ఇన్నాళ్ళూ చేసింది అంతా వృధా యేనా?' అన్నాడు కోపంగా.

'మామూలు వృధా కాదు. శుద్ధ దండగ. మీరు శ్రీ రామకృష్ణుల భక్తులై ఉండి ఇదా నేర్చుకున్నది? మీరు LKG లో ముప్పై ఏళ్లుగా ఉంటున్నారు. మీ అబ్బాయి కూడా స్కూల్లో ఇదే పని చేస్తే మీకు బాగుంటుందా?' అడిగాను.

అతనేమీ మాట్లాడలేదు.

"చూడండి.వివేకానంద స్వామి ఏమన్నారు? ఆయనిచ్చిన భక్తియోగోపన్యాసాలు చదవండి. ఆయనిలా అన్నారు. It is good to be  born in a church,but it is very bad to die there.To make it clearer, it is very good to be born in a certain sect and have its training - it brings out our higher qualities.But in the vast majority of cases we die in that little sect, we never come out or grow.That is the great danger of all these worships of Pratikas.One says that these are all stages which one has to pass, but one never gets out of them,and when one becomes old,one still sticks to them.If a young man does not go to the church he ought to be condemned,but if an old man goes to church, he also ought to be condemned, he has no business with this child's play anymore.The church should have been merely a preparation for something higher.What business has he anymore with forms and Pratikas and all these preliminaries?"

అవి విదేశాలలో ఆయనిచ్చిన ఉపన్యాసాలు. కానీ మన దేశానికి వచ్చిన తర్వాత కూడా ఇవే విషయాలు ఆయన చెప్పారు. మఠాలలో ఎడతెరిపి లేని పూజా పునస్కారాలను,గంటలు గంటలు అలంకరణ చెయ్యడం మొదలైన పనులను ఆయన వద్దనే వారు. ఎక్కువసేపు చేసే జపానికి ధ్యానానికి ఆయన విలువిచ్చేవారు.ఆయన మహాజ్ఞాని.ఆయనకున్న అవగాహన మిగతావారికి ఎలా ఉంటుంది? అది వాస్తవం కూడా.

అసలు విషయం ఏమంటే - నామజపంలో రుచి కుదరాలి. ధ్యానంలో రుచి కుదరాలి. అది వచ్చేవరకూ మనం పట్టుదలగా అవి చెయ్యాలి. పూజల ప్రయోజనం నిన్ను ధ్యానం లోకి తీసుకెళ్ళడమే.అది సిద్ధించకుండా నువ్వు ఎల్లకాలం పూజలు తంతులు చేసుకుంటూ కూచుంటే, దేవుని కోసం గుడికెళ్ళి, లోపల కెళ్ళకుండా వాకిలి బయటే గంటలు గంటలు తారట్లాడుతూ ఉన్నట్లు అవుతుంది.

గుడిలో పూజారి సంగతి వేరు. అతని పనే అది.అందుకని ఆ అలంకరణా ఆ తంతులూ అవీ అతనికి అవసరం.అదతని ఉద్యోగం.అతను కూడా అదంతా అయిపోయాక జపము ధ్యానము ప్రార్ధనా చెయ్యాలి. తనకోసం మాత్రమే గాక, దర్శనానికి వచ్చే భక్తులకు మంచి జరగాలని దైవాన్ని అతడు ప్రార్ధించాలి. అలా ప్రార్ధించక పోతే,ఊరకే అలంకరణ మాత్రమే చేస్తూ కూచుంటే, అతను నిజమైన పూజారే కాదు.

వింటున్న నేను ఇలా అన్నాను.

'ఇదెలా ఉందంటే, వంటకోసం గంటలు గంటలు ఏర్పాట్లు చేసుకుని చివరకు వంట చెయ్యకుండా, ఆ వస్తువులన్నీ కిచెన్ లోనే వదిలేసి బయటకు వచ్చినట్లుంది.'

'అవును. ఈ విషయాన్నే నేను ఆ పెద్దాయనకు చెప్పాను.' అదెలా స్వామీ? ఇప్పటికిప్పుడు మారాలంటే ఎలా? ముప్పై ఏళ్ళ నుంచీ అలవాటై పోయింది' అని ఆయన అన్నాడు. 'కష్టమైనా సరే, మీ పద్ధతి మార్చుకోండి.ఇది సరియైన విధానం కాదని' ఆయనకు గట్టిగా చెప్పాను.తర్వాత రెండేళ్లకు మళ్ళీ ఆయన కలిశాడు.'మీరు చెప్పినది పాటిస్తున్నాను. మొదట్లో చాలా కష్టం అయ్యింది.మనసు ఒప్పుకునేది కాదు.కానీ ఇప్పుడు చాలా బాగుంది స్వామీ. నామజపంలో రుచి కుదిరింది.లోలోపల చాలా ఆనందంగా ఉంటున్నది. ఇప్పుడు చాలా మనశ్శాంతిగా ఉంది.' అన్నాడు.

నా భావాలనే స్వామీజీ కూడా చెబుతూ ఉండటంతో నేను మౌనంగా వింటున్నాను.

ఆయన చెప్తున్నది నిజమే. రిచువల్స్ ను చాలా వరకూ తగ్గించి జపధ్యానాలకే ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. అదే అసలైన ఆధ్యాత్మిక ఆచరణ. వివేకానంద స్వామి చేసే పూజ చాలా విలక్షణంగా ఉండేది.బాహ్యతంతులను ఆయన ఎక్కువగా ఆచరించేవారు కారు. మహా అయితే ఒక పుష్పాన్ని ఠాకూర్ పాదాల వద్ద అర్పించేవారు.లేదా ఒక అగర్బత్తీ వెలిగించేవారు.అంతే.ఆ తర్వాత గంటలపాటు నిశ్చలంగా ధ్యానంలో కూచునేవారు.ఆయన చేసే పూజ అలా ఉండేది.

(ఇంకా ఉంది)