“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

24, నవంబర్ 2016, గురువారం

స్వామి యదునాధానంద గారితో సంభాషణ - 7 (శ్రేష్ఠభక్తి)

స్వామీజీ చెప్పసాగారు.

"ఒక్క జపమే చాలు.దానితోనే సర్వమూ సాధించవచ్చు" అని శ్రీమాత అనేవారు. అమ్మ చెప్పిన తదుపరి ఏ విషయంలో నైనా సరే ఇక మారుమాట ఏముంటుంది? కానీ ఈ మాటను సరిగా అర్ధం చేసుకోవాలి. ఏ సాధనా చెయ్యకుండా జపం ఒక్కటే చేసేవారికి జపమే చాలు.అనుక్షణమూ లోపల్లోపల 'అజపాజపం' చేసేవారికి అదొక్కటే చాలు.దానినుంచే అన్నీ వస్తాయి. కానీ రోజంతా కర్మలలో మునిగి ఉండేవారికి ఒక అరగంటో గంటో చేసే ఉత్తుత్తి జపం ఏ మాత్రమూ సరిపోదు.వారు మిగతా విషయాలలో కూడా ఎన్నో జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది.


ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా - చివరకు మనం శ్రేష్ఠభక్తులుగా మారాలి.అదొక్కటే అతి ముఖ్యమైన విషయం.

శ్రేష్ఠభక్తికి మొదటి ఉదాహరణ ప్రహ్లాదుడు.అతను పూర్తిగా పాజిటివ్. తండ్రి హిరణ్యకశ్యపుడు పూర్తిగా నెగటివ్.పాజిటివ్ నెగటివ్ కలిస్తే ఎలక్ట్రిక్ స్పార్క్ వస్తుంది. ఆ విద్యుత్ శక్తి స్వరూపమే నరసింహస్వామి.

"ఎక్కడున్నాడో నీ దేవుడు చూపించు" అని తండ్రి కోపంగా అరిచాడు.అన్ని చోట్లా ఉన్నాడని అన్నాడు ప్రహ్లాదుడు."అయితే ఈ స్తంభంలో ఉన్నాడేమో చూపించు" అంటూ స్తంభాన్ని గదతో మోదాడు హిరణ్యకశ్యపుడు.ఆ పగిలిన స్తంభంలో నుంచి వెయ్యి సూర్యుల కాంతితో నరసింహస్వామి ఆవిర్భవించాడు. దేవుని అవతారాలు ఎన్నో ఉన్నాయి.కానీ అన్నింటిలోకీ మహా శక్తివంతమైన అవతారం నరసింహావతారమే.ఈ అవతారంలో భగవంతుడు ఉన్నది కూడా అత్యంత స్వల్పకాలమే. మహా అయితే ఒక గంటసేపు ఉన్నదేమో ఈ అవతారం.

మహోగ్రస్వరూపంతో ఉన్న నృసింహుడిని చూచి దేవతలే భయంతో వణికిపోయారు. ఆయన్ను శాంతింప చెయ్యడానికి మళ్ళీ చిట్టి ప్రహ్లాదుడినే ముందుకు పంపారు.తన బుజ్జి భక్తుడిని చూచి ఆయన శాంతించాడు. ప్రహ్లాదుడిని తన తొడపైన కూర్చోబెట్టుకుని ముద్దు చేశాడు.

అప్పుడు దేవతలతో ఇలా అన్నాడు.

'హిరణ్య కశ్యపుడిని చంపడం కోసం నేనీ అవతారం ఎత్తవలసిన అవసరం లేనే లేదు.నేనున్నచోటనుంచే 'ఉఫ్' అని ఊదితే వాడు గాలిలో కలిసి పోతాడు.నా సృష్టిలో వాడొక జీవి అంతే.ఈ అవతారం ఎత్తకుండానే నేను అతడిని సంహరించగలను.కానీ నా శ్రేష్ఠభక్తుడైన ప్రహ్లాదుడి మాట నిలబెట్టడం కోసం, ఈ స్తంభంలోనుంచి ఈ విధంగా ఆవిర్భవించాను.నా ప్రియభక్తుల మాటను నేను గౌరవిస్తాను.వారు ఏదో యధాలాపంగా అన్నా సరే, దానిని నేను నెరవేర్చక తప్పదు."

శ్రేష్ఠ భక్తి అంటే అది !!

ఇటువంటి శ్రేష్ఠభక్తికి రెండో ఉదాహరణ అభిరామి భట్టార్.ఈయన అసలు పేరు సుబ్రమణ్య అయ్యర్. ఈయన 18 వ శతాబ్దంలో తమిళనాడులో ఉండేవాడు. పార్వతీ అమ్మవారికి ఈయన మహాభక్తుడు.ఆ ఊరిలో ఉన్న పార్వతీ దేవికి పేరు 'అభిరామి'.

ఆ సమయంలో మరాఠా రాజు సెర్ఫోజీ తమిళనాడును పాలించేవాడు. ఒకరోజు మహారాజు శివాలయానికి వచ్చాడు.అక్కడ పూజలేమీ చెయ్యకుండా ఊరకే కూచుని ఒళ్ళు మరచిన ధ్యానంలో ఉన్న సుబ్రమణ్య అయ్యర్ ను ఆయన చూచి - "ఈయన ఎవరు? ఈయన ప్రవర్తన వింతగా ఉన్నదే? మీలా ఈయన మామూలు పూజలు చెయ్యడం లేదు? ఊరకే కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నాడు? ఏంటిది?" - అని అక్కడి పూజారులను ప్రశ్నించాడు.

వారిలో కొంతమంది - ' ఈయన అమ్మవారికి శ్రేష్ఠ భక్తుడు.' అని జవాబు ఇచ్చారు. కానీ అయ్యర్ అంటే గిట్టని మరికొందరు అర్చకులు మాత్రం - ' అతనొక పిచ్చివాడు.దురహంకారి. అతన్ని పట్టించుకోకండి' అని రాజుగారికి చాడీలు చెప్పారు.

అతన్ని పరీక్షించాలని అనుకున్న సెర్ఫోజీ మహారాజు, ధ్యానంలో ఉన్న అయ్యర్ దగ్గరికి వెళ్లి -'ఈరోజు తిధి ఏమిటి?' అని ప్రశ్నించాడు. అయ్యర్ అప్పటిదాకా తన ధ్యానంలో అమ్మవారి దివ్యతేజోవంతమైన రూపాన్ని చూస్తున్నాడు.అది పున్నమి చంద్రునిలా వెలుగుతున్నది. రాజు ప్రశ్నతో ధ్యానం చెదరి కళ్ళు తెరిచిన అయ్యర్ తను చూస్తున్న జగజ్జనని తేజస్సును మర్చిపోలేక - "ఈ రోజు పౌర్ణమి" అని జవాబు చెప్పాడు.

కానీ ఆరోజు అమావాస్య !!

మహారాజు కోపంతో ఊగిపోయి, "మహారాజునైన నాతోనే నీకు వెటకారంగా ఉన్నదా?నీకు చాలా పొగరులా ఉన్నదే? సరే చూస్తాను. ఈరోజు రాత్రికి పున్నమి చంద్రుడు కన్పించకపోతే నీకు చావు తధ్యం." అని అదే ఊరిలో ఆ రాత్రికి బస చేశాడు.

ఆరోజు అమావాస్య గనుక చంద్రుడు కనిపించడు గనుక అయ్యర్ కు చావు తప్పదని అందరూ అనుకున్నారు.  ఆ రాత్రికి సుబ్రమణ్య అయ్యర్ ఆశువుగా శ్లోకాలలో అమ్మను ప్రార్ధించసాగాడు.నూరు శ్లోకాలు పూర్తయ్యేలోపు ఏదో ఒక అద్భుతం జరగకపోతే అగ్నిలో దూకి తానే చనిపోదామని, రాజు చేతిలో శిరచ్చేదం చేయించుకోవడం కంటే అదే మంచిదని ఆయన అనుకున్నాడు. ఎదురుగా మహారాజు కూర్చుని ఇదంతా చూస్తున్నాడు.

78 శ్లోకాలు పూర్తయ్యేసరికి అయ్యర్ కు మాత్రమే దర్శనమిస్తూ ప్రత్యక్షమైన పరమేశ్వరి తన చెవికమ్మను తీసి ఆకాశంలోకి విసిరిందని, అది పున్నమి చంద్రునిలా కాంతులు విరజిమ్మి, దశదిశలా తెల్లని వెలుగును నింపిందని చరిత్ర చెబుతున్నది. ఆ విధంగా అమావాస్య రోజున పౌర్ణమి అయింది. దీనిని కళ్ళారా చూచిన సెర్ఫోజి మహారాజు అదిరిపోయి, అయ్యర్ ను క్షమించమని ప్రార్ధించి అతనికి 'అభిరామి భట్టార్' అని బిరుదు ప్రదానం చేశాడని రికార్డ్ చెయ్యబడి ఉన్నది.ఇది మొన్న మొన్న జరిగిన సంఘటనే. ఎప్పటిదో కాదు. ఆ తర్వాత మిగిలిన 22 శ్లోకాలనూ ఆయన పూర్తి చేశాడు.

"తాటంక యుగళీ భూత తపనోడుప మండలా" - కదా అమ్మ !!

తన శ్రేష్ఠభక్తుడైన అభిరామి భట్టార్ మాటను నిజం చెయ్యడానికి అమావాస్య రాత్రిపూట పున్నమి వెన్నెలను కాయించింది జగజ్జనని.

శ్రేష్ఠ భక్తి అంటే అది !!

ఇలాంటి శ్రేష్ఠభక్తికి ఇంకో నిదర్శనం రామానుజాచార్యుల వారి జీవితంలో మనం చూడవచ్చు.ఆయన మహాభక్తుడే గాక పూర్ణాయుష్కుడై 120 ఏళ్ళు బ్రతికిన మహనీయుడు.

ఒకరోజున ఆయన దగ్గర పనిచేసే చాకలి వచ్చి ఇలా అన్నాడు.

' అయ్యా ! నేను ఎప్పటినుంచో మీకు బట్టలు ఉతుకుతూ ఉన్నాను. మీరు కూడా నాకు తగినంత ధాన్యం వగైరాలు ఇస్తూ ఉన్నారు.కానీ మీరిస్తున్న సంభారాలు ఈ మధ్య నాకు సరిపోవడం లేదు.ఎందుకంటే, నా కుటుంబం పెద్దదై పోయింది.అందుకని ఆ వెచ్చాలను ఇంకొంచం ఎక్కువగా ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాను.'

రామానుజులు యధాలాపంగా - 'సరే ! రేపటినుంచీ నీకు కావలసినంతగా అవి ఇవ్వబడతాయి' అని అన్నారు.కానీ ఆ సంగతి ఆయన మరచిపోయారు.ఆ చాకలి కోరినట్లు రేపటినుంచీ ఎక్కువ సంభారాలు ఇవ్వమని తన కోశాదికారికి చెప్పడం విస్మరించారు. ఆ తర్వాత కొన్నేళ్ళు గడిచాయి.

కొన్నాళ్ళకు ఆ చాకలి మరణించాడు. పరామర్శ కోసం అతని ఇంటికి వెళ్ళారు రామానుజులు. అప్పుడు హటాత్తుగా తానిచ్చిన మాట ఆయనకు గుర్తుకొచ్చింది. ఆయన పశ్చాత్తాపంతో క్రుంగి పోయాడు. ఇచ్చిన మాటను నెరవేర్చలేక పోయానే అని ఎంతో బాధ పడ్డాడు.

కానీ ఆ చాకలి భార్య ఆయనతో ఇలా చెప్పింది.

'స్వామీ ! మాకు మీరిస్తున్న సంభారాలు చాలడం లేదనీ, ఇంకా ఎక్కువగా కావాలనీ నా భర్త కొన్నేళ్ళ క్రితం మిమ్మల్ని అర్ధించాడు. ఆ మరుసటి రోజు నుంచీ మాకు ఏ లోటూ లేకుండా మీ సంస్థానం నుంచి మాకు కావలసినంత సరుకులు ఇన్నేళ్ళుగా లభిస్తూ ఉన్నాయి.దానివల్ల మేము ఏ లోటూ లేకుండా హాయిగా బ్రతుకుతున్నాము. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియడం లేదు.' అంటూ ఆయన పాదాలకు నమస్కరించింది.

రామానుజులు నిర్ధాంతపోయారు !!

'తను చెప్పిన మాటను తానే మరచి పోయాడు. తన ఉద్యోగులకు తాను ఏమీ ఆదేశాలు ఇవ్వలేదు. కానీ తన మాట నెరవేరింది. ఇదెలా సాధ్యం?" అని ఆలోచనలో మునిగిన ఆయన మనోనేత్రం ముందు మనోహరమైన చిరునవ్వుతో వెలుగుతున్న నారాయణుని దివ్యరూపం గోచరమైంది.

భక్తుడు మరచిపోయినా భగవంతుడు మరచిపోడు. యధాలాపంగా తన భక్తుడు ఇచ్చిన మాటను ఆయనే నిజం చేస్తాడు. అన్నేళ్ళుగా ఆ చాకలి కుటుంబానికి ఏ లోటూ లేకుండా అన్నీ సరఫరా చేసింది దైవమే !!

ఇది నమ్మలేని వింతగా మనకు అనిపించవచ్చు. అలా అనిపించడానికి కారణం మనలో పాతుకుపోయిన విశ్వాస రాహిత్యం తప్ప ఇంకేమీ కాదు. భక్తిప్రపంచంలో అన్నీ సాధ్యాలే.భక్తి అంటే ఏమిటో తెలియని వారికి ఇవి కాకమ్మ కబుర్లలా అనిపించవచ్చు. కానీ వారికి తెలియని ప్రపంచం ఎంతో ఉంది.

శ్రేష్ఠ భక్తికి ఇది ఇంకొక ఉదాహరణ !!

నేనొకసారి కడప రామకృష్ణాశ్రమానికి వెళ్లాను. అక్కడ ఒక ముసలాయన నాతో మాట్లాడటానికి వచ్చారు.

తాను ఎన్నో గ్రంధాలు చదివానని, మహా పండితుడనని, అనర్గళంగా ఏ విషయం మీదనైనా మాట్లాడగలనని, ఎంతో మందికి ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చానని ఆయన ఎంతో గర్వంగా నాకు చెప్పారు.వేదాలు ఉపనిషత్తులు, పురాణాలు, సమస్త గ్రంధాలు తనకు కొట్టిన పిండి అని అన్నారు.

'గాస్పెల్ చదివారా?' - అని నేనడిగాను.

'అదేంటి స్వామీ అలాగంటారు? శ్రీ రామకృష్ణుల భక్తుడినై ఉండి గాస్పెల్ చదవకుండా ఉంటామా? ఎన్నోసార్లు తిరగా మరగా చదివాను' అన్నాడు.

'ఊరకే చదవడం కాదు. దానిలోనివి మీరు ఏం పాటిస్తున్నారు?తన పాండిత్యం గురించి ఇలా గొప్పలు చెప్పుకోమని ఠాకూర్ చెప్పారా ఎక్కడైనా? అసలు పాండిత్యానికి ఆయనేమైనా విలువ ఇచ్చేవారా? మరి మీరెందుకు దాని గురించి అంత గొప్పగా చెప్పుకుంటున్నారు?' అని ఆయన్ను అడిగాను.

ఆయనేమీ జవాబు ఇవ్వలేదు.

భక్తులమని, ఆధ్యాత్మికులమని భావించుకునేవారు అందరూ ఇలాగే ఉంటారు. వారికి పాండిత్యం ఉండవచ్చు, విషయం తెలియవచ్చు, కానీ ఆచరణ లేకుంటే వారి "జ్ఞాన"మంతా  ఎందుకూ పనికిరాదు.ఇలా ఉన్నవాళ్ళు అసలు భక్తులే కారు.ఇక శ్రేష్ఠభక్తులు ఎలా కాగలరు?" అన్నాడు స్వామీజీ.

నా భావాలు కూడా ఇలాగే ఉంటాయి గనుక ఆయన చెబుతున్న మాటలు నాతో నేనే మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంటే, మౌనంగా వింటూ ఉన్నాను.

(ఇంకా ఉంది)