“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

25, నవంబర్ 2014, మంగళవారం

గోంగూర పువ్వు


 ఆఫీసులో వెహికల్స్ పార్కింగ్ చేసేచోట ఉన్న పిచ్చిచెట్లలో ఒక సౌందర్యం విరబూసి కనిపించింది.

పిచ్చిచెట్టు అనే పదం క్షంతవ్యం.చెట్లలో ఏ చెట్టూ పిచ్చిది కాదు.ఇది మాటవరసకు వాడబడిన పదం మాత్రమే.

'ఏమిటా?' అని చూచాను.

అదొక గోంగూర పువ్వు.

యధాప్రకారం దానిని పలకరించాను.

అది వింతగా చూచింది.

'అందరూ గులాబీలనే మెచ్చుకోలుగా చూస్తారు.మమ్మల్ని ఎవరూ పట్టించుకోరు.నీకు నేనెందుకు మిత్రమా?' అన్నది.

'అందరి గోల నాకెందుకు?నీతో మాట్లాడగలుగుతున్నాను కదా.ఆ మాత్రం అర్ధం కాలేదా?' ఎదురు ప్రశ్నించాను.

అది మౌనంగా నవ్వింది.

ప్రేమగా చూచింది.

మౌనంగానే తన భావాలను నాకు ప్రసారం చేసింది.

చదవండి.
-----------------------------------------------------------

మహరాజుల చేతులలో
నలిగిపోవు ఖర్మలేదు
ప్రతిరోజూ పడకలపై
కుమిలి ఏడ్చు బ్రతుకు గాదు

గులాబీల సొగసు జూచి
మత్తిల్లిన మనసులలో
కాలుమోపబోను నేను

అందము నాస్వాదించుట
నెరుగలేని హీనులతో
చెలిమి చేయబోను నేను

రాజప్రాసాదపు లోగిలి
శ్రీమంతుల నడివాకిలి
నా పదములు తాకబోవు

సౌందర్యపు గర్వముతో
మిడిసిపడే సొగసురాండ్ర
చెంతకు నే చేరనెపుడు

మాయలేని గుండెలలో
మచ్చలేని చేతులలో
నిలిచి యుందు నేనెప్పుడు

జీవహీన విగ్రహాల
మెడల జోలి నాకేల?
ప్రకృతిమాత చల్లని ఒడి
చాలు నాకు ఈ నేల

లోకుల పాపపు కన్నుల
సోకకుండ బ్రదుకు గడపి
రాలిపోదునీ భూమిని
నాకమందు మనసు నిలిపి

భావోన్మత్తుల కన్నుల
లోగిళ్ళను స్పర్శించెద
కల్మషహీనుల ఎడదల
నెల్లప్పుడు నర్తించెద

కనుమోయీ బాటసారి
నా జీవన గమనమును
తరచి చూడుమొక్కసారి
నీ జీవిత గమ్యమును

అత్తరులో సత్తువకై
రక్తమిచ్చు దానగాను
మత్తుకళ్ళ మరుపులలో
కురుల మెరయు దానగాను

కర్మరంగమున కాలిడి
కండలు కరుగగ జేయుచు
ఘర్మజలము చిందించెడి
సార్ధక జీవుల కెప్పుడు

ప్రేమమీర దరిజేరుచు
పెరటిలోని పెన్నిధినై
సాంద్రమైన బలమునిచ్చు
ఆంధ్రమాత సుతను నేను...