“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

1, నవంబర్ 2014, శనివారం

రేపే శనీశ్వరుని రాశిమార్పు

రెండున్నర ఏళ్ళుగా తులారాశిలో ఉన్న శనీశ్వరుడు వృశ్చికరాశిలోకి మారే రోజు రేపే.

ఈ మార్పువల్ల ప్రపంచవ్యాప్తంగానూ,వ్యక్తిగత జీవితాలలోనూ కూడా పెనుమార్పులను ఆయన కలిగిస్తాడు.గత నెలరోజుల నుంచే ఆయా మార్పులు,సూచనలు కనిపించడం ప్రారంభించాయి.ఎందుకంటే మందగ్రహమైన శనీశ్వరుడు కనీసం ఒక నెలరోజుల ముందునుంచే తన ప్రణాళికను సూచనాప్రాయంగా ప్రకటించడం ప్రారంభిస్తాడు. 

వరుసగా సముద్రంలో ఏర్పడుతున్న తుఫానులూ,మొన్న ఆంధ్రాలో వచ్చిన స్వల్ప భూకంపమూ,హుద్ హుద్ తుఫాను ప్రభావం వల్ల కుదేలౌతున్న వ్యవసాయరంగమూ,వైరస్ కంటే వేగంగా విస్తరిస్తూ పంటలను నాశనం చేస్తున్న దోమలూ-- ఇవన్నీ శనీశ్వరుని గోచారప్రభావ సూచనలే.ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ ముందు ముందు రాబోతున్న విలయాలకు వార్నింగ్ సిగ్నల్స్ మాత్రమే.

ప్రపంచవ్యాప్తంగా నిశ్శబ్దంగా పెరుగుతున్న ముస్లిం తీవ్రవాదం ఇంకొక ప్రధానమైన విలయసూచన.తన కుమారుడిని ఇమాంగా ప్రకటించబోయే మీటింగ్ కి మన ప్రధానమంత్రిని పిలవకుండా పాకిస్తాన్ ప్రధానినీ ఇంకా అనేక దేశాలనుంచి ఇతర వ్యక్తులనూ ఆహ్వానించిన జామా మసీదు ఇమాం ఇచ్చిన స్టేట్మెంట్ ఈ కోణంలో చూస్తే అత్యంత తీవ్రమైన ఆందోళన కలిగించే అంశం. 

అంటే,ప్రకృతి విపత్తులే గాక,మనిషి చేజేతులా చేసుకుంటున్న పనులు కూడా రాబోయే రెండేళ్లలో అనేక విపత్తులను కొని తేబోతున్నాయని అర్ధమౌతున్నది.

వ్యక్తిగత జీవితాలలో గనుక మీరు గమనించుకుంటే,గత నెలరోజులుగా అందరి జీవితాలలో ఇంతకు ముందు లేని మార్పులు చోటు చేసుకోవడం మీరు స్పష్టంగా చూడవచ్చు.ఆ మార్పులు ఈఈ విధాలుగా ఉంటాయి.
  • ఆరోగ్యాలలో తేడాలు రావడం.దీర్ఘవ్యాధులు బయట పడటం.
  • మేము చాలా ఆరోగ్యవంతులం అనుకునే వారిలో కూడా అనారోగ్యాలు బయటపడటం.
  • కొత్త పరిచయాలు ఏర్పడటం.కొత్త వ్యాపకాలు మొదలు కావడం.
  • కొత్త కొత్త అనుకోని సంఘటనలు జరగడం.
  • బాధ్యతలు ఎక్కువై పోవడం.అవి కుటుంబ బాధ్యతలు కావచ్చు ఉద్యోగ/వృత్తి బాధ్యతలు కావచ్చు.
  • మానసిక చింతా ఆందోళనా ఎక్కువ కావడం.
  • అసహజములైన అలవాట్లూ,పోకడలూ బయటపడటం.పైగా వాటిని గర్వంగా చెప్పుకోవడమే గాక ప్రపంచం మొత్తం గుర్తించి జేజేలు కొట్టాలని కోరుకోవడం.యాపిల్ కంపెనీ సి.ఈ.వో కూడా నేను 'గే' ని కావడానికి గర్వపడుతున్నానని ప్రకటించడం ఈ ప్రభావమే.
  • పెద్దవీ చిన్నవీ యాక్సిడెంట్లు ఎక్కడ చూచినా ఎక్కువ కావడం.
  • గొడవలు ఘర్షణలు చీటికీ మాటికీ విసుగులు ఎక్కువ కావడం.తొందరపాటు తనమూ దూకుడూ ఎక్కువ కావడం.
  • భార్యా భర్తల మధ్యన గొడవలై విడాకుల దాకా పోవలసి రావడం.ఇద్దరి మధ్యనా మానసికంగా దూరం పెరగడం.
  • గైనిక్ సమస్యలూ,పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన సమస్యలూ,నోరు,పళ్ళు,చిగుళ్ళ సమస్యలూ ఉన్నట్టుండి ఎక్కువ కావడం.వాటికి టెస్టులూ,మందులూ మొదలు కావడం.
ఈ మార్పులు చాలామంది జీవితాలలో ఇప్పుడు కనిపిస్తున్నాయి.ఒక్కసారి శనీశ్వరుడు వృశ్చికరాశిలోకి అడుగుపెడితే అప్పుడు ఆయా ప్రభావాలు ఇంకా స్పష్టంగా ఎక్కువగా కనిపిస్తాయి.

మొత్తంమీద రాబోయే రెండున్నర సంవత్సరాల కాలం,మనుషుల జీవితాలలోనూ,ప్రపంచ ముఖచిత్రంలోనూ చాలా మార్పులను తీసుకు రాబోతున్నది.అద్భుతమైన ఈ యూనివర్సల్ డ్రామా రేపటినుంచీ మన కళ్ళముందు ఎలా  ఆవిష్కరింపబడుతుందో గమనిద్దాం.