“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

22, నవంబర్ 2014, శనివారం

యమునా తీరం...


యమునా తీరం
అంతమెరుగని విరహవలయం
రాధాహృదయం
వింత వలపుల ప్రేమనిలయం






గోపికల గుండెల్లో
మిగిలి రగిలిన ప్రణయగాథ
ఓపికల అంచుల్లో
విరిగి ఒరిగిన మధురబాధ



ఓపలేని విరహంలో
వేగుతున్నదొక ఉదయం
తాపమింక సైపలేక
తూగుతున్నదొక హృదయం






దాచిఉన్న హృదయానికి
దరిజేరని అనంతం
పూచిపూచి వాడిపోయె
పలుకలేని వసంతం




 ఎదురుచూచు వేదనలో
కరుగుతోంది కాలం
కుదురులేని మనసులో
మరుగుతోంది మౌనం






ప్రియుని కొరకు వేచివేచి
పిచ్చిదాయె మానసం
క్రియాశూన్య చేతనలో
కదలలేని సాహసం




రుచులు చూపి దూరమాయె
మురళి మధురగానం
అలవిగాని తాపంలో
తల్లడిల్లె ప్రాణం




నీవు లేని నిశిరాతిరి
నన్నుజూచి వెక్కిరించె
నన్ను మరచి చనిన నిన్ను
మరువలేక యమున వేచె

ప్రేమ విలువ నెరుగలేని
దైవత్వం ఎందులకో?
చెలియ మనసు మరచిపోవు
రాచరికం ఎందులకో?






ప్రేమేగా జీవనసారం?
ప్రేమేగా పావనతీరం!!
ప్రేమేగా శాశ్వతవేదం?
ప్రేమేగా బ్రతుకున మోదం!!





ప్రేమేగా సత్యస్వరూపం?
ప్రేమేగా నిత్యనివాసం!!
ప్రేమేగా మణిమయ తేజం?
ప్రేమేగా నిజమగు దైవం !!