పాత ఫోటోలను వెదుకుతుంటే రెండేళ్ళక్రితం తీసిన కొన్ని మార్షల్ ఆర్ట్స్ ఫోటోలు కనిపించాయి.
రమేష్,గిరిధర్ నా దగ్గర మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి రెండేళ్ళ క్రితం వచ్చారు.కానీ అన్ని ఆరంభ శూరత్వాలలాగా వారిది కూడా అయింది.ఆ తర్వాత వారికి రావడమూ కుదరలేదు.నాకేమో నేర్పడమూ కుదరలేదు. నేర్పడానికి నేను సిద్ధంగా ఉన్నా,వారికి తీరిక లేకుంటే నేనేం చెయ్యగలను?ఒక దొంగ గురువు దగ్గర రమేష్ కొన్నేళ్ళు కష్టపడి కుంగ్ ఫూ నేర్చుకున్నాడు.కానీ అది అసలైన కుంగ్ ఫూ కాదు.కుంగ్ ఫూ స్కూల్స్ లో ఎక్కువ శాతం బోగస్ స్కూళ్ళే.స్టూడెంట్స్ యొక్క తెలియనితనాన్ని ఆసరాగా తీసుకుని ఆయా గురువులు నకిలీ కుంగ్ ఫూ నేర్పిస్తూ అదే నిజమని భ్రమింపచేస్తూ వేలకువేలు ఫీజులు గుంజుతున్నారు.అలాంటి దొంగ గురువులు నాకు చాలామంది తెలుసు.కొన్ని వేలమంది స్టూడెంట్స్ ఇలా మోసపోతున్నారు.
ఒక విద్యను నేర్చుకోవాలంటే ఆరిపోని తపన లోలోపల నిరంతరం జ్వలిస్తూ ఉండాలి.ఎప్పుడో మనకు గుర్తొచ్చినపుడు కాసేపు మాట్లాడు కోవడం,కొంచం అభ్యాసం చెయ్యడం, ఆ తర్వాత మర్చిపోవడం,మళ్ళీ మన పనులన్నీ అయిపోయి ఏమీ తోచనపుడు ఇవి గుర్తురావడం- ఇలా చేస్తే ఏ విద్యా పట్టుపడదు. అందులోనూ మార్షల్ ఆర్ట్స్ వంటి కష్టమైన విద్యలు అసలే రావు.అలాంటి విద్యలు పట్టుబడాలంటే ప్రతిరోజూ అభ్యాసం తప్పనిసరి.
నాకు ఇరవై ఏళ్ళ వయస్సు నుంచీ నేను మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తున్నాను. ఇప్పటికి కొన్ని వందలమందికి శిక్షణనిచ్చాను.కానీ విద్యను శుద్ధంగా చివరివరకూ నేర్చుకున్న వారు ఇంతవరకూ ఒక్కరు కూడా లేరు.ప్రస్తుతం నాకు ఏభై ఏళ్ళు వచ్చాయి.కానీ నేటికీ నా వయసులో సగం వయసున్న ఒక పాతికేళ్ళ యువకుడిని కూడా తేలికగా ఎదుర్కొని కొన్ని సెకన్లలో మట్టి కరిపించగలను. నిరంతర అభ్యాసం వల్ల అలాంటి ఫిట్ నెస్ వస్తుంది.
స్టూడెంట్స్ అనేవారు ముందు ఎంతో ఉత్సాహంతో ఊపుతో వచ్చి అడుగుతారు.మన సమయం వృధా చేసుకొని వారికి నేర్పడం మొదలు పెడతాము.కానీ వారిలో చిత్తశుద్ధి ఉండదు.కొన్ని నెలలు పోయాక అభ్యాసం మానేస్తారు.కొంతమంది ఒకటి రెండేళ్ళు నేర్చుకుని మానేస్తారు.అలాచేస్తే వీరవిద్యలు పట్టుపడవు.నేను ముప్పై ఏళ్ళ నుంచీ అభ్యాసం మానకుండా చేస్తున్నాను.ఈరోజుకీ చేస్తూనే ఉన్నాను.ఇప్పుడు కూడా ఉదయమే లేచి డాబామీద "తాయ్ చి యాంగ్ ఫాం" ప్రాక్టీస్ చేసి వచ్చి ఇది వ్రాస్తున్నాను.నా దగ్గర ఏదైనా నేర్చుకోవాలంటే జీవితాన్ని దానికి అంకితం చెయ్యగల పట్టుదలా దీక్షా ఉన్నవాళ్లకే అది సాధ్యమౌతుంది.లేకుంటే వాళ్ళకూ నాకూ సమయం వృధా కావడం తప్ప ఉపయోగం లేదు.అవి ఆధ్యాత్మిక సాధనా రహస్యాలైనా సరే,ఇతర విద్యలైనా సరే.
ఉబుసుపోని కబుర్లలో కాలక్షేపం చేసేవారికి కబుర్లే మిగులుతాయి.దీక్షగా సాధన చేసేవారికే కోరుకున్నది దక్కుతుంది.