“What is the use of human life if one is not enlightened while still living?" - Self Quote

29, మే 2014, గురువారం

కాలజ్ఞానం 23-జ్యేష్టమాసం 2014 ఫలితాలు

నిన్న రాత్రి 00-11 నిముషాలకు న్యూడిల్లీలో జ్యేష్ట శుక్ల పాడ్యమి మొదలైంది.ఈ సమయం ఆధారంగా దేశానికి ఈనెల ఎలా ఉండబోతున్నదో చూద్దాం.

స్వాతంత్ర్య లగ్నానికి మకరం నవమం అవడం వల్ల ఈ నెల అంతా విదేశీ వ్యవహారాలతోనూ దానికి సంబంధించి ఇతరదేశాలతో విధాన సర్దుబాట్ల తోనూ సరిపోతుంది.

హోరానాధుడు కుజుడు కావడం ఆయన నవమంలో ఉండటం కూడా దీనినే బలపరుస్తున్నది.

మన దేశంలో కూడా ధార్మిక విషయాలపైన దృష్టి కేంద్రీకృతమౌతుంది. ధార్మిక విషయాలంటే దేశాన్ని ప్రక్షాళన చెయ్యడం,గంగానదిని ప్రక్షాళన చెయ్యడం,ధార్మిక సంస్థలను బలోపేతం చెయ్యడం,సంఘంలోని అవినీతిని ప్రక్షాళన చెయ్యడం మొదలైనవి.

మన దేశానికి గంగానది జీవనాడి వంటిది.అది కలుషితం కావడం మొదలైనప్పుడే దేశానికి భ్రష్టత్వం పట్టడం మొదలైంది.ఇన్నాళ్ళూ వచ్చిన ప్రభుత్వాలు ఊరకే మాటలకే పరిమితమైనాయి గాని గంగానదిని ప్రక్షాళన చెయ్యాలన్న పనిని మొదలు పెట్టలేదు.మోడీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వెయ్యడం గొప్ప మార్పుకు నాంది కాబోతున్నది.

చాలామంది భౌతికవాదులకు గంగానది ఒక మామూలు నీటిగుంట కావచ్చు. కాని భారతీయుల ధార్మికవిశ్వాసం వేరు.యుగయుగాలుగా కోట్లాదిజనుల ధార్మికవిశ్వాసాలకు గంగానది కేంద్రబిందువుగా ఉంటున్నది. అలాంటి పవిత్రనది కుళ్ళుగుంటగా మారడం వెనుక మార్మికమైన అర్ధాలే కాదు.కోట్లాది జనుల నీచమైన కర్మలూ సూచితం అవుతున్నాయి.ఇన్నాళ్ళకు గంగానది శుభ్రపడబోతున్నది.అంటే దేశం కూడా బాగుపడబోతున్నది అని అర్ధం.ఏ దేశమైనా తన ధార్మికవిశ్వాసాలను పునాదిగా కలిగి ఉన్నపుడే పురోగమించ గలుగుతుంది.

నాలుగింట శుక్రకేతువుల వల్ల
ప్రభుత్వానికి సోకాల్డ్ కుహనా మేధావులతో చుక్కెదురు అవుతుంది. ప్రభుత్వం ఏది చేయ్యబోయినా దేశాన్ని కాషాయీకరణం చేస్తున్నారు అన్న గోలను ఈ కుహనామేధావులు రేకెత్తిస్తారు.వారి వెనుక దేశ వ్యతిరేకశక్తులు పని చేస్తూ ఉంటాయి.

ప్రజలలో కూడా కొంత అనిశ్చితి ఏర్పడుతుంది.కొత్త ప్రభుత్వంమీద కొంత నమ్మకమూ కొంత భయమూ ఏర్పడుతూ ఉంటాయి.

అయిదింట రవిచంద్రులవల్ల
ప్రతిపక్షాలూ దుష్టశక్తులూ కలసి చేసే దుష్ప్రచారాన్ని ప్రభుత్వం సమర్ధవంతంగా తిప్పికొట్టగలుగుతుంది.ప్రభుత్వం తీసుకుంటున్న వేగమైన చర్యలవల్ల దేశంలో మేధోమధనం ప్రారంభమౌతుంది.జూన్ ఎనిమిదో తేదీన ఈ మార్పులను స్పష్టంగా చూడవచ్చు.

నక్షత్రనాధుడు చంద్రుడు పంచమంలో ఉండటం వల్ల మేధోపరమైన విధాన నిర్ణయాలు తీసుకోబడతాయి అనీ అవి చాలామందికి నచ్చినా నచ్చకపోయినా దేశానికి మంచి చేసేవి అయి ఉంటాయనీ సూచన ఉన్నది.

ఆరింట గురుబుధులు
కార్మిక,కమ్యూనికేషన్ రంగాలలో వేగమైన విధాననిర్ణయాలు తీసుకోబడతాయి.యధావిధిగా కుహనా మేధావులతో ప్రభుత్వానికి విరోధం ఏర్పడుతుంది.కానీ అంతిమంగా ప్రభుత్వానిదే విజయం అవుతుంది.

నవమంలో కుజుడు
ప్రజలకు చాలా మేలు జరిగే నిర్ణయాలు తీసుకోబడతాయి.ఆర్ధికరంగంలో ఆశాజనకమైన మార్పులకు దారితీసే చర్యలకు శ్రీకారం చుట్టబడుతుంది.షేర్ మార్కెట్ లాభపడుతుంది.శత్రుదేశాలనుంచి కుట్రలు మొదలౌతాయి.

విదీశీ వ్యవహారాలలో మన దేశానికి స్పష్టమైన శక్తివంతమైన వైఖరి ప్రారంభం అవుతుంది.ఇతర దేశాలకు మనమంటే భయమూ గౌరవమూ పెరగడం ప్రారంభం అవుతుంది.

పదింట రాహు శనులు
పరిపాలన ఎత్తులకు పైఎత్తులతో ముందుకు సాగుతుంది.ప్రతిపక్షాలకు మింగుడు పడని గట్టి నిర్ణయాలు తీసుకోబడతాయి.ఏ నిర్ణయాలు తీసుకోబడినా అవి ప్రజలకు మేలు చేసేవిగా ఉంటాయి.

ఇప్పుడు జ్యేష్టమాసంలో మన ఆంద్రరాష్ట్రం ఎలా ఉండబోతున్నదో చూద్దాం. సామాన్యంగా దేశానికీ రాష్ట్రానికీ మాసకుండలి ఒకే విధంగా ఉంటుంది.అయితే ప్రస్తుతం మాత్రం హైదరాబాద్ నగరానికి లగ్నం మారింది.కనుక రాష్ట్రం వరకూ మాసఫలితాలు వేరుగా ఉండబోతున్నాయి.అవి ఏమిటో చూద్దాం.

స్వతంత్రలగ్నానికి మాసలగ్నం దశమలగ్నం వల్ల ఈ నెల అంతా రాష్ట్రంలో పరిపాలనా సంబంధ విషయాలు చక్కదిద్దుకోవడమే సరిపోతుంది.

మూడింట శుక్రకేతువుల వల్ల రాష్ట్రవిభజన ప్రక్రియ వేగవంతం అయ్యేకొద్దీ ప్రజలు అనేకమందిలో,ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న సీమాంధ్ర ప్రజలకు భయాందోళనలు పెరుగుతాయి.ధైర్యం సన్నగిల్లుతుంది.

నాలుగింట రవిచంద్రులవల్ల
చాలామందిలో,ముఖ్యంగా హైదరాబాద్ వాసులలో నైరాశ్యమూ అయోమయమూ భయమూ ఎక్కువౌతాయి.జూన్ ఎనిమిదికి ఈ ఆందోళనలు ఊపందుకుంటాయి.వాటికి కారణాలు కూడా ఉంటాయి.

అయిదింట గురుబుదులవల్ల
ప్ర్రజలకు ఒకవైపు ఆశా ఇంకొకవైపు భయమూ ముప్పిరిగొంటాయి.కొంత లాభమూ కొంత నష్టమూ ఎదురుగా దర్శనమిస్తుంటాయి.ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో తెలియని అయోమయం ఎదురౌతుంది.

ఎనిమిదింట కుజునివల్ల
ప్రజలలో భయం ఎక్కువౌతుంది.అనైతిక కోరికలూ కార్యకలాపాలూ పెరిగిపోతాయి.ఆవేశమూ దూకుడు ఎక్కువైపోతాయి. కొత్త ప్రభుత్వాలు పని చేసే తీరులో అనేక అనిశ్చితులూ గందరగోళాలూ మొదలౌతాయి. ఒకరినొకరు విమర్శించుకోవడం మొదలౌతుంది.ముందుముందు ఇదంతా జరుగుతుంది అని ఇంతకు ముందే కొన్ని పోస్ట్ లలో వ్రాశాను.కావలసిన వారు పాతపోస్ట్ లు ఒకసారి తిరగెయ్యండి.రాష్ట్రవిభజన అనేది సమస్యలకు అంతంకాదు -- ఆరంభం మాత్రమే.

తొమ్మిదింట రాహు శనులవల్ల
మతపరమైన విచ్చిన్నకర దుష్టశక్తుల ప్లానులు ఎక్కువౌతాయి.రాష్ట్ర విభజన పరంగా కొత్తరాష్ట్రాలలో వారి కార్యకలాపాలు ఎలా ఉండాలో ప్లానులు వెయ్యబడతాయి.

కేంద్రం నుంచి రాష్ట్రానికి మేలుచేసే సహాయాలు అందుతాయి.