“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

1, మే 2014, గురువారం

కర్మ పనిచేసే విచిత్రవిధానాలు-రహస్య జ్యోతిష్య విజ్ఞానం

నిన్న బుధవారం.గత కొద్దిరోజులుగా ఉన్న కొన్ని గ్రహగతుల దృష్ట్యా బుధవారం రాత్రిళ్ళు వచ్చే బుధహోరలో చాలా జాగ్రత్తగా ఉండాలనీ,అనూహ్య ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయనీ ఒక మిత్రునితో చర్చిస్తూ కొద్ది రోజులక్రితం అన్నాను.ఆ సమయంలో చెయ్యవలసిన కొన్ని అంతరంగిక రేమెడీలు ఎలా చెయ్యాలి అన్న విషయం అతనితో చర్చించాను.అతనూ అంతరంగిక యోగరహస్యాలను కొంతవరకూ ఎరిగినవాడే గనుక అతనితో ఈ విషయాలు కొద్దిగా చర్చించగలిగాను.

నిన్న రాత్రి 7.40 నుంచి గంటసేపు బుధహోర గనుక ఆ సమయంలో చెయ్యవలసిన కొన్ని అంతరంగిక రెమెడీలను ఎవరికీ తెలియకుండా మౌనంగా పూర్తిచేశాను.

రాత్రి పదిగంటల ప్రాంతంలో ఒక ఎమెర్జెన్సీ ఫోన్ వచ్చింది.

పిడుగురాళ్ళ ఆన్ డ్యూటీ స్టేషన్ మాస్టర్ చేతికి గాయమైందనీ మణికట్టు తెగి రక్తం ఆగకుండా కారిపోతుంటే లోకల్ ఆస్పత్రిలో ఫస్ట్ ఎయిడ్ చేసి నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ లో ఇద్దరు మనుషులను తోడిచ్చి గుంటూరుకు పంపిస్తున్నామనీ మెసేజి వచ్చింది.వెంటనే డాక్టర్ మనోజ్ గారిని ఎలర్ట్ చేసి ఆయనా నేనూ కలసి రాత్రి పదకొండుకు అంబులెన్స్ తో స్టేషన్ కు వెళ్ళాము.

ఈలోపల,ఎన్ని గంటలకు ఈ సంఘటన జరిగిందని అడిగాను.రాత్రి ఎనిమిది ప్రాంతంలో జరిగిందని తెలిసింది.అప్పుడు సరిగ్గా బుధహోర జరుగుతున్నది. ఇతను ఏ కోచ్ లో వస్తున్నాడని అడిగాను.S-6 లో వస్తున్నాడని చెప్పారు.

ఇలాంటి సంఘటనలను కొన్ని వందలు చూచి ఉన్నాను గనుక నాకేమీ ఆశ్చర్యం కలగలేదు.

జరిగిన సంఘటన మాత్రం వినడానికి చాలా విచిత్రంగా ఉన్నది.ఇతను డ్యూటీలో ఉన్నపుడు ఎవడో పిచ్చివాడు వీళ్ళ ఆఫీస్ లోకి జొరబడి అన్ని వస్తువులూ కదిలిస్తూ నానా గొడవా చెయ్యడం మొదలుపెట్టాడు.వెంటనే రైల్వే పోలీసులను పిలిచి అతన్ని బయటకు వెళ్ళగొట్టారు.కాసేపటికి ట్రెయిన్ వచ్చినపుడు స్టేషన్ మాస్టర్ బయటకు రాగానే ఆ పిచ్చివాడు వీళ్ళ ఆఫీసులో దూరి లోపలనుంచి తలుపు గడియ పెట్టుకున్నాడు.అక్కడి ఎక్విప్మెంట్ ను ఏదైనా కెలుకుతాడేమో అన్న కంగారులో వీళ్ళు బయటనుంచి తలుపులు గట్టిగా తోశారు.ఆ తలుపుకు గ్లాస్ విండోస్ ఉన్నాయి.కంగారులో ఇతను చెక్కమీద చెయ్యివేసి తొయ్యకుండా గ్లాస్ మీద చెయ్యి పెట్టి తలుపుని గట్టిగా తోశాడు.ఆ గ్లాస్ పగిలి ఇతని చెయ్యి తలుపులోనుంచి లోనికి వెళ్ళిపోయింది.పగిలిన గ్లాస్,కత్తిలా ఇతని మణికట్టును కోసేసింది.నరాలు తెగి రక్తం పిచికారిలా చిమ్మింది.డ్రస్సూ నేలా అంతా రక్తమయం అయింది.ఇదంతా ఒక్క క్షణంలో జరిగిపోయింది.అంతా ఏదో ఇంగ్లీష్ సినిమాలో జరిగినట్లు జరిగింది.

వెంటనే లోకల్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చేతిని ప్యాకింగ్ చేసి వెంటనే విజయవాడ తీసుకెళ్ళమని సూచించారు.వ్యాసుక్యులర్ సర్జరీ అవసరం కావచ్చు.అలాంటి సదుపాయాలు విజయవాడలోనే ఉన్నాయి గనుక వెంటనే అక్కడకు తీసుకెళ్ళండి అని సూచించారు.

పేషంట్ గుంటూరులో దిగిన తర్వాత పరీక్ష చేశాము.బీపీ నార్మల్ గా ఉన్నది. అతను హై బీపీ పేషంట్ అని తెలిసింది.స్పృహలోనే ఉన్నాడు. నడవగలుగుతున్నాడు.వైటల్స్ అన్నీ బాగానే ఉన్నాయి.కాకపోతే చెయ్యి అన్ని వేళ్ళూ కదిలించలేకపోతున్నాడు.ముఖ్యంగా చిటికెనవేలు కదులుతుంటే మణికట్టు దగ్గర లోపల చాలా నొప్పిగా ఉన్నది అన్నాడు. ఉంగరపు వేలూ చిటికెన వేలూ బాగా వంగిపోయాయి.బ్యాండేజి చేసిన చేతి వేళ్ళు,గోళ్ళూ మామూలుగా ఎర్రని రంగులోనే ఉన్నాయి గనుక వేళ్ళకు రక్తసరఫరా బాగానే ఉన్నదని,ఎక్కువ డామేజ్ జరగలేదనీ అర్ధమైంది. మణికట్టులోనుంచి పోయే 'అల్నార్ నెర్వ్' అనేది చిటికెన వేలి కదలికలనూ కొంతవరకూ ఉంగరపు వేలి కదలికలనూ కంట్రోల్ చేస్తుంది గనుక ఆ నెర్వ్ డామేజ్ జరిగి ఉండవచ్చని భావించాము.మెరుగైన చికిత్స కోసం వెంటనే అతనికి మనుషుల తోడిచ్చి అంబులెన్స్ లో విజయవాడకు పంపించాము.ఆ విషయాలను అలా ఉంచుదాం.

ఇదంతా చూస్తున్నపుడే,ఇది ఎందుకు జరుగుతున్నదో,అతని పూర్వకర్మ ఏమిటో,గతంలో అతను ఏమి చేసినందువల్ల ఈ కర్మ అనుభవిస్తున్నాడో నాకు అర్ధమై పోయింది.అతను రైలు దిగి నడుస్తూ వస్తున్న విధానం చూచినప్పుడే అతనిమీద ఏ గ్రహప్రభావం బలంగా ఉన్నదో,ప్రస్తుతం అతని జాతకంలో ఏ దశ జరుగుతున్నదో తెలిసిపోయింది.ఇతని చదువుకూ ఇతని ఉద్యోగానికీ ఏమీ సంబంధం లేదన్న విషయమూ,ఇతను బాగా చదువుకున్న వాడన్న విషయమూ,ఇతని జాతకంలో చదువుకు సంబంధించి దోషాలున్నయన్న విషయమూ,ఇది తరతరాలుగా వీళ్ళ ఫేమిలీలో ఉన్న శాపం అన్న విషయమూ,ఆ శాపం రావడానికి వాళ్ళ ఫేమిలీలో పూర్వీకులు చేసిన తప్పులు ఏమిటన్న విషయాలూ అన్నీ తెలిసిపోయాయి.

అయినా డబల్ చెకప్ చేద్దామని అతన్ని ఒక ప్రశ్న అడిగాను.ఈ ప్రశ్న ఆ సమయంలో అడగటం అసందర్భం అయినా,అనుమాన నివృత్తి కోసం అలా అడగక తప్పలేదు.

'నీ క్వాలిఫికేషన్ ఏమిటి?' అని అతన్ని అడిగాను.ఆ సమయంలో డాక్టర్ గారు అతని బీపీ చెకప్ చేస్తున్నారు.

'బీ టెక్ మెకానికల్' అని అతను జవాబిచ్చాడు.

వింటున్న డాక్టర్ ఆశ్చర్యపోయి 'అవునా? మీరు సర్వీస్ లో చేరి ఎన్నాళ్ళు అయింది?' అంటూ అడిగాడు.

'పదకొండేళ్ళు' అంటూ అతను జవాబిచ్చాడు.

'ఏంటీ పదకొండేళ్ళ క్రితం బీటెక్ మెకానికల్ చేసి రైల్వేలో స్టేషన్ మాస్టర్ గా చేరావా?' అని డాక్టర్ మళ్ళీ అడిగాడు.

అతను అవునంటూ తలాడించాడు.

ఇక నేను ఆ విషయం ఏమీ రెట్టించలేదు.నాకు అర్ధమైన విషయాలు కరెక్టే అని ఈ డబల్ చెకప్ తో నాకు రూడి అయిపొయింది.

గబగబా అతనికి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తిచేసి విజయవాడకు అంబులెన్స్ లో పంపించేశాము.

అంతా అయిపోయాక ఇంటికి వెళదామని బయటకు వస్తుంటే సహోద్యోగి ఒకాయన ఇలా అన్నాడు.

'చూడండి సార్ ఎంత విచిత్రమో? ఎవడో పిచ్చివాడు వచ్చి లోపల దూరి తలుపెసుకోవడం ఏమిటి?ఆ తలుపును తోసే క్రమంలో తలుపుకున్న గాజుగ్లాసు పగిలి మనవాడు తన చేతిని తానె కోసుకోవడం ఏమిటి?నరాలు తెగిపోవడం ఏమిటి?అంతా భలే విచిత్రంగా ఉన్నది సార్.చెప్పినా కూడా ఎవరూ నమ్మరు.'

నేను జవాబివ్వకుండా తలాడిస్తూ నవ్వడం గమనించి పక్కనే ఉన్న ఇంకొక సహోద్యోగి 'ఏంటి సార్.చెప్పకుండా మీలో మీరే నవ్వుకుంటున్నారు?' అన్నాడు.

'చిటికెన వేలును కంట్రోల్ చేసేది బుధుడే' అన్నాను నవ్వుతూ.

'ఏంటి సార్? అన్నాడు అతను అర్ధం గాక.

'అంతేకాదు.నరాలకూ వాటికి జరిగే డామేజీకీ కూడా బుధుడే కారణం' అన్నాను.

వాళ్ళు వింతగా చూచారు.

'అంతేకాదు.పిచ్చితనానికి కూడా బుధునిమీద ఉన్న ఇతర గ్రహాల ప్రతికూల ప్రభావాలే కారణం.ఇంకో సంగతి చెప్పనా?నిన్నగాక మొన్ననే అమావాస్య' అన్నాను మళ్ళీ.

వాళ్ళు అలాగే వింతగా చూస్తున్నారు.

'గుడ్ నైట్.జాగ్రత్త.ఈరోజు బుధవారం.సంఘటన జరిగింది కూడా బుధహోరలోనే' అని వారికి చెప్పాను.

ఒకసారి టైం వైపు చూచాను.రాత్రి 12.50 చూపిస్తున్నది.

జ్యోతిష్య,యోగ,తంత్రవిజ్ఞానం చాలా బలమైనది,సత్యమైనది.మన పూర్వీకులు వీటి సహాయంతోనే ఒక మనిషిని చూస్తూనే అతని భూత భవిష్యత్ వర్తమానాలు చదవగలిగేవారు.వీటిని సక్రమంగా అధ్యయనం చేస్తే ఇప్పుడు కూడా అది సాధ్యమే.

మనిషి జీవితంలో అడుగడుగునా అతను కర్మకూ ప్రకృతికీ లోబడే ఉంటాడు.'శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు' అనడం అక్షరాలా నిజం.అంతా మనమే చేస్తున్నాము జరిగేది అంతా మన గొప్పే అనుకునే అహంకారం వల్లనే మనిషి పతనం అవుతాడు.సత్యానికి దూరమౌతాడు.నిజమైన దృష్టి ఉన్నవాడు మాత్రం అనునిత్యం తనను నడిపిస్తున్న కర్మనూ ఆ క్రమంలో ప్రకృతి శక్తుల పాత్రనూ స్పష్టంగా దర్శించగలుగుతాడు.

కర్మ ఎంత బలవత్తరమో,ప్రపంచంలోని ప్రతి ఒక్కరినీ అది పట్టి ఎలా నడిపిస్తున్నదో,చేసిన కర్మను తప్పుకోవడం ఎవరికైనా సరే ఎలా అసాధ్యమో ఆలోచిస్తూ మా ఇంటివైపు బయలుదేరాను.