“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

26, మే 2014, సోమవారం

పోగొట్టుకున్న బంగారు గాజు - ప్రశ్నతంత్రం ఏం చెప్పింది?-(1)

ఈ మధ్య మాకు తెలిసిన ఒకామె తన బంగారు గాజును పోగొట్టుకుంది.

ఒక ఫంక్షన్లో దానిని తన చేతినుంచి తీసి ఎందుకో హేండ్ బేగ్ లో ఉంచింది.ఆ తర్వాత దాని గురించి మరచిపోయింది.కొన్నాళ్ళ తర్వాత గుర్తొచ్చి దానికోసం వెదికితే అది బ్యాగ్ లో లేదు.

దానివిలువ లక్షరూపాయలు ఉంటుంది.

ఎక్కడ వెదికినా దొరకలేదు.

'గాజు ఏమైందో కొంచం చూచి చెప్పన్నయ్యా?' అని నన్ను అడిగింది.

నాకు చెల్లెళ్ళు లేరు.కులాలు వేరైనా ఆమెను నా చెల్లెలిగా భావిస్తాను.ఆమె కూడా నన్ను 'అన్నయ్యా' అంటూ ప్రేమగా పిలుస్తుంది. 

ప్రశ్నకుండలి వేసి చూచాను.

చూస్తున్నపుడే నాకు ఒక పాత సంఘటన గుర్తొచ్చింది.

మా అమ్మగారి వద్ద 'అంజనవిద్య' ఉండేది.తమిళనాడులోని ఒక గురువుగారు కాటుకవంటి ఒకదానిని భరిణలో పెట్టి ఇచ్చి ఒక మంత్రం ఉపదేశించి ఆ విద్యను ఎలా వాడాలో మా అమ్మగారికి ఉపదేశం చేశారు.ఆ కాటుకను కొన్ని మూలికలతో ఆయనే తయారు చేసేవారు.అప్పట్లో ఆయన పేరు 'భగవాన్ అనంత' అనేవారు.ఆయన అమ్మవారి ఉపాసకుడు.ఆయన ఆశ్రమం కావేరీ తీరంలో ఉండేది.ఈ విషయం నలభై ఏళ్ళ క్రితం జరిగింది.

అంజన విధానం ఇలా ఉంటుంది.

ముందుగా కొంత పూజాతతంగం ఉంటుంది. దాని తర్వాత ఆ కాటుకను ఒక చిన్నపిల్ల చేతి బొటనవేలి గోటికి పూయాలి. ఆ చిన్నపిల్లకు పదేళ్ళలోపు వయసు ఉండాలి.ఆ పిల్ల ఎవరైనా కావచ్చు. ఇంకా చిన్నతనం మాత్రం ఉండాలి.అంటే అబద్దాలు చెప్పకుండా చూస్తున్నదానిని ఉన్నదున్నట్లు చెప్పే వయసులో ఉండాలన్నమాట.

ఆ పిల్లను గోటిమీద పూసిన కాటుకలోకి చూస్తూ ఉండమని చెప్పాలి. అప్పుడు ఆ మంత్రాన్ని జపిస్తూ అక్కడ కూచుంటే,ఆ పిల్లకు గోటిమీద 'టీవీతెర' లాగా విషయం కనిపించడం మొదలౌతుంది.అప్పుడు మనం అడిగిన ప్రశ్నలకు ఆ అమ్మాయి సమాధానాలు చెబుతూ ఉంటుంది.జరిగిన జరుగుతున్న జరగబోయిన దేనికైనా జవాబులు వచ్చేవి.ఒకవేళ మనుషుల ప్రదేశాల పేర్లు కావాలంటే అక్షరాల రూపంలో కనిపించేవి.చూచేవారికి తెలిసిన భాషలో(అది ఏ భాష అయినా కావచ్చు) ఆ అక్షరాలు కనిపిస్తాయి.

ఈ అంజనం వేసిన ప్రతిసారీ ఒకే రకంగా ఆ దృశ్యం మొదలౌతుంది.చూచే చిన్నపిల్లలు మాటమాటకీ వేర్వేరుగా ఉండేవారు గాని కనిపించే దృశ్యం మాత్రం ఒకటే ఉంటుంది.ఎందుకంటే ప్రతిసారీ వాళ్ళు ఆ గోటిలో ఒకే సీన్ కనిపిస్తున్నదని చెప్పేవారు.

ముందుగా ఒక నల్లని స్త్రీ వచ్చి ఒకచోట ఊడ్చి కడిగి ముగ్గు వేస్తుంది.ఆ తర్వాత అక్కడ ఒక సింహాసనం వేస్తుంది.అప్పుడు అందులో ఆంజనేయస్వామి వచ్చి ఆసీనుడౌతాడు.ఆమె ఒక నల్లని జెండా పట్టుకుని అక్కడే ఒకపక్కగా నిలబడి ఉంటుంది.ఇక మనం ప్రశ్నలు అడుగవచ్చు. 

మనం అడగరాని కొంటెప్రశ్నలు అడిగినా,అసందర్భపు ప్రశ్నలు అడిగినా జవాబు రాదు.ఆంజనేయస్వామి గుడ్లెర్రజేసి కోపంగా చూస్తూ జాగ్రత్త అన్నట్లుగా తోక చూపిస్తాడు.మన ప్రేలాపన ఇంకా అలాగే కొనసాగిస్తే,కనిపించే దృశ్యం మాయమై పోతుంది.ఇక ఏమీ కనిపించదు.

ఆ నల్లని స్త్రీ ఎవరని మా అమ్మగారిని నేను చిన్నప్పుడు అడిగాను.

ఆమె పేరు 'నీలపతాక' అని ఆమె అన్నారు.ఆమె పేరు దేవీ ఖడ్గమాలలో వస్తుంది.ఆమె నిత్యాదేవతలలో ఒకరని,ఈ అంజనవిద్యకు ఆమె అధిష్టాన దేవత అని మా అమ్మగారు చెప్పినారు.

ఈ విద్య ఖడ్గమాలా దేవతలకూ హనుమత్ ఉపాసనకూ సంబంధించిన విచిత్ర ఉపాసన.

అయితే ఈ విద్యకు చాలా నియమ నిబంధనలుండేవి. ఉదాహరణకు, అర్ధరాత్రైనా అపరాత్రైనా ఏ ఆర్తుడు వచ్చి అడిగినా 'ఇప్పుడు కాదు.నేను చూడను.తర్వాత రా' అని చెప్పకూడదు.

అప్పటికప్పుడు తలస్నానం చేసి అంజనక్రియను ప్రారంభం చెయ్యాలి.అబద్దం చెప్పకూడదు.డబ్బు కావాలని అడుగకూడదు.గ్రహణ సమయంలోనూ ఇతర పర్వదినాలలోనూ నిష్టగా ఉండి లెక్కప్రకారం ఇన్నివేలు అని ఆ మంత్రాన్ని జపం చెయ్యాలి.ఇక ఆహార నియమం సంగతి చెప్పనక్కర్లేదు. ఇలా చాలా కట్టుబాట్లు ఉండేవి.మొత్తంమీద దీనిని చేసేవారికి సోషల్ లైఫూ,ఫేమిలీ లైఫూ చాలా దెబ్బతినేది.

చాలామంది వచ్చి ఈ అంజనవిద్య వల్ల ఉపయోగం పొందేవారు.

ఇలా జరుగుతూ ఉండగా ఒకసారి మా బంధువుల ఇంటిలో పెళ్లి సమయంలో ఒకరి బంగారు గొలుసు పోయింది.పాతకాలంలో పెళ్ళిళ్ళలో ఇలాంటి సంఘటనలు చాలా ఎక్కువగా జరిగేవి.కామన్ బాత్రూంలో స్నానం చేసేటప్పుడు బంగారు ఆభరణాలు తీసి అక్కడపెట్టి హడావుడిలో స్నానం చేసి వాటిని మర్చిపోయి బయటకి వచ్చేసేవారు.ఆ తర్వాత చూస్తే అవి ఉండేవి కావు.ఇలాంటి సంఘటనలు సర్వసాధారణంగా జరిగేవి.అలాగే లగేజిని కామన్ గా ఒక రూం లో ఉంచినప్పుడూ ఇలాంటి సంఘటనలు జరిగేవి.

దానిని తీసినవారు ఎవరు? అని అంజనం వెయ్యవలసి వచ్చింది.

అడిగాక తప్పదు గనుక మా అమ్మగారు అంజనం వేసి చూచారు.

ఆ చూస్తున్న చిన్నపిల్ల చెప్పిన ప్రకారం -- ఒక స్త్రీ ఆ గొలుసు ఉన్న గదిలోకి వచ్చి పెట్టె తెరచి ఆ గొలుసు తీసుకుంటున్నదని చెప్పింది.

ఆమె పేరు ఏమిటి? అని ప్రశ్నించడం జరిగింది.

ఫలానా పేరు అని తెరమీద కనిపించగా ఆ అమ్మాయి బయటకు చదివింది.

వీళ్ళకు ఇంకా అనుమానం పోక- 'ఆమె ఎలా ఉంటుంది'? అని ప్రశ్నించారు.

ఆ అమ్మాయి వర్ణించింది.

ఇంకా నమ్మకం కుదరక-'గొలుసు పోగొట్టుకున్న ఆమెకు ఈమె ఏమౌతుంది?' అని అడిగారు.

ఆ బంధుత్వం కూడా తెరమీద కనిపిస్తే చూస్తున్న చిన్నపిల్ల చదివి చెప్పింది.

వినేవాళ్ళు నోరెళ్ళబెట్టారు.

ఇంతా చేస్తే దొంగతనం చేసినది ఎవరో కాదు.ఆ గొలుసును పోగొట్టుకున్న వ్యక్తి తోడికోడలు.ఆమె కట్టుకున్న చీర రంగూ,మనిషి పోలికలూ,పేరూ అన్నీ సరిపోయాయి.పైగా జరిగిన సంఘటననూ అక్కడి పరిసరాలనూ ఆ అమ్మాయి కళ్ళకు కట్టినట్లు వర్ణించింది.

"మమ్మల్ని దొంగలను చేస్తారా?" అంటూ ఇక కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి.అవి ఎంతవరకూ పోయాయంటే బంధువులు ముఖముఖాలు చూచుకోవడం కూడా మానేసేటంత వరకూ దారితీశాయి. కొన్ని నెలలపాటు ఆ భార్యాభర్తల మధ్యన మాటలు లేవు.

కాని కొన్నాళ్ళ తర్వాత ఆ గొలుసు ఆమె దగ్గరే దొరికింది.

అయితే 'అదే గొలుసని గ్యారంటీ ఏముంది? మేము కూడా ఇలాంటిదే కొనుక్కున్నాం' అని వాళ్ళు బుకాయించారు.

ఇదంతా చూచి మా అమ్మగారికి విసుగు పుట్టి ఆ విద్యను ఉపయోగించడం మానేశారు.నా చిన్నప్పుడు ఆ విద్యను నాకు చెప్పమని ఎంతో బ్రతిమాలాను.

కాని ఆమె ఒప్పుకోలేదు.

'దీనివల్ల చాలా గొడవలు వస్తాయి.వద్దు' అనేవారు.

అలా ఆ విద్య ఆమెతోనే అంతరించిపోయింది.

ప్రస్తుత ప్రశ్నకుండలిని గమనిస్తున్నపుడు ఎప్పుడో జరిగిన ఈ సంఘటన నాకు గుర్తుకు వచ్చింది.

ఎందుకంటే ఈ బంగారుగాజును తీసినది దగ్గర బంధువుల అమ్మాయే.

ఈ సంగతి ఆమెతో ఎలా చెప్పాలి?

చెబితే ఇంటిలో తప్పకుండా గొడవలు అవుతాయి.

చెప్పకుండా ఎలా ఉండాలి?

చెప్పకపోతే అసత్యదోషం చుట్టుకుంటుంది.

అన్నీ సమస్యలే.

మా అమ్మగారిని మనస్సులో తలచుకుని నమస్కరించి--'మీ గాజు దొరకదు.దాని గురించి మర్చిపోండి' అని మాత్రం చెప్పాను.

ఆమె ఏమేమో ప్రశ్నలు అడిగినా ఇంక నేనేమీ జవాబులు చెప్పలేదు.

ఆమె తృప్తికోసం--'ఎల్లుండి ఒకసారి ఇల్లంతా వెదకండి దొరకవచ్చు.' అనిమాత్రం చెప్పాను.

ఆ మాత్రం అబద్దం చెప్పినందుకే నాకు దారుణమైన రియాక్షన్ వచ్చింది.దానిఫలితంగా ఒక వారం రోజులపాటు బాధపడవలసి వచ్చింది.

ఇంతకీ ఈ నిర్ణయానికి ఎలా రాగలిగాను?ప్రశ్నచక్ర విశ్లేషణ ఎలా చేశాను? అన్నది తర్వాతి పోస్ట్ లో చూడండి.