“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

29, మార్చి 2014, శనివారం

జయనామ సంవత్సరం - ఉగాది కుండలి-ఫలితములు

జయనామ  సంవత్సర ఉగాది ధనుర్లగ్నంలో 31-3-2014 న రాత్రి 00.16 కి మొదలౌతున్నది.ఉగాది కుండలి ప్రకారం మనరాష్ట్రం వరకూ ఈ క్రొత్తసంవత్సరం ఎలా ఉండబోతున్నదో పరిశీలిద్దాం.

రాష్ట్ర పరిస్థితి ప్రజలు ఊహిస్తున్నంత బాగా ఏమీ ఉండదు.అధికార మార్పిడి హింసాత్మక సంఘటనల మధ్య జరుగుతుంది.

ఎంతసేపూ కేంద్రం మీద ఆధారపడి అడుక్కోవలసిన పరిస్థితి ఉంటుంది.

ప్రజాజీవితంలో అనేక సమస్యలు తలెత్తుతాయి.రాష్ట్ర విభజన చేసుకున్నంత ఆనందంగా ఆ తర్వాత పరిస్థితులు ఉండవు.చతుర్ధంలోని అమావాస్య, ప్రజాజీవితంలో చీకటి ముసురుకుంటుందని,అంతా మొదలునుంచి ప్రారంభం కావాల్సి వస్తుందని సూచిస్తున్నది.ఏదో చేద్దామని నాయకులు ఆశించినప్పటికీ,దానికి తగిన పరిస్థితులు వారికి అందుబాటులో ఉండని కారణం చేత,వారు అనుకున్న అన్నింటినీ చెయ్యలేరు.

రాష్ట్ర ఆర్ధికపరిస్థితి గడ్డుగానే ఉంటుంది.ఆర్ధికరంగంలో అనేక చిక్కులు ఎదురౌతాయి.కాకపోతే సమయానికి ఏదో విధంగా నెట్టుకురావడం జరుగుతుంది.

ఈ సమస్యలనుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే మంచి పట్టుదల ఉన్న నాయకత్వం అవసరమౌతుంది.అటువంటి నాయకుడు ఉన్నప్పటికీ కూడా, అతను రాష్ట్రాన్ని నడపడానికి చాలా చిక్కులు ఎదుర్కోవలసి ఉంటుంది.

రాష్ట్రంలో అధికారంలో వచ్చె ప్రభుత్వం,కేంద్రప్రభుత్వంలోని మిత్రుల సహాయం వల్లనే ముందుకు పోగలుగుతుంది.కేంద్రంతో ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ఈ వ్యవహారం జరుగుతుంది.

శని నక్షత్రంలో శనిహోరలో మొదలౌతున్న ఈ సంవత్సరం రాష్ట్ర పరంగా పెద్ద గొప్ప ఫలితాలనేమీ ఇవ్వదనే చెప్పాలి.కొందరు నాయకులు ఊహిస్తున్న స్వర్ణాంధ్రను నిర్మించడం ఈ ఒక్క సంవత్సరంలో అయితే మాత్రం జరగని పని.

ఒక్క మాటలో చెప్పాలంటే నాయకులకు భోగాలు,ప్రజలకు కష్టాలతో ఈ సంవత్సరం గడుస్తుందని చెప్పవచ్చు.జయనామ సంవత్సరం నాయకులకు జయాన్ని తెచ్చిపెట్టినా, ప్రజలకు మాత్రం అపజయాన్నే మిగులుస్తుంది.

అతితెలివితో,స్వార్ధంతో ముందుచూపు లేకుండా ప్రవర్తించే ప్రజలకు ఇంతకంటే చక్కని రోజులు ఎలా వస్తాయి?సామూహిక కర్మప్రభావం దాట శక్యంకానిదన్న విషయం ఇప్పటికైనా ప్రజలు గ్రహించి వారివారి నిత్యజీవితాల్లో సక్రమంగా ఉండటం మొదలుపెడితే మంచిది.లేకుంటే ఇంకా గడ్డురోజులు ముందున్నాయి.