“What is the use of human life if one is not enlightened while still living?" - Self Quote

19, మార్చి 2014, బుధవారం

హోమియో అద్భుతాలు - 31 ఏళ్ల పార్శ్వపు తలనొప్పి(Migraine)

నా కొలీగ్ ఒకాయన గత 31 ఏళ్ళుగా పార్శ్వపు తలనొప్పితో బాధపడుతున్నాడు.దీనిని వాడుకభాషలో 'మైగ్రేన్' అనీ వైద్యపరిభాషలో 'హెమిక్రేనియా' అనీ 'క్రానిక్ పెర్సిస్టెంట్ హెమిక్రేనియా(CPH)' అనీ పిలుస్తారు.

ఆయన వాడని మందు లేదు.అన్నీ ఫెయిలై చివరకు ఇంగ్లీష్ మందులు వాడుతూ సమస్యతో యుద్ధం చేస్తూ ఉన్నాడు.ప్రతిరోజూ రాత్రి ఒక బిళ్ళ వేసుకోకపోతే మర్నాడు లేచేసరికి భయంకరమైన తలనొప్పితో మెలకువ వస్తుంది.ఆ నొప్పి ఎంత తీవ్రంగా ఉంటుందంటే అది భరించలేక,ఏదైనా గన్ అందుబాటులో ఉంటే దానితో కణతలోకి షూట్ చేసుకుందామా అన్నంత తీవ్రంగా ఉంటుందని అంటాడు.కొన్నేళ్లుగా అలా మందులు వాడటం వల్ల క్రమేణా ఆ మందుల సైడ్ ఎఫెక్ట్స్ శరీరం మీద కనిపిస్తున్నాయి.

లావెక్కడం,ఉన్నట్టుండి విషయాలను మర్చిపోవడం, ఆబ్సెంట్ మైండెడ్ అయిపోవడం,తన ప్రమేయం లేకుండా ఆలోచనలు ఎటో వెళ్ళిపోవడం,ప్రతి చిన్న విషయానికీ ఆదుర్దా గాభరా ఏర్పడటం మొదలైన లక్షణాలు కనిపించడం ప్రారంభం అయింది.

ఈయన నాకు పరిచయం అయ్యి కొద్ది నెలలే అయింది.మాటల సందర్భం వచ్చినపుడు దీర్ఘవ్యాదులు తగ్గించడంలో హోమియోపతి యొక్క విశిష్టతను గురించి చెబుతూ ఉండేవాడిని.

తాను హోమియోపతి కూడా వాడానని అయినా తన మైగ్రేన్ తగ్గలేదని ఆయన చెప్పాడు.

'హోమియో మందులు ఇచ్చే ప్రతివారూ వారికి డిగ్రీలున్నప్పటికీ హోమియో వైద్యులు కాలేరు.వారు చేసేది హోమియో వైద్యమూ కాదు.'Organon of Medicine' లో డాక్టర్ హన్నేమాన్ చెప్పిన సిద్ధాంతాల ప్రకారం వాటిని వాడితేనే అది సరియైన హోమియో ట్రీట్మెంట్ అవుతుంది.అప్పుడే దీర్ఘవ్యాదులు తగ్గుతాయి.లేకుంటే హోమియోపతి మందులు వాడినా అవి తగ్గవు.' అని నేను చెప్పాను.

తన మైగ్రేన్ కు హోమియోపతి ట్రీట్మెంట్ ఇవ్వమని ఆయన ఒకటి రెండుసార్లు అడిగాడు కాని దానికి సరియైన సమయం రాకపోవడంతో అది కుదరలేదు.ఈ 'సమయం రావడం' అనేది చాలా విచిత్రమైన ప్రక్రియ.

చాలామంది నన్ను ఆధ్యాత్మిక సూచనల కోసమో,లేక వారి సందేహాల నివృత్తి కోసమో వచ్చి కలుస్తుంటారు.కాని వచ్చినవారు వారు ఎందుకొచ్చారో మర్చిపోయి కూచున్న కాసేపు ఏదేదో లోకాభిరామాయణం మాట్లాడి వెళ్లిపోతుంటారు.నాలో నేను నవ్వుకొని ఊరుకుంటూ ఉంటాను.అలాగే కొంతమంది ఏళ్ళతరబడి పరిచయం ఉన్నాకూడా నానుంచి వారు కోరినది ఏమీ పొందలేరు.కొంతమంది చాలా దగ్గరగా వచ్చికూడా కనీసం నన్ను కలవలేక ఒకవేళ కలిసినా ఏమీ పొందలేక హటాత్తుగా దూరమై పోతుంటారు. దానికి కారణం వారివారి కర్మ పరిపక్వం కాకపోవడమే.మాయ అనేది రకరకాలుగా వారిని దూరంగా ఉంచుతుంది.

జీవితంలో అనుభవించవలసిన కర్మ చాలా మిగిలి ఉన్నపుడు సత్యానికి మనం దగ్గర కాలేము.ఏదేదో కారణాలు చూపించి అది దూరంగా లాక్కుపోతుంది.ఆ కారణాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా భలే విచిత్రంగా ఉంటాయి.వారివారి పొరపాట్లను గ్రహించి వారు కళ్ళు తెరిచేసరికి జీవితంలో ఏళ్ళకేళ్ళు దొర్లిపోయి ఉంటాయి.అప్పుడు చింతించి ఉపయోగం ఉండదు.

సమయం రానిదే సరియైన ఆధ్యాత్మిక గురువు దొరకడు.సమయం రానిదే సరియైన వైద్యుడూ దొరకడు.ఒకవేళ దొరికినా ఉపయోగం ఉండదు.సమయం రానిదే ఉన్నతమైన సత్యాలు అందవు.సమయం రానిదే జీవితంలో ఏదీ జరగదు.కర్మ పరిపక్వం కావడమే సమయం రావడమంటే.

అయితే మనంతట మనం కర్మపరిపక్వం చేసుకునే మార్గాలు ఉన్నాయి. ఉద్దేశ్యపూర్వకంగా వాటిని ఆచరించి కర్మను తగ్గించుకోవచ్చు.సాధన అంటే అదే.అయితే ఆ రహస్యాలు తెలియాలంటే కూడా మళ్ళీ కొంతకర్మ పరిపక్వత కావాలి.సరైన మార్గదర్శకులు పరిచయం కావాలి.వారిని అడిగి తెలుసుకుందామన్న జిజ్ఞాస మనకు కలగాలి.అందుకు అడ్డుగా ఉండే మన అహంకారం పక్కకు తప్పుకోవాలి.ఆ తర్వాత,ఆయా మార్గాలను ఆచరించే బుద్ధి మనకు పుట్టాలి.కర్మచక్రంలో సూక్ష్మంగా ఉండే ఇన్ని అడ్డంకులు తొలగిపోతేగాని ఇదంతా సాధ్యం కాదు.ఇదొక విచిత్రమైన మార్మిక వలయం.

ఒకరోజున ఏదో ప్రయాణంలో ఉన్నాము.మళ్ళీ ఆయన అదేమాట అడిగాడు.

సమయం వచ్చిందని నాకు ఇంట్యూటివ్ గా అనిపించింది.

వెంటనే అక్కడికక్కడే కేస్ టేకింగ్ మొదలుపెట్టాను.హోమియోపతి వైద్యవిధానంలో కేస్ టేకింగ్ ఎలా ఉంటుందో దానికి ఎంత సూక్ష్మపరిశీలనా ఓపికా కావాలో ఈ విశ్లేషణను చూచి అర్ధం చేసుకోవచ్చు.

కంప్లెయింట్:-కుడివైపు తలనొప్పి-గత 31 ఏళ్ల నుంచి వదలకుండా పీడిస్తున్నది.అంటే పేషంట్ కు 15 ఏళ్ల వయసునుంచీ అన్నమాట.

తల్లితండ్రుల వివరాలు:-

తండ్రి:-40 ఏళ్ల వయస్సులో జాండీస్ తో చనిపోయారు.
తల్లి:-హిస్టీరియాతో బాధపడేవారు.ప్రస్తుతం తగ్గింది.
చిన్నసోదరుడు:-BP ఉన్నది.ఈమధ్యనే హార్ట్ ఎటాక్ వచ్చి కోలుకున్నాడు. కోపమూ ఇర్రిటేషనూ ఎక్కువ.
చెల్లెలు:-ఈమెకు కూడా కోపమూ ఇర్రిటేషనూ ఎక్కువే.27 ఏళ్ల వయస్సులో చనిపోయింది.సూయిసైడ్ అని అనుమానం.

ఫేమిలీ హిస్టరీని బట్టి వీరి జీన్స్ లో నెర్వస్ టెంపరమెంట్ ఎక్కువగా ఉన్నదని తెలుస్తోంది.మైగ్రేన్ కూడా నరాలదోషంవల్ల వచ్చె బాధనే(nervous complaint).కనుక తత్వపరమైన ట్రీట్మెంట్ (constitutional treatment with a number of anti-psoric remedies)అవసరం అవుతుంది.

పేషంట్ వివరాలు:-

వయస్సు:-46 ఏళ్ళు.బొద్దుగా ఉన్నాడు.కానీ మొదట్లో ఇలా ఉండేవాడిని కాననీ సన్నంగా ఉండేవాడిననీ,మైగ్రెన్ కు వాడుతున్న ఇంగ్లీషు మందులలో కార్టిజాన్స్ ఉండటం వల్ల హటాత్తుగా రెండు మూడేళ్ళలో 47 నుంచి 96 కేజీలకు బరువు పెరిగిపోవడం జరిగిందనీ అన్నాడు.

నొప్పి ఎక్కువగా కుడికణత ప్రాంతంలో వస్తుంది.క్రమేణా ఎక్కువైపోయి అక్కడనుంచి పాకి కుడికంటిలో బోరింగ్ పెయిన్ తో లోకలైజ్ అవుతుంది.

కణత నుంచి భుజానికి కూడా పాకుతుంది.ఒక ఏభైసార్లు కుడివైపున వస్తే ఎప్పుడైనా ఒకసారి ఎడమవైపున కూడా వస్తుంది.

నొప్పి వచ్చినపుడు కాంతిని చూడటం కష్టంగా ఉంటుంది.అసలు లైట్ ను చూడలేడు.

ఒక చీకటిగదిలో దిండ్ల మధ్యన తల దాచుకుని తలకు ఒక గుడ్డ గట్టిగా చుట్టుకుని వత్తుకుంటూ పడుకుంటే కొంత ఉపశమనంలాగా ఉంటుంది కాని నొప్పి తగ్గదు.క్రమేణా బాగా ఎక్కువైపోతే వాంతులు మొదలౌతాయి.

పొట్టలో ఉన్న ఆఖరి నీటిబొట్టు కూడా వాంతి అయిపోతేగాని వాంతులు ఆగవు.వరసగా అవుతూనే ఉంటాయి.పొట్ట మొత్తం ఖాళీ అయిన తర్వాత తలనొప్పి శాంతిస్తుంది.ఇదంతా జరగడానికి దాదాపు ఒకరోజంతా పడుతుంది.

వేళకు తినకపోతే తలనొప్పి మొదలౌతుంది.

ఏదైనా రోజువారీ షెడ్యూల్ తప్పినా వస్తుంది.

రాత్రిపూట నిద్రమేలుకుంటే వచ్చేస్తుంది.

టెన్షన్ వచ్చినా మొదలౌతుంది.

నొప్పి వచ్చే సమయంలో కళ్ళు ఎర్రబడిపోతాయి.ముఖం ఉబ్బరించినట్లుగా అవుతుంది.కళ్ళవెంట ధారగా నీళ్ళు కారిపోతూ ఉంటాయి. చూచేవాళ్ళు ఏడుస్తున్నాడని అనుకుంటారు.తెలియనివాళ్ళు అడుగుతారు కూడా ఎందుకు ఏడుస్తున్నావు అని.

తలలో చెమటలు ఎక్కువగా పోస్తాయి.నిద్రలో కూడా తలలో చెమటలు ఉంటాయి.తలనొప్పి వచ్చే సమయంలో తలా,మెడా,ఛాతీల మీద చెమటలు పోస్తాయి.

రాత్రంతా నిద్రపోయి లేచినా ఉదయానికి ఫ్రెష్ గా ఉండదు.

ఉద్రేక-ఉపశమనములు (aggravation & amelioration)

>వాంతుల వల్ల పొట్ట పూర్తిగా ఖాళీ అవడం,గట్టి వత్తిడి,
<మలబద్దకం,జాగారం,టెన్షన్,పగటిపూట,కాంతి,శబ్దం,గాఢమైన వాసనలు,రొటీన్ మార్పు.

కోరికలు(Desires)

తిండి:--ఉప్పంటే ఇష్టం,స్వీట్లు కూడా ఇష్టమే(ఇప్పుడు మాత్రమె, మొదటినుంచీ లేదు),కాఫీ లాంటివి వేడిగా త్రాగితే బాగుంటుంది.ఆహారం తినేటప్పుడు చాలా గబగబా తినడం జరుగుతుంది.

వాతావరణం:--చల్లనిగాలి కావాలి.కానీ బాగా చలిగాలి అయితే తలనొప్పి వస్తుంది.చలికాలంలో కూడా చన్నీళ్ళు స్నానం చేస్తాడు.ఏమీ కాదు(hot constitution)

అలవాట్లు:--దురలవాట్లు ఏమీ లేవు.శుభ్రత ఎక్కువ.బ్రష్ కూడా మూడు లేదా నాలుగుసార్లు చేస్తాడు.స్నానం కూడా వీలైతే రోజుకు మూడు లేదా నాలుగుసార్లు చేస్తాడు(syphilitic miasm)

అసహ్యాలు(Aversions)

తిండి:--కారం ఇష్టం ఉండదు.మసాలా పదార్ధాలు పడవు(తింటే వాంతి అవుతుంది)

మానసికం:--గదిలో వస్తువులు చెల్లాచెదురుగా ఉంటె నచ్చదు.వెంటనే ఎక్కడి వస్తువును అక్కడ సర్దడం జరుగుతుంది.(Fastidious nature)

మానసిక లక్షణాలు(Mental symptoms):--

ఇంతకు ముందు బాగా కోపమూ ఇరిటేషనూ ఉండేవి.రైల్వేలో చేరక ముందు టీచర్ గా ఒక స్కూల్లో పని చేస్తున్నప్పుడు వాటిని బాగా కంట్రోల్ చేసుకోవడం అలవాటయ్యింది.అప్పటినుంచే తలనొప్పి కూడా ఎక్కువయ్యింది.

చాలా నిజాయితీపరుడు.ఆత్మాభిమానం ఎక్కువ.బాధ్యతగా ప్రవర్తిస్తాడు.చాలా పద్దతిగా ఉండే వ్యక్తి.

ఇంతకు ముందు వాడిన మందులు:--


ఇంగ్లీషు మందులు:--Migranil & Flonarine.ఫ్లోనరిన్ వాడిన తర్వాత బాగా లావెక్కడం జరిగింది.ఇందులో స్టేరాయిడ్ ఉన్నది.

హోమియోపతి:--ఒక హోమియో డాక్టర్ ఇచ్చిన బెల్లడోనా -30 మందు రోజుకు నాలుగు సార్లు వాడడం జరిగింది.తలనొప్పి తగ్గకపోగా భయంకరంగా ఎక్కువైంది.కనుక మళ్ళీ అదే డాక్టర్ దానిని యాంటీ డోట్ చెయ్యడం జరిగింది.ఆ తర్వాత హోమియో జోలికి పోలేదు.

పై లక్షణాలను సేకరించిన తర్వాత, ఎలా వీటిని ఎనలైజ్ చేసాను?ఏ మందులు ఇచ్చాను?ఆ తలనొప్పి ఎలా కంట్రోల్ అయింది? అన్న వివరాలు వచ్చే పోస్ట్ లో చదవండి.

(ఇంకా ఉంది)