Love the country you live in OR Live in the country you love

8, జనవరి 2014, బుధవారం

హీరో ఉదయ్ కిరణ్ జాతకం -ఒక పరిశీలన


నటుడు ఉదయకిరణ్ జాతకాన్ని పరిశీలిద్దాం.ఇతను 26-6-1980 న పుట్టినట్లు చెబుతున్నారు.జనన సమయం తెలియదు.కనుక పైపైన చూద్దాం.

ముఖ్యంగా రెండు గ్రహస్థితులు ఇతని జాతకంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి.ఒకటి చంద్రుని నీచస్థితి.రెండు కుజశనుల డిగ్రీసంయోగం.

ఆత్మకారకుడు కుజుడయ్యాడు. కారకాంశ ధనుస్సు.జైమిని సూత్రాల ప్రకారం లగ్న,కారకాంశల నుంచి తృతీయం మీద పాపగ్రహ ప్రభావం ఉంటే అసహజమరణం అని ఖచ్చితంగా చెప్పవచ్చు.ఈ సూత్రాన్ని కొన్ని వందలజాతకాల్లో గమనించడం జరిగింది. కొంతకాలం క్రితం ఆత్మహత్య చేసుకున్న హిందీనటి జియాఖాన్ జాతకంలో కూడా ఇదే యోగం ఉన్నది.

తృతీయమైన కుంభం మీద శనికుజుల డిగ్రీ దృష్టి ఉండటం స్పష్టంగా చూడవచ్చు.ఇదే ఈ జాతకానికి గల కార్మిక్ సిగ్నేచర్.వారిద్దరూ నవమంలో ఉండటం చూస్తే,వీరి వంశంలో ఈ శాపం ఉన్నదని స్పష్టంగా కనిపిస్తున్నది.ఇతని సోదరుడు కూడా ఇలాగే సూయిసైడ్ చేసుకున్నాడని అంటున్నారు.కనుక ఈ గ్రహయోగం ఖచ్చితంగా నిజమే అని తెలుస్తోంది.

చంద్రుని నుంచి నవమంలో రాహు బుధులూ,దశమంలో శనికుజ యోగమూ ఉండటం చూస్తే బలమైన శాపదోషం నిజమే అని రూడి అవుతున్నది.

శనికుజుల యోగం యాక్సిడెంట్లకూ అసహజ మరణాలకూ దారితీస్తుంది అని ఇంతకు ముందు లెక్కలేనన్ని సార్లు వ్రాశాను.ఆత్మహత్యలు చేసుకున్నవారి అనేక జాతకాల్లో ఈ యోగం ఉండటం గమనించాను.ఒకవేళ ఆత్మహత్య కాకపోతే వారికి యాక్సిడెంటల్ డెత్ ఉంటుంది.

"మంద మాందిభ్యాం జలోద్బంధనాదిభి:" అనే జైమినిమహర్షి సూత్రం ఇక్కడ ఖచ్చితంగా రుజువు కావడం చూడవచ్చు.తృతీయం మీద శని మాందుల ప్రభావం ఉంటే చెప్పిన మరణ కారణాలలో ఉద్బంధనం(ఉరి)కూడా ఒకటి.ఎన్నో వేల సంవత్సరాల క్రితం మహర్షి చెప్పిన సూత్రం ఇక్కడ నేటికీ రుజువు కావడం గమనార్హం.ఉరిపోసుకుని చనిపోయిన ప్రతి ఒక్కరి జాతకంలో ఈ గ్రహస్తితి ఖచ్చితంగా ఉండటం గమనించాను.

చంద్రుని నీచస్థితివల్ల సున్నిత మనస్తత్వంగాని తేలికగా ఆందోళనకు గురయ్యే తీరుగాని ఉంటుంది అన్నది అందరికీ తెలిసినదే.ఇతని జాతకంలో దీనికి తోడు చంద్రుని మీద వక్రశుక్రుడు,రాహువు,శనిగురువుల ప్రభావం ఉన్నది. చంద్రుడు ఇన్ని గ్రహాల ప్రభావానికి లోనైతే ఆ జాతకుని ఆలోచనలు ఒకేసారి ఎన్నోవైపులకు లాగబడతాయి.చివరకు ఎటూ తేల్చుకోలేక పోవడం జరుగుతుంది.

సూక్ష్మభూమికలలో వేచిచూస్తున్న కొన్ని దుష్టశక్తులకు ఇలాంటి మానసిక స్థితిలో ఉన్నమనుషులే కావాలి.ఇటువంటి డోలాయమాన సందిగ్ధస్థితిలో ఉండి డిప్రెషన్ కు గురైన వ్యక్తులను అవి తేలికగా లోబరుచుకుంటాయి. చాలాసార్లు ఈ శక్తుల ప్రోద్బలం వల్లనే ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది.అలాంటి సమయంలో ఉన్నవారికి ఆత్మహత్య తప్ప ఇంకేదారీ కనిపించదు.వారి మనస్సు అంతా దానిమీదే కేంద్రీకృతమై ఉంటుంది.అలా ఉండేలా ఆ శక్తులు చేస్తాయి.

అందుకే ఇలాంటివారిని వారి కుటుంబసభ్యులు నీడలా వెంట ఉండి కాపాడాలి.నిరంతర కౌన్సిలింగ్ వీరికి చాలా అవసరం.అనుక్షణం వెంట ఉండి ధైర్యాన్ని ఇస్తూ ఉండాలి.రక్షణ వలయంలా నిలబడాలి.అయితే ఖర్మ బాగాలేనప్పుడు(దీనినే టైం బాగాలేదు అనికూడా అంటాం) అదే కొరవడుతుంది.అయినవాళ్ళు అందరూ అప్పుడే దూరమౌతారు.అప్పుడు చీకటిశక్తులు వీరి మనస్సును తేలికగా డిప్రెషన్ లోకి తీసుకెళతాయి. ఆత్మహత్య వైపు ప్రేరేపిస్తాయి.

చంద్రుడు కేమద్రుమయోగంలో ఉండటం కూడా ఈ జాతకానికి ఒక చెడు సూచన.అంటే మానసికంగా ఇతనికి ఎటువంటి ఆధారమూ ఆసరా లేకపోయింది అని తెలుస్తోంది.పైగా కేతువు లోన్లీ ప్లానెట్ అయినవారు చాలా తేలికగా డిప్రెస్ అవుతారు.అలాంటివారిని ఏకాంతంలో వదిలేసి ఉంచకూడదు.

గోచార గ్రహస్తితి:

ఇతను ఆత్మహత్య చేసుకున్న రోజున గోచారబుధుడు జననకాల శనికుజులకు చాలాదగ్గరి కోణస్థితిలోకి వచ్చి యున్నాడు.అంటే,విపరీతమైన డిప్రెషన్ మరియు అసహజమైన హింసాత్మక సంఘటన జరగడానికి ప్రేరేపణ ఆరోజున గట్టిగా ఉన్నది.ఇంకా సరిగ్గా చెప్పాలంటే ఒకటి రెండురోజుల ముందే ఈ ధోరణి మొదలై ఉండాలి.ఎందుకంటే అప్పటికే గోచారబుధుని పైన ఈగ్రహాల బలీయమైన ప్రభావం పడటం మొదలైంది.కనుక ఒకటి రెండు రోజుల ముందునించే ఇతనిలో మూడ్స్ మారటం మొదలై ఉండాలి.

ఆత్మహత్యా జాతకాల్లో ఉన్న గ్రహస్తితులే ఇక్కడకూడా మళ్ళీ దర్శనం ఇస్తున్నాయి.ఇంతకు ముందు వ్రాసిన కొన్ని జాతకాల్లో ఈ విషయాలు చర్చించాను.కావలసినవారు పాత పోస్ట్ లు ఒక్కసారి తిరగేయ్యండి.

జ్యోతిష్య కారణాలను అలా ఉంచితే,ఈ సంఘటనకు దారితీసిన కారణాలు అందరికీ తెలుసు.నేను మళ్ళీ చెప్పనక్కరలేదు.ఒక వ్యక్తో ఒక కులమో మాత్రమే బ్రతకాలి బాగుపడాలి మిగిలినవారు పైకి రాకూడదు అన్న నీచ మనస్తత్వం మనుషులలో పోనంతవరకూ ఇలాంటి మొగ్గలు ప్రతి రంగంలోనూ రాలిపోతూనే ఉంటాయి.అందులోనూ సినిమారంగంలో ఉన్న కుళ్ళూ కుతంత్రాలూ రాజకీయాలూ అన్నీఇన్నీ కాదు.అదొక బురదగుంట.ఆ బురదలో ఇలాంటివారు కూరుకుపోయి కనుమరుగు కావడంలో వింతేముంది?

అందరూ మర్యాదస్తులూ,కదిలిస్తేచాలు నీతులు చెప్పేవారూ ఉన్న ఈలోకంలో ఒక మనిషి బ్రతకలేక తన నిండుప్రాణాన్ని చేజేతులా అంతం చేసుకున్నాడంటే అంతకంటే తలవంపులు ఆ సమాజానికి ఇంక వేరేమీ అవసరం లేదు.మనస్సాక్షి ఉన్న ప్రతి సినిమాపెద్దమనిషీ తల దించుకోవలసిన పరిస్తితి ఇది. కానీ ఇప్పుడు ఏం చేసినా ఉదయకిరణ్ ప్రాణం వెనక్కు రాదు.ఈ కుళ్ళు ప్రపంచాన్ని వెక్కిరిస్తూ అతని ఆత్మ ఏదో లోకాలకు చేరుకుంది.కాని అది అక్కడైనా శాంతిగా ఉంటుందా?దాని వ్యధ తీరెంతవరకూ ఆ ఆత్మ శాంతిగా ఉండదనే మన గ్రంధాలు చెబుతున్నాయి. దీనికి ఎవరు కారకులో వారికి ఈ ఉసురు తగలకుండా ఉంటుందా?

ఏమో? వేచిచూద్దాం.

అతని నిర్భాగ్య ఆత్మ శాంతించుగాక అని దైవాన్ని ప్రార్ధిద్దాం.