“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

28, జనవరి 2014, మంగళవారం

సాధనా సమ్మేళనం - కోటప్పకొండ-1



ఇప్పటివరకూ పంచవటి సాధనా సమ్మేళనాలు నాలుగు జరిగాయి. మొదట పూనూరు,రెండు హైదరాబాద్,మూడు మహానంది నాలుగు హైదరాబాద్ లో జరిగాయి.ఇప్పుడు ఐదవ సాధనాసమ్మేళనం కోటప్పకొండ మీద జరిగింది.ఈసారి కొద్దిమందితో మాత్రమే ఇది నిర్వహించబడింది.

నేను,రామన్నగారు,మదన్,రాజు నలుగురమే ఈసారి ఇందులో పాల్గొన్నాము.శనివారం ఉదయం ఏడున్నరకు మొదలైన కార్యక్రమం సోమవారం ఉదయం పదిగంటలకు ముగిసింది.

కోటప్పకొండ నరసరావుపేట దగ్గరలో ఉన్న శైవక్షేత్రం.దీని అసలుపేరు త్రికూటేశ్వర క్షేత్రం.దీనిని త్రికూటాద్రి అనికూడా అంటారు.ఇది దూరంనుంచి చూస్తె అరుణాచలంలాగా ఉంటుంది.ఇక్కడ పరమశివుడు జ్ఞానమూర్తిగా దక్షిణామూర్తి రూపంలో కొలువై ఉంటాడు.అమ్మవారికి ఇక్కడ ప్రత్యెక ఆలయం లేదు.ఇక్కడ మూడుకొండలు కలిసి ఉంటాయి.వీటిని బ్రహ్మ,విష్ణు,రుద్ర శిఖరాలంటారు.


వీటిలో ప్రస్తుతం అందరూ వెళ్ళే ఆలయం ఎడమవైపున ఉండే బ్రహ్మశిఖరం మీద ఉన్నది. ఇక్కడవరకూ రోడ్డుమార్గం ఉన్నది. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నపుడు కోడెల శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈక్షేత్రం బాగా వృద్ధిలోకి వచ్చింది. రోడ్డునిర్మాణం చేసి పైన మంచి వసతులు కల్పించారు.అంతకు ముందు అయితే కొండకోమ్ముకు ఎక్కాలంటే చాలా కష్టం అయ్యేది.ఇప్పుడు రోడ్డు ఉన్నది కనుక బ్రహ్మశిఖరం వరకూ తేలికగా కార్లలో బస్సుల్లో వెళ్ళవచ్చు.

మూడుకొండలలో కుడివైపున విష్ణుశిఖరం ఉంటుంది.దీనికి కొంచం కిందగా పాపనాశేశ్వరస్వామిగా శివుడు ఉన్నాడు.ఇక్కడకు మెట్లదారి లేదు. రాళ్ళమీదుగా పాకుకుంటూ దట్టమైన చెట్లపొదలలోనుంచి ఒక అరకిలోమీటరు పైకి ఎక్కవలసి ఉంటుంది.దారిలో నరమానవుడు కనిపించడు.గుబురుగా కప్పేస్తున్న చెట్లమధ్యలోనుంచి పాములా పాక్కుంటూ కొండను ఎక్కాలి.

మూడవది మధ్యలో ఉన్న రుద్రశిఖరం.దీనిపైన కొండకొమ్మున పాత శివలింగం ఉన్నది.ఇక్కడకు కూడా మెట్లదారి లేదు.బ్రహ్మశిఖరం వద్దనుంచి రాళ్ళమీదుగా ఎక్కుతూ దాదాపు రెండు కిలోమీటర్లు పైనున్న శిఖరానికి పోవాలి.ఇదీ కష్టమే.పైన ఇప్పుడు ఒక మంటపం కట్టినారు. బ్రహ్మశిఖరం పైన ఉన్న పుట్ట పక్కనుంచి ఎగుడుదిగుడు కాలి బాటలో రాళ్ళమీదుగా నడుస్తూ దూకుతూ పాకుతూ వెళ్ళవలసి ఉంటుంది.

ఉదయం పదిగంటలకు త్రికూటేశ్వర స్వామి దర్శనం చేసుకొని పుట్ట పక్కగా ఉన్న కాలిబాటలోనుంచి రుద్రశిఖరంవైపు ఎక్కడం ప్రారంభించాము.మెట్లు లేవు. రాళ్ళ మీదుగా ఎక్కుతూ పోవాలి. అక్కడక్కడా ఆగుతూ అలుపు తీర్చుకుంటూ నడక సాగించి ఒక గంటన్నర తర్వాత కొండకొమ్ముకు చేరుకున్నాము. నెత్తిమీద ఇసుక బస్తాలు మోసుకుంటూ కొండ కొమ్ముకు వెళుతున్న పనివాళ్ళు మాకు దారిలో కనిపించారు.మామూలుగా నడకే కష్టంగా ఉంటె వాళ్ళు ఇసుక బస్తాలు మోసుకుంటూ కర్రపోటుతో ఎక్కుతున్నారు.అలుపు లేకుండా ఉండటానికి ఫాస్ట్ బీట్ సినిమా పాటలు సెల్ లో వింటూ కొండ ఎక్కుతున్నారు.


'రామేశ్వరం పోయినా ఏదో తప్పనట్లు, నిశ్శబ్దాన్ని కోరుకుంటూ మనం ఇంత ఎత్తుకు వచ్చినా ఇక్కడకూడా సినిమా పాటలు మనల్ని వెంటాడుతూ ఉన్నాయే' అన్నాను.

రాజు కూడా జ్యోతిష్కుడే గనుక వారిని బాగా గమనించి ఇలా అన్నాడు.



'సార్.వీళ్ళ జాతకాలలో శనిబుధుల మధ్యన శుభదృష్టి ఉండి ఉంటుంది. అందుకే ఇలాంటి సినిమా పాటలు వింటూ కాయకష్టంతో కొండ ఎక్కుతున్నారు.పైగా ఈరోజు శనివారం కూడా.'

నేను మెచ్చుకోలుగా అతనివైపు చూచాను.జ్యోతిష్య విద్యార్ధికి ఇలాంటి పరిశీలన చాలా అవసరం.దీనివల్లనే స్ఫురణశక్తి అనేది జ్యోతిష్కునిలో క్రమేణా మేల్కొంటుంది.

'బుధుడే కాదు.శుక్రుడు కూడా కావచ్చు.ఎందుకంటే సినిమా పాటలకు శుక్రుడే కదా కారకుడు' అన్నాను.

ఇంతలో ఒకతను తన సెల్ లో శివస్తోత్రాలు వింటూ కొండ ఎక్కుతూ కనిపించాడు.అతన్ని గమనించి ఇలా చెప్పాను.
'రాజు.ఇతని జాతకంలో గురు సంబంధం కూడా ఉండి ఉంటుంది. ఎందుకంటే మిగతా వాళ్ళు చెత్త పాటలు వింటున్నారు.ఇతనొక్కడే భక్తి పాటలు వింటున్నాడు.ఈ తేడాను గమనించావా?' అడిగాను.

అవునంటూ రాజు తలూపాడు.

అలుపు తీర్చుకోవడానికి ఒకచోట కూచున్నాము.


'సార్.త్రికూటం గురించి కొంచం చెప్పండి' మదన్ అడిగాడు.

'మదన్.కంఠం పైది వాగ్భవకూటం. కంఠంనుంచి కటివరకూ కామరాజ కూటం. కటినుంచి క్రింద శక్తికూటం. 'శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖపంకజా, కంఠాధ కటిపర్యంత మధ్యకూట స్వరూపిణీ,శక్తికూటైకతాపన్న కట్యధోభాగధారిణీ మూలమంత్రాత్మికా మూలకూటత్రయ కళేబరా' అనే లలితానామాలు దీనినే సూచిస్తున్నవి.

శిరస్సుపైది అంబరం.అక్కడ అంతా శూన్యమే.త్రికూటమనబడే భ్రూమధ్యం లోనే ఇడాపింగళా సుషుమ్నానాడులు కలుస్తాయి.అదే త్రివేణీ సంగమం. అక్కడనుంచే కోటి కోరికలు పుట్టుకొస్తాయి.అందుకే 'త్రికూటా కామకోటికా' అని కూడా లలిత అంటుంది.'

'త్రికూటేశ్వరుడు అంటే మూడు కూటములకూ అధిపతి అని అర్ధమా?' అడిగాడు మదన్.

'అంతేగా మరి.ఈ శబ్దం త్రిగుణాతీత పరబ్రహ్మ వాచకం.త్రికూటేశ్వరుడు అనే పేరు క్రమేణా రూపాంతరం చెంది కోటేశ్వరుడు అయింది.అదే కోటప్పకొండ లేదా కోటయ్యకొండ అయింది.గుంటూరు జిల్లాలో తరచుగా వినిపించే కోటేశ్వరరావు అనే పేరు ఇదే.' అన్నాను.

ఈ ఆలయాల గురించి ఒక గాధ వినిపిస్తుంది.అందరూ చెప్పే కధ ఏమంటే,ఇక్కడ గొల్లభామ అని ఒకామె ఉండేది.ఆమె ఈ కొండమీద మేకలు కాచుకుంటూ ఉండేది.శిఖరం మీద ఉన్న శివునికి ఈమె రోజూ పాలు ఇస్తూ ఉండేది.కాలక్రమేనా ఈమెకు వివాహమై గర్భం దాల్చింది.కనుక కొండ ఎక్కలేక శివుడినే క్రిందకు వచ్చి నేలమీద ఉండమని కోరుకున్నది.ఆయన సరేనని ఒక నియమం పెట్టినాడు.

నీవు వెనక్కు తిరిగి చూడకుండా కొండ దిగి వెళుతూ ఉండు.నేను నీ వెనుకే నడుస్తూ వస్తుంటాను.నీవు వెనక్కు తిరిగితే మాత్రం అక్కడే నేను ఉండిపోతాను అని చెప్పినాడు.ఆమె సరే అని కొండ దిగుతూ ఉన్నది. వెనుకనుంచి ఏవేవో భయంకరమైన శబ్దాలు వినిపిస్తుంటే ఏమిటా అని వెనక్కు తిరిగి చూచింది.అప్పటికి వాళ్ళు రుద్రశిఖరం పైనుంచి బ్రహ్మశిఖరం వరకూ వచ్చినారు.ఆమె వెనక్కు తిరిగి చూచింది గనుక అక్కడే శివుడు లింగరూపం ధరించి శిల అయిపోయినాడు.అని ఒక గాధ వినిపిస్తుంది.

మన పురాణాలు,ప్రాంతీయ కథలలో చరిత్రా,మార్మిక విషయాలూ,ప్రాంతీయ నమ్మకాలూ అన్నీ కలగలసి ఏది ఏదో చెప్పలేనంతగా పెనవేసుకుని ఉంటాయి.అందుకే వీటిలో ఏది నిజమో ఏది కాదో చెప్పలేము.కాకుంటే కొంత ప్రయత్నం చెయ్యవచ్చు.

శివుడు మానవనేత్రాలకు కనిపించటం దుర్లభం. కొండకొమ్ము మీద తపస్సులో ఉన్న శివునికి గొల్లభామ రోజూ పాలు సరఫరా చెయ్యడం అనేది సంభవం కాదు.పరమశివునికి పాలు అవసరం లేదు.కాకపోతే ఒకటి జరిగి ఉండవచ్చు.పాతకాలంలో రుద్రశిఖరం మీద ఒక యోగి తపస్సు చేసినాడని అంటారు.ఈ కొండశిఖరం మీద తపస్సు చేసిన యోగీశ్వరుడిని ఈమె మేకలు కాచుకునే సమయంలో చూచి అతనికి ఆహారంగా మేకపాలను ఇచ్చి ఉండవచ్చు.పాతకాలంలో ఇలాంటి అమాయక భక్తులు ఎందఱో ఉండేవారు. బుద్ధునికి కూడా సుజాత అనే యువతి పాయసాన్ని ఇచ్చినట్లు గాధ ఉన్నది. అలా రోజూ చేస్తూ ఉండగా కొన్నాళ్ళకు ఈమె కొండ ఎక్కలేని పరిస్తితిలో ఉన్నపుడు ఆయననే క్రిందకు వచ్చి ఉండమని కోరి ఉండవచ్చు.


సామాన్య జనసహవాసాన్ని తట్టుకోలేని ఆయన పూర్తిగా కిందకు రాకుండా బ్రహ్మశిఖరం వరకూ వచ్చి అక్కడే కొంతకాలం తపస్సులో ఉండి తన శరీరాన్ని వదలిపెట్టి శివైక్యం చెంది ఉండవచ్చు.ఆ సమాధిమీద శివలింగప్రతిష్ట జరిగి ఉండవచ్చు. ఎందుకంటే శైవంలో మహనీయుల సమాధులమీద శివలింగాన్ని ప్రతిష్టించడం ఆచారంగా ఉన్నది. కాలక్రమేణా ప్రాంతీయగాధలు దీనితో కలసిపోయి ఇప్పుడు మనం వినే కధ రూపుదిద్దుకుని ఉండవచ్చు.

ఇలా మాట్లాడుకుంటూ దాదాపు 1500 అడుగుల ఎత్తున ఉన్న రుద్రశిఖరం చేరుకున్నాము. అక్కడనుంచి చూస్తె చుట్టుపక్కల ఎన్నో ఊళ్లు కనిపిస్తున్నాయి. పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నరసరావుపేట కూడా దూరంగా కనిపిస్తున్నది.శిఖరం పైన ఒక చిన్న దేవాలయమూ అందులో శివలింగమూ ఉన్నాయి.అక్కడ ఒక మంటపం నిర్మాణంలో ఉన్నది. దానికోసమే పనివాళ్ళు క్రిందనుంచి ఇసుక బస్తాలు మోసుకొస్తున్నారు.

అంతపైకి ఎక్కి వచ్చినందుకు బాగా అలుపు వచ్చింది.మంటపంలో కూలబడ్డాము.


ఆ మంటపంలో నల్లగా తుమ్మమొద్దులా ఉన్న ఒక కాంట్రాక్టర్ కామోసు కూచుని ఉన్నాడు.అతను కూడా సినిమా పాటలు సెల్ లో పెట్టుకుని వింటున్నాడు.'హతోస్మి' అనిపించింది.'ఇంత ఎత్తుకు ఎక్కి వస్తే ప్రశాంతతను భగ్నం చేస్తూ ఇక్కడ కూడా తయారయ్యావా నాయనా?' అనుకున్నాను.

కాసేపు అక్కడ కూచున్న తర్వాత 'లోపలకు వెళ్లి శివలింగాన్ని దర్శనం చేసుకోండి.మీకు వీలైతే అభిషేకం కూడా మీరే చేసుకోవచ్చు' అని ఆ కాంట్రాక్టర్ అన్నాడు.

లోనికి వెళ్లి చూద్దామని లేచాను.

'చొక్కా విప్పి లోపలకు వెళ్ళాలి' అని కాంట్రాక్టర్ అన్నాడు.

నాకు నవ్వొచ్చింది.

'పంచె ఏం పాపం చేసింది?' అన్న మాట నా నోటివరకూ వచ్చి ఆగిపోయింది.

అతనికి ఏమీ సమాధానం చెప్పకుండా చొక్కాతోనే లోపలకు వెళ్లి లింగానికి తలను తాకించి ప్రణామం చేసి బయటకు వచ్చాను.కాంట్రాక్టర్ ఏదో గొణగడం లీలగా వినిపిస్తున్నది.అతని ముఖం చూస్తె నామీద బాగా కోపం వచ్చినట్లు అర్ధమైంది.

'చెప్పినా కూడా వినకుండా చొక్కాతోనే లోపలికి వెళుతున్నాడు.చూడబోతే పెద్దాయనలాగా ఉన్నాడు. ఏంటిది?'అని విసుక్కున్నాడని తర్వాత క్రిందకు దిగేసమయంలో రాజు మాతో అన్నాడు.నవ్వుకున్నాను.మొత్తానికి కొండకొమ్ముమీద ప్రశాంత మౌనధ్యానంలో గడపవలసిన సమయం అనవసరమైన మాటలలో వృధా అయిపోయింది.

చాలాసార్లు ఇలాగే అవుతూ ఉంటుంది.అత్యున్నతమైన దాని పక్కనే అతి నిమ్నమైనదీ ఉంటుంది. నిధిని చుట్టుకొని విషసర్పం ఉన్నట్లు.

'కొండ పక్కనే లోయ ఉంటుంది' అని చైనీస్ తత్వవేత్త లావోజు అంటాడు.భగవంతుని ముఖద్వారం లో కూడా మనకోసం సైతాన్ ఎదురు చూస్తూనే ఉంటాడు.చాలామంది సత్యానికి ఒక్క అడుగు దూరంలోకి వచ్చి అక్కణ్ణించి వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు.ఇది లోక సహజమే.

అయితే శబ్దం నిశ్శబ్దాన్ని భగ్నం చెయ్యలేదు.దానికి ఆధారమైన ఆకాశాన్ని అదేం చెయ్యగలదు?శబ్దం కొంచంసేపు ఉండి తర్వాత లయిస్తుంది. దానిముందూ వెనుకా కూడా స్థిరంగా నిలిచి ఉండేది నిశ్శబ్దమే.అంతరిక నిశ్శబ్దం అనుభవంలో ఉన్నవారిని బయటి శబ్దాలు ఏమీ చలింపచెయ్యలేవు.


ఇంకాసేపు అక్కడే కూచుని క్రిందకు దిగడం మొదలుపెట్టాము.మదన్ చెప్పులు వేసుకుని రాలేదు. దిగేటప్పుడు కోసు రాళ్ళు కాళ్ళకు గుచ్చుకుని చాలా బాధ పడ్డాడు.అందుకని నా చెప్పులు అతనికిచ్చాను.కొండరాళ్ళమీద నడిచేటప్పుడు అడుగులు వెయ్యడంలో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి.అవి పాటించకపోతే కాళ్ళు బొబ్బలు వస్తాయి.లేదా స్లిప్ అయి కిందపడే ప్రమాదం ఉంటుంది.అయితే ఎక్కేటప్పుడు ఉన్న అలుపు దిగేటప్పుడు లేదు.క్రిందకు దిగేటప్పుడు పాటలు వినిపించ లేదు.ఎందుకంటే పనివాళ్ళు మూటలు పైన పడేసి వెంటనే క్రిందకు వెళ్ళిపోయారు.అప్పుడు రాజుతో ఇలా చెప్పాను.

'రాజు.ఇందాక మనం కొండ మీదకు ఎక్కేటప్పుడు బుధహోర నడుస్తున్నది. కనుక ఆ చెత్త పాటలు వినిపించాయి.ఇప్పుడు బుధహోర అయిపొయింది. చంద్రహార నడుస్తున్నది.శనిలో చంద్రుడు అంటే వైరాగ్యం,నిశ్శబ్దం.అందుకే ఆ పనివాళ్ళు ఇప్పుడు ఎవరూ మనకు తారసపడటం లేదు.మనం కూడా పూర్తి నిశ్శబ్దంగా వైరాగ్య భావాలతో నడక సాగిస్తున్నాం.'

'అవును సార్.హోరలు చాలా బాగా పనిచేస్తాయి.ఇంతకూ ముందు కూడా మీరు హోరలను ఉపయోగించి మంచి మంచి ప్రిడిక్షన్స్ ఇవ్వడం నేను గమనించాను.' అన్నాడు.


'అవును రాజు.వాడుకోవడం తెలిస్తే హోరలు చాలా బాగా ఉపయోగిస్తాయి.' అన్నాను.

బ్రహ్మశిఖరం వరకూ దిగేసరికి మధ్యాన్నం రెండు అయింది.అక్కడ ఉన్న ఏకైక హోటల్లో ఏదో భోజనం చేశామనిపించి గదులకు బయల్దేరాము.కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని సాయంత్రం నాలుగుకు లేచి మళ్ళీ సంచారానికి బయలుదేరుదామని  అనుకుని నిద్రకు ఉపక్రమించాము.

(ఇంకా ఉంది)