నిజమైన అదృష్టవంతులు మాత్రమే మాతో చేయి కలుపుతారు

11, జులై 2013, గురువారం

మానవుని అహంకారం-మరికొన్ని పద్యములు

ఈరోజు ఆశువుగా వచ్చిన కొన్ని పద్యాలు ఇక్కడ ఇస్తున్నాను.'కందం చెప్పగలవాడే కవి' అన్న సామెత వల్లనో ఏమో చాలావరకూ కందపద్యాలే పలికాయి.చివరలో రెండు మాత్రం ఆటవెలది పద్యాలు.అర్ధం సులభగ్రాహ్యమే అయినప్పటికీ ఒక మిత్రురాలి విజ్ఞప్తి మేరకు దానిని కూడా వ్రాశాను.

1.
అహమున జిక్కిన మనుజుల
బహుపూజల ఫలితమెల్ల బూదిని గలియున్  
ఇహపరముల జెడిపోదురు
మహనీయత నందబోరు మహిలో సత్యా

అహంతో విర్రవీగే మనుషులు ఎన్నెన్ని పూజలు చేసినా వారికి ఫలితం అంటూ ఏమీ ఉండదు.వాటి ఫలితం అంతా బూడిదలో కలిసిపోతుంది. అహంకారులు ఇహంలోనూ పరంలోనూ కూడా ఏమీ సాధించలేరు. మహనీయులు కాలేరు.

2.
యాత్రలు కల్లలు వినుమా
పాత్రత లేనట్టి పాట్లు పాడగు వెతలున్
గాత్రమ్మున శుద్ధి మరచి
ఆత్రమ్ముగ పాడబోవు యాతన సత్యా

అహంకారంతో యాత్రలు చెయ్యడం వృధాప్రయాస.పాత్రతను బట్టి మనకు ఫలం దక్కుతుంది గాని,అది లేకపోతే మనం పడే పాట్లన్నీ చివరికి ఏమీ ఫలితాన్ని ఇవ్వలేక అగచాట్లుగా మారతాయి.పాత్రత లేకుండా యాత్రలు చేసేవారు గాత్రశుద్ది లేకుండా గానం చెయ్యాలని ఆశపడే ఆత్రగాళ్ళ మాదిరి ఉంటారు.

3.
సతులందరు మాయయనెడి
సుతులందరు ఋణము లనెడి సత్యము వినుమా
మితిమీరిన యాశ విడచి
మతిచెదరని యోగనిష్ట మరుగర సత్యా

భార్యాపిల్లలు బంధువులు స్నేహితులు ఋణానుబంధాలన్న సంగతి గ్రహించు.ఆశను బొత్తిగా విడచిపెట్టు.స్థిరమైన మనస్సుతో యోగనిష్టుడవై ఉండు.

4.
ఆశల రుచులను మరగుచు
పాశంబుల బద్ధుడౌచు పడియుండు నరున్
ఆశల బాపును కర్మము 
పాశంబుల దీర్చు మిత్తి పరుగున సత్యా

ఆశల రుచిని మరగి,అష్టపాశములలో చిక్కి కదలలేని మనుష్యులకు వారివారి కర్మమే బుద్ధి గరపుతుంది.చివరకు మరణమే వారి బంధాలను విడదీస్తుంది.

5.
అహమున జిక్కెను సర్వము
అహరహమును నందులోనె యమరుచు నడచున్ 
అహమన్న మిధ్య జూడగ 
ఇహమందున నిదియె వింత నెరుగర సత్యా 

లోకం మొత్తం 'అహం' అనే ఉచ్చులో చిక్కి నిత్యమూ అందులోనే అఘోరిస్తూ ఉన్నది.ఇంతా చూస్తె 'అహం' అనేది అసలు లేనేలేదు.అదొక ఎండమావి. ప్రపంచంలో ఇదే పెద్ద వింత.దీనిని మించిన వింత లేనేలేదు.

6.
ఇహమందున పరమందున
అహమే యసలైన శత్రువనుటను వినుమా
అహమంత విచ్చిపోవగ
అహమే మిగులును జివరకు ననువుగ సత్యా

ఈలోకంలోగాని పరలోకంలోగాని మనిషికి అహంకారమే అతి పెద్ద శత్రువు. ఈ అహంకారం మొత్తం నాశనమైతే చివరికి సత్యమైన తానే మిగులుతాడు.

7.
ఒరులెవ్వరు లేరిచ్చట 
పరులను మదినెంచి జూడ పాపము గలుగున్ 
గురిగా జూచెడి చూపున 
సరియగు యాత్మగనె దోచు సర్వము సత్యా

ఈ ప్రపంచంలో పరాయివారంటూ ఎవ్వరూ లేరు.పరులు అనుకోవడం పాపమే.గురిగా సరిగా చూచితే సర్వం ఆత్మమయంగానే కనిపిస్తుంది.

8.
యమ నియమపు నీమమ్ముల
సమయోచితముగ దెలియుచు సాధన రీతుల్
అమనస్కపు మార్గమ్మున
విమలాత్మను బొంది జూడు వింతను సత్యా

యమనియమాది విధులను చక్కగా పాటిస్తూ,సాధనా రీతులను సరిగ్గా అనుసరిస్తూ, అమనస్క యోగాన్ని సాధించి,కల్మషం లేని ఆత్మను అనుభవంలో పొంది, అప్పుడు కనిపించే అసలైన వింతను చూడాలి.

9.
ఒడలంతయు బూదినలది 
మడిగట్టుక బూజ సేయు మనుజుని మదిలో .
దడవుచు వాసనలుండిన
అడుగున బురదల చెరువగు నతడిక సత్యా

ఒకడు ఒళ్లంతా బూడిద పూసుకుని మడి కట్టుకుని పూజలు చేసినా,అతని అంతరంగంలో వాసనలు ఉంటే ఆ పూజల ఫలితం సున్నాయే.అడుగున బురద ఉంచుకుని పైపైన మాత్రం మంచి నీరు కలిగిఉండే చెరువు మాదిరి ఈ వ్యవహారం ఉంటుంది.

10.
లోకాచారము లెల్లను
నాకటముగ మీరవలయు నీభువి యందున్
లోకుల మాటలు జూడగ
వాకిట దివ్వెలు కడమను జీకటి సత్యా 

సాధకులు లోకాన్ని ఎప్పుడూ లెక్క చెయ్యకూడదు.దానిని సునాయాసంగా అధిగమించాలి.కారణం ఏమంటే,వాకిటిలో మాత్రం దీపం ఉండి,ఇంటి లోపల అంతా చీకటి ఉన్నట్లుగా లోకుల మాటలు ఉంటాయి.అవి పైపై పూతలు. కనుక వాటిని లెక్కించ పనిలేదు.

11.
వదరుబోతులెల్ల నొకచోట గుమిగూడి 
శాస్త్ర చర్చయనుచు సాగదీయ 
ఎవనికైనగాని యనుభవమ్మది లేక
రచ్చ యగును గాని రక్తి నిడదు

అనుభవం లేని వాగుడుకాయలందరూ ఒకచోట చేరి శాస్త్రచర్చ చెయ్యబోతే అది చివరికి రచ్చ అవడమే గాని ఫలితం ఉండదు.ఏకాభిప్రాయమూ రాదు.

12.
తిండి కొరకు నేల దిరిగేటి జీవుండు
మూడునాళ్ళ కొరకు మోహమంది
తానె ఘనుడ నంచు తైతక్క లాడంగ
పంచభూత చయము పక్కుమనియె

ప్రపంచంలో ఎంతటి మానవుడైనా విర్రవీగవలసిన అవసరం ఏమాత్రమూ  లేదు.ఎందుకంటే,ప్రతి మనిషీ బతుకుతున్నది తిండికోసం మాత్రమే.తినితిని చివరికి చావడం తప్ప ఇక్కడ ఎవరైనా ఉద్దరిస్తున్నది ఏమీలేదు. ఒకవేళ ఎవడైనా అలా అహంకరిస్తే పంచభూతాలు వాడిని చూచి పక్కుమని నవ్వుతాయి.ఎందుకంటే,వాటి కళ్ళముందు ఇలాంటి అల్పులైన నరులు కోటానుకోట్లు గతించారు.అవి శాశ్వతములు.మానవులు కాదు.