“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

9, ఆగస్టు 2013, శుక్రవారం

శ్రావణ శుక్ల పాడ్యమి-దేశజాతకం

కొన్ని ముఖ్యమైన పనులలో ఉండటం వల్ల పాడ్యమి ముందే వ్రాయవలసిన దేశజాతకం తృతీయనాడు వ్రాస్తున్నాను.

ఈ మాసంలో దేశ పరిస్తితి,రాష్ట్ర పరిస్తితి ఎలా ఉందో జ్యోతిష్య పరంగా గమనిద్దాం.పాడ్యమి నాటి కుండలి ఇక్కడ చూడవచ్చు.

లగ్నం దేశలగ్నమే అయిన వృషభం అయింది.చక్రంలో గ్రహాలు మొత్తం కాలసర్ప యోగపరిధిలో ఉన్నవి.

దాదాపు పదహైదు వందల ఏండ్ల క్రితం వరాహమిహిరాచార్యుడు కాలసర్ప యోగాన్ని గురించి చెబుతూ "కాలసర్పాఖ్య యోగోయం రాజా రాష్ట్ర వినాశనం" అన్నాడు. ఈ యోగం పట్టినపుడు రాజూ రాష్ట్రమూ ఈ రెండికీ కీడు మూడుతుంది.అన్నాడు.అది అక్షరాలా జరుగుతూ ఉండటం మన కళ్ళెదురుగా చూస్తున్నాం.

తృతీయంలో అమావాస్య వల్ల కమ్యూనికేషన్ చాలా ఘోరంగా దెబ్బ తింటుంది.ఎవరు ఏమి చెబుతున్నారో ఏమి మాట్లాడుతున్నారో ఎవరికీ అర్ధం కాదు పట్టదు.ఎవరి స్వార్ధం మేరకు వారు మాట్లాడుతూ ఉంటారు.బయటకు చెప్పేది వేరు.లోపల ఉండే ఉద్దేశాలు వేరుగా ఉంటాయి.

వీరితో బుధుని కలయికవల్ల ఎవరి వాదనను వారు సమర్ధవంతంగా వినిపిస్తారు.తెలివిగా మాట్లాడతారు.కాని అంతర్లీనంగా రాష్ట్ర ప్రయోజనం కంటే ఎవరికి వారికి వ్యక్తిగత స్వార్ధమే బలమైన అంశంగా పనిచేస్తుంది.

రాహుకేతు ఇరుసు  6-12 భావాలలో పడింది గనుక రాష్ట్రానికి శత్రుపీడ ఎక్కువగా ఉంటుంది.కొందరు బహిరంగ శత్రువులు,మరికొందరు రహస్య శత్రువుల మధ్యన రాష్ట్రం విలవిలలాడుతుంది.గొడవలు గందరగోళాలు జరగడం ప్రతిరోజూ మనం చూస్తూనే ఉన్నాం.12 నుంచి 18 వరకూ,మళ్ళీ 24,25 తేదీలలోనూ ఈ గొడవలు బాగా ఎక్కువగా ఉంటాయి.జనానికి చాలా విసుగూ చికాకూ కలుగుతాయి.

చతుర్దంలో శుక్రస్తితి వల్ల జనజీవనంలో పెద్దగా విధ్వంసం ఏమీ జరుగదు.కానీ ఆందోళనలు జరుగుతాయి.ప్రజలకు ఇబ్బందులు ఉంటాయి.

రెండింట గురుకుజుల వల్ల నాయకులు ఒకరినొకరు ఇష్టం వచ్చినట్లు తీవ్రంగా తిట్టుకుంటారు.ఆర్ధికరంగం అతలాకుతలం అవుతుంది.ఇక్కడ నాలుగు ఆరూడాలు కలవడం వల్ల అనవసరమైన వాగ్వాదాలూ పరస్పర దూషణలూ సర్వసాధారణంగా ఉంటాయి.కాని చివరకు వీరి వాగుడుని బట్టి జరిగేది ఏమీ ఉండదు.

  • 7 నుంచి 9 వరకు గొడవలు గోలా ఉంటాయి;దూషణల పర్వం సాగుతుంది.
  • 10 నుంచి 13 లోపల ఒక నష్టం జరుగుతుంది.ప్రజలూ నాయకులూ పిచ్చేక్కినట్లు తిట్టుకుంటారు.
  • 14 నుంచి 19 వరకూ జనాభిప్రాయానికి బలం వస్తుంది.
  • 20 నుంచి 23 వరకూ దూషణల పర్వం మళ్ళీ పుంజుకుంటుంది.
  • 24-25 తేదీలలో ప్రగల్భాలు ఎక్కువౌతాయి.
  • 26 నుంచి 30 వరకూ శత్రుపీడ ఎక్కువౌతుంది.
  • 31 నుంచి 3 వరకూ చర్చలవల్ల కొంత మేలు జరుగుతుంది.
  • 4 నుంచి 6 వరకూ మళ్ళీ శత్రుపీడా,స్తంభనా  ఉంటాయి.