“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

20, ఫిబ్రవరి 2013, బుధవారం

త్యాగయ్య నాదోపాసన -2

త్యాగయ్య శ్రీరాముని పరమ భక్తుడు.అనవరతమూ శ్రీరామధ్యానంలో తపించి పరవశించిన మహనీయుడు.ఆయన జపించి ధ్యానించి నిత్యమూ కీర్తించిన రాముడు ఎట్టివాడు?  

రఘువంశ తిలకుడైన శ్రీరాముని త్యాగయ్య ఆరాధించిన మాట నిజమే.కాని త్యాగయ్య ఒక మానవ మహారాజును ఆరాధించినవాడు కాదు.త్యాగయ్య దృష్టిలో శ్రీరాముడు రఘువంశంలో పుట్టిన ఒక రాజు మాత్రమె కాదు. శ్రీరాముడు ఒక సామాన్య రాజే అయితే త్యాగయ్య ఆయన్ను ఆరాదించేవాడే కాదు.త్యాగయ్య దృష్టిలో శ్రీరాముడుత్త మానవమాత్రుడు కాడు. మనోవాగతీతమై,వేద ప్రతిపాదితమైన నిరాకార నిర్గుణ పరబ్రహ్మమే దిగివచ్చి రూపుదాల్చి శ్రీరాముని రూపాన్ని ధరించి భక్తులకోరకు సగుణదైవమై భూమిపైన నడయాడిందని త్యాగయ్య నమ్మిక. అది త్యాగయ్య ఒక్కని నమ్మకం మాత్రమే కాదు.ప్రాచీనకాలం నుండి ఎందఱో మహర్షుల, పరమ భక్తుల పవిత్రనమ్మకం అది.అంతేకాదు.ఈగడ్డ మీద జన్మించిన భారతీయుడైన ప్రతివాడి విశ్వాసం కూడా అదే.అది ఉత్త విశ్వాసం మాత్రమె కాదు.పరమ సత్యం కూడా.

త్యాగయ్య నాదోపాసకుడు.ఆయన ఆరాధించిన రాముడు నాదశరీరుడు. ప్రణవస్వరూపుడు.అనేక కీర్తనలలో ఆయన ఇదే విషయాన్ని చూచాయగానూ,కొన్ని చోట్ల చాలా స్పష్టంగానూ చెప్తాడు.పరబ్రహ్మమును ప్రణవనాదముగా ఉపాసించే విధానం మన సాంప్రదాయంలో వేదకాలం నుంచి ఉన్నది. త్యాగయ్య ఆ ప్రాచీన మార్గానికి రామభక్తిని జోడించి తనదైన బాణీలో ఒక నూతన ఒరవడిని ఇచ్చాడు.అయితే ఈ క్రమంలో అనేకమంది ప్రాచీన భక్తయోగుల మార్గాన్నే ఆయన కూడా అనుసరించాడు.

అఠాణ రాగంలో పాడిన 'శ్రీప ప్రియ సంగీతోపాసన చేయవే ఓ మనసా' అనే కృతిలో తాపసజనులకు సాధకులకు ధనమైనట్టిది, ఆద్యాత్మిక అధిభౌతిక అధిదైవికములనబడే త్రితాపములను హరించునట్టిది, అయిన సప్తస్వర నాదమయమైన సంగీతోపాసన చేయమని అట్టి ఉపాసన సర్వాంతర్యామి యగు శ్రీహరికి మిక్కిలి ప్రియమైనదని అంటూ తన మనసుకు నచ్చ చెబుతాడు.

(అఠాణ రాగం)
శ్రీప ప్రియ సంగీతోపాసన చేయవే ఓ మనసా

తాపసజన మానసధనమే 
త్రితాప రహిత సప్తస్వర చారి                                                

రంజింప జేసెడు రాగంబులు
మంగళమగు యవతారములెత్తి 
మంజీరము ఘల్లని నటించు 
మహిమ తెలియు త్యాగరాజ నుతుడగు                              

'రంజింప చేసెడు రాగంబులు మంగళమగు నవతారములెత్తి' అనే పాదంలో మనస్సును రంజింప చేయగలిగిన అనేక రాగములను అనాహత నాదస్వరూపుడగు నారాయణునికి గల అనేక అవతారములుగా భావించి  రసమయమైనట్టి ఒక సాధనారహస్యాన్ని తన మనసుకే గాక మనకు కూడా బోధపరుస్తాడు త్యాగయ్య. అనాహత నాదమును పరబ్రహ్మముగానూ వివిధ రాగములను ఆ పరబ్రహ్మముయొక్క అవతారములుగానూ భావిస్తాడు త్యాగయ్య. నిరాకారుడైన భగవంతుడు సాకారుడై అవతారముగా దిగిరావడం ఎంత వింతయో,అనాహతనాదము (unstruck sound) వివిధ నాదములుగా రాగములుగా మారి దిగివచ్చి మానవకర్ణములకు వినిపించుటకూడా అంతే వింత.ఈ రెంటికి ఉన్న సారూప్యమును మనకు ఈ కీర్తనలో చూపించుతాడు సద్గురు త్యాగరాజు.నిరాకార సాకారస్థాయిలను అనాహత ఆహత నాదములతో పోలిక చెప్పి నిరూపించుట ఒక అద్భుతమైన అనుభవసత్యం.  

నళినకాంతి రాగంలో పాడిన 'మనవ్యాలకించ రాదటే మర్మమెల్ల దెల్పెదనే మనసా' అనే కృతిలో త్యాగయ్య శ్రీరాముని అవతార తత్వాన్ని లోకానికి విశదపరుస్తాడు. అలా విశదపరచడానికి తన మనస్సును ఒక ఉపకరణంగా తీసుకొని తన మనసును తాను విడిగా చూస్తూ దానికి ముద్దుగా నెమ్మదిగా శ్రీరాముని అవతారతత్వాన్ని బోధిస్తాడు. 

అనవసరమైన కర్మకాండ అనే అడవిలో చిక్కుకుని దారితప్పి లోకులు బాధపడుతూ ఉండటం చూచి వారికి సరియైన దారి చూపాలని కరుణించి మానవరూపంలో కనిపించి నడయాడిన దైవమే శ్రీరాముడని వివరిస్తాడు. ఈ భావాన్ని తెలిపే 'కర్మకాండ మతాకృష్టులై భవగహనచారులై గాసి జెందగా కని మానవా-అవతారుడై కనిపించినాడే నడత త్యాగరాజు మనవాలకించరాదటే'అనే చరణం భగవంతుని గహనమైన అవతారతత్వాన్ని తేటతెల్లం చేస్తుంది.

వివిధ కర్మలతో కూడిన సంసారమనే అడవిలో చిక్కుకుని కర్తృత్వ భోక్త్రుత్వాది భ్రమలలో పడి నలిగి అహంకరించి సర్వమునూ అంతర్యామిగా నడిపిస్తున్న భగవత్తత్వమును గ్రహించలేక నానాటికర్మలే సర్వస్వమను కొని క్రమేణా యమాలయానికి దగ్గరౌతున్న జీవులకు సులభమైన తరుణోపాయాన్ని చూపడానికి అఖండఘన సచ్చిదానంద స్వరూపుడైన దైవం మానవరూపంలో శ్రీరామునిగా దిగివచ్చింది గాని ఆతడు మనవంటి మామూలు మానవుడు గాడనే విషయాన్ని తన మనస్సుకు నచ్చజెబుతూ అదే సమయంలో లోకానికి కూడా హితబోధ గావిస్తాడు.   

(నళినకాంతి రాగం) 
మనవ్యాలకించ రాదటే 
మర్మమెల్ల దెల్పెదనే మనసా                                         

ఘనుడైన రామచంద్రుని 
కరుణాంతరంగము దెలసి నా                                        

కర్మకాండ మతాకృష్టులై భవ 
గహనచారులై గాసి జెందగ
కని మానవా-అవతారుడై 
కనిపించినాడే నడత త్యాగరాజు                                      

శ్రీరామభక్తిని నాదోపాసనకు జతగావించి తన ఇష్టదైవమును శుద్ధనాదరూపునిగా సాక్షాత్కరించుకున్నాడు త్యాగయ్య.ఆరభి రాగంలో పాడిన 'నాదసుధా రసంబిలను నరాకృతాయ మనసా' అనే కీర్తనలో శ్రీరాముని దివ్యరూపమును ప్రణవ నాదరూపముగా వర్ణించుతాడు.

(ఆరభి రాగం) 
నాదసుధా రసంబిలను నరాకృతాయ మనసా 
వేదపురాణాగమ శాస్త్రాదుల కాధారమౌ                                     
  
స్వరములు యారొక ఘంటలు వరరాగము కోదండము 
దురనయ దేశ్యము త్రిగుణము నిరతగతి శరమురా                      

సరస సంగతి సందర్భముగల గిరములురా 
ధరభజనే భాగ్యమురా త్యాగరాజు సేవించు                                   

శ్రీరాముడు అమృతమయమైన ప్రణవస్వరూపుడు.ఆయన ధరించిన కోదండము రాగస్వరూపము.దానికి ఉన్నట్టి ఏడు చిరుఘంటలు ఆరున్నొక్క స్వరములు.దుర,నయ,దేశ్యములనబడేవి వరుసగా ఘనరాగములు, నయరాగములు,దేశ్యరాగములుగా విరాజిల్లుచున్న త్రిగుణములు.మూడు రకములైన ఈరాగముల ముప్పేటతో పేనబడినది రామకోదండమున కున్నట్టి అల్లెత్రాడు.శృతితప్పని స్వరగతి సూటిగ సాగే రామబాణము. గానమున మ్రోగే సందర్భోచిత సరససంగతులు గిరములుగా త్యాగరాజు ఉపాసించుతున్నట్టి నాదస్వరూపమే శ్రీరామునిగా రూపుదాల్చి ఆయన కన్నులకు గోచరించింది.ఆ దివ్యసాక్షాత్కారమును తన మనస్సుకు బోధపరుస్తూ పరమనాద స్వరూపుడైన శ్రీరాముని అంతరిక సాధనతో భజించమనీ అదే పరమానంద దాయకమనీ విశదీకరిస్తాడు త్యాగయ్య. సర్వ శాస్త్రములకు ఆధారమైన నాదామృతరసమే నరాకృతిని దాల్చి శ్రీరామ రూపాన్ని ధరించినదన్న సత్యాన్ని మనకు తేటతెల్లం చేస్తాడు.  

కల్యాణి రాగంలో పాడిన 'భజన సేయవే మనసా' అనే కీర్తనలో బ్రహ్మేంద్ర రుద్రాదులకు సైతము దక్కని రామభజన చెయ్యమని తన మనసుకు హత్తుకునేలాగ ఉపదేశిస్తాడు.

(కల్యాణి రాగం)
భజన సేయవే మనసా - పరమ భక్తితో   
అజరుద్రాదులకు భూసురాదుల కరుదైన రామ                          

నాద ప్రణవ సప్తస్వర - వేదవర్ణ శాస్త్ర పురా 
ణాది చతుష్షష్టి కళల - భేదము గలిగే 
మోదకర శరీర మెత్తి - ముక్తి మార్గమును దెలియక 
వాద తర్కమేల శ్రీమ - దాది త్యాగరాజ నుతుని                         

రామ భజనను పరమ భక్తితో చెయ్యమని త్యాగరాజు ఉవాచ. నాద ప్రణవము నుండి సప్త స్వరములు ఉద్భవించినవి.వానినుండి వేదశాస్త్ర పురాణములు  అరువది నాలుగు కళలు పుట్టినవి.ఇవన్నియు నాదరూపములే,నాదము భక్తుని శరీరమందే యున్నది.కనుక ఇట్టి ఉత్కృష్టమైన మానవ జన్మమును ఎత్తికూడా తనలోనే యున్న సమస్తమును తెలియలేక ఉత్త వృధా వాదములలో చిక్కి కాలము గడపి మోసపోనేల? నాదములు వర్ణములు శబ్దములు స్వరములు తనలో ఎక్కడ దాగి ఉన్నవో గుర్తెరిగి ఆ నాదమునకు ఆధారుడైన ప్రణవ తారకరూపుడగు శ్రీరాముని తనలోనే దర్శించే భజనను (సాధనను) పరమ భక్తితో చెయ్యమని, అదే ఉత్కృష్టమైన మోక్ష సాధనమని త్యాగయ్య ఈ కీర్తనలో తన మనస్సుకు బోధిస్తాడు.

అవతారుడగు శ్రీరాముని దివ్యమంగళ స్వరూపమును శబ్దబ్రహ్మముగా ఉపాసించే విధానమును సూచించడమే గాక తానాచారించి ఆనందాబ్దిలో ఓలలాడిన ఘనుడు త్యాగయ్య. ఆయన యుపాసించిన శ్రీరాముడు ప్రణవ వాచ్యుడగు శబ్దబ్రహ్మమే గాని వేరొకటి గాదు.