“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

22, ఫిబ్రవరి 2013, శుక్రవారం

హైదరాబాద్ బాంబు పేలుళ్లు - ఖగోళ సూచికలు

నిన్న జరిగిన పేలుళ్ళ నేపధ్యంలో ఇవీ నాయకుల స్టేట్మెంట్లకు సామాన్యుని మనోగతాలు.

ఇది పిరికిపందల చర్య
వారిని నియంత్రించలేకపోవడం మన చేతగానితనపు చర్య కాదా?
ఈ విద్రోహ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఇప్పటికే జనాలు తీవ్రంగానే ఖండింపబడ్డారు ఇక మనం కూడా తీవ్రంగా ఖండించేదేముంది? 
బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియచెస్తున్నాం
ఇది ఫ్రీ గనుక ఎన్ని టన్నులైనా కుమ్మరించొచ్చు 
దోషులను త్వరలో పట్టేస్తాం.తీవ్రమైన శిక్షలు విధిస్తాం 
మొదటిది ప్రశ్నార్ధకమే.ఒకవేళ వారి ఖర్మ కాలి వారంతట వారు పట్టుబడితే తర్వాత ఒక దశాబ్దం పాటు వారిని రాజభోగాలతో మేపడం మాత్రం ఖాయం.
రాష్ట్రమంతటా రెడ్ ఎలర్ట్ ప్రకటిస్తున్నాం 
ఇప్పుడెందుకు? అమాయక పౌరులను ఇబ్బందుల పాల్జేయడానికా? 
అంతటా తనిఖీలు గస్తీలు ముమ్మరం చేస్తాం 
నాలుగు రోజులపాటా? ఆ తర్వాత?
మతానికీ ఉగ్రవాదానికీ ముడిపెట్టొద్దు
మేం కొత్తగా ముడిపెట్టేదేముంది? ఇప్పటికే పడిన చిక్కుముళ్ళను మీరు విప్పండి చాలు.

సరే ఇవన్నీ ఎన్నాళ్ళు మాట్లాడుకున్నా జవాబుల్లేని ప్రశ్నలు, పేపర్లవారికీ, టీవీవారికీ ఒక రెండు రోజులపాటు మళ్ళీ ఇంకొక బ్రేకింగ్ న్యూస్ వచ్చేదాకా ఊకదంపుడు చర్చలకు పనికొచ్చే విషయాలూ గనుక అవి వారికొదిలేసి మన ఇంటి డాబామీదికెక్కి ఒకసారి ఖగోళం లోకి దృష్టి సారించి అసలు నిన్న ఎటువంటి గ్రహ స్తితులున్నాయో పరికిద్దాం.నిన్నటి గ్రహస్తితులు ఇవాళ ఎలా కనిపిస్తాయి అని మాత్రం నన్నడక్కండి.వాటిని ఆకాశం చూపదు కాని సాఫ్ట్ వేర్ చూపిస్తుంది.

అసలు నన్నడిగితే మనుషులకంటే గ్రహాలే మంచివి అంటాను.గ్రహాలు పాపం అమాయకులు.అవి మనలాగా వక్రబుద్ధి ఉన్నవి కావు.మన నాయకుల లాగా ఈరోజొక మాటా రేపొక మాటా చెప్పేవి కూడా కావు.కనుక ఎప్పుడడిగినా ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చూపుతాయి.వాటికి పక్షపాతం కూడా లేదు.ఋజుస్వభావులు.అందుకే నిన్నటి గురించి అవేమంటు న్నాయో ఒక్కసారి చూద్దాం.

నిన్న సాయంత్రం 6.50 కి హైదరాబాద్ లో ఉన్న గ్రహస్తితి ఇది.మొన్న శనీశ్వరుడు వక్రస్తితిలోకి వచ్చిన నేపధ్యంలో నిన్న ఈ గ్రహస్తితి ఉన్నది.ఇందులో చూడగానే కనిపించేది కుంభరాశిలో అయిదు గ్రహాల కూడిక.వీటిలో సూర్యుడు నిన్నటి రోజున నెప్ట్యూన్ తో డిగ్రీయుతి లోకి వచ్చి ఉన్నాడు.ఈ సంయోగం రాహునక్షత్రమైన శతభిషం లో జరిగింది.నవాంశలో రవి నెప్త్యూన్లు ధనూరాశిలోకి వస్తారు.ధనుస్సు మన దేశ లగ్నం అయిన వృషభానికి అష్టమంలో ఉంటుంది.అంటే 'నాశనం' అన్నమాట.రాహుస్పర్శ వీరికి ఉంది అంటేనే శపితయోగం పని మొదలు పెట్టింది అని అర్ధం.శపితయోగ ప్రభావాలు ఎలా ఉంటాయో ఇంతకు ముందే వివరంగా చర్చించాను.కనుక మళ్ళీ చెప్పవలసిన పనిలేదు.కనుక శపితయోగ ప్రభావంతో ప్రజానాశనం సూచితం అయ్యింది.  

ఈ సంఘటన వెనుక ఉన్న ముఖ్య ప్రభావం నెప్ట్యూన్ గ్రహానిది.నెప్ట్యూన్ రాహు నక్షత్రంలో ఉండటం వల్ల రాహు ప్రభావానికి లోనై నెగటివ్ లక్షణాలు సంతరించుకుంటుంది. ఆ నెగటివ్ లక్షణాలు ఎలా ఉంటాయో ఒక్కసారి పరిశీలిద్దాం.

  • Illusion,creates confusion,deceit and trickery,irrational and dreamy.
సరిగ్గా ఈ లక్షణాలనే ఉగ్రవాదులు కలిగి ఉంటారని వేరే చెప్పనవసరం లేదు కదా.ఇలాంటి లక్షణాలున్న నెప్ట్యూన్ తో ప్రస్తుతం రవి,బుధ,శుక్ర,కుజులు కలిశారు.అప్పుడు ఎలాంటి ఫలితాలు రావచ్చో చూద్దాం.
  • సూర్యునితో నెప్ట్యూన్ యొక్క డిగ్రీ కలయిక ప్రస్తుతం మనం చూడవలసిన అతి ముఖ్యమైన యోగం.దీనివల్ల ప్రభుత్వంతో విరోధం,మోసంచెయ్యడం,కుట్ర సూచింపబడుతుంది.ఇదే సూర్యుడు భారతదేశ కుండలిలో చతుర్దాదిపతిగా  ప్రజలను సూచిస్తాడు అన్న విషయం మనకు తెలుసు.కనుక ఈ దేశప్రజలంటే ద్వేషం ఉన్నవారే ఈపని చేశారు అని తెలుస్తుంది.మన దేశపు ప్రభుత్వం అంటేనూ ప్రజలంటేనూ పడనివారెవరు? వారెవరో అందరికీ తెలుసు నేను చెప్పవలసిన పని లేదు.
  • కుజునితో కలయిక వల్ల కుట్రపూరిత విధ్వంసాన్ని సృష్టించడం జరిగింది.
  • శుక్రుని సున్నా డిగ్రీల స్తితివల్ల దేశలగ్నాదిపతి అయిన శుక్రుడు పూర్తి  బలహీన స్తితిలో నిన్న ఉన్నాడు.కనుక రక్షణదళాలు మోసగింప బడ్డాయి.వాళ్ళ కళ్ళను నేరస్తులు తేలికగా కప్పగలిగారు.
  • బుధునితో కలయిక వల్ల సవ్యంగా ఆలోచించే బుద్ధి వారిలో లోపిస్తుంది.కనుక ఈ ఘోరానికి పాల్పడ్డారు.అధికారులలో కూడా ఇదే లోపంవల్ల సక్రమమైన చర్యలు చేపట్టలేక పోయారు.
  • వీటికితోడు నాలుగు రోజుల్లో పౌర్ణమి రానే రాబోతున్నది.
  • అయితే ఇంకొక అనుమానం రావచ్చు.ఇందులో శనీశ్వరుని పాత్ర ఏముంది? అని.నిన్న సాయంత్రం పేలుళ్లు జరిగిన సమయంలో చంద్రహోర జరుగుతున్నది. చంద్రుడు రాహుశనులచేత చూడబడు తున్నాడు.నవాంశలో శనితో కలిసి ఉన్నాడు.కనుక ఆ గంట సమయమూ శనిరాహువుల ఆధీనంలోనే ఉన్నది.అంటే శపిత యోగ ప్రభావం హోరా నాధుని ద్వారా పనిచేసిందన్న మాట.

పైన గ్రహాలు ఇచ్చిన సూచనలు గమనిస్తే ఏమి జరగాలో ఏమి జరిగిందో స్పష్టంగా కనిపిస్తుంది.అంతే కాదు.పై గ్రహస్తితివల్ల ఇది ఎవరు చేసారో కూడా తెలుస్తుంది.కాని మనం బయటకు చెప్పరాదు.ప్రభుత్వానికీ తెలుసు.వారూ అప్పుడే చెప్పరు.ప్రజలకూ తెలుసు.వారిలో వారు చర్చించుకుంటారు. దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. అసలు మన దేశంలో ఒక మంచి మార్పు వస్తుందని ఊహించడం కూడా తప్పే అని రోజురోజుకూ నమ్మకం నాకైతే బలపడుతోంది.

అదలా ఉంచితే,ఇప్పుడు కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి.ఈ ఘోరం ఇండియాలోనే ఎందుకు జరగాలి? అందులోనూ హైదరాబాద్ లోనే ఎందుకు జరగాలి? దీనికి జవాబేమిటంటే, ప్రస్తుత గురుసంచారం భారతదేశ లగ్నంలో జరుగుతున్నది కనుక ఇటువంటి ముఖ్య ఘటనలు మనదేశంలోనే జరుగుతాయి. హైదరాబాద్ co-ordinates కూ ప్రస్తుత గ్రహస్తితికీ ఉన్న సంబంధాన్ని Astro-Cartography mapping చేసి పరిశీలించాలి.అప్పుడు ఆ సంబంధం తెలియవచ్చు.

మొత్తమ్మీద సూర్య నెప్త్యూన్ల డిగ్రీ కంజంక్షన్ కుజపరిధిలో రాహునక్షత్రంలో జరగడం ఈ ఘోరాన్ని ట్రిగ్గర్ చేసింది అని చెప్పవచ్చు.ఇప్పుడు చాలామంది చాలా రోజులుగా నన్ను అడుగుతున్న ఇంకో ప్రశ్న తలేత్తుతుంది.అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇదంతా ఎనాలిసిస్ చేసి ఏమిటి ఉపయోగం? అని.

కేంద్ర ప్రభుత్వానికీ,రాష్ట్ర ప్రభుత్వానికీ అన్ని వనరులూ చేతిలో ఉన్న ఎన్నో ఇంటలిజెన్స్ ఏజన్సీలకూ అన్నీ తెలిసి వాళ్ళే ఏమీ చెయ్యలేకపోయారు. మనమేం చెయ్యగలం?కాకపోతే ముఖ్యమైన సంఘటనలు జరిగినప్పుడు వాటి సూచికలు ఖగోళంలో ఖచ్చితంగా కనిపిస్తాయి అన్న విషయాన్ని పరిశీ లించడం వరకే ఈవ్యాసం ఉద్దేశ్యం. పైన ఇచ్చిన జ్యోతిష విశ్లేషణ పరికిస్తే ఇది నిజం అని తెలుస్తుంది.

దేశమంతా టీవీలలో పత్రికలలో నెట్ లో చర్చలు హోరెత్తుతున్నాయి.వాటి ఉపయోగం ఏమిటో నా విశ్లేషణ ఉపయోగం కూడా అదే.మనకు తిన్నదరగదు.అది అరిగేవరకూ మాట్లాడుకొని పనికిమాలిన చర్చలు చేసుకొని మనల్ని మన చేతగాని దద్దమ్మతనాన్నీ తిట్టుకొని అరిగిన తర్వాత మళ్ళీ భోజనం చెయ్యడానికి పోదాం. రాజకీయ నాయకులకు ప్రజల చర్చలు ఏవీ పట్టవు.ఎవరెన్ని చర్చలు చేసుకున్నా ఎంత వాగినా వారు ప్రశాంతంగా నిమ్మకు నీరెత్తినట్లు ఉంటారు.వారి అజెండాలు నిర్ణయాలు వారివి.మన గోడు మనది.

మనం మంచి నాయకుల్ని ఎన్నుకోం.కనుక అలాంటి నాయకులు తీసుకునే నిర్ణయాల ఫలితాల్ని కూడా నవ్వుతూ అనుభవిద్దాం.ఇప్పుడనుకొని ఉపయోగం ఏముంది? 'వినాశకాలే విపరీత బుద్ధి', 'చేసుకున్నవారికి చేసుకున్నంత మహాదేవా' మొదలైన సామెతలు  ఊరకే రాలేదుకదా.