“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

8, ఫిబ్రవరి 2012, బుధవారం

నాతో కలిసి నడుస్తావా నేస్తం?

గోవుల్లాంటి మూగజీవులకు 
చెత్తకుండీలలో ఎంగిలాకులు
కుక్కాపిల్లీ క్రూరజంతువులకు 
ఏసీరూములు సోఫామెత్తలు
గమనించావా లోకపు న్యాయాన్ని?

మెత్తనిభర్తలకు కరుకుభార్యలు 
లేతమొగ్గలకు వ్యసనపు మొగుళ్ళు 
చదువుకోవాలంటే అవకాశాలు శూన్యం 
వసతులమరిస్తే చదువు పూజ్యం
ఏమిటంటావ్ ఈ విచిత్రం?

ఆలయాలలో హోరున పూజలు 
నడిరోడ్డున దిక్కులేని శవాలు
వేదికలపైన ధార్మికోపన్యాసాలు 
రాతిగుండెల శ్రోతల జీవితాలు
మితిలేని ఆత్మవంచనలు; కాదనగలవా?


ఆశకూ ఆనందానికీ మధ్య ఇంతటి దూరాలెందుకో?
కన్నీటికీ చిరునవ్వుకీ మధ్య తీరని అంతరాలేమిటో
విచిత్రమైంది కదూ ఈ సృష్టి?


ఆశల పెనాల మీద ఆవిరయ్యే జీవితాలు
గమ్యం చేరుకోలేక కూలే ఊహలవిహంగాలు
ఎప్పటికీ మారని ఎదురుచూపులు
ఎన్నటికీ తీరని మనిషి కోరికలు
ఎక్కడికంటావ్ మన పరుగు?

కోరుకున్నది వెంటనే దొరికితే తెలుస్తుందా జీవితం విలువ?
అన్నీ సుఖంగా అమిరితే పుట్టుకొస్తుందా తెగువ?
చీకటే లేకుంటే పగటికి విలువేది?
లేమి నుంచేగా కలిమి మొదలయ్యేది? 


కడుపు నిండినా ఇంకా తినాలని ఆశెందుకో
ఎన్నటికీ తృప్తిలేని సుఖాలపై మోజెందుకో
అంతముందా ఆశల అన్వేషణకు 
పొంతనుందా లోకపు తీరులకు
కళ్ళుతేరిచి చూడు నేస్తం నీవే గ్రహిస్తావు సమస్తం 


పగలూ రాత్రీ అంతులేని ఆటలో
దారీతెన్నూ తోచని పరుగు పందెంలో
ఆలోచించావా ఎప్పుడైనా?
ఎన్నాళ్ళుగా గడిపావో ఈ వ్యధాభరిత జీవితాన్ని
ఎన్నేళ్ళుగా నడిచావో వృధాగా ఈ ఎడారి నడకల్ని


ఎక్కడికో నీ ప్రయాణం ఈ లోకంలో
ఎందుకోసమో నీ అన్వేషణ ఈ మోహంలో 
దాక్కున్నావా బాధ్యతల ముసుగులో?
దారితప్పావా ఆత్మవంచన అనే అడివిలో?
నీకేం కావాలో నీకైనా తెలుసా? 
నీ పయనం ఎక్కడికో అదైనా తెలుసా?


మారిందా లోకమనే కుక్కతోక ఎన్నడైనా?
తీరిందా మనసు దాహం ఎప్పుడైనా?
పాతకాలం నుంచీ మనిషితీరు మారిందా ?
మనసుపాశం ఎన్నడైనా మనిషిని వదిలిందా ?
లోకంలో ఆనందం ఆకాశపుష్పమేనోయ్
ఉందని అనుకోవడం నీ భ్రమేనోయ్ 

ఎవరెలా పోతే నీకెందుకు లోకమేమైపోతే నీకెందుకు 
నీవెవరో ముందు తెలుసుకో నిన్నే నీగమ్యంగా నిలుపుకో 
నీవే నీకు తెలియవు లోకాన్నేం జయిస్తావ్ నువ్వు? 
స్వార్ధమే నీకు కావలిస్తే అమితంగా దానిని పెంచుకో 
ప్రపంచాన్ని మొత్తం మింగేసి నీవొక్కడివే మిగులు 

లోకమనేది ఎక్కడా లేదనేది తెలుసుకో 
ఉన్నది మనుషులూ వాళ్ళ స్వార్ధమే 
నీలోకి నువ్వే నడచిపో మిగిలినదంతా వ్యర్ధమే
భరించలేవా ఈ నిజాన్ని? తాకలేవా ఈ అగ్నిని? 
అయితే నీ జీవితం వృధాయేనంటాను నేను


ఎక్కడున్నావ్ పుట్టకముందు? 
ఏమౌతావ్ పోయిన తర్వాత?
ఊహించావా ఎప్పుడైనా ఒక్క క్షణం?
బ్రతుకుపోరాటంలో పడి మరిచావా ఈ ప్రశ్నని?
కట్టుకున్నావ్ కదూ నీ కళ్ళకి పట్టుగంతల్ని?


శాశ్వతమనుకుంటున్నావా నువ్విక్కడ 
అదే నిజమైతే, నీ ముందరివాళ్ళంతా ఎక్కడ?
నీవు పోయిన మరుక్షణం నిన్ను మరిచిపోతుందీ లోకం
నీకు నచ్చినా నచ్చకున్నా ఇదే అసలైన చేదునిజం 
నీ జీవితకాలం ఈలోకంలో అతి స్వల్పం 
విశాలవిశ్వంలో నీ బ్రతుకే అత్యల్పం 

కనీసం ఇప్పుడైనా కళ్ళుతెరవవా మరి 
లోకమూ వద్దు నీమనసూ వద్దు 
ఈరెంటినీ వదిలిచూడు ఒకసారి
నేనన్నది నిజమేనని అంటావప్పుడు
ఎన్నడూ వినని నాదం వింటావప్పుడు


అన్ని సమస్యలూ అర్ధమౌతాయప్పుడు
చిక్కుముళ్లన్నీ విడిపోతాయప్పుడు
నీ పెద్దలందరూ ఈ బాటనే నడిచారు 
అందరు దేవుళ్ళూ ఆత్మదేవుణ్నేకొలిచారు

ఆరాటమనేదుంటే ఆచరించు ఈవిధానం స్వయంగా 
నీవే చూడు, చేరుతావో లేవో నీగమ్యం నిజంగా