“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

5, ఫిబ్రవరి 2012, ఆదివారం

యువరాజ్ సింగ్ కు కాన్సర్- గ్రహప్రభావాలు

క్రికెటర్ యువరాజ్ సింగ్ కు లంగ్ కాన్సర్ అనీ, దానికి విదేశాలలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడనీ వార్తలు వస్తున్న నేపధ్యంలో అతని జాతకం పరిశీలిస్తే ఆశ్చర్యకరవిషయాలు కొన్ని  కన్పించాయి. అవేమిటో చూద్దాం.

ఇతను డిసెంబర్ 12 ,  1981 న చండీఘర్ లో పుట్టాడని సమాచారం దొరుకుతోంది. ఇది నిజమో కాదో తెలియదు.డిసెంబర్ పన్నెండున పుట్టినవాళ్ళు సామాన్యంగా మహా మొండివాళ్లై  ఉంటారు. నాకు క్రికెట్ మీద బొత్తిగా ఆసక్తి లేదు కనుక అతని ఆట గురించి నాకు తెలియదు. క్రికెట్ ఆటను నేను అసలు చూడను. కానీ సామాన్యంగా ప్రతి ఆటగాడూ మొండివాడై ఉండాలని నేను నమ్ముతాను. లేకుంటే ప్రతికూల పరిస్తితుల్లో ఆటను ఆడలేడు.కనుక ఇతనూ మొండిమనిషే అని అనుకుంటున్నాను. అలాంటప్పుడు డిసెంబర్ 12 సరియైన జననతేదీనే కావచ్చు.ఇంతకంటే ఖచ్చితమైన సమాచారం దొరికేవరకూ ఇదే నిజమని అనుకుందాం.

సాధారణంగా ప్రముఖుల అసలైన జననవివరాలు వారు బయటపెట్టరు. దానికి కారణాలు అనేకం ఉంటాయి. ప్రస్తుతం మాత్రం ఈ వివరాలు నిజమే అని నమ్ముతూ ఈ విశ్లేషణలో ఏమి కనిపిస్తుందో చూద్దాం.ఇతని సరియైన జననసమయం మాత్రం తెలీలేదు. కనుక స్థూలవిచారణ చేద్దాం.ఇతని జాతకంలో ముఖ్యంగా కనిపించే అంశాలు కొన్ని --

1 . రాహుకేతువులు సున్నా డిగ్రీలలో ఉండటం.

2 . శని కన్యారాశిలో 26  డిగ్రీలలో ఉంటూ తృతీయదృష్టితో వృశ్చికరాశిలో 26 డిగ్రీలలో ఉన్న రవిని డిగ్రీదృష్టితో వీక్షించడం.

3 . బుధుడు రవికి అతి దగ్గరగా ఉండి అస్తంగతుడవ్వడం.

4 . గురువు తులారాశిలో 9 డిగ్రీలలో ఉంటూ బలహీనుడైన (?) రాహు నక్షత్రంలో ఉండటం.

కేన్సర్ కు అనేక గ్రహస్తితులు కారణం అవుతాయి. వాటిలో గురు శనులు, గురు కుజులు, గురు రాహువులు, గురు కేతువులు ప్రముఖ పాత్ర వహిస్తారు. అందరిలోకీ గురువుపాత్ర మాత్రం ఖాయంగా ఉంటుంది. గురువు సంపూర్ణ శుభగ్రహం కదా ఇదేంటి ? దేవగురువైన బృహస్పతి కాన్సర్ ను కలిగిస్తాడా ? అన్న అనుమానానికి నా పాత పోస్ట్ లలో వివరణ ఇచ్చాను. వాటిలో గురువూ శనీ ఎలా కాన్సర్ కు కారకులౌతారో వివరించాను.కావలసినవారు అవి ఒకసారి చదువవచ్చు.  

గోచారరీత్యా ఇప్పుడు గురువు మళ్ళీ మేషరాశి 9  డిగ్రీలలో ఉండి జననకాల గురువును ఖచ్చితమైన డిగ్రీదృష్టితో చూస్తున్నాడు. జననకాలశుక్రుడు వీరిద్దరికీ సరిగ్గా మధ్యన మకరం 8 డిగ్రీలలో ఉండటం చూడవచ్చు. దీని వివరాన్ని నేను చెప్పదలుచుకోలేదు. ఇదొక వివాదాస్పద అంశం. జ్యోతిష్య వేత్తలకు దీని అర్ధం తెలుస్తుంది.

గోచారశని తులారాశి 5  డిగ్రీల మీద సంచరిస్తూ జననకాల గురువుకు అతి దగ్గరగా ఉన్నాడు. కనుక శని గురువుల ప్రాధమిక ప్రభావం ఇతని రోగం వెనుక కనిపిస్తున్నది. అంతేకాక సహజతృతీయరాశి అయిన మిథునానికి అధిపతి అవుతూ ఊపిరితిత్తులకు సూచకుడైన బుధుడు రవికి అతిదగ్గరగా ఉంటూ అస్తంగతుడై, శనిదృష్టివల్ల  ఊపిరితిత్తుల కాన్సర్ కు దారి తీశాడు. ఈ కాన్సర్ కణితి గుండెకు అతిదగ్గరగా ఉండటం కూడా రవిపైన ఖచ్చితమైన శనిదృష్టి వల్లనే జరిగింది. రవి గుండెకు కారకుడని మనకు తెలుసు.


జననకాల మరియు గోచారగురుశనుల ప్రభావం వల్లనే ఈపరిస్తితి తలెత్తింది.కేన్సర్ కారకులలో గురు, శని గ్రహాల యొక్క పాత్ర ఈవిధంగా మళ్ళీ రుజువౌతున్నది. రవి వల్ల గుండె, బుదునివల్ల ఊపిరితిత్తులూ సూచింప  బడుతున్నాయి. ఏ జాతకానికైనా రవి చంద్రుల బలం ప్రధానం. ఎందుకంటే వీరిద్దరూ జీవితానికి వెలుగునిచ్చే గ్రహాలు. ఇతని జాతకంలో వీరిద్దరూ శని ప్రభావానికి లోనయ్యారు.శని యొక్క తృతీయదశమదృష్టులు రవి చంద్రులపైన ఉండటం చూడవచ్చు. 


చంద్ర లగ్నాత్ పరిశీలిస్తే, షష్ఠఅష్టమ స్తానాదిపతులైన కుజశనులు చాతీని సూచించే చతుర్దంలో కలవడం వల్ల ఛాతీకి సంబంధించిన తీవ్రరోగం సూచితం. శనికుజుల కలయిక మంచిది కాదు. దీనివల్ల తప్పక తీవ్రపరిణామాలు ఉంటాయి.రోగస్థానంలో లగ్నాధిపతి అయిన బుధుడు ఆయుస్థానాధిపతి అయిన రవితో కల్సి ఉండటం, వారిమీద చతుర్ధం నుంచి శనికుజుల దృష్టి పడటం కూడా ఆరోగ్యపరంగా తీవ్ర పరిణామాలు సూచిస్తున్నది.   


జైమిని మహర్షి తన ఉపదేశసూత్రాలలో ప్రధమాధ్యాయంలో 'కుజదృష్టే మహారోగః' అన్నాడు. కారకాంశకు చతుర్ధమున చంద్రుడుండి కుజునిచేత చూడబడితే 'మహారోగం' కలుగుతుంది అన్నాడు. అంటే ఒక పెద్దరోగం అని అర్ధం.ఈ సూత్రం ఇక్కడ వర్తిస్తుంది.యువరాజసింగ్ జాతకంలో ఆత్మకారకుడు బుధుడయ్యాడు. కారకాంశ మీనం అయింది. మీనం నుంచి చతుర్దంలో చంద్రుడున్నాడు. కన్యనుంచి రాశిదృష్టితో కుజుడు చంద్రుని వీక్షిస్తున్నాడు. జైమినిమహర్షి రాశి దృష్టులను చెప్పాడు. దాని ప్రకారం ద్విస్వభావ రాశులు ద్విస్వభావరాశులను వీక్షిస్తాయి. జైమిని మహర్షి చెప్పిన సూత్రం ఇతని జాతకంలో ఖచ్చితంగా రుజువైంది.ఏం పరవాలేదు ఇది చిన్నరోగమే అని కొందరు అంటున్నప్పటికీ, చిన్నరోగం అయితే అమెరికా వెళ్లి స్పెషలిస్టుల వద్ద ట్రీట్మెంట్ తీసుకోవలసిన అవసరం లేదు. 
   
ఇకపోతే ప్రస్తుత పరిస్తితి చూద్దాం.


రేపు 8 వ తేదీనుంచి శనిభగవానుడు వక్రస్తితిలోకి ప్రవేశిస్తున్నాడు. జూన్ 24 వరకూ వెనక్కు వెళుతూ మళ్ళీ కన్యారాశిలో ప్రవేశిస్తాడు. కనుక జననకాల గురువుకు క్రమంగా దూరమౌతాడు. ఈ సమయంలో ఇతని ఆరోగ్యపరిస్తితి మెరుగుపడుతుంది.  ఆ తర్వాత శనిభగవానుడు మళ్ళీ రుజుగమనంలోకి వచ్చి, అక్టోబర్ 31 ప్రాంతంలో మళ్ళీ తులారాశిలోని జననకాల గురువుమీద సంచరిస్తాడు. కనుక ఆ సమయంలో మళ్ళీ ఇతనికి వ్యాధి తిరగబెట్టవచ్చు. లేదా ఇంకొక రౌండ్ ట్రీట్మెంట్ అవసరం కావచ్చు. జూన్ లో గురువు గోచారరీత్యా ద్వాదశరాశిలో ప్రవేసిస్తాడు.కనుక అప్పుడు ఇతనికి విపరీత ఖర్చులు ఉంటాయి. అవి ట్రీట్మెంట్  కోసమే కావచ్చు.


యువరాజ్ సింగ్ జననసమయం ఖచ్చితంగా తెలిస్తే ఇతని జాతకాన్ని ఇంకా వివరంగా పరిశీలించవచ్చు. ఇతనికి కావలసిన రెమెడీస్ కూడా చెప్పవచ్చు. ప్రస్తుతానికి మనకు ఇంతకంటే వివరాలు దొరకలేదు. చిన్న వయసులో కేన్సర్ రావడం దురదృష్టమే. ఇతని కెరీర్ ఇకముందు ఎలా ఉంటుందో సందేహమే. ఇతనికి త్వరలో నయం కావాలని మాత్రం కోరుకుందాం.