“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

28, సెప్టెంబర్ 2011, బుధవారం

కుజప్రభావం

మనిషి జీవితంలో కుజగ్రహానికున్న పాత్ర అనూహ్యం. ఈయననే అంగారకుడని, భూమిపుత్రుడని కూడా అంటారు. కుజదోషం అనే దోషం గురించి అందరికీ కొద్దో గొప్పో తెలుసు. ఈ దోషం మనుషుల జీవితాలతో ఎంత చెలగాటం ఆడుతుందో అనుభవించినవారికే అర్ధమౌతుంది. అది అనుభవంలోకి వచ్చేవరకూ దాని తీవ్రత ఎంత దారుణంగా ఉంటుందో తెలియదు. మన రాష్ట్రంలో కంటే తమిళనాడులో దీనిగురించి చక్కని అవగాహన ఉంది. దానికి కావలసిన జాగ్రత్తలుకూడా వారుబాగా తీసుకుంటారు. 

మనం అన్నీ గాలికొదిలేశాం. మనకు సంగీతమూ పట్టదు, సాహిత్యమూ పట్టదు, జ్యోతిష్య వేదాన్తాది ప్రాచీననిధులూ పట్టవు. మనకు తెలిసిందల్లా అడ్డగోలుగా డబ్బులు సంపాదించడం, అడ్డదిడ్డంగా మాట్లాడడం, నా అంతవాడు లేదని మిడిమిడి జ్ఞానంతో విర్రవీగడం. సంస్కృతీ సాంప్రదాయాలను గాలికి వదిలేసి పూర్తిగా విలాసాల వెంటపడినందుకే మన ఆంధ్రుల పరిస్తితి ఇలా నిత్యాగ్నిహోత్రంలా ఉంది. మన ప్రాచీన నిధులను మనమే ఎగతాళి చెయ్యడం ఒక గొప్పగా భావించే ఎలుకపిల్లలు నేడు ఎక్కడచూచినా పుట్టుకొచ్చారు. కలిప్రభావం అంటే ఇదేనేమో.

ఆ విషయాలు అలా ఉంచితే, నిన్న డిల్లీలో మూడంతస్తుల భవనం కుప్పకూలి చాలామంది మరణించారు. ఒక్కసారి వెనక్కు చూస్తే, 2010  నవంబర్ లో ఇలాగే ఇదే డిల్లీలో అయిదంతస్తుల భవనం కూలిపోయి జనం నలిగిపోయి పరలోక ప్రయాణం కట్టారు. ఈ రెండు సంఘటనల వెనుకా కుజగ్రహం పాత్ర స్పష్టంగా ఉందంటే విచిత్రంగా ఉండవచ్చు. కాని ఇది పచ్చినిజం. ఆయా ఘటనలు జరిగినప్పుడు ఆయా గ్రహస్తితులు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం.

16 -11 -2010 న రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో జరిగిన అప్పటి ఘటనలో 42 మంది చనిపోయారు. 65 మంది గాయపడ్డారు. ఆరోజు కన్యాశనికీ, వృశ్చికకుజునికీ డిగ్రీ దృష్టి ఉంది.బుధుడు కుజునితో చాలాదగ్గరగా ఉన్నాడు. రవి సున్నాడిగ్రీలలో ఉండి అప్పుడే వృశ్చికరాశిలో ప్రవేశిస్తున్నాడు. ఈ గ్రహకూటమి వల్లనే ఈ ఘటన జరిగింది. ఇంకొక్క విచిత్రం ఏంటంటే ఆరోజు మంగళవారం. అంతే కాదు అప్పటి హోర కూడా కుజహోర. ఇంతకంటే కుజ ప్రభావానికి రుజువులేం కావాలి? మన పెద్దలు వారాలకూ హోరలకూ ఇచ్చిన ప్రాధాన్యత వెనుక తరతరాల అనుభవం ఉందనీ అవి మూఢనమ్మకాలు కావనీ అర్ధం చేసుకోవాలి. 
   
ఇక నిన్నటిఘటన చూద్దాం. కర్కాటక కుజుడు, కన్యాశనితో నక్షత్రపరివర్తనలో ఉన్నాడు. అంటే కుజనక్షత్రంలో శనీ, శనినక్షత్రంలో కుజుడూ ఉన్నారు. గ్రహాల మధ్యన ఉండే పంచవిధ సంబంధాలలో ఇదీ ఒకటి. కుజునికీ, కన్యారవికీ డిగ్రీదృష్టి అప్ప్లైయ్యింగ్ స్తితిలో (applying aspect) ఉంది. ఈరోజు ఖచ్చితమైన దృష్టి (exact aspect) వచ్చింది. బుధుడు రవికి అతి దగ్గరగా ఉన్నాడు. నిన్నటి ఘటనలో ఇప్పటివరకూ ఏడుగురు చనిపోయారు. 25 మంది గాయపడ్డారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. విచిత్రం ఏంటంటే, నిన్న కూడా మంగళవారమే. ఈ ఘటన జరిగింది కూడా 19.45 ప్రాంతంలోనే. అయితే ఈసారి డిల్లీలో శనిహోర జరుగుతున్నది. ఈ ఘటన వెనుక ఉన్న శని కుజుల సంబంధం ఏమిటో పైన వివరించాను. 

మరొక్క విషయం. పోయినేడాది జరిగిన ఘటన పౌర్ణమికి మూడ్రోజుల ముందు వ్యవధిలో జరిగింది. నిన్నటి ఘటన సరిగ్గా అమావాస్య ఘడియలలో జరిగింది. నేనెప్పటినుంచో చెబుతున్న ఈ "పౌర్ణమి - అమావాస్య" ప్రభావం మళ్ళీ రుజువైంది.

అలాగే, కుజుని కర్కాటకప్రవేశం నుంచీ ప్రపంచవ్యాప్తంగా దుర్ఘటనలు జరుగబోతున్నాయని ముందే వ్రాశాను. అలాగే  జరుగుతుండటం చూడవచ్చు. మారణహోమం లేని రోజంటూ ఈ మధ్యలో లేనేలేదు. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట సామూహిక మానవహననం జరుగుతూనే ఉన్నది. ఆయా సంఘటనల మీదా ఆయా గ్రహస్తితుల మీదా వాటివెనుక ఉన్న లింకులమీదా అన్నీ అయినతర్వాత వివరంగా ఒక పోస్ట్ త్వరలో వ్రాస్తాను. జరుగబోయే ఘటనలను సాంకేతికభాషలో కాలజ్ఞానంలో వ్రాసాను. అవి అర్ధం చేసుకునేవారికి అర్ధమౌతున్నాయి.

ఈ పోస్ట్ చదివినవారు ఏమంటారో ఊహించగలను. మీకంత తెలిస్తే ముందేచెప్పి ఆపద నివారించవచ్చుకదా అంటారు. సామాన్యులకు సేవచెయ్యవచ్చు కదా అంటారు. వారికి తెలీని ఒకవిషయం చెప్పదలుచుకున్నాను. తనకు  తెలిసినంతమాత్రాన అందరికీచెప్పి అందరి ఆపదలూ నివారించడం దైవజ్నుని కర్తవ్యం కాదు. నివారణ అనేది అర్హులైన సన్నిహితులైన కొందరికే చెప్పడం జరుగుతుంది. మిగిలినవారు ఎవరిఖర్మను వారనుభవించక తప్పదు. ఎందుకంటే, వారి అహంకారమే వారి కర్మను తొలగించుకోవడంలో అడ్డుగా నిలుస్తుంది. సామూహిక దుర్ఘటనలను నివారించడం జ్యోతిర్వేత్తల పనికాదు. అలా చెయ్యడం అహంకారం అనిపించుకుంటుంది. దైవనియమాన్ని ఉల్లంఘించినట్లు అవుతుంది. పైగా "సామాన్యులూ" "సేవా" అన్న కాన్సెప్ట్ లకు నేడు కాలం చెల్లిందని నేను నమ్ముతాను. ఈనాడు  సామాన్యులంటూ  ఎవ్వరూ లేరు. సేవ ఎవ్వరికీ అవసరం లేదు. ఒకరికి సేవచెయ్యాలి అనుకోవడం పెద్ద భ్రమ. తీవ్రమైన inferiority complex, guilt complex లున్నవారే  అలా ఎవరికైనా సేవచెయ్యాలని భావిస్తారు. నాదృష్టిలో అసలు సోషల్ సర్వీస్ అనేదే పెద్ద మోసం. స్వంతలాభం చూసుకోకుండా సోషల్ సర్వీస్ చేస్తున్నవారు నేడు ఎక్కడా లేరు. సోషల్ సర్వీస్ అవసరంలేదు కూడా. నేడసలు కావాల్సింది పరసేవ కాదు. ఆత్మసేవ కావాలి. ఆత్మసేవకులే నిజమైన సేవ చెయ్యగలరు. ఇతరులు చేసేది సేవలా కనిపిస్తుంది కాని సేవ కాదు. అదొట్టి బూటకం.

ఇవన్నీ అలా ఉంచితే, మన ప్రాచీనులు కుజుని ప్రభావాన్ని ఎందుకంత నొక్కిచెప్పారో ఇప్పుడైనా అర్ధం చేసుకుందామా?