“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

25, జులై 2011, సోమవారం

చైనా బుల్లెట్ ట్రయిన్ ప్రమాదం -- ప్రపంచ వ్యాప్తంగా రాహుకేతువుల ప్రభావం

23-7-2011 రాత్రి 20.37 గంటలకు చైనా లోని వెంజౌ నగరం సమీపంలో ఆగిఉన్న ఒక రైలును మరొక రైలు గుద్దుకుని భయంకర ప్రమాదం సంభవించింది. ఈ రెండూ బుల్లెట్ రైళ్ళు కావడం అతివేగంగా ప్రయానించేవి కావడం గమనార్హం. ఇందులో ఒకటి ఆగిఉన్నప్పుదు ఇంకొకటి వచ్చి దీనిని గుద్దుకోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. అదే హెడ్ ఆన్ కొలిజన్ జరిగి ఉన్నట్లయితే ఆ ప్రమాదం ఊహించలేనంత స్థాయిలో ఉండేది. పెద్ద ప్రమాదం తప్పి చిన్నదిగా పోవడంలో ( ప్రస్తుతం జరిగిందేమీ చిన్నది కాదు, కాని హెడ్ ఆన్ కొలిజన్ తో పోలిస్తే ఇది చిన్నదే ) కారణం కుజ కేతువుల separating aspect మాత్రమే. కుజుడు 28 డిగ్రీలలోనూ కేతువు 27 డిగ్రీలలోనూ ఉంటూ ఒకరికొకరు దూరంగా పోతున్నారు. కనుక ఘోర ప్రమాదం తప్పింది. లేకుంటే ఇంతకంటే పెద్దప్రమాదం  జరిగి ఉండేది.  

కుజ కేతువుల కంజంక్షన్ ఎంత ఘోరాలు చేస్తుందో ఈ ఉదాహరణల వల్ల తెలుసుకోవచ్చు. ఒకవైపు నార్వే లో అరగంట పైగా వెతికి వెతికి దాదాపు 90 మందిని కాల్చి చంపిన రాక్షసుడి దుర్మార్గం జరిగీ జరగకముందే, చైనా లో బుల్లెట్ రైళ్ళు  గుద్దుకొని ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడా దాదాపు వందల్లో చనిపోయి ఉండవచ్చు. ఈ రెండు సంఘటనలూ "బహుళ అష్టమి" రోజునే జరగటం కాకతాళీయం అనలేం. కుజుని నక్షత్రంలో కుజకేతువులు (అందులోనూ రాహుకేతువులు నీచలో ఉన్నప్పుడు)  ఖచ్చితమైన డిగ్రీ  కంజంక్షన్లో  ఉండడం ఎంత ప్రమాదాలు సృష్టిస్తుందో ఈ సంఘటనలవల్ల తెలుసుకోవచ్చు. 

ఈవెంట్ చార్ట్ ను ఇప్పుడు పరిశీలిద్దాం.దుర్ఘటన జరిగిన సమయానికి వెంజౌ నగరంలో కుంభలగ్నం ఉదయిస్తున్నది. ఇక్కడ వాహనాలకు కారణమైన చతుర్ధ స్థానంలో భయంకర ప్రమాదాలకు కారణమైన కుజకేతువుల డిగ్రీకల్ గ్రహయుతి సంభవిస్తూ ఉంది. ఈ యుతి శుక్రుని వృషభరాశిలో జరిగినందువల్ల  విలాసవంతమైన వాహనాలకు సూచికగా ఉన్నది. బుల్లెట్ ట్రెయిన్ అయేది విలాసవంతమైన వాహనమే. 

ఇదేగాక లగ్నడిగ్రీలకు దగ్గరగా నెప్ట్యూన్ ఉన్నట్లుగా మనం చూడవచ్చు. లగ్నం 9 డిగ్రీలలో ఉంటె నెప్ట్యూన్ 6 డిగ్రీలలో ఉండటం కాకతాళీయం ఎంతమాత్రం కాదు. నెప్ట్యూన్ గుణాలు ఏమిటో చూద్దామా? కనిపిస్తున్నదానిని మాయతో కప్పడం, గందరగోళం సృష్టించడం, మోసపూరిత భ్రమను కల్పించడం ఇతని లక్షణాలు. పిడుగుపాటువల్ల ఎలక్ట్రానిక్ సిగ్నలింగ్ వ్యవస్థ దెబ్బతిని ముందు ఒక రైలు పట్టాలపైన నిలిచి ఉన్నదన్న సిగ్నల్ వెనుకనుంచి వేగంగా  వస్తున్న రైలుకు అందలేదు. ఇది విషయాన్ని మాయతో కప్పడమే కదా. దుర్ఘటనా స్థలంలో ఉన్న గందరగోళాన్ని చూస్తె, గందరగోళం సృష్టించడం అన్న రెండవ లక్షణమూ నిజమైనట్లే కనిపిస్తుంది.  సుఖంగా  ప్రయాణం చేస్తున్నామన్న భ్రమలో ఉన్న ప్రయాణీకులు మోసం చెయ్యబడటమూ నిజమే. నెప్ట్యూన్ ప్రభావం ఈ రకంగా అక్కడ పనిచేసింది. కుజ కేతువుల కలయిక భయంకర విస్ఫోటనాన్ని సూచిస్తుంది. పిడుగు అనేది అటువంటి లక్షల వోల్టుల శక్తి ప్రసారమే.

ముంబై పేలుళ్ళలోనూ, ఓస్లో మారణకాండ లోనూ, వెంజౌ రైలు ప్రమాదంలోనూ కొన్ని కామన్ ఫేక్టర్స్   ఉన్నాయి. 

1. ఈ మూడూ జలస్థానాల దగ్గరే జరిగాయి. ముంబైలో సముద్రం ఉంది. ఉతోయా ద్వీపం సముద్రానికి దగ్గరగానే ఉంది. వెంజౌ ప్రమాదం నదిమీద ఉన్న బ్రిడ్జి పైనే జరిగింది.
2. ఈ మూడు సంఘటనలూ విలాస వంతమైన పరిసరాలలోనే జరిగాయి. ముంబై విలాస నగరం, ఉతోయ ద్వీపం పిక్నిక్ స్పాట్. బుల్లెట్ ట్రెయిన్ విలాస వాహనం. 

జలప్రదేశాలూ, విలాసప్రాంతాలూ శుక్ర కారకత్వం లోనివే  అనీ, ప్రస్తుత కుజకేతువుల యుతి శుక్ర రాశి అయిన వృషభంలోనే జరుగుతున్నదన్న విషయం గుర్తుంచు కుంటే పిక్చర్ క్లియర్ గా అర్ధమౌతుంది. వృషభం భూతత్వ రాశి. జలతత్వ గ్రహం అయిన శుక్రుని అధీనంలో ఉంది. కనుక ఇప్పటివరకూ జరిగిన దుర్ఘటనలు అన్నీ, భూమీ జలమూ కలిసి ఉన్న ప్రదేశాలలోనే జరిగాయి. ముంబై నీ, ఒస్లోనీ, వెంజౌ నీ పోల్చి చూస్తే ఈ విషయం చక్కగా కనిపిస్తుంది.

మరొక్క విషయం ఇక్కడ చెప్పాలి. ఈ మూడు చార్టు లలోనూ angular houses అనబడే కేంద్ర స్థానాలు స్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఓస్లో చార్టులో సప్తమ కేంద్రం ఇన్వాల్వ్ అయింది. వెంజౌ లో చతుర్ధ కేంద్రం ఇన్వాల్వ్ అయింది. మేదినీ జ్యోతిష్య విశ్లేషణలో కేంద్రస్థానాల పాత్రను ఈ కోణాలు చక్కగా చూపిస్తున్నాయి. అయితే ముంబై చార్ట్ కీ మిగిలిన రెండింటికీ కొన్ని తేడాలున్నాయి. ముంబై చార్ట్ లో లగ్నం ధనుస్సు అయింది. దీన్నుంచి షష్టమ స్థానంలో కుజ కేతువుల యుతి ఉంది. రాహువు రహస్య స్థానం అయిన ద్వాదశంలో ఉన్నాడు. కనుక ఇది ఖచ్చితంగా శత్రువుల, ఉగ్రవాదుల కుట్ర అని తెలుస్తున్నది. సప్తమంలో రవీ, దశమంలో శనీ ఉన్నప్పటికీ అవి అటువంటి బాంబు దాడిని సూచించే గ్రహాలూ కావు. దానికి పూర్తి భిన్నంగా కేంద్ర స్థానాల పాత్ర ఉన్నటువంటి ఓస్లో దుర్ఘటన ఒక రైట్ వింగ్ రాజకీయ చర్య అనీ, వెంజౌ ప్రమాదం Act of God అనీ చెప్పవచ్చు. అందుకనే ముంబై ఘటనా కుండలిలో (ఉగ్రవాద చర్యలో) కేంద్ర స్థానాల పాత్ర లేదు. అక్కడ 6 , 12 భావాల పాత్ర ఉంది. ఈ రకమైన తేడాలు ఈ మూడు చార్టుల మధ్య ఉన్నాయి.

ఎవరు చేసిన ఖర్మ వారు తప్పక అనుభవించేట్లు చెయ్యడంలో  ప్రక్రుతి ఎంత తెలివిగా వ్యవహరిస్తుందో, ఆ ప్లాన్ ను అమలుపరచడం ఎంత వేగంగా జరుగుతుందో, disaster compass ను గ్రహాలు ఎంత ఊహాతీతంగా ఎంత వేగంగా ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి తిప్పుతాయో గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. సూక్ష్మంగా గమనిస్తే ఆయా గ్రహాల, రాశుల, భావాల సిగ్నేచర్ అనేది సంఘటనా పరిసరాలలో కనిపిస్తుంది.

ప్రపంచ వ్యాప్తంగా రాహుకేతువుల ప్రభావాలు ఇంకెన్ని కనిపిస్తాయో చూద్దాం.