“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

24, జులై 2011, ఆదివారం

ఓస్లో మారణకాండ -- జ్యోతిష్య కోణాలు

మొన్న మధ్యాన్నం15 .26 కి నార్వే రాజధాని ఓస్లో లో బ్రీవిక్ అనే క్రైస్తవ మతోన్మాది చేసిన  బాంబుదాడి, తరువాత రెండుగంటలకు ఉతోయా ద్వీపంలో అరగంట పాటు జరిగిన మారణకాండల నేపధ్యంలో కొంత జ్యోతిష్య విశ్లేషణ చేద్దాం. రాహు కేతువులు - దుర్మరణాలు అని నేను వ్రాసిన పోస్ట్ లో  రాహు కేతువుల నీచ స్తితివల్ల ముందుముందు మరిన్ని ఘోరాలు జరుగుతాయి అని చెప్పాను. ఓస్లో దుర్ఘటన వెనుక కూడా ఈ గ్రహాల పాత్ర ఉంది.  ఘటనాసమయానికి వేసిన కుండలి ఇక్కడ జత చేస్తున్నాను. ముఖ్యంగా ఏడు ముఖ్యమైన గ్రహగతులు ఈ కుండలిలో కనిపిస్తున్నాయి. 

ఒకటి -- లగ్నం రాహు శనుల మధ్యన పాపార్గళం అవడం. దీనివల్ల దుష్టశక్తుల ప్రోద్బలం లగ్నం మీద ఉన్నదని సూచన వస్తుంది. కాని ఈ లగ్నం ప్రతి ప్రదేశానికీ 24 గంటలలో ఒక రెండు గంటలపాటు (దాదాపుగా) వస్తుంది. మరి ప్రతి ప్రదేశంలోనూ ఈ మారణకాండ జరగలేదు. నార్వే లోని ఓస్లో నగరంలో మాత్రమె దీనికి అనుకూలమైన పరిస్తితులు వచ్చాయి. కనుక దీనికి మించిన వేరే కోణాలు ఇందులో ఉన్నాయి.

రెండు -- కేతు కుజుల ఖచ్చితమైన డిగ్రీ కంజంక్షన్. ఈ గ్రహాలూ రెండూ 27 డిగ్రీల మీద కుజునిదైన మృగశిరా నక్షత్రంలో ఉన్నాయి.కుజ కేతువుల డిగ్రీ కంజంక్షన్ భయంకరమైన హింసకు, మారణకాండకూ  సూచిక అవుతుంది. కాని ఇవి కలిసి ఉన్న వృషభ రాశి అరేబియా, రష్యా, మరియు యూరోప్ లోని కొన్ని బార్డర్ ప్రాంతాలను మాత్రమె సూచిస్తుంది. యూరోప్ ను సూచించినప్పటికీ  ఖచ్చితంగా ఓస్లో నగరాన్ని సూచించే గ్రహస్తితులు ఏమున్నాయో పరిశీలించాలి. రాశి అనేది రెండు మూడు దేశాలనూ, ఒక్కొక్క సారి ఒక ఖండం మొత్తాన్నీ  సూచిస్తుంది. అందుకని ఒక నగరానికి మాత్రమె పరిమితమైన ఇంకేదో పారామీటర్ ఇందులో ఉండి ఉండాలి.
 
మూడు-- ఈ రోజున బహుళ అష్టమి అయింది. పౌర్ణమి అమావాస్యలతో బాటు దానికి మధ్య బిందువులైన చతుర్ధీ, అష్టమీ కూడా ప్రమాదకారులే. ఈ విషయం ఇక్కడ మళ్ళీ రుజువు అయింది. కానీ ఇది ఒక ప్రమాదకర టైం స్లాట్ ను మాత్రమె సూచిస్తుంది కాని ఒక ప్రదేశాన్ని సూచించదు.

నాలుగు -- ఈ సంఘటన జరిగినప్పుడు ప్రమాదాలకు కారకుడైన కుజుని హోర జరుగుతున్నది. కుజ హోర అనేక ప్రదేశాలలో జరుగుతుంది. కాని ప్రతిచోటా ఈ స్థాయిలో దుర్ఘటనలు జరుగలేదు. కాకుంటే చిన్న చిన్న ఘర్షణలు జరిగితే జరిగి ఉండవచ్చు. మరి ఓస్లో నగరంలోనే ఇంత పెద్ద స్థాయిలో ఇలా జరిగేటట్లు చేసిన గ్రహ ప్రభావం ఏమై ఉంటుంది?
 
అయిదు -- కుజ కేతువులు లగ్నాత్ అష్టమంలో ఉంటూ నాశనాన్ని సూచిస్తున్నారు. పైన లగ్న విచారణలో స్ఫురించిన కోణాలే దీనికి కూడా వర్తిస్తాయి. 
 
ఆరు -- లగ్నాధిపతి శుక్రుడు నవమ స్థానంలో ఉంటూ ఈ సంఘటన వెనుక మతప్రమేయం ఉందన్న విషయం సూచిస్తున్నాడు. ఈ ఘటనకు పాల్పడిన బ్రీవిక్ అనేవాడికి ముస్లిములు అంటే గిట్టదన్న విషయం తెలుస్తున్నది. అంతేగాక ఇతనికి బహుళజాతులసమాజం అంటే కూడా పడదని తెలిసింది.
 
ఏడు -- సప్తమంలో గురువూ చంద్రుడూ, దశమంలో రవీ ఉండటం వల్ల, ఈ వ్యక్తికి ప్రభుత్వం మీద కసి ఉందన్న విషయమూ, ప్రభుత్వ విధానాలు ఇతనికి సరిపోవడం లేదు అన్న విషయమూ సూచింపబడుతున్నది. అంతే గాక ఇతనికి తత్వశాస్త్ర పరిచయం కూడా ఉంటుంది అని గురు చంద్రుల కలయిక సూచిస్తున్నది. ఇతని బ్లాగులో చూస్తే కాంట్, హెగెల్, మాకియవెల్లి, జాన్ స్టువర్ట్ మిల్ మొదలైన పాశ్చాత్య తత్వవేత్తల భావాలు అందులో వ్రాసుకున్నాడు. ఇతనొక right wing activist అనీ, తీవ్ర భావాలు కలిగినవాడనీ మీడియా వల్ల తెలుస్తున్నది.

ఒక భయంకర దుర్ఘటన జరిగే అవకాశాలు ఉన్న గ్రహస్తితి ఇక్కడ కనిపిస్తున్నప్పటికీ, అది యూరోప్ లోని నార్వేలో ఉన్న ఓస్లో నగరంలోనే ఎందుకు జరగాలి అన్న విషయం పరిశోధనలో తేలవలసి ఉంది. ప్రదేశాలకూ రాశులకూ గ్రహాలకూ ఉన్న సంబంధాన్ని రాబట్టటానికి Astro Mapping సూత్రాలు పరిశీలించవలసి ఉంటుంది.

ఇవన్నీ అలా ఉంచితే, అసలు నార్వే స్వతంత్రదినపు కుండలి ఏమి చెబుతున్నదో చూద్దాం. స్వీడన్ నుంచి నార్వే కు స్వతంత్రం 7-6-1905 న ఉదయం 11 .01 .03 గంటలకు వచ్చింది. ఈ సమయాన్ని కుందస్ఫుట విధానంతో లాహిరీ అయనాంశను ఉపయోగించి సవరించాను. నార్వే స్వతంత్రదిన కుండలి ఇక్కడ ఇస్తున్నాను.

లగ్నమూ రాహువూ కలిసి మఖా నక్షత్రంలో ఉంటూ ఈ దేశంలో ఉన్న మల్టీ రేషియల్ జనాభాను సూచిస్తున్నది. అంతే గాక ఈ దేశానికి ముస్లిముల వల్ల ప్రమాదం ఉందని సూచిస్తున్నది. ప్రస్తుతం ఈ దేశంలోకి  వలసల ద్వారా వస్తున్న జాతులలో పాకిస్తానీ ముస్లిమ్స్ ఎక్కువనీ దాదాపు 32,000 మంది ఇప్పటికే ఓస్లో లో నివసిస్తున్నారనీ  అంచనా ఉంది. బహుశా బ్రీవిక్ అనేవాడికి ఇదే నచ్చని విషయం అయ్యి ఉండవచ్చు. తమ దేశంలోకి వస్తున్న వలస జనాభా వల్ల దేశం దెబ్బ తింటుందనీ, క్రిస్టియన్ దేశం అయిన నార్వేలో, ముస్లిం జనాభా పెరిగితే అది ముందు ముందు మత ఘర్షణలకు దారి తీస్తుందని, అతని బాధ అయి ఉండవచ్చు. ఇదే విషయాన్ని అతను ట్విటర్ లో వ్రాసాడు. "బహుళ జాతులు నివసిస్తున్న దేశాలలో ముస్లిములు కూడా ఉన్నట్లయితే అలాటిచోట్ల శాంతి ఎక్కడుందో చెప్పండి?" అంటూ ట్విటర్ లో కామెంట్ చేశాడుట.  

మొత్తం మీద వంద సంవత్సరాల క్రితం నాటి స్వతంత్ర కుండలిలో కనిపిస్తున్న విషయాలు ఈనాడు నిజం కావడం ఆశ్చర్యకరం. మనుషులకైనా, దేశాలకైనా, అనుకూల దశలు వచ్చినపుడు ఆయా విషయాలు తప్పక  జరుగుతాయన్న జ్యోతిష్య సూత్రం ఎంత నిజమో అని ఆశ్చర్యం కలుగుతుంది. 


ఈ దేశపు కుండలిలో రవి బుధులు దశమ స్థానంలో ఉండి, విశాల భావాలు కలిగిన, స్థిరమైన, ఇంటలేక్చువల్ ప్రభుత్వాన్ని సూచిస్తున్నారు. నార్వే శాంతియుతమైన దేశమే. ప్రస్తుతం ఈ దేశానికి గురు/రాహు/కుజ/బుధ/కుజ విమ్సోత్తరీదశ జరుగుతున్నది. జ్యోతిశ్శాస్త్రంలో దీనిని దశాచ్చిద్ర   సమయం అంటారు. ఈ సమయంలో దేశంలో కల్లోలం గానీ, మోసంగానీ, దుండగుల దాడులు గానీ తప్పక జరుగుతాయి. కుజుని విధశా ప్రాణ దశల ప్రభావం వల్ల హింస పెట్రేగింది. రవితో కూడిన బుధుని దశమ స్థితివల్ల ప్రభుత్వం మీద, ప్రభుత్వ పాలసీలమీదా జరిగిన దాడిగా దీనిని అనుకోవచ్చు.

గోచార రీత్యా పరిస్తితి ఎలా ఉందో చూద్దాం. గోచార కుజ కేతువులు దశమ స్థానపు రవి బుధుల మీద ఉండటం గమనించవచ్చు. గోచారరాహువు నాలుగింట ఉంటూ ప్రజలలోని అసంతృప్తిని సూచిస్తున్నాడు. కనుక ప్రభుత్వం మీద హింసతో కూడిన ప్రజాదాడి జరిగింది. గోచార కుజుడు ఏడాదికొకసారి ఈ బిందువుపైన సంచరిస్తాడు. కాని రాహు కేతువులు 18 ఏళ్లకొకసారి మాత్రమే అలా సంచరిస్తారు. అందులోనూ ప్రస్తుతం నీచ స్తితిలో బలవత్తరంగా  ఉన్నారు. కనుక ఈ మారణకాండ వీరి ప్రభావమే అనడంలో సందేహం లేదు. 


స్వతంత్ర కుండలిలో నవమ స్థానంలో ఉన్న శుక్ర గురువులను మూడవ స్థానం నుంచి వక్రించిన కుజుడు చూస్తున్నందువల్ల, మతపరమైన విషయాలు ప్రజలలో హింసకూ ఘర్షణకూ దారి తీస్తాయని తెలుస్తున్నది. అదేగా ప్రస్తుతం జరిగింది. గోచార గురువు ప్రస్తుతం మత పరమైన విషయాలను సూచించే నవమ స్థానంలో సంచరిస్తూ ఉండటం గమనించవచ్చు. 


ఈ దేశానికి 11 -8 -2011 తో గురు మహాదశ అయిపోయి శని మహా దశ మొదలౌతున్నది. శని ఈ దేశ కుండలిలో సప్తమంలో ఉంటూ దిగ్బలం కలిగి ఉన్నాడు. రాహు నక్షత్రంలో కేతువుతో కలిసి ఉన్నాడు. కనుక వచ్చే 19 ఏళ్లలో ఈ దేశంలో ప్రజా సంబంధమైన గొడవలు కల్లోలమూ తప్పవు. 2016 నుంచి 2017 వరకూ జరిగే శని/కేతు దశలలో ఈ దేశంలో అలజడీ, కల్లోలం, ప్రజా జీవితం సంక్షోభంలో పడటమూ జరుగుతుంది. దేశ ప్రభుత్వం స్థిరంగా ఉన్నప్పటికీ, అనేక దేశాల నుంచి వస్తున్న వలసలను, ముఖ్యంగా ముస్లిముల వలసలను నివారించకపోతే, బ్రీవిక్ లాటి వాళ్ళు మరింతమంది పుట్టుకొచ్చే ప్రమాదం ఉంది. అదే జరిగితే అప్పుడు ప్రజా జీవితం అతలాకుతలం అయ్యే ప్రమాదం లేకపోలేదు.