“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

14, మే 2011, శనివారం

Jesus Never Fails - Sai Baba Never Fails.

ఈ మధ్య ఒక మిత్రుడు మొబైల్ లో ఒక మెసేజి పంపించాడు. Sai Baba Never Fails అని. పైగా ఈ మెసేజిని ఇరవై ఒక్క మందికి పంపిస్తే వారం రోజుల్లో మంచి జరుగుతుందనీ లేకుంటే ఏదో చెడు జరుగుతుందనీ సారాంశం. ఆ మిత్రుడు బాగా చదువుకున్నవాడూ, ప్రభుత్వంలో ఉన్నత అధికారీనూ. దానికి నేను Only fools believe in such things అని జవాబిచ్చాను. మాకున్న స్నేహం వల్ల నా జవాబులోని కరుకుతనానికి ఆయనేమీ అనుకోలేదనుకోండి.

ఇరవై ఏళ్ల క్రితం నాకు హోమియోపతి తెలీనప్పుడు కడపలో ఒక హోమియో డాక్టర్ దగ్గర నేను ట్రీట్మెంట్ తీసుకునే వాణ్ని. ప్రిస్క్రిప్షన్ పేపర్ల మీద ఆయన చేతి రాత నాకు బాగా గుర్తు. ఒకరోజున నాకు ఒక పోస్ట్ కార్డ్ వచ్చింది. దానిమీద కూడా దాదాపు ఇలాటి సందేశమే ఉంది. ఏదో గుళ్ళో పాము కనిపించిందనీ చూస్తూ ఉండగానే అది దేవుడిగా మారి మాయమైందనీ, ఈ విషయం ఇంకొక పది మందికి కార్డులు రాస్తే మంచి జరుగుతుందనీ లేకుంటే చెడు జరుగుతుందనీ ఏదేదో రాసుంది. దాని మీద వ్రాత చూస్తె నాకు ఆశ్చర్యం కలిగింది. అది మా హోమియో డాక్టర్ గారిది. ఆయన కడప హోమియో కాలేజీలో ప్రొఫెసర్ కూడా. అలాటి వాళ్లకి కూడా అలాటి నమ్మకాలు ఉంటాయా అనిపించింది. ఆ కార్డును చించి పారేశాను. 

అప్పుడే నా మిత్రుడొకడికి ఇలాటి కార్డే ఇంకొకరి నుంచి వస్తే అతను కట్టలు కట్టలు ఉత్తరాలు అందరికీ రాయడం నాకు తెలుసు. అతన్ని వారించినా వినకుండా ఏమో ఏ పుట్టలో ఏ పాముందో అంటూ ఓపిగ్గా కూచుని అందరికీ జాబులు వ్రాశాడు. తరువాత ఎన్నాళ్ళు ఎదురు చూసినా  ఏమీ మంచి జరగలేదు. అది వేరే సంగతి. 

"ఓ స్త్రీ రేపురా"-- అని ఇళ్ళ తలుపుల మీద వ్రాసి అందర్నీ భయపెట్టిన సంఘటన ఒకటి పదేళ్ళ క్రితం జరిగింది. మనం వ్రాయకపోతే ఆ స్త్రీ మన ఇంట్లోకి వస్తుందేమో అని భయపడి ప్రతిఒక్కరూ వాళ్ళ తలుపులమీదా  గోడలమీదా "ఓ స్త్రీ రేపురా"-- అని వ్రాసుకునే వాళ్ళు.  

మనిషి బలహీనతల మీద ఆడుకునే ఆటల్లో ఇవొక రకమైన ఆటలు. ఇలాటి ఆట క్రిస్టియన్లకు బాగా అలవాటు. మనం రోడ్డుమీద పోతుంటే కార్ల మీదా ఆటోల మీదా Jesus Never Fails అని వ్రాసి ఉండటం చూస్తాము. ఎవరైనా ఏదైనా బాధలో ఉంటె వారొచ్చి "యేసును నమ్ముకోండి, ఈ బాధలు ఎగిరిపోతాయి" అని చెప్తూ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేస్తూ ఉంటారు. యేసుని నమ్ముకోకపోయినా బాధలు ఎల్లకాలం ఎవరి దగ్గరా నివాసం ఉండవు. కాని ఆ సంగతి తెలియని అమాయకులూ, డబ్బుకు ఆశపడే వాళ్ళూ ఆ మాటలు నమ్మి కొన్నాళ్ళు వాళ్ళు చెప్పినట్లు చర్చికి పోయి ప్రార్ధనలు చేస్తారు. ఈ లోపల ఆ భాధలు ఎలాగూ పోతాయి. "చూశావా నువ్వు యేసుని నమ్మినందువల్ల బాధలు పోయాయి"-- అని ఇంకా మెస్మరైజ్ చేసి వీళ్ళని మతం మార్చేస్తారు. ఈ మారిన వాళ్ళకూ పూర్తిగా నమ్మకం ఉండదు. ఏ మూలో, "నువ్వు చేసింది తప్పు" అని మనసు చెబుతూనే ఉంటుంది. దాని కప్పి పుచ్చుకోడానికి వీడు ఇంకొందరికి ఇవే మాయమాటలు చెప్పి వాళ్ళ మతం మార్చి, తానూ చేసినపని కరెక్టే అని తనను తాను మభ్యపెట్టుకుంటాడు.  ఇదొక చైన్ రియాక్షన్ లా కొనసాగుతుంది. పైగా ఎర వెయ్యడానికి విదేశాలనుంచి తేరగా  వచ్చిపడే డబ్బు ఎలాగూ ఉండనే ఉంది.

తాము దిగిన ఊబిలోకి ఇతరులను కూడా దించి తద్వారా వాళ్ళ అభద్రతా భావాన్నించి కృతకమైన రిలీఫ్ పొందటమే వీళ్ళందరూ చేస్తున్న పని. అంతేకాని జీససూ సాయిబాబా  వీళ్ళ జీతగాళ్ళేమీ  కాదు. మనం చేస్తున్న బోడిపూజలకు, దొంగప్రార్ధనలకు ఆశపడి, ప్రతి వెధవపనినుంచీ మనల్ని  రక్షిస్తూ కూచోటానికి వాళ్ళేమీ మనలాగా పనీపాటా లేని వాళ్ళు కారు. అసలు వాళ్ళెక్కడున్నారో, ఈ ప్రార్ధనలు వాళ్ళని చేరుతున్నాయో లేదో,  ఎవరికీ తెలియదు. ఈలోపల వాళ్ళ పేరుచెప్పి  మన బిజినెస్స్ మాత్రం నిరాఘాటంగా సాగుతూ ఉంటుంది.

ఈ క్రిశ్టియన్ల పద్ధతినే ఇప్పుడు షిర్డీ సాయిబాబా భక్తులు కూడా కాపీ కొడుతున్నారు. కాని ఇది సరియైన మార్గం కాదు అన్నసంగతి వాళ్ళు తెలుసుకోలేక పోతున్నారు. ప్రచారం ద్వారా దేవుడి మీద నమ్మకం కలిగించడం కాదు అసలు కావలసింది. వాళ్ళు జీవిస్తున్న విధానం ద్వారా ఇతరులలో నమ్మకం కలిగించాలి. నీతులు చెప్పటం ద్వారా కాకుండా, వాటిని ఆచరించి చూపడం ద్వారా లోకాన్ని ప్రభావితం చెయ్యవలసి ఉంది. జీసస్ గురించి ప్రచారం అక్కర్లేదు. ఆయన చెప్పింది ఆచరిస్తే చాలు. సాయిబాబాకు గుళ్ళూ గోపురాలూ బంగారు కిరీటాలూ అక్కర్లేదు. ఆయన చెప్పింది ఆచరిస్తే చాలు. ఆ పని మాత్రం ఎవ్వరూ చెయ్యరు. ఈ పై పై పటాటోపాలు, ప్రచారాలు మాత్రం బాగా చేస్తుంటారు. ఒకవేళ ఆ జీససూ సాయిబాబా ఎప్పుడైనా ఈలోకానికి వస్తే, వాళ్ళ సోకాల్డ్ భక్తుల్ని చూసి వాళ్ళే చీదరించుకుంటారు. ఈ విషయం అర్ధమైతే ఆధ్యాత్మిక మార్కెటింగ్ చేస్తున్నవాళ్ళ నోళ్ళు మూతపడతాయి.

అప్పటి వరకూ saibaba never fails లాటి మెసేజీలు మొబైల్స్ లో వస్తూనే ఉంటాయి. ఇదొక రకమైన పిచ్చివ్యవహారం . వీళ్ళందరికీ నేనొక్కటే చెబుతుంటాను. మీరు చెప్పేది నిజమే Jesus never fails, Sai baba never fails... Because they never went to any school and never sat for any exam. So the question of failing does not arise. ఇప్పటి కాలపు పరీక్షలు వ్రాసి చూడమనండి, వాళ్ళు పాసవుతారో ఫెయిలవుతారో తెలుస్తుంది.