“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

24, మే 2011, మంగళవారం

జిడ్డు కృష్ణమూర్తి జీవితం-తత్త్వం

మహనీయుల జీవితాలు గ్రహప్రభావానికి అతీతాలు అని చాలా మంది అనుకుంటారు. అది నిజం కాదు. వాళ్ళ గురువులను గొప్ప చెయ్యడానికి ఆయా శిష్యులు అలా చెప్పుకోవచ్చు. మా గురువు కర్మాతీతుడు, సాక్షాత్ భగవంతుని అంశ అని చెప్పుకోడానికి శిష్యులకూ, వినడానికి మనకూ బాగుంటుంది, కాని చేదువాస్తవం వేరుగా ఉంటుంది. 

భౌతికశరీరంలో ఉన్నంతవరకూ అందరూ కర్మబద్ధులే , గ్రహప్రభావానికి బద్ధులే . ఇందులో ఏమీ మినహాయింపు లేదు. మహనీయుల మనస్సు కర్మకు అతీతంగా ఉండవచ్చు. పడుతున్న బాధలను వాళ్ళు పట్టించుకోకపోవచ్చు. కాని పాంచభౌతికమైన శరీరం మాత్రం పంచభూతాత్మకమైన గ్రహప్రభావానికి లోనుకాక తప్పదు. పంచభూతాలకు అతీతమైన భూమికలో ఉన్నవారే గ్రహప్రభావానికి అతీతులు.  ఆ భూమికలో శరీరం ఉండలేదు కనుక గ్రహప్రభావం శరీరం మీద తప్పకుండా ఉండి తీరుతుంది.  పూర్తిగా కాంతిశరీరం కలిగిన బాబాజీవంటివారు మాత్రమే భౌతికకర్మకు అతీతులుగా ఉండగలరు. ఈలోపల ఉన్నవారు ఎంతటివారైనా గ్రహప్రభావానికి బద్దులే. అందుకే మహనీయులు అందరూ మనలాగా నానాబాధలూ పడినవారే.  బాధలుపడినంత మాత్రాన వారి మహాత్వానికి భంగం లేదు. ఆ బాధలను వారు చూచినతీరులోనూ, వాటిని స్వీకరించిన విధానాలలోనే వారి గొప్పతనం దాగుంటుంది. 

జిడ్డు కృష్ణమూర్తి జీవితం కూడా గ్రహప్రభావానికి అతీతం ఏమీ కాదు. ఆయన జీవితాన్ని, తత్వాన్ని అధ్యయనం చేస్తే ఈ విషయం తేటతెల్లం అవుతుంది.  పరాశర మహర్షి ఉపదేశం ప్రకారం జిడ్డుగారి జాతకంలో అష్టోత్తరీ (108 ) దశ వర్తిస్తుంది.
 
శ్లో|| విహాయ లగ్నం లగ్నేశాత్ కేంద్ర కోణగతే త్వగౌ 
ఆర్ద్రా ప్రభ్రుతిభా దష్టోత్తరీ  నామ్నీ దశోదితా  ||
(పరాశర హోర 47- 15)


(లగ్నేశుని నుండి లగ్నమును విడచిపెట్టగా ఇతరములైన కేంద్ర కోణాదులలో రాహువు గనుక ఉన్నట్లయితే ఆ జాతకమున ఆర్ద్రా నక్షత్రంతో మొదలయ్యే  అష్టోత్తరీ  దశను పరిగణింపవలెను). 

జిడ్డు కృష్ణమూర్తి చిన్నతనంలో బలహీనంగా ఉండేవాడు. ఆయనది అంత గట్టి ఒళ్ళు కాదు.లగ్నాధిపతి అయిన శని వక్రించి ఉండటమూ, చంద్రుడు కేతునక్షత్రంలో ఉండటమూ దీనికి కారణాలు.  పైగా ఈయనకు చిన్నతనంనుంచే ఆత్మలను చూడటం వంటి కొన్ని శక్తులు ఉండేవి అని తెలుస్తుంది. దానికి కారణం చంద్రుడు మూలా నక్షత్రంలో గాలాక్టిక్ సెంటర్ కు దగ్గరగా ఉండడం కావచ్చు. ఈయన మనస్సు కొద్దిపాటి  సూక్ష్మభూమికలను అనుభూతి చెందగల లక్షణాన్ని  స్వతహాగా కలిగిఉండేది అని అనుకోవచ్చు.  


1903 లో వీరి కుటుంబం కడపకు మారింది. అప్పుడు ఆయనకు మలేరియా సోకింది. అప్పుడు జాతకంలో శని/శుక్ర దశ నడిచినట్లు మనం చూడవచ్చు. శని లగ్నాదిపతిగా వక్రించి బలహీనుడుగా ఉండటమూ, శుక్రుడు బాధకాధిపతి యగు కుజుని నక్షత్రంలో ఉండటమూ, కుజ శుక్రులు ఇద్దరూ కలిసి రోగ స్థానంలో ఉండటమూ చూస్తే గ్రహప్రభావం ఎంత నిర్దుష్టంగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఆ సమయంలో గోచార శని మకర రాశిలో జిడ్డుగారి లగ్నం మీద సంచరించింది.

1904 లో ఇరవైయేళ్ళ వయసున్న తన అక్క మరణించింది.   కాని ఆ తర్వాత కూడా కృష్ణమూర్తి తల్లిగారైన సంజీవమ్మగారు చనిపోయిన తన కూతురి ఆత్మను చూచి ఆమెతో సంభాషించగలిగేది. తోటలోని ఒక మూలకు ఆమె ఆత్మ వస్తుండేది. ఆ సమయంలో తల్లి ఆ ప్రాంతానికివెళ్లి కూతురిఆత్మతో మాట్లాడేది. ఆ సమయంలో కృష్ణమూర్తి వయసు 9 ఏళ్ళు ఉంటుంది. ఆయనకూడా తనఅక్కగారి ఆత్మను  చూచినట్లు తరువాత తన అనుయాయులతో చెప్పారు. కాని ఆమె శవాన్ని చూసి ఉన్నందువల్లా, ఆమెను దహనం చెయ్యటం చూసినందువల్లా, ఆత్మగా ఆమె కనిపించినపుడు కృష్ణమూర్తి భయంతో తల్లి చాటున దాక్కునేవాడు. ఈ సంఘటనలు అన్నీ 1904 -  1905 మధ్యన కడపలో జరిగాయి. వక్రించిన శనిని  నాడీవిధానం ప్రకారం తొమ్మిదో ఇంట్లో ఉన్నట్లు చూడాలి. పంచమాత్ పంచమ భావం కావడం వల్లనూ, పంచమాధిపతి యగు శుక్రుని అంతర్దశ, అష్టమాధిపతి యగు ఉచ్చ రవి అంతర్దశ   నడుస్తున్నందువల్లనూ  ఈయనకు ఆత్మలను చూడటం వంటి అలౌకిక సంఘటనలు  ఆ సమయంలో జరిగాయి. 


డిసెంబర్ 1905 లో ఈయన తల్లిగారు మరణించారు. ఆ తరువాత తన తల్లిఆత్మను కూడా తాను చూచానని జిడ్డు కృష్ణమూర్తి చెప్పారు. ఆ సమయంలో శని/చంద్ర దశ లో గురు/రాహు విదశలు జరిగాయి. మాత్రు  కారకుడగు చంద్రుడు అష్టమంలో ఉన్న కేతు నక్షత్రమైన మూలలో ఉంటూ ద్వాదశ త్రికస్థానంలో పడటం చూడవచ్చు.  గోచార శని ఈ సమయంలో కుటుంబస్థానమైన కుంభం లో సంచరిస్తూ తృతీయదృష్టితో మాత్రుస్థానాన్ని చూస్తున్నాడు. తల్లికి సంబంధించిన దుర్ఘటన కుటుంబంలో జరుగబోతున్నది అని సూచిస్తున్నాడు. కనుక తల్లి మరణానికి తగిన గ్రహస్తితులు అప్పుడు జరిగాయి.  బహుశా ఈ సంఘటనలే కృష్ణమూర్తి పసిమనసుపైన గాఢమైన ముద్రలు వేసి ఉండవచ్చు. ఆ ముద్ర ఏ విధంగా ఉండి ఉండవచ్చు అని ఊహిస్తే, ఒక బలీయమైన ఆసరాను కోల్పోయి  మానసికంగా దిక్కుతోచని స్తితిలో పడిన స్థితిని ఆయన చిన్నతనంలోనే ఎదుర్కున్నాడు అని తెలుస్తుంది. ఇదే ఆయన జీవితంలో తగిలిన మొదటి దెబ్బ.అందుకే తన జీవితమంతా మానసికమైన ఆసరాకోసం తపించాడు అని అనిపిస్తుంది. గొప్పతత్వవేత్త అన్నఖ్యాతి వచ్చిన తరువాత కూడా రోసలిన్ తో జరిపిన రాసలీలలు ( ఇది వివాదాస్పదమైన విషయం) ఈ చిన్న తనపు మానసికషాక్ నుంచి ఉపశమనం పొందటానికి తన అంతఃచేతననుంచి ఉద్భవించిన చేష్టలే అని అనుకోవచ్చు.

జనవరి 1909 లో కృష్ణమూర్తి తండ్రి నారాయణయ్య   అడయార్ లోని దియోసాఫికల్ సొసైటీ లో వచ్చిన ఉద్యోగ రీత్యా తన కుటుంబాన్ని మద్రాసుకు మార్చారు. ఆ సమయంలో ఆయనకు శని/శని/గురు దశ జరిగింది. నవమ శని/ రాహు నక్షత్రంలోని గురువూ కలిసి ఆయన్ను సాంప్రదాయభిన్నమైన దియోసఫీ గురువులకు పరిచయం చేసారు.మద్రాసుకు మారిన కొన్నాళ్ళకే  ఈయన లెడ్బీటర్  దృష్టిలో పడటమూ  ఈయన చుట్టూ ఉన్న తేజోవలయాన్ని ( ఆరా ) గమనించిన తియోసఫీ గురువులు,   రాబోయే "మెస్సయ్య"(అవతారపురుషుని)గా ఈయన్ను అంగీకరించడమూ జరిగిపోయాయి. 1909  లో గోచార శని మీన రాశిలో సంచారం చేస్తూ, జిడ్డు యొక్క నవమ రాశి అయిన కన్యను వీక్షించాడు. గోచార గురువు సింహరాశిలో జననకాల అష్టమ కేతువుపైన సంచరించాడు. అందుకనే, ఈ సమయంలో ఆయనకు తియోసఫీ గురువులతోనూ  వారి రహస్యసాధనలతోనూ పరిచయం కలిగింది.


సరిగ్గా అప్పుడే ఆయన జీవితంలో శనిమహాదశ అంతమై, గురు మహాదశ మొదలైంది. అప్పటినుంచి, అంటే 1909 నుంచి 1925 లో ఈయన తమ్ముడు నిత్యానంద చనిపోయేవరకు ఈయన తియోసఫీ  గురువుల పర్యవేక్షణలో మునిగి తేలాడు. మాస్టర్స్ అనే సిద్దగురువులు టిబెట్ లోనూ హిమాలయాలలోనూ ఉంటారని వాళ్ళు రాత్రిళ్ళు సూక్ష్మ శరీరాలతో వచ్చి కనిపించి ధియోసఫీ సభ్యులను గైడ్ చేస్తూ ఉంటారని, తనద్వారా "లార్డ్ మైత్రేయ" ( మళ్ళీ వచ్చి లోకాన్ని ఉద్దరిస్తాడని  అన్ని మతాలూ నమ్ముతున్న అవతార పురుషుడు ) ఈ లోకానికి వెల్లడి కాబోతున్నాడని, దానికి తగిన ఉపకరణంగా తాను మారాలని,  దానికి కొన్ని ప్రత్యెక సాధనలు చెయ్యవలసి ఉన్నదని-- ఇత్యాది భావనలు ఈయనకు బాగా నూరిపోయ్యబడ్డాయి. ఆయన కూడా వాటిని బాగా వంట పట్టించుకున్నట్లే కనిపిస్తుంది. దాదాపు పదహారేళ్ళపాటు ఈ దిశగా తనను తాను అంతరికంగా సిద్ధం చేసుకుంటూ లెడ్ బీటర్, అనీబెసంట్ ల పర్యవేక్షణలో సాధనలు చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఆయనలో ఉన్న సహజ శక్తులు బాగా  వికసించి అతీత శక్తులు కొన్ని ఆయనకు ప్రాప్తించాయని అంటారు.

ఇకపోతే  తాను పొందిన మానసిక షాక్ నుంచి తెరుకోవడంలో భాగంగా, తనను చేరదీసిన అనిబెసంట్ లో పోయిన  తన తల్లిని చూసుకుని ఆమెకు బాగా దగ్గరైనట్లు కూడా తోస్తుంది. ఈయన జీవితంలో తగిలిన రెండవ దెబ్బ-- ఈయన ఎంతగానో ప్రేమించిన తమ్ముడు నిత్యానంద మరణం. ఇది 1925 లో జరిగింది.  తల్లి మరణంతో తగిలిన మానసికమైన దేబ్బనుంచి ఆయన తియోసఫీ గురువుల లాలనలో కోలుకున్నాడు. కాని నిత్యానంద మరణం ఆయన విశ్వాసాలను కదిలించింది. తియాసఫీ సిద్ధాంతాలనూ, మాస్టర్స్ అనబడే పరమ గురువుల ఉనికినీ ప్రశ్నించేట్లూ , వాటిని తిరస్కరించేట్లూ చేసింది.