నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

5, మే 2011, గురువారం

భస్మాసుర హస్తం

గత రెండు రోజులుగా ఒక ఫన్నీ మెసేజి మొబైల్స్ లో సంచారం చేస్తున్నది.

"పాకిస్తాన్ లో ఎవరికీ రక్షణ లేదు. చివరికి లాడెను క్కూడా. ఇండియాలో ఎవరికీ ప్రమాదం లేదు. చివరికి కసబ్ క్కూడా.  "

చూట్టానికి ఫన్నీగా తోచినా, ఈ మేసేజిలో ఉన్న సత్యం ఎవరూ కాదనలేనిది. మనకొక పురాణకధ ఉంది. అందులో భస్మాసురునికి శివుడు వరమిస్తే, ఆ అసురుడు చివరికి ఆ చెయ్యిని శివునిమీదేపెట్టబోతే విష్ణువు మోహినీ అవతారంలో అసురుణ్ణి మోహింపచేసి తన నెత్తిన తానే చెయ్యేసుకుని బూడిదగా మారేటట్లుచేసి కధసుఖాంతం చేస్తాడు. ఇది పురాణగాధ.

మోడరన్ భస్మాసురుల్లో భింద్రన్ వాలేనూ, ప్రభాకరన్నూ, బిన్ లాడెన్నూ ప్రముఖంగా చెప్పుకోవాలి. ఇందిరా గాంధీ పెంచి పోషించిన భింద్రన్ చివరికి ఆమె చావుకే కారకుడయ్యాడు. తమిళ పులుల్ని పెంచినందుకు అవి రాజీవుని చావుకు కారణమయ్యాయి. లాడెన్ను పెంచిన పాపానికి అమెరికా అధ్యక్షులెవరూ ఆపదలో చిక్కుకోక పోయినా, వేలాది అమాయకులు మాత్రం ట్విన్ టవర్స్ పేల్చివేతలో బలయ్యారు. మనదేశంలో వేలాదిమంది ఈ రాక్షసి చేతిలో బలైపోయారు. కాని మోడరన్ భస్మాసురున్ని, పెంచి, పోషించి, వరమిచ్చిన అమెరికా మాత్రం అతన్ని చివరికి పదేళ్ళ సుదీర్ఘ వేటలో వెంటాడి మట్టుబెట్టింది.  

ఈ క్రమంలో పాకిస్తాన్కూ అమెరికాకూ విభేదాలు రావటం ఖాయం. ఇన్నాళ్ళూ పాకీని నమ్ముతున్నట్లు నటిస్తున్న అమెరికా ఇక బయటపడక తప్పదు. కాని పాకీదేశం మాత్రం తెలివిగా చైనాతో స్నేహాన్ని బాగా గట్టి చేసుకుంటున్నది. ఇకపోతే భారత ఉపఖండంలో ఇంకే దిక్కూ లేదుగనక, అమెరికా మన దేశంతో దగ్గర కాక తప్పదు. పవర్ ఈక్వేషన్స్ లో వస్తున్న మార్పులు జాగ్రత్తగా గమనిస్తే, భవిష్యత్తులో చైనా పాకీ భాయిభాయి, అమెరికా ఇండియా భాయీభాయి అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అదలా ఉంచితే, లాడెన్ను మట్టుబెట్టింది అమావాస్య ఘడియలకు అతిదగ్గరలో అర్ధరాత్రిపూట కావటం గమనార్హం. దీపావళి అమావాస్య నరకాసుర సంహారానికి గుర్తుగా మిగిలిపోతే, చైత్ర అమావాస్య లాడెన్ పీడ విరగడ అయినందుకు గుర్తుగా మిగిలింది.  

లాడెన్ పోయాడని ప్రపంచం సంబరాలు చేసుకోవలసిన పని లేదు. అతను విడిచిపెట్టి పోయిన విషం అన్ని దేశాల్లోనూ విష వృక్షాలను, విష సర్పాలనూ సృష్టించింది. ఆ వృక్షాలకు కాస్తున్న ఫలాలు చాలా ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుంటే సమస్య శాశ్వతంగా పరిష్కారం అయినట్లు ఏమీ కనిపించటం లేదు. ముందుముందు ఆ సర్పాలు పెరిగి పెద్దవై ఎవర్ని ఎక్కడ కాటేస్తాయో ఎవరికీ తెలియదు. నిరంతరజాగరూకతా, చిత్తశుద్దులే ఏదేశపు ప్రజలకైనా ప్రభుత్వాలకైనా శ్రీరామరక్ష. అవి లేనంతవరకూ,ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీ కానంతవరకూ,ఓటుబ్యాంకు రాజకీయాలు పోనంతవరకూ ప్రమాదపు అంచునే ప్రజాజీవనం సాగక తప్పదు.