“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

17, అక్టోబర్ 2009, శనివారం

జ్యోతిర్ముద్ర

దీపావళి నాడు ఇల్లు శుభ్రం చేసుకొని దీపాలు వెలిగించి పండుగ చేసుకోవటం మంచిదే.
కాని మన ఆచారాలు పండుగలు అన్నీ ఆంతరిక సత్యాలపైన ఆధారములు అన్న సంగతి మరువరాదు. ఇల్లు శుభ్రం చేసుకోవటం కంటే అంతరంగం శుభ్రం చెయ్యటం ముఖ్యం. బయట దీపాలు వెలిగించటం కంటే అంతరంగ మండలంలో జ్యోతిని వెలిగించటం ముఖ్యం. ఆంతరిక ఆధారాలు లేని బాహ్య ఆచారాలు ప్రాణం లేని శరీరం వంటివి. ఆంతరిక ఆధారాలను వదలి ఉత్తి బాహ్య కర్మలను ఆచరించటం కూడా మన ధర్మ క్షీణతకు ఒక కారణం.
క్రియా యోగం లో యోనిముద్ర లేక జ్యోతిర్ముద్ర లేక జ్యోతి ముద్ర అని ఒక ముద్ర ఉన్నది. దీనినే హట యోగంలో షన్ముఖీ ముద్ర అని కూడా అంటారు.
దీనిని అభ్యాసం చేయటం వల్ల భ్రూ మధ్యంలో జ్యోతివంటి వెలుగు కనిపిస్తుంది. తంత్రంలో దీని అసలు పేరు యోని ముద్ర. బహుశా పేరు కొంచం ఎబ్బెట్టుగా ఉందనేమో, పరమహంస యోగానంద గారు దీనిపేరు జ్యోతి ముద్ర అని మార్చారు. కాని భారత దేశంలో ఉన్న క్రియా యోగ ఆశ్రమాలలో దీనిని యోని ముద్ర అనే పిలుస్తారు. తంత్రము లో వాడే అనేక పదాలు మన " నాగరిక " సమాజానికి కొంత ఎబ్బెట్టు గా కనిపిస్తాయి. కాని ఉన్నది ఉన్నట్టుగా చూచే తంత్ర ప్రపంచంలో అటువంటి సమస్యలు ఉండవు. యోనిముద్రా త్రిఖండేశీ త్రిగుణాంబా త్రికోణగా అంటూ లలితా సహస్ర నామం దేవిని జ్యోతిస్వరూపిణిగా కీర్తించింది.
జ్యోతిముద్రను కొంత కాలం పట్టుదలగా సాధన చెయ్యటం వల్ల భ్రూ మధ్యంలో వెలుగును దర్శించవచ్చు. వెలుగు కనిపించే సమయంలో ఆలోచనలు ఆగిపోతాయి. ఒక రకమైన నిశ్చల ప్రశాంతత అనుభవంలో కొస్తుంది. విశ్రాంతిగా అనిపిస్తుంది. కొంతమందికి సమయంలో తుమ్మెదల ఝుంకారం వంటి ధ్వని వినిపిస్తుంది. నుదుటిమీద ఏదో రూపాయి బిళ్ళ వంటి ఒక వస్తువును అంటించినట్లు బరువుగా అనిపిస్తుంది.
దీనివల్ల మనిషి వ్యక్తిత్వంలో చాలా మార్పు వస్తుంది. ప్రశాంతతను ఇష్టపడే తత్త్వం పెరుగుతుంది. ప్రతి దానికీ కంగారు. చిరాకు తగ్గిపోతాయి. ఒక విధమైన నిబ్బరం కలుగుతుంది. జీవితంలోని ఎగుడు దిగుళ్ళను తేలికగా తట్టుకునే శక్తి కలుగుతుంది.

"
జ్యోతిషామపి తజ్జ్యోతిహి"(అది జ్యోతులకే జ్యోతి, వెలుగులకే వెలుగు ) అని వేదం పరమాత్మను దర్శించింది. అంగుష్ఠ మాత్రమైన జ్యోతి రూపంలో పరమాత్మ హృదయాన్తర్గతుడై ఉన్నాడని మంత్ర పుష్పం చెబుతుంది. అట్టి అన్తర్జ్యోతికి బాహ్య రూపం అయిన సూర్య భగవానుని "జ్యోతిషాణాం పతయే నమహ" అని ప్రస్తుతించింది ఆదిత్య హృదయం. ఆ పరమాత్మను జ్యోతి రూపంలో దర్శించవచ్చు అని యోగ శాస్త్రము తంత్రము చెబుతున్నాయి.
తత్ర సూర్యో భాతి చంద్ర తారకం
నేమా విద్యుతో భాతి కుతోయ మగ్నిహి,
తమేవ భాంత మనుభాతి సర్వం
తస్య భాసా సర్వమిదం విభాతి.

(అక్కడ సూర్యుడు, చంద్రుడు తారకలు ప్రకాశించవు. విద్యుత్తు కూడా ప్రకాశించదు. ఇక అగ్ని మాట చెప్పేదేమి. అది ఉండటం వల్లనే ఇతరములన్నీ తెలియబడుతున్నవి. అది వెలుగుట వల్లనే ఇతరమైన సర్వమూ వెలుగుతున్నది.)

అని కఠోపనిషత్తు మరియు భగవత్ గీత చెబుతున్నాయి.

అట్టి
అంతర్జ్యోతి దర్శనం పొందటం మనిషి ఆధ్యాత్మిక లోకంలో పురోగమిస్తున్నాడు అనటానికి ఒక సూచన. ఆధ్యాత్మిక లోక సంచారిని భౌతిక ప్రపంచ బాధలు ఎక్కువగా బాధ పెట్టలేవు.
దీపావళి నాడు యోనిముద్ర వంటి సాధనలు చేసే యోగ సాధకుల అంతర్నేత్రాలకు జ్యోతి దర్శనం కావాలని ఆశిస్తూ నా బ్లాగు చదివేవారందరికీ దీపావళి శుభాకాంక్షలు అందజేస్తున్నాను.