“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

19, ఫిబ్రవరి 2009, గురువారం

నాడీ జ్యోతిషం : తంత్ర నాడీ గ్రంథాలు


తంత్రనాడి అంటే భయపడే అవసరం లేదు. తంత్రము అంటే గణిత తంత్రము అని అర్థము. పూర్తిగా గణితము, సాంప్రదాయ జ్యోతిషము, ఇతర నూతన విభిన్న పద్ధతులద్వారా ఆశ్చర్యకరమైన ఫలితములు చెప్పునది శాఖ. దీనికి మంత్రములతో పని లేదు.

దీని గ్రంథములు చాలావరకు సంస్కృతములో ఉంటాయి. భ్రుగునాడి, ధృవనాడి లేక సత్యనాడి, దేవకేరళం లేక చంద్రకళానాడి, బుధనాడి, శుకనాడి, ఇత్యాది గ్రంథములు ఈ కోవకు చెందినవి. వీటి యొక్క పద్ధతులు ఒక్కొక్కటి విభిన్నములైనవి. వీటిలో నాడీఅంశను మొదటగా గుర్తించవలసి ఉంటుంది. దానిని బట్టి మిగతా గణితము ప్రారంభం అవుతుంది.

మొదటగా కొంత కాలవిభజనము మరియు రాశిచక్రవిభజనం చూద్దాము. దాని ద్వారా నాడీఅంశ అర్థం అవుతుంది.

భారతీయ జ్యోతిషానికి గల అనేక ముఖ్య ప్రత్యేకతలలో అంశచక్రములు ఒకటి. జననకాలమునకు గల గ్రహస్థితిని బట్టి తయారుచేయునది రాశిచక్రము. దీనిని ఆకాశమున గల రాశులు, గ్రహముల యథాతథస్థితి అని చెప్పవచ్చు. ఇది అన్ని విషయములను చూపలేదు. జాతకములోని వివిధ అంశములను తెలుసుకోవటానికి, వివిధ అంశచక్రములను పరిశీలించాలి. రాశిచక్రమును అంశ చక్రముతో సమన్వయ పరచుకుంటూ విశ్లేషణ సాగించాలి.

పరాశరమహర్షి షోడశవర్గచక్రములను చెప్పి యున్నాడు. కొందరు షడ్వర్గములను, కొందరు సప్తవర్గములను, దశవర్గములను ఇత్యాదిగా ఎవరి అనుభవమును బట్టి వారు పరిశీలిస్తారు.

రాశి, హోర, ద్రేక్కాన, చతుర్థాంశ, పంచాంశ,షష్టఅంశ, సప్తాంశ, నవాంశ, దశమాంశ ఇత్యాదిగా అంశ లేదా వర్గ చక్రములు ఉన్నాయి. షష్టి అంశ అనగా 60 విభాగం వరకు సామాన్యంగా పరిగణిస్తారు. బాగా జ్యోతిషజ్ఞానము కలవారు నవనవాంశ( 81 ), నవద్వాదశాంశ ( 108) మొదలగు ఉన్నత వర్గములను కూడా పరిశీలిస్తారు. ఒక్కొక్క రాశిని అనేక సూక్ష్మ భాగములుగా చేస్తే విభాగములు ఏర్పడతాయి. వీటిలో 150  సూక్ష్మ విభాగమునే నాడీఅంశ అని అంటారు.

ఒక్కొక్క రాశి కి 30 డిగ్రీలు ఉన్నవి. అట్లా 12 రాశులకు 30 డిగ్రీలతో, 12 x 30 = 360 డిగ్రీల రాశి చక్రము ఏర్పడుతుంది. ఒక రాశి దాదాపుగా రెండు గంటలు ఉదయిస్తుంది. అట్లా 12 రాసులు 12 x 2 = 24 గంటలలో రాశి చక్రము మొత్తం తిరిగివస్తుంది.

ఇప్పుడు కొంత గణితభాగం చూద్దాం.

రాశి ప్రమాణం ముప్ఫై డిగ్రీలు = ఒక రాశి ఉదయించే సమయం దాదాపుగా రెండు గంటలు.

30 degrees = 2 hours

30x60x60 seconds of arc = 2x 60x60 seconds of time.

దీనిని నాడీఅంశ కోసం 150 తో భాగించగా,

(30x60x60) / 150 = (2x60x60) / 150

720 seconds of arc = 48 seconds of time

12 minutes of arc = 48 seconds of time

అనగా 48 సెకండ్ల కాలం ఒక నాడి అంశ. సత్యాచార్యుడు దీనిని తిరిగి పూర్వ, పరభాగములుగా విభజించాడు. అనగా, పూర్వభాగములో 24 సెకండ్ల కాలం, పర భాగములో మరొక 24 సెకండ్ల కాలం ఉంటాయి. 24 సెకండ్ల కాలాన్ని తిరిగి 4 భాగములు చేసాడు. అంటే ఒక 6 సెకండ్ల కాలంలో ఒక జన్మ జరుగుతుంది. జనన సమయం 6 సెకండ్ల తేడావస్తే, జాతకం సూక్ష్మ వివరాలలో పూర్తిగా మారిపోతుంది. నాడీజాతకానికి ఇంత సరియైన సమయం కావాలి.

150 నాడీ అంశలకు వసుధ, వసుధారిని, వైష్ణవి, బ్రాహ్మి ఇత్యాది పేర్లు ఉంటాయి. ఒక్కొక్క రాశిలో 150 నాడి అంశల చొప్పున 12 రాశులకు కలిపి 1800 నాడీ అంశలు ఉంటాయి. దీనిని పూర్వ, పర, చతుర్థభాగములుగా విభజించగా 225 విభాగంలో ఒక జాతకుని జీవిత కథ దర్శనం ఇస్తుంది. 1800 భాగాలను తిరిగి 8 విభాగములు చెయ్యగా 14,400 జాతకములు ఒక రోజులో ఒకప్రదేశంలో మనకు లభిస్తాయి. ఇంతటి సూక్ష్మవిభాగము చెయ్యడము వలన జాతకుని ప్రస్తుతజననమే గాక పూర్వజన్మలు, పూర్వం చేసిన పాపకర్మలవల్ల వచ్చే ఫలితములు ,దోషములు, శాపములు, చేయవలసిన రేమేడీలు, భవిష్యత్తులో వచ్చే జన్మలు, మరణం తరువాత కలిగే లోకములు అన్నీ అద్దంలో చూచినట్లు తెలుసుకోగలుగుతాము.

వీటిని లెక్కించే విధానం ఏమనగా: చరరాసులలో ( మేష, కటక, తుల, మకర) ఇదే వరుసలోను, స్థిర రాసులలో (వృష, సింహ, వృశ్చిక, కుంభ) వ్యుత్క్రమ దిశలోనూ, ద్విస్వభావరాసులలో (మిథున, కన్య,ధనుష్, మీన) 76 అంశ నుండి వీటిని లెక్కిస్తూ రావాలి.

వచ్చే వ్యాసంలో ఇంకొంత గణిత, ఫలిత భాగములు చూద్దాము.