“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

21, ఫిబ్రవరి 2009, శనివారం

హోమియోపతి మూల సూత్రములు



నాకు తెలిసిన ప్రత్యామ్నాయ వైద్య విధానములలో హోమియోపతి ఒకటి. ఈ వైద్య విధానము యొక్క మూలసూత్రాలను ఈ పోస్టులో పరిశీలిద్దాము.

దీనిని శామ్యూల్ హన్నేమాన్ అనే జర్మన్ దేశీయుడు కనిపెట్టినాడు. ఆయన జీవితాన్ని మరియు జాతకాన్ని రాబోయే వ్యాసములలో చూద్దాము. ప్రస్తుతం హోమియోపతి సిద్ధాంతమును మాత్రం తెలుసుకుందాము.

హోమియోపతి వైద్యవిధానము ముఖ్యముగా నాలుగు సూత్రములపై ఆధారపడి యున్నది.

1 . Individualism : ప్రతి మానవుడు తనకు తాను ఒక ప్రత్యేకజీవిగా ఉంటాడు. మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారనిఒక భావన ఉంది. కాని వారు కూడా పూర్తిగా ఒకరిని పోలి ఒకరు ఉండరు. వారిలో కూడా శారీరక, మానసిక భేదములు ఎన్నోఉంటాయి. ప్రాణశక్తి తీరు ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కనుక ఈ వ్యక్తిగత విభిన్నత్వములను పరిశీలించకుండా వారి రోగాలకు మనం ఇచ్చే మందులు ఆ వ్యక్తికి పూర్తీ ఆరోగ్యమును కలిగించలేవు. ఎందుకంటే, మనం ఆ 'వ్యక్తి' యొక్క ప్రాణశక్తిని పరిగణనలోకి తీసుకోవడం లేదు గనుక. ప్రతి మనిషి ప్రాణశక్తీ ఒకే విధంగా ఉండదు. కనుక ఆ ప్రాణశక్తిని మనం లెక్కలోకి తీసుకోవలసి ఉంటుంది.

2. Dynamism : వ్యాధి అనేది ఒక శక్తి. అది బాహ్య జడపదార్థము కాదు. అంతర్గతముగా వ్యాపించగలిగే ఒక జీవశక్తి. నేడు వ్యాధులకు కారణము బాక్టీరియా, వైరస్ మొదలైన సూక్ష్మ జీవులు అని సైన్సు చెబుతున్నది. కాని మనిషిలో జీవశక్తి బలముగా ఉంటే ఏ వ్యాదీ శరీరమును ఏమీ చెయ్యలేదు. కనుక జీవశక్తిలో ఏర్పడిన ప్రాధమిక లోపమే వ్యాధికి కారణము గాని సూక్ష్మ జీవులు కాదు. జీవశక్తిలో ప్రాణస్థితిలో ఏర్పడిన లోపమును స్థూలస్థితిలో కల మందులు బాగుచెయ్యలేవు. పోటేన్సీల లోనికి మార్చ బడిన ప్రకృతి సహజమైన మందులే జీవశక్తిలోని వైకల్యమును అధిగమించ గలవు.

3. Totality Of Symptoms : మానవుడు జడయంత్రము కాదు. జీవముతో నిండిన వాడు. అతడు శరీరము, మనస్సు, ప్రాణము అనే వాటి కలయిక. వ్యాధి ఏర్పడినపుడు ఈ మూడు స్థాయిలలో తేడాలు స్పష్టముగా కనిపిస్తాయి. కనుక మొత్తము లక్షణములను క్రోడీకరించిన స్వరూపమునే వ్యాధి రూపముగా చూడాలి. అంటే కాని ఒక్కొక్కభాగమును విడివిడిగా చూస్తూ స్పెషలిస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వటము సరియైన విధానము కాదు.

4 . Law Of Similars : ఒక మందు ఆరోగ్య వంతునిలో ఏ మార్పులు తేగలదో, అనారోగ్య వంతునిలో అవే మార్పులను నివారించగలదు. దీనిని " Similia Similibus Curentur " or Like cures Like అని అంటారు. ఉష్ణం ఉష్ణేన శీతలం, ముల్లును ముల్లుతోనే తియ్యాలి, వజ్రాన్ని వజ్రం తోనే కొయ్యాలి అనే ఉవాచలలో ఈ సూత్రం దాగి ఉందని కొందరిభావన. కాని ఈ సూత్రమును ప్రామాణీకరించి ఒక రూపాన్నిచ్చిన ఖ్యాతి డాక్టర్ శామ్యూల్ హన్నేమాన్ కు దక్కింది.

1990 - 95 మధ్య, నేను విజయవాడలో ఉన్నపుడు పొన్నూరు వాస్తవ్యులైన Dr P.V.Gopala Rao గారి వద్ద హోమియోపతి నేర్చుకునే అవకాశం మరియు వారు, వారి శిష్యులు నడుపుతున్న ఫ్రీ క్లినిక్ లో పనిచేసే అవకాశంకలిగింది. 5 సంవత్సరాలు హోమియోపతిని అధ్యయనం చేయటం జరిగింది.

శామ్యూల్ హన్నేమాన్ జీవితం మరియు జాతకాన్ని వచ్చే వ్యాసాలలో చూద్దాం.