“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

8, ఫిబ్రవరి 2009, ఆదివారం

జ్యోతిష ప్రయోజనం ఏమిటి?

మనిషికి తెలిసిన అన్ని శాస్త్రాలలోకి జ్యోతిషం గొప్పది. పుట్టిన తేది, సమయం, ప్రదేశం- ఈ మూడిటిని బట్టి మనిషి వ్యక్తిత్వం, జీవితం లో జరుగబోయే సంఘటనలు, ఆయు ప్రమాణం, ఇతర వివరాలు ఏ ఇతర సైన్సు చెప్పలేదు. జీవితంలో ఎన్ని సాధించినా మనిషికి తెలియంది భవిష్యత్తు మాత్రమె. దానిని స్పష్టంగా చూపించే విద్య జ్యోతిషం.

జరిగేది ఎలాగూ జరుగుతుంది, జ్యోతిషం ఎందుకు అన్న ప్రశ్న ఈ నాటిది కాదు. చాలా ప్రాచీన కాలం నుంచి ఉన్నది. భట్టోత్పలుడు వరాహుని గ్రంధాలకు, పృధు యశస్సు గ్రంధాలకు వ్యాఖ్యాత. ఈయన ఈ విషయాన్ని వివరంగా చర్చించాడు. ముందు జరుగ బోయేవి తెలుసుకుంటే మార్చుకునే ప్రయత్నాలు చెయ్యవచ్చు. అసలు జ్యోతిష ప్రయోజనం జరుగబోయే చెడును తొలగించుకోడమే. దానికి అవకాశముందా అన్నది ప్రశ్న?

భవిష్యత్తును మార్చుకునే అవకాశం తప్పక ఉంది. అవకాశమే లేకుంటే జ్యోతిష విద్యకు అర్థమే లేదు. అంటే కర్మ ఫలం అనేది స్థిరం కాదు. దానిని మార్చవచ్చు. జీవితంలో మనం అనుభవించే మంచి, చెడు రెండూ మనము పూర్వ జన్మలలో చేసుకున్న కర్మ ఫలితాలు. కనుక సరియైన కర్మను ఇప్పుడు చేసి, దాని ద్వారా పూర్వం చేసిన చెడు కర్మ ఫలితం మార్చవచ్చు. భగవంతుని సృష్టిలో మార్పుకు ఎప్పుడూ వీలుంటుంది.

అయితే భవిష్యత్తు మొత్తాన్నీ మన ఇష్టం వచ్చినట్టు మార్చగలమా? మార్చలేము. కర్మ మూడు రకాలు. మొదటిది అనుభవించక తప్పని దృఢ కర్మ. రెండవది రెమెడీస్ కి లొంగే అదృఢ కర్మ. మూడవది గట్టి రెమెడీస్ కి లొంగే మిశ్ర కర్మ. జ్యోతిష చక్రాన్ని బట్టి ఏది ఏదో తెలుస్తూంది. ఉన్నత అంశ చక్రాలైన ఖవేదాంశ , అక్ష వేదాంశ, నక్షత్రాంశ, షష్ట్యంశ లు పూర్వ జన్మ దోషాలను చూపుతాయి. నాడీ అంశ గుర్తించ గలిగితే పూర్వ జన్మలను అద్దంలో చూసినట్టు చూడవచ్చు. నాడీ జాతకాన్ని గురించి త్వరలో రాస్తాను. దోషాలన్నీ పూర్వ జన్మపు చెడు కర్మలు. మంచి యోగాలు మంచి కర్మలు. దోషాల పైన గురు దృష్టి లేదా పంచ విధ సంబంధాలలో ఏదో ఒకటి ఉంటే అది పరిహారాలకు లొంగుతుంది. శుభ గ్రహ సంబంధం లేకుంటే లొంగదు.

మనిషి జీవితంలో పశ్చాత్తాపానికి ఎప్పుడూ అవకాశం ఉంది. చేసిన తప్పులు దిద్దుకునే అవకాశం భగవంతుని సృష్టిలో ఉంటుంది. అయితే రెమెడీస్ అనేవి తూతూ మంత్రంగా చేసి తరువాత మళ్ళీ మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం అంటే కుదరదు. చిత్త శుద్ధితో, చేసిన పాపాలకు నిజమైన పశ్చాత్తాపం తో భగవంతుని వేడుకుంటూ రెమెడీస్ మనస్పూర్తిగా చేస్తే తప్పక అవి ఫలితాన్ని ఇస్తాయి. చాలా సార్లు ఫలితాలు వెంటనే కనిపించి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇది ఎన్నో సార్లు రుజువైంది.

కాకుంటే రెమెడీస్ చెయ్యడం చాలా కష్టం. తేలికగా కనిపించే రెమెడీస్ కూడా ఒక పట్టాన లొంగవు. చెయ్యటానికి బుద్ధి పుట్టదు. పుట్టినా అనేక అవాంతరాలు కలుగుతాయి. మధ్యలో మాని వేయాల్సిన పరిస్తితులు తలెత్తుతాయి. వీటన్నిటికీ తట్టుకొని నిర్ణీత కాలం వరకు చెయ్య గలిగితే తప్పక దోషాలు తోలగుతవి. జ్యోతిషం మణి, మంత్ర, ఔషదాలను రేమేడీలుగా సూచించింది. ఇవే గాక తాంత్రిక రేమేడీలు ఉన్నాయి. సులభంగా కనిపిస్తూ చేసేటప్పుడు నానా బాధలు పెట్టె లాల్ కితాబ్ రేమేడీలు ఉన్నవి.

జ్యోతిషం నిరాశావాదం కాదు. ఇది జీవితం మీద ఆశను పెంచే శాస్త్రం. రేమేడీల ద్వారా భవిష్యత్తును మార్చుకోవచ్చు అనేది నిర్వివాదం. ఇదే జ్యోతిషం యొక్క అసలైన ప్రయోజనం.