21, జూన్ 2023, బుధవారం
International Yoga Day 2023
1, మే 2023, సోమవారం
శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన
నిన్న వైశాఖ శుద్ధ దశమి.
శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిగా పిలువబడే బ్రహ్మంగారు సజీవ సమాధిలో ప్రవేశించిన రోజు. ఈ సంఘటన 1693 CE లో జరిగింది. ఈ సంఘటనను స్మరిస్తూ బ్రహ్మంగారి భక్తులు ప్రతి ఏడాదీ ఈ రోజున బ్రహ్మంగారి ఆరాధనను చేస్తారు.
ఇక్కడ దొడ్డవరం గ్రామంలో బ్రహ్మం గారి భక్తులు చాలామంది ఉన్నారు. బ్రహ్మం గారి గుళ్ళు రెండు మూడున్నాయి. వాటిలో పాత గుడిలో నిన్నంతా ఆరాధనలు జరిగాయి. మొన్న రాత్రి బ్రహ్మంగారి పద్యనాటకం వేశారు. కుల మత భేదం లేకుండా, ఊరి జనాభా మొత్తానికీ రెండుపూటలు అన్నసంతర్పణ చేశారు.
ప్రసుతం మేము అద్దెకుంటున్న ఇంటివాళ్ళ పెద్దబ్బాయి ఈ కార్యక్రమాన్ని గత 20 ఏళ్ళ నుంచీ జరిపిస్తున్నాడు. ఇది ఎంతో మంచి విషయం. నాకు బాగా నచ్చింది.
ఒక మహాయోగిగా బ్రహ్మంగారిని నా చిన్నప్పటి నుంచీ నేను
ఎంతో గౌరవిస్తాను. బ్రహ్మంగారి గురించి నేను మొదటిసారిగా 1976 లో తెలుసుకున్నాను. అప్పటికి ఒక ఏడాది ముందు 1975 లో రాజమండ్రిలో కొన్ని యోగాసనాలను 12 ఏళ్ళ వయసులో
నేర్చుకున్నప్పటికీ, మొదటిసారిగా
అన్ని ఆసనాలను ‘శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర‘ అనే
పుస్తకంలోనే 1976 లో చూశాను. అభ్యాసం మొదలుపెట్టాను. అప్పట్లోనే పల్లెటూర్లలో రాత్రంతా ప్రదర్శించే బ్రహ్మంగారి నాటకాన్ని చూడటం, ఆయన జీవితచరిత్రను చదవడం జరిగింది. యోగసాంప్రదాయంతో నా పరిచయం అలా మొదలైంది. అప్పటికీ
ఇప్పటికీ 45 ఏళ్ళు గడిచాయి. నా యోగసాధన అనేక పుంతలు తొక్కుతూ ముందుకు సాగింది.
బ్రహ్మంగారి పైన నా గౌరవం కాలంతో బాటు పెరుగుతూ వచ్చింది.
నేడు, మా ఆశ్రమం వచ్చిన
దొడ్డవరం గ్రామంలో చూస్తే, బ్రహ్మంగారి గుడులు
మూడున్నాయి. ఆయన ఆరాధనను నిష్ఠగా చేసే గ్రామస్తులున్నారు. బ్రహ్మంగారి
గుడి ఉన్న బొడ్డురాయి ప్రక్కనుంచే మా ఆశ్రమానికి పోయే దారి ఉంటుంది. ఇదంతా
కాకతాళీయం కాదని నేను నమ్ముతున్నాను.
బ్రహ్మంగారి చరిత్రను పరిశీలిస్తే, ఆయన తన సంచారంలో భాగంగా అద్దంకి, ధేనువకొండలకు వచ్చినట్లు తెలుస్తున్నది. ధేనువకొండ గ్రామం మాకు కేవలం పది నిముషాల దూరం మాత్రమే.
NTR తీసిన బ్రహ్మంగారి చరిత్ర సినిమాను నేను 1984 లో గుంతకల్ లో చూశాను. ఆ సినిమా షూటింగ్ రాయలసీమలోనే జరిగింది. ఆ షూటింగ్ లో నా తోటి ఉద్యోగులు కొంతమంది నటించారు కూడా. షూటింగ్ చూద్దామని వాళ్ళు కందిమల్లాయపల్లి వెళితే, నటులు తక్కువయ్యారని గ్రామస్తులుగా వేషాలు వీళ్ళకే వేయించి వీళ్ళనే సినిమాలో పెట్టాడు NTR. ఆ సినిమాకు నేను పోయిన రోజున, గుంతకల్ లో ఉండే శ్రీ శంకరానందగిరి స్వాములవారు కూడా సినిమాహాలుకు వచ్చి బాక్స్ లో కూచుని ఆ సినిమాను చూచారు. నేను దర్శించిన బ్రహ్మజ్ఞానులలో ఆయన ఒకరు.
అయితే
ఆ సినిమా నన్ను నిరాశపరచింది. NTR కు తోచిన రీతిలో
ఆ సినిమా వాస్తవ వక్రీకరణకు గురయింది. అది నాకు నచ్చలేదు. జనాకర్షణ కోసం చరిత్రను మార్చాడాయన. 'అతి'నటన కూడా చేశాడు. అందుకే ఆ సినిమాను
రెండవసారి నేను చూడలేదు. ఆ సినిమాను ఇంకా బాగా, వాస్తవాలకు దగ్గరగా తీసి ఉండవచ్చుననేది నా అభిప్రాయం.
తరువాత నేను గుంటూరు డివిజన్ లో పనిచేసినప్పుడు, నంద్యాల యర్రగుంట్ల లైన్ వేస్తున్న సమయంలో, బనగానపల్లెలో బ్రహ్మంగారి సమాధిని దర్శించాను. వారి వంశస్తులను చూచి నిరాశ చెందాను. కారణం? ఆయన శక్తి వారిలో కనిపించకపోవడం.
వేదాంత, యోగ, తంత్ర
సంప్రదాయాలను సమన్వయం చేసి ఆచరణాత్మకమైన సిద్ధమార్గాన్ని రాయలసీమలోను, ఒంగోలు, నెల్లూరు ప్రాంతాల
లోని పల్లెపట్టులలోను బహుళ ప్రచారం చేసిన మహాయోగిగా బ్రహ్మంగారిని నేను అమితంగా
గౌరవిస్తాను. హిందూమతం యొక్క ఆచరణాత్మక యోగవిధానాలు గ్రామ్యప్రాంతాలలో ఇంకా
బ్రతికి ఉన్నాయంటే అది బ్రహ్మంగారి చలవే. మా మార్గం కూడా అదే కాబట్టి మా ఆశ్రమంలోని
ధ్యానమందిరంలో బ్రహ్మంగారి చిత్రపటాన్ని కూడా ఉంచబోతున్నాను.
బ్రహ్మంగారిని ఆరాధించినంత వరకూ, SC, ST, BC లను క్రైస్తవం తాకలేకపోయింది. ఆయనను మరచిన తర్వాతనే పల్లెల్లో అది ఎక్కువైంది. ఇది వాస్తవం.
బ్రహ్మంగారి తత్త్వాలన్నా,
బ్రహ్మంగారి నాటకమన్నా నాకు చాలా ఇష్టం. అందుకే మొన్న రాత్రి తెల్లవారుజాము 4
వరకూ, ఎద్దులబండి వేదికగా ఇక్కడ సాగిన ఆ పద్యనాటకం నాకు చాలా ఆనందాన్ని కలిగించి, నా
చిన్నతనాన్ని గుర్తుకు తెచ్చింది. తెలుగునాట పల్లెటూర్ల జీవితాన్ని మళ్ళీ
ఆస్వాదించే అవకాశం ఇన్నాళ్ళకు మళ్ళీ నాకు ఈ విధంగా లభించింది.
పండితులలాగా ఉత్తమాటలు ఉపన్యాసాలు చెప్పడం కాకుండా, దైవశక్తిని, అమానుష యోగశక్తులను ప్రత్యక్షంగా ప్రదర్శించి చూపి, కుల మతాలకు అతీతమైన
వేదాంతతత్త్వాన్ని ఆచరణలో నిరూపించిన మహాయోగి - బ్రహ్మంగారు. అసలైన హిందూమతాన్ని
నిలబెట్టినది ఇటువంటి మహనీయులే. సాంఖ్యము, తారక
రాజయోగము, అమనస్కము, కుండలినీ యోగములకు ఆయన జీవితమే ప్రత్యక్ష నిదర్శనం.
అయితే, ఉత్తగా ఏడాదికొకసారి ఆయన ఆరాధనను చేసి ఊరుకోవడమో, లేదా ఆయనను తమ కులానికే పరిమితమైన మహనీయునిగా భావించి ఒక గుడి
కట్టి ఒదిలేయడమో నేను హర్షించను. ఆయన చూపిన సమగ్రమైన యోగమార్గంలో నడచి ఆయా సమాధిస్థితులను డైరెక్ట్ గా అందుకోవడము, ఆయా అమానుష
యోగశక్తులను సాధించి, అవసరమైతే
ప్రదర్శించి చూపగలగడమే ఆయనకు మనం చేయగల అసలైన ఆరాధన అని నేను నమ్ముతాను. దానినే మా
ఆశ్రమంలో అనుసరిస్తున్నాము. బోధిస్తున్నాము.
ఆయన చూపిన యోగమార్గంలో నడుస్తున్న మేము, ఆయన ఆరాధింపబడుతున్న గ్రామానికి, ఆయన సంచరించిన ప్రాంతానికి చేరుకోవడం ఆయన అనుగ్రహం గానే భావిస్తున్నాను.
అందరూ నమ్ముతున్నట్లు వేమనయోగి రెడ్డికులానికి ప్రతీక అని, బ్రహ్మంగారు విశ్వబ్రాహ్మణ కులానికి ప్రతీక అని నేను నమ్మను. వారిది యోగికులం. అది కులమతాలకు అతీతమైన ఋషికులం. నిజమైన మహనీయులందరిదీ అదే కులం.
అందుకనే, ఆచరణాత్మక యోగసాధనకు పెద్దపీటను వేసే మా ఆశ్రమంలో, శ్రీ రామకృష్ణులవారు, రమణమహర్షి, జిల్లెళ్ళమూడి అమ్మగార్లతో బాటు, బ్రహ్మంగారి చిత్రపటాన్ని కూడా ఉంచి పూజించబోతున్నాము.
ఇదే మేము చేయబోతున్న బ్రహ్మంగారి ఆరాధన. ఈ ఆరాధన ఏడాది కొకసారి జరిగేది కాదు. అనుక్షణం జరిగేది. ఇదే అసలైన ఆరాధన అనేది మా నమ్మకం.
29, ఏప్రిల్ 2023, శనివారం
పరలోకం - నిత్యజీవం
క్రైస్తవ విషబోధలు తలకెక్కితే ఎలాంటి ఘోరాలు
జరుగుతాయో అనడానికి ఒక లేటెస్ట్ ఉదాహరణ ఈ మధ్యనే కెన్యాలో జరిగింది. Good News International Ministries అనే క్రైస్తవ సంస్థను స్థాపించిన పాల్ మెకంజీ తెంగే
అనే పాస్టర్ ను ఈ నెల 15 వ తేదీన అరెస్ట్ చేశారు. కారణం? తిండీ నీళ్ళూ మానేసి
చనిపోయేదాకా అలాగే ఉపవాసం ఉంటూ క్షీణించి క్షీణించి చనిపోతే, సరాసరి జీసస్ దగ్గరకు
వెళతారని నూరి పోసి చాలామందిని ఈ పాస్టర్ చంపేశాడు. ఇతనికి 6౦౦ ఎకరాల చర్చ్
ప్రాపర్టీ ఉంది. అందులో పోలీసులు వెతుకుతుంటే ఎక్కడికక్కడ శవాలను పాతిపెట్టిన
దిబ్బలు ఎన్నెన్నో కనిపిస్తున్నాయి. ఇప్పటికి కనీసం 100 శవాలను తవ్వి తీశారు.
వాటిలో ఎక్కువమంది చిన్నపిల్లల శవాలే ఉన్నాయి. వాళ్ళందరూ ఇతని మాటలు నమ్మి, తిండీ నీళ్ళూ మానేసి, క్షీణించి చనిపోయినవారే.
2003 కు ముందు ఒక కారు డ్రైవరుగా పనిచేసిన ఈ
పాల్ మెకంజీ, 2003 లో ఈ మిషనరీ సంస్థను స్థాపించి అతి త్వరలో వేలాదిమందిని ఆకర్షించాడు. ఇతని
బోధనలు ముఖ్యంగా Dooms Day చుట్టూ తిరిగేవి. అంటే, త్వరలో భూమి అంతం కాబోతున్నదని, జీసస్ ను నమ్మితే స్వర్గానికి వెళతారని,
లేకపోతే నరకమే గతి అని నూరిపోసే బోధలన్నమాట. ఆ విధంగా భయపెట్టి, బ్లాక్ మెయిల్
చేసి, జీసస్ ను నమ్మేలాగా చెయ్యడం ఈ ప్లాన్ లో ఒక భాగం. ఇదే పిచ్చి ఇంకా ముదిరితే,
చివరకు ఈ రకంగా సూయిసైడ్ చేసుకుని జీసస్ దగ్గరకు చేరుకోవాలని విషబోధలు ఈ క్రమంలో బోధిస్తారు.
చెప్పగా చెప్పగా అబద్దాలను కూడా నిజాలుగా ఒప్పించవచ్చు. అమాయకులకు బ్రెయిన్ వాష్ చెయ్యవచ్చు. క్రైస్తవ పిడివాదులు గాని, ఇస్లామిక్ టెర్రరిస్టులు గాని తయారయ్యేది ఇలాగే.
ఇంతమంది అమాయకుల చావులకు కారకుడైన పాస్టర్ పాల్ మెకంజీ, అందరినీ
ముందుగా పరలోకానికి పొమ్మని, తను మాత్రం చివరలో వస్తానని వాళ్ళకు చెప్పేవాడు. ఎందుకంటే, చివరలో
తను స్వర్గం గేట్లు మూయాలట. లేకపోతే పాపులు లోపలికి వచ్చేస్తారట. ఈ విధంగా జనాన్ని మభ్యపెట్టేవాడు. ఇతని బోధలను నమ్మిన గొర్రెలు తమ ఆస్తులన్నీ అమ్మి ఇతని సంస్థకు డొనేషన్ క్రింద
ఇచ్చేసేవారు. ఆ తరువాత పస్తులుండి చనిపోయేవారు. ఈ విధంగా అతను బాగా ఆస్తులను కూడబెట్టి కోట్లకు పడగలెత్తాడ. ఇప్పుడు అరెస్టయ్యాడు.
ఆ వివరాలన్నీ నెట్లో దొరుకుతాయి. ఇతనికి ఒక యుట్యుబ్ చానెల్ కూడా ఉంది. చూడండి. అర్ధమౌతుంది. అయితే, నేను చెప్పాలనుకున్నది అది కాదు. ముఖ్యంగా రెండు విషయాలు నేను చెప్పాలనుకున్నాను.
ఒకటి, అమాయకులైన ప్రజలు ఏ విధంగా గొర్రెలుగా మారి ఇలాంటి పాస్టర్ల మాయలో పడుతున్నారు అనే విషయం.
రెండు, అసలు బైబిలు బోధల లోనే
ఉన్న అబద్దాలు, లోపాలు ఏమిటన్న విషయం. ఈ రెండు విషయాలు నేను చెప్పబోతున్నాను.
కెన్యా లాంటి ఆఫ్రికా దేశాలలో పేదరికం, చదువులేనితనం ఉంటాయి. ఇండియాలో కూడా కొన్ని రాష్ట్రాలలో మారుమూల ప్రాంతాలలో ఇవి ఉన్నాయి. అటువంటి చోట్ల క్రైస్తవ పాస్టర్ల కళ్ళు పడతాయి. డబ్బు ఎరవేసి బైబిల్ అబద్దాలు అమాయకులకు నూరిపోస్తారు. మతాలు మారుస్తారు. సమాజంలో చిచ్చు రేపుతారు. ఇది ఇండియాలో ముమ్మరంగా జరుగుతున్నది. ముఖ్యంగా ఆంధ్రలో చాలా ఎక్కువగా జరుగుతున్నది. ఇక్కడ ప్రతి పల్లెలోనూ కనీసం రెండు చర్చిలున్నాయి. మైకులు మారు మోగుతున్నాయి. కాకమ్మ కబుర్లను పాస్టర్లు బాగా నూరిపోస్తున్నారు. వెర్రి గొర్రెలు నమ్మేస్తున్నారు.
ఈ పాస్టర్లు చెప్పే ముఖ్యమైన బోధ, పరలోకం, నిత్యజీవం అనేవి. పరలోకం అనేది ఒకటి ఉందని, జీసస్ ను నమ్మితే అక్కడకు పోతారని,
అక్కడ నిత్యజీవం ఉంటుందని పచ్చి అబద్దాలను పాస్టర్లు ప్రపంచవ్యాప్తంగా అమాయకులకు నూరిపోస్తున్నారు. ఇవన్నీ అబద్దాలే.
అవే నిజాలైతే, ఈ క్రింది ప్రశ్నలకు జవాబులేంటి?
1. క్రైస్తవం పుట్టి కేవలం రెండువేల సమత్సరాలు మాత్రమే అయింది. భూమి పుట్టి నేటికి 454 కోట్ల సంవత్సరాలైంది. మరి జీసస్ పుట్టకముందు ఉన్న కోట్లాది మనుషులందరూ నరకానికే పోయారా? ఇది నమ్మదగిన విషయమేనా?
2. నేటికీ ఇజ్రాయెల్ దేశంలో జీసస్ ను నమ్మరు.
అక్కడ ఓపన్ గా క్రైస్తవాన్ని బోధిస్తే జైల్లో పెడతారు. మరి ఇజ్రాయెల్
దేశస్తులందరూ నరకానికే పోతారా? అప్పుడు వాళ్ళు నమ్ముతున్న యెహోవా ఏం చేస్తాడు మరి?
3. క్రైస్తవం తెలియనివారు, దానిని అనుసరించని ఇతర మతస్తులు, నాస్తికులు ఎక్కడికి పోతారు?
4. క్రైస్తవబోధలు నిజాలైతే, ఇజ్రాయెల్ దేశం ఈనాటికీ జీసస్ ను ఎందుకు నమ్మడం లేదు?
అసలు విషయమేమంటే, క్రైస్తవం చెబుతున్న శాశ్వత పరలోకం అనేది ఎక్కడా లేనేలేదు. అది అబ్రహామిక్ మతాలు సృష్టించిన పచ్చి అబద్దం మాత్రమే.
హిందూమతం ప్రకారం, స్వర్గ నరకాలనేవి తాత్కాలికమైన లోకాలు మాత్రమే. ఇంకా చెప్పాలంటే ఇవి మరణానంతర స్థితులు మాత్రమే. పుణ్యం చేస్తే స్వర్గం, పాపం చేస్తే నరకం కొంతకాలం పాటు ఉంటాయి. అవి అనుభవించిన తర్వాత మళ్ళీ కర్మానుసారంగా జన్మ ఉంటుంది. ఈ విధంగా జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని అందుకునేటంత వరకూ జననమరణ చక్రం తిరుగుతూ ఉంటుంది. ఇది మన సనాతన ధర్మం చెబుతున్న సత్యం. అంతేకాదు, బౌద్దమూ జైనమూ కూడా ఇదే చెబుతాయి. ఇది మాత్రమే సత్యం. అంతేగాని, జీసస్ ని నమ్మితే స్వర్గం, లేకపోతే శాశ్వత నరకం అనేవి బూటకాలు, పచ్చి అబద్దాలు మాత్రమే. కానీ ఈ అబద్దాలను కోట్లాదిమంది నిజాలని నమ్ముతున్నారు. గొర్రెలుగా మారుతున్నారు. దీనికి కారకులు పాల్ మెకంజీ వంటి దొంగ పాస్టర్లు. ఇది వాళ్ళ వ్యాపారం.
ఈ పాల్ మెకంజీకి పెంటకోస్ట్ డినామినేషన్ తో సంబంధాలున్నాయి. ఇది తీవ్రమైన భావాలున్న సంస్థ. వీరిలో చాలామంది రోగమొస్తే మందులు వాడరు. జీసస్ తగ్గిస్తాడని మూర్ఖంగా నమ్ముతారు.
ముప్పై ఏళ్ళ క్రితం మా దగ్గర పనిచేసే ఒక ఉద్యోగి ఇదే విధంగా నమ్ముతూ, తనకు గుండెజబ్బు వచ్చినా మందులు వేసుకోకుండా, ట్రీట్మెంట్ తీసుకోకుండా, జీసస్ రక్షిస్తాడని చెబుతూ అర్ధాంతరంగా చనిపోయాడు. పెంటకోస్ట్ మిషన్ గురించి వారి నమ్మకాల గురించి నాకప్పుడే మొదటిసారి తెలిసింది.
పోతే, పాల్ మెకంజీ దృష్టిలో ఇతను చెప్పేదే అసలైన క్రైస్తవమతం. అమెరికా వంటి పాశ్చాత్య దేశాలలో ప్రచారంలో ఉన్న క్రైస్తవం అసలైన క్రైస్తవం కాదని ఇతను బోధిస్తాడు. రోగాలు వస్తే మందులు వేసుకోవడం పాపమని, మొబైల్, కంప్యూటర్ వంటి మోడరన్ పరికరాలు వాడకూడదని, అమెరికా వంటి దేశాలు సైతాన్ అనుచరులని ఇతను బోధించేవాడు. సోషల్ సెక్యూరిటీ నంబర్ అనేది తీసుకోవద్దని, అది Seal of the Beast అని ఆ గొర్రెలకు ఎక్కించేవాడు. అందుకే, ఓటర్ లిస్టులో నమోదు కూడా చేసుకోకుండా తన బోధలను వినే గొర్రెలకు నూరిపోసేవాడు. చివరకు తిండీ నీళ్ళు మానేసి ఆత్మహత్యలు చేసుకోమని అదే జీసస్ ను చేరుకునే అసలైన దారి అని వాళ్ళను హిప్నటైజ్ చేశాడు. నమ్మించాడు. వాళ్ళందరూ చచ్చారు. ఇతను మాత్రం హేపీగా ఉన్నాడు.
అసలీ Seal of the Beast అంటే ఏమిటి? ఇది బైబిల్ లోని ప్రకటనల గ్రంధం (Revelations Chapter) లో ఉంటుంది. ఈ చాప్టర్ 66 CE ప్రాంతంలో వ్రాయబడింది. ఇది రాజకీయపరంగా వ్రాయబడిన అబద్దపు వ్రాతలే గాని నిజాలు కావు.
ఎలా అంటే, అప్పట్లో నీరో చక్రవర్తి రోం ను పాలించేవాడు. ఇతని బొమ్మతో నాణేలు చలామణీలో ఉండేవి. పాతకాలంలో రాజులందరూ తమ తమ బొమ్మలతో నాణేలను ముద్రించేవారు. ఇది మామూలే. అయితే, రోమన్ల ఏలుబడిలో ఉన్న యూదులు యెహోవా పిచ్చిలో ఓల్డ్ టెస్టమెంట్ మాయలో పడి, దీనిని వ్యతిరేకించారు. నీరో చక్రవర్తి బొమ్మ ఉన్న నాణేలను Seal of the Beast గా వాళ్ళు వర్ణించారు. అయితే, డైరెక్ట్ గా దీనిని వ్యతిరేకిస్తే రాజు చేతిలో చావు తప్పదు కనుక, మార్మిక భాషలో అర్ధం అయ్యీ కానట్టుగా దీనిని వ్రాసి, 'ప్రకటనల గ్రంధం' అని దీనికి పేరు పెట్టారు. దీనిని నేటి క్రైస్తవులు దైవాదేశంతో వ్రాయబడిన ప్రకరణంగా భావిస్తూ మోసపోతున్నారు.
ఇలాంటి తెలిసీ తెలియని బోధలను చేస్తూ జనాలను చీకటి యుగాలలోకి తీసుకుపోతున్న క్రైస్తవ పాస్టర్లు నేడు ఇండియాలో కూడా లక్షలాది మంది ఉన్నారు. ఇటువంటి పిచ్చి బోధలను నమ్మి పిచ్చోళ్లుగా మారుతున్న అమాయకులు కోట్లల్లో ఉన్నారు
పాప్ మెకంజీ ఈ బోధలను క్రొత్తగా చెయ్యడం లేదు. 2016 లో
కూడా ఇలాగె చేసి కొన్ని వందల మందిని ఇదే విధంగా ఉపవాసాలుండమని ప్రేరేపించి, వాళ్ళ
చావులకు కారకుడయ్యాడు. ఇప్పుడు లేటెస్ట్ గా మళ్ళీ చేశాడు. ఈ విధంగా జనాభాని తన వంతు కృషితో తగ్గిస్తున్నాడన్న మాట.
ఇటువంటి విషప్రచారాలు చేస్తున్నవారిని చట్టపరంగా నిరోధించవలసిన అవసరం ప్రతి దేశంలోనూ, ముఖ్యంగా ఇండియాలో చాలా ఉన్నది. లేదంటే నిన్న కెన్యాలో జరిగిన ఇటువంటి సంఘటనలే రేపు ఇండియాలో కూడా జరిగే ప్రమాదం ముందు ముందు ఉన్నదనేది వాస్తవం.
రూల్ ఆఫ్ లా లేనంతవరకూ ఇలాంటి వెఱ్ఱి పోకడలు తప్పవనేది కూడా వాస్తవమే.
మతమార్పిడి నిరోధకచట్టం ఇండియాలోని ప్రతి రాష్ట్రంలోనూ కఠినంగా అమలు కావలసిన అవసరం ఉన్నది. అంతేకాదు, సక్రమమైన రీతిలో హిందూమతాన్ని హిందూసంస్థలు అందరికీ ప్రచారం చెయ్యవలసిన అవసరం కూడా ఉన్నది. లేకపోతే Dooms Day అనేది త్వరగా రావడానికి ఇటువంటి విషబోధనలే కారణాలు అవుతాయి.
25, ఏప్రిల్ 2023, మంగళవారం
దొడ్డవరం - తెల్లబాడు గ్రామాలు
ఈరోజు మంగళవారం.
నేడు దొడ్డవరం ఊరిలో ఉన్న లక్ష్మినరసింహస్వామి ఆలయానికి వెళ్లి స్వామి దర్శనం చేసుకుని వచ్చాము. అర్చకులు నరసింహాచార్యులు గారు, నడివయసు దాటిన మనిషి. మా వివరాలు విని చాలా సంతోషించారు. 'ఈ ఊరికి మేమొచ్చి పది రోజులైందని, ఊరిలో అతి ప్రాచీన ఆలయం ఏమిటి? అని వాకబు చేస్తే నరసింహస్వామి గుడి అని చెప్పారని, అందుకని ఈ ఆలయానికి నేటికి వచ్చి దర్శనం చేసుకోగలిగామ'ని ఆయనతో అన్నాను.
ఆలయంలో ఎవరూ లేరు. ఇతర గ్రామస్తులు సామాన్యంగా ఈ ఆలయానికి రారని తెలిసింది. ఎందుకంటే, ఇక్కడ సాంప్రదాయాన్ని ఖచ్చితంగా పాటిస్తారట. ఇది పెద కమ్మవారి అధ్వర్యంలో నడుస్తున్న ఆలయం. విశాలంగా, శుభ్రంగా, ప్రశాంతంగా ఉంది. అంకమ్మతల్లి గుడి అయితే, మొక్కులు, బలులు మొదలైన వాటితో గ్రామ్యపంధాలో ఉంది. దానికి విభిన్నంగా నరసింహస్వామి ఆలయం, వైదిక సాంప్రదాయ విధానంలో శుచిగా ఉన్నట్లుగా అనిపించింది. ఇక్కడి 'ఆరా' కూడా చాలా బాగుంది.
వచ్చే నెల 4. 5 తేదీలలో సరసింహ జయంతి జరుగుతుందని, రోజంతా పూజలు, భజనలు ఉంటాయని, రమ్మని ఆచార్యులు అన్నారు. 'అలాగే వస్తామని' అంటూ, 'జనం వచ్చే పర్వదినాలలో కంటే, రాని మామూలు రోజులే మాకు బాగుంటాయి. ఎప్పుడైనా వచ్చి ఇక్కడ ఆలయంలో ఒక్కడినే కూర్చుని జపధ్యానాలు అనుష్టానము చేసుకోవచ్చా?' అని అడిగాను.
'బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. అంతకంటే కావలసింది ఏముంది? వచ్చి చేసుకోండి' అని ఆయన అన్నారు.
'ప్రతి ఏకాదశికి రామనామ సంకీర్తన జరుగుతుంది. ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది వరకూ ఉంటుంది. ఆడవాళ్ళ సంకీర్తనా బృందం ఉంది. వాళ్ళు చాలా బాగా భజన చేస్తారు. మీరూ వచ్చి పాల్గొనండి' అని ఆహ్వానించారు.
'మా ఆశ్రమంలో కూడా ప్రతి ఏకాదశికి రామనామ సంకీర్తనం మొదలుపెట్టి చెయ్యబోతున్నాము. అయినా, ఇక్కడకు కూడా వస్తాను' అని ఆయనతో చెప్పాను.
దొడ్డవరం తెల్లబాడు గ్రామాలలో రామనామ సంకీర్తనం చేసే ఆడవాళ్ళ బృందాలున్నాయి. వీరిది అవధూతేంద్ర సరస్వతీస్వామి వారి పరంపర. వీరికే రఘువరదాసుగారని పేరున్నది. నా చిన్నపుడు గ్రామగ్రామాలలో రామనామ ఏకాహాలు, సప్తాహాలు వీరి అధ్వర్యంలో జరిగేవి. రామనామాన్ని తెలుగునాట గ్రామగ్రామాలలో ప్రచారం చేసి తరించిన మహనీయుడాయన. పాతతరం వారికి ఆయన సుపరిచితుడే. రామనామం మారుమ్రోగుతున్నంత వరకూ పల్లెటూర్లు ఎంతో బాగున్నాయి. కాలక్రమేణా క్రైస్తవ విషప్రచారాలతోను, ఇతర వెర్రిపోకడలతోనూ నేటి పల్లెటూర్లు ఎంతగా భ్రష్టు పట్టినప్పటికీ, ఈ నాటికీ రామనామ సంకీర్తనమే పల్లెలను కొద్దో గొప్పో రక్షిస్తున్న శక్తి అనేది నా నమ్మకం.
రామనామ సంకీర్తనను నేను చాలా ఇష్టపడతాను. దాని శక్తి నాకు బాగా తెలుసు. దానితో నా అనుబంధం ఇప్పటిది కాదు. నా చిన్నప్పటిది.
దొడ్డవరం, తెల్లబాడు గ్రామాలు రెండూ కలిసే ఉంటాయి. వీటిలో అసలు ఊరు దొడ్డవరం గ్రామమే. ఇది వెయ్యేళ్ళ క్రితం గడ్డ ఎత్తబడిన ఊరు. అప్పటిలో చోళరాజుల పరిపాలనలో ఉండేది. అద్దంకి రాజధానిగా ఉండేది. కాలక్రమంలో యాదవ రాజులు, రెడ్డి రాజులు ఈ ప్రాంతాన్ని పాలించారు.
మొదట్లో ఈ గ్రామం గడ్డను ఎత్తినది బ్రాహ్మణులే. బ్రాహ్మణులు, పెద కమ్మవారు కలసి ఈ గ్రామాన్ని స్థాపించారు. ఈ గ్రామం అసలు పేరు వీరనరసింహపురి అగ్రహారం. అందుకే వెయ్యేళ్ళనాటి నరసింహస్వామి ఆలయం ఈ ఊరిలో ఉన్నది.
ఏభై ఏళ్ళ క్రితం వరకూ ఈ ఊరిలో ముప్పై దాకా బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి. ప్రస్తుతం రెండు మాత్రమే మిగిలున్నాయి. అందరూ ఇళ్ళను పొలాలను అమ్ముకుని ఊరు ఒదిలి చదువులు, ఉద్యోగాల కోసం పట్నాలకు వెళ్ళిపోయారు. పెదకమ్మవారి కుటుంబాల పిల్లలు కూడా చాలామంది అమెరికాలో స్థిరపడ్డారు.ఆ కులంలోని పెద్దవాళ్ళు మాత్రం ఊరిలో మిగిలారు. శివాలయం వైపుగా చిన్న కమ్మవారి కుటుంబాలు ఉన్నాయి. వారు వ్యవసాయవృత్తిలో ఉన్నారు. వారిలో వాడే బత్తుల వెంకటసుబ్బయ్య. వృత్తిరీత్యా సాప్ట్ వేర్ ఇంజనీర్ అయినప్పటికీ, వేదం మీద ఆసక్తితో ఎంతో పరిశోధన చేసి, 'అతిరుద్రం- షడ్దర్శనాలు' అనే విషయం మీద సంస్కృతభాషలో Ph.D చేశాడు. జ్యోతిష్యశాస్త్రంలో M.A చేశాడు. ఇతని గురించి ఇంతకు ముందు వ్రాశాను. ఈ ఊరి ఆణిముత్యం ఇతడు. బ్రాహ్మణులు, వైశ్యులు, కమ్మవారు గాక, వడ్డెరలు, యాదవులు, మాలలు, మాదిగలు, ఇతర కులస్తులు కొంతమంది ప్రస్తుతం గ్రామంలో ఉన్నారు.
ఈ ఊరు చాలా పేరు గాంచిన ఊరు. సినీనటి భానుమతి పుట్టినది ఇక్కడే. ఇక్కడ రామాలయం వీధిలోనే ఆమె పుట్టిన ఇల్లు ఉన్నది. ఆమె తండ్రి బొమ్మరాజు వెంకటసుబ్బయ్య బ్రాహ్మణుడు. తల్లి సరస్వతి, కళావంతులని చెప్పారు. మద్రాసులో స్థిరపడి, ఎంతో పేరుప్రఖ్యాతులు సంపాదించిన తర్వాత కూడా, అప్పుడప్పుడు ఆమె తన స్వగ్రామమైన దొడ్డవరానికి వచ్చి పోయేదని ఇక్కడివాళ్ళు చెప్పారు. ఇక్కడి ఆలయ ఉత్సవాలలో ఆమె తల్లి సరస్వతి నాట్యం చేసేదని, తల్లి వెంట చిన్నపిల్ల భానుమతి వస్తూ ఉండేదని అన్నారు. సరస్వతి గారు సంగీత విద్వాంసురాలు. ఆమె దగ్గరే భానుమతి తన మొదటి సంగీత పాఠాలను అభ్యసించి ఉండవచ్చు.
సంగీత విద్వాంసులకు, కళాకారులకు, సాహిత్యప్రియులకు ఈ ఊరు పెట్టింది పేరు.
బుర్రకధకు మన దేశంలోనే
పేరు తెచ్చిన మేటి కళాకారుడు జంగం వెంకటస్వామి, ఆయన శిష్యుడు హరిజనుడైన కాకుమాను రాఘవులు
ఈ ఊరి వారే. వెంకటస్వామి గాత్రం ఎంత ఖంగుమనేదంటే, దానిని రికార్డు చేయబోతుంటే
గ్రామఫోను ప్లేటు చిట్లిపోయిందట. దీనిని ఇప్పటికీ కధగా చెప్పుకుంటారు.
ప్రఖ్యాత మృదంగ
విద్వాంసుడు శింగంశెట్టి చంద్రశేఖరం ఈ ఊరివాడే. ఈయన పక్కా కమ్యునిస్టు. కానీ
నిరంతరం కృష్ణనామాన్ని జపించేవాడు. భక్తిరసంలో ఓలలాడేవాడు.
ప్రఖ్యాత వీధి భాగవతకళాకారుడు
జక్కుల వెంకట రామదాసు ఈ ఊరిలో పుట్టినవాడే.
సాక్షాత్తు వెంకటేశ్వర
స్వామిని తన నాదస్వర గానంతో మెప్పించిన నాదస్వర ప్రవీణుడు చినబాలాజీ ఈ గ్రామస్తుడే.
(ఈ వివరాలను శ్రీ గొల్లపూడి ప్రకాశరావు రచించిన 'మా జంట గ్రామాలు' అనే పుస్తకం నుంచి గ్రహించాను)
ఇంకా ఎందరెందరో ఎన్నో రంగాలలో ప్రసిద్ధి కెక్కినవారు ఈ గ్రామం నుంచి వచ్చారు. అలాంటిది దొడ్డవరం గ్రామం. కానీ ప్రస్తుతం మాత్రం గతకాలపు సాంస్కృతిక వైభవం అంతా అంతరించింది. జనాల దగ్గర డబ్బు పెరుగుతున్నది గాని సాంస్కృతిక పేదరికం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది.
నాలుగు వేల జనాభా ప్రస్తుతం ఈ గ్రామంలో ఉన్నది. నరసింహస్వామి ఆలయానికి తోడు, ఒక రామాలయం (అసంపూర్తిగా వదలివెయ్యబడింది. చందాలు వసూలు చేసినవారు కొందరు చనిపోగా, మరికొందరు అమెరికాకు వెళ్ళిపోయారట), మాలపల్లిలోని రామాలయం, పాత శివాలయం, అంకమ్మ తల్లి గుళ్ళు రెండు, బ్రహ్మంగారి గుళ్ళు మూడు, పోలేరమ్మ తల్లి గుడి ఒకటి, శక్తి క్షేత్రం అనే అమ్మవారి గుడి ఒకటి, అయ్యప్ప స్వామి గుడి, ఈ మధ్యనే కట్టబడిన ఒక పెద్ద నల్లరాతి ఆంజనేయస్వామి విగ్రహం, ఈ విధంగా చాలా గుడులున్నాయి. ఇవిగాక మూడు చర్చిలున్నాయి. ఎవరికి వారే, వారి వారి కులగుళ్ళు కట్టుకుంటూ వాళ్ళ ఉనికిని సామాజికబలాన్ని నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నట్టు కనిపిస్తున్నది గాని, పాతకాలపు ఆలయాల సంస్కృతిని పద్ధతులను నిలబెట్టే క్రమం మాత్రం గోచరించడం లేదు. మైకులు మాత్రం మోగిపోతున్నాయి.
ఈ గ్రామానికి మాకు గల అనుబంధం ఏనాటిదో? ఎప్పటిదో? నేడు మేము ఈ గ్రామానికి చేరుకున్నాము. మా మొదటి ఆశ్రమం ఇక్కడే వస్తున్నది. మొదటి ఆశ్రమం అని ఎందుకన్నానంటే, గోదావరి తీరంలో మా ఇంకొక ఆశ్రమం రావాలన్నది నా సంకల్పం. పేరుకు చంద్రపాడు గ్రామ పరిధిలో ఉన్నప్పటికీ, ఏది కావాలన్నా మేము రావలసింది దొడ్డవరం గ్రామానికే. కనుక ప్రస్తుతానికి మేము దొడ్డవరం గ్రామస్తులమే.
ఈ ఊరుకు ఆనుకుని ఉన్న ఇంకొక గ్రామం ఇలపావులూరు. 1984 ప్రాంతాలలో మాకు బాగా పరిచయస్తుడైన IT Rao గారు ఈ గ్రామపు ఆయనే. ఆయనపేరు ఇలపావులూరి తిరుమలరావు. ఈయన గుంతకల్లు రైల్వే డివిజన్ లో TTE గా పనిచేశారు. అప్పుడప్పుడూ తన స్వగ్రామానికి వచ్చి పోతూ ఉండేవాడు. ఆ ఇలపావులూరు గ్రామం మా ప్రక్కనే ఉంది.
వేదాంత, యోగ, తంత్ర సంప్రదాయాలను సమగ్ర సమన్వయం చేస్తున్న మా ఆశ్రమం ఇక్కడ రావడం ఈ నేల చేసుకున్న పుణ్యమే అని చెప్పాలి. కానీ ఈ గ్రామస్తులకు మా ఆశ్రమ విధానాలు, ఆశయాలు అర్ధమౌతాయా? ప్రపంచంలో ఎక్కడా దొరకని అత్యున్నత ఆధ్యాత్మిక సంపద వాళ్ళ ముంగిటిలోకి వచ్చి నిలుచున్న విషయం వారికి ఎప్పటికైనా తెలుస్తుందా? దానిని అందుకోగలిగే వాళ్ళు ఒక్కరైనా ఇక్కడ కనిపిస్తారా?
ఏమో? కాలమే నిర్ణయించాలి.
4, ఏప్రిల్ 2023, మంగళవారం
ఆశ్రమవాస పర్వం ప్రారంభం
కొంచం పని ఉండటంతో 31 ఉదయాన్నే జిల్లెళ్ళమూడి నుంచి గుంటూరు వచ్చేశాము. ఒకటో తేదీ చైత్ర శుక్ల ఏకాదశి, అమ్మ పుట్టినరోజు. ఆ రోజుకు జిల్లెళ్ళమూడిలో లేము. కారణం? భరించలేనంత సౌండ్ పొల్యూషన్. ఒకేసారి పది మైకులు మోగుతున్నాయి. పండుగ అంటే, మైకులు పెట్టి గోలచెయ్యడం ఒక్కటే నేడు ఇండియాలో ఎక్కడ చూసినా కనిపిస్తోంది. ఎవరికీ సివిక్ సెన్స్ గాని, కామన్ సెన్స్ గాని కనిపించడం లేదు.
ఈ కోణంలో చూస్తే అమెరికా ఒక స్వర్గమే అని చెప్పాలి. ప్రశాంతంగా, ఎటువంటి చప్పుళ్ళు లేకుండా ఉండాలనుకునేవారికి అక్కడున్నంత సౌకర్యం ఇండియాలో లేదు. ఒక కారు హారన్ సౌండు కూడా వినకుండా ఆర్నెల్లు అమెరికాలో ఉన్నాను. ఇండియాలో అడుగుపెట్టిన మరుక్షణం అన్నివైపులనుంచీ ధ్వని కాలుష్యం మీదపడి దౌర్జన్యం చేస్తోంది. ఏం చేస్తాం? కొన్ని కావాలంటే కొన్ని ఒదులుకోక తప్పదు మరి !
అనకూడదు గాని, జిల్లెళ్ళమూడి నుండి బయటకు రాగానే, ఒక్కసారిగా మైకుల గోల మాయమై, ఎంతో ప్రశాంతంగా అనిపించింది. నరకం నుంచి బయటపడిన ఫీలింగ్ కలిగింది.
అమ్మ ఉన్నప్పుడూ ఆమెను ప్రశాంతంగా బ్రతకనివ్వలేదు ఈ భక్తులు. పోయిన తర్వాత కూడా ఆమెకు ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. ఈ భక్తుల పైనా, ఇండియా వ్యవస్థ పైనా చాలా చీదరేసింది. స్వర్గాన్ని నరకంగా మార్చడంలో ఇండియా ప్రజలు, వ్యవస్థలు ముందుంటాయి.
గుంటూరులో రెండు రోజులుండి పనులు చూసుకుని, ఈరోజున గుంటూరుకు శాశ్వతంగా గుడ్ బై చెప్పి ఒంగోలు దగ్గర చంద్రపాడు ఆశ్రమానికి వచ్చేశాము. అయిదుగురితో ఆశ్రమం మొదలైంది.
ప్రస్తుతం ఇక్కడ నేల తప్ప ఏమీ లేదు. అయితేనేం? జనాల గోలకు, మైకుల గోలకు, వాహనాల రణగొణధ్వనులకు, దుమ్ముకు, సిటీ వేడికి, వీటన్నిటికీ దూరంగా ప్రశాంతంగా ఉండే మరోప్రపంచం ఇది. అయితే, అన్ని సౌకర్యాలకూ అలవాటు పడినవారు ఇక్కడ ఉండటం, అడవిలో ఉన్నట్లే ఉంటుంది. కానీ, మనుషులకు, వాళ్ళ నిమ్నత్వాలకు, ప్రపంచపు గోలకు దూరంగా బ్రతకాలనుకునే మాలాంటి కొంతమందికి మాత్రం ఇది స్వర్గమే.
ఏదేమైనా, ఏ విధమైన సౌకర్యాలూ లేకపోయినా, అవసరమైతే పొలం మట్టిలోనే పడుకోవలసి వచ్చినా, రేపటినుంచి ఇక్కడే ఉంటూ, ఒక నెలా రెండు నెలల్లో ఆశ్రమానికి ఒక ఆకారం తేవాలని సంకల్పించాను.
అయిదో తేదీ నుంచి, అయిదుగురితో పంచవటి ఆశ్రమం మొదలౌతోంది
కొన్నేళ్ల నుంచీ నేను చెబుతూ వస్తున్న ఆశ్రమవాసపర్వం ఈ విధంగా ప్రారంభం అయింది.
21, మార్చి 2023, మంగళవారం
పంచవటి
కొడిగట్టిన దీపాలకు
క్రొత్త వెలుగునిచ్చి
మసిపట్టిన మానవాళికి
మళ్ళీ జీవం పోసిన
మహోన్నత దైవత్వం
పాండిత్యపు పంజరాలలో బందీ అయింది
దైవాన్ని భూమిపైకి
దించి తీసుకొద్దామని
రాక్షసత్వ పట్టునుంచి
భూమిని విడిపిద్దామని
చెయ్యబడిన మహాప్రయత్నం
కనపడకుండా కనుమరుగై పోయింది
అమేయమైన ఆత్మతత్త్వాన్ని
ఆచరణలో ప్రదర్శించి
మహోన్నత శిఖరంగా
మానవాళి ముందు నిలిచిన
వేదోపనిషత్తుల సారం
ప్రదక్షిణాల సంత అయింది
అవధిలేని మాతృత్వాన్ని
అక్షరాలా నిరూపించి
గొప్పగొప్ప సత్యాలను
గోరుముద్దలుగా తినిపించిన
రూపుదాల్చిన వాత్సల్యం
సాంప్రదాయ సంకెళ్ళలో సద్దుమణిగింది
మాటను గ్రహించలేని
మానవజాతి మొద్దునిద్రను
ఒక్కసారిగా వదిలించాలని
మట్టిమనుషులను మేల్కొల్పాలని
సంకల్పించిన మహామౌనం
ఎవరికీ గుర్తులేని ఏకాకి అయింది
అన్నింటినీ ఆకళింపు చేసుకున్న
అమేయమైన చైతన్యం
మానవసమూహాల రొచ్చుకు
అందనంత సుదూరతీరంలో
విశ్వపుటంచులను అన్వేషిస్తూ
తనలో తానై తదేకనిష్ఠలో నిలిచింది
20, మార్చి 2023, సోమవారం
అరుణాచల యాత్ర - 9 (సింహాన్ని సింహం గుర్తుపట్టలేదా?)
అరుణాచలంలో ఉండగా ఒకరోజున ఒక సంఘటన జరిగింది.
మేమంతా కలసి ఆశ్రమం రోడ్డులో నడుస్తూ ఉండగా, ఒక స్వామీజీ కనిపించాడు. మేము రోడ్డుకు ఇవతలవైపున్నాము. అతను అవతలవైపున్నాడు. ఒక పండ్ల బండి దగ్గర ఏదో బేరం చేస్తున్నాడు. అతని డ్రస్సు చూస్తూనే అది రామకృష్ణమఠం డ్రస్సని నేను గుర్తుపట్టాను.
'ఒక తమాషా చూడండి' అని నాతో ఉన్న శిష్యులతో చెప్పి ఆయన వైపు గబగబా నడిచాను.
'నమస్తే స్వామీజీ' అన్నాను ఆయన పక్కనే నిలబడి.
'నమస్తే' అన్నాడాయన నా వైపు చూస్తూ
'మీరు రామకృష్ణ మఠం స్వామీజీనా?' అడిగాను.
'ఒకప్పుడు' అన్నాడు.
ఇది కూడా డ్రాపౌట్ కేసేనని నాకర్ధమైంది. కొంతమంది మఠంలో బ్రహ్మచారి పీరియడ్ పూర్తి చేసుకుని, స్వామీజీలయ్యి, కొన్నాళ్లో, కొన్నేళ్లో ఉండి అప్పుడు బయటకొచ్చేస్తూ ఉంటారు. అది వాళ్ళ ఖర్మ !
కాషాయం కట్టుకున్నంతమాత్రాన ఖర్మ వదలదు కదా !
'మీరంతా ఏంటి?' అన్నాడు మా గ్రూపు వైపు చూస్తూ.
'మేము ఒక ఆశ్రమం కట్టుకుంటున్నాం. అందుకని, దానికంటే ముందు అన్ని ఆశ్రమాలూ స్టడీ చేస్తున్నాం' అన్నా
'ఆశ్రమం ఆలోచన ఎవరిది?' అన్నాడు
'నాదే' అన్నాను
'మంచిదే. కానీ మీకు ధ్యానం గురించి తెలియాలి. ధ్యానం పునాది లేకపోతే, ఆశ్రమం త్వరలోనే బోరు కొడుతుంది' అన్నాడు.
అతనేంటో నాకర్ధమైపోయింది.
'అవును. మా ఉద్దేశ్యం కూడా అదే' అన్నాను
'ఊరకే ఉద్దేశ్యం ఉంటే చాలదు. ధ్యానం గురించి కొంతకాకపోతే కొంతైనా తెలుసుకోండి' అన్నాడు స్వరం పెంచి.
నేను వెంటనే చేతులు కట్టుకుని అటెన్షన్లో నిలబడుతూ 'అలాగే స్వామీజీ. తప్పకుండా తెలుసుకుంటాము. ధ్యానం గురించి ఉపదేశించేవాళ్ల కోసమే మేమందరమూ వెతుకుతున్నాము' అన్నాను వినయంగా.
'ఇలా రోడ్లమీద వెతికితే ధ్యానం దొరకదు. ధ్యానం మీద నేనొక బుక్కు రాశాను. అది త్వరలో ప్రింట్ అవుతున్నది. చదవండి' అన్నాడు దర్పంగా .
'తప్పకుండా స్వామీజీ. కానీ మాబోటివాళ్లకు అది అర్ధమౌతుందా?' అన్నాను భయభక్తులతో చేతులు అలాగే కట్టుకుని.
'ఇన్నేళ్లొచ్చినై. ఎందుకురా నువ్వు?' అన్నట్లు జాలిగా నావైపు చూశాడు స్వామీజీ.
'సాయంత్రం రండి. నేను ఫలానా చోట ఉంటున్నాను. ఒక్క అరగంట మాత్రం మీకు టైము కేటాయించగలను. ధ్యానం గురించి మీకు ఫండమెంటల్స్ నేర్పిస్తాను. అంతకంటే టైం ఇవ్వలేను మీకు' అన్నాడు ఆయన సీరియస్ గా.
నాకు లోపల పొట్ట చెక్కలయ్యే నవ్వొస్తోంది. కానీ బయటకు బిగబట్టుకుని మౌనంగా చూస్తున్నా.
'ఓకేనా?' అన్నాడు పిల్ల స్వామీజీ గదమాయిస్తున్నట్లు.
'ఓకే స్వామీజీ. ప్రస్తుతానికి ఈ డబ్బులుంచండి' అంటూ కొంత డబ్బు ఆయన చేతిలో పెట్టాను.
ఆ డబ్బులు జేబులో పెట్టుకున్న అతను, రోడ్డు క్రాస్ చేసి చాలా విసురుగా నడుస్తూ ఒక సందులోకి వెళ్లిపోయాడు.
ఆయన మాయం కావడంతోనే అందరం ఆ రోడ్డుమీదనే పగలబడి నవ్వుకున్నాం.
'అర్థమైందా స్వామీజీలు ఎలా ఉంటారో?' అడిగాను శిష్యులవైపు తిరిగి.
'బాగా అర్ధమైంది. ఛీ ఇలాంటి వాళ్ళా స్వామీజీలు?' అన్నారు శిష్యులు.
'ఈ ట్రిప్ లో ఇదే హైలైట్ సంఘటన, మీ యాక్టింగ్ మాత్రం అద్భుతం గురూజీ' అన్నాడు గణేష్.
అందరం మళ్ళీ నవ్వుకున్నాం.
'గురూజీ నాదొక సందేహం' అడిగాడు ప్రవీణ్.
'ఏంటది చెప్పు' అన్నాను
'ఒక సింహం ఇంకొక సింహాన్ని గుర్తుపడుతుందంటారు కదా? ఆ స్వామీజీ మిమ్మల్ని గుర్తుపట్టలేదెందుకు?' అడిగాడు.
నవ్వాను.
'వెరీ సింపుల్ ప్రవీణ్. దీనికి లాజికల్ గా మూడే ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, అతనైనా సింహం కాదు. రెండు, నేనైనా సింహం కాదు. మూడు, ఇద్దరమూ సింహాలం కాదు. ఈ మూడు తప్ప వేరే కావడానికి ఆస్కారం లేదు. అన్నాను.
'అంతే కదా' అన్నాడు ప్రవీణ్
'నేను సింహాన్ని కాను. మామూలు మనిషినే. ఆ సంగతి నాకు తెలుసు. అతను సింహం అయ్యి ఉండవచ్చు. అందుకే మనల్ని చూచి అలా పారిపోయాడు, బహుశా గ్రామసింహం అయ్యుంటాడు' అన్నాను.
మళ్ళీ అందరం నవ్వుకున్నాం.
అరుణాచలం రోడ్లమీద నడుస్తూ శిష్యులతో ఇలా చెప్పాను.
'కాషాయవస్త్రాలు, ఆశ్రమాలు, పటాటోపాలు ఆధ్యాత్మిక ఔన్నత్యానికి గుర్తులు కావు. కాషాయం చూచి మోసపోకండి. గడ్డాలు పెంచిన అందరూ ఋషులనుకోకండి. నిజమైన ఔన్నత్యం సాధనతో మాత్రమే వస్తుంది. సాధనాబలం లేనప్పుడు ఉత్తవేషం ఎందుకూ పనికిరాదని గ్రహించండి'.
ఇదంతా వింటున్న మరొక శిష్యుడు ఇలా అడిగాడు
'మరి మీరెందుకు ఆ స్వామీజీకి డబ్బులిచ్చారు?'
ఇలా వివరించాను.
'శ్రీ రామకృష్ణుల పేరుమీద అతను సన్యాసి అయ్యాడు. దానికి నేను విలువనిచ్చాను. ఈ మనిషికి నేను విలువనివ్వలేదు. శ్రీ రామకృష్ణులకు ఇచ్చాను. అతనికా డబ్బు ఇచ్చింది కూడా ఆయనే. సంస్థను వదిలేసి వచ్చినా కూడా అతన్ని రామకృష్ణులు అలా కాపాడుతున్నారు. అది ఆయన కరుణకు నిదర్శనం. ఆ విషయం ఈ స్వామీజీ ఎన్నటికీ గ్రహించలేడు. గ్రహించే దృష్టి అతనిలో లేదు. సన్యాసిగా అయిన తరువాత అతను మఠాన్ని వదలిపెట్టి బయటకు వచ్చినట్లున్నాడు. అది అతని ఖర్మ. మనకనవసరం.
ఏదేమైనప్పటికీ అతనొక సాధువు. పాపం వాళ్లకు ఆదాయం ఏముంటుంది? మనలాగా వాళ్లకు పొద్దున్నే కాఫీలు, టిఫిన్లు ఇచ్చేవాళ్ళు ఎవరుంటారు? మనం ఇచ్చిన డబ్బుతో ఆయనకు రెండు రోజుల భోజనం దొరికితే చాలు. ఆయన సక్రమంగా ఉంటే ఇంకా ఇచ్చి ఉండేవాడిని. అతని అహంకారమే అతన్ని పాడుచేసింది. మనల్ని గుర్తించకుండా అతనికి అడ్డుపడినది కూడా ఆ అహమే. అహంకారం వల్ల, తన జీవితంలో ఒక గొప్ప అవకాశాన్ని ఈ స్వామీజీ కోల్పోయాడు. అహాన్ని పెంచే కాషాయం కషాయం అవుతుంది. మాయాప్రభావం ఇలా ఉంటుందని గ్రహించండి'. అన్నాను
'ఇది మాకందరికీ గొప్ప పాఠం గురూజీ' అన్నారు శిష్యులు.
'అవును. ఇంతటితో అతన్ని వదిలెయ్యండి. అతని ఖర్మ అతనిది. పదండి మంచి టీ త్రాగుదాం' అన్నాను.
అందరం కలసి ఆశ్రమం ఎదురుగా ఉన్న టీ హోటల్ వైపు దారితీశాము
16, మార్చి 2023, గురువారం
జ్యోతిష్యం హోమియోపతి సలహాలు ఇకపైన అడక్కండి
అరుణాచల యాత్ర - 8 (చంద్రశేఖర్ తో సంభాషణ)
15, మార్చి 2023, బుధవారం
ఆరోవిల్ సౌండ్ గార్డెన్ సందర్శన
ఆరోవిల్ లో ఉన్నపుడు ఒక రోజున సౌండ్ గార్డెన్ ను సందర్శించాం.
అక్కడ సప్తస్వరాలను పుట్టించే రకరకాల సంగీత పరికరాలను తయారుచేసి అమ్ముతున్నారు. అక్కడున్న ఒక హాంకాంగ్ భక్తుడు మాకు వాటిని గురించి వివరించాడు. అలా వివరిస్తూ యోగచక్రాలకు సప్తస్వరాలకు సంబంధం ఉందని అతనన్నాడు. చూడబోతే ధ్యానసాధకుడిలాగే కనిపించాడు. చైనా జాతీయుడు.
అతని వివరణ అంతా అయిపోయాక పక్కకు పిలిచి ఇలా అడిగాను.
'మీరు అంతరిక నాదాన్ని విన్నారా?'
అతను ఎగాదిగా చూశాడు.
'లేదు' అన్నాడు.
నవ్వాను.
'మీరెన్నాళ్లనుంచీ ఇక్కడుంటున్నారు?'
'ఆరేళ్ళనుంచీ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ సాధన చేస్తూ ఇక్కడే ఉంటున్నాను' అన్నాడతను.
'మీరు తైచీ, కిగాంగ్, జెన్ అభ్యాసం చేస్తారా?'
'లేదు నాకవి తెలీదు. నేను అరబిందో గారి ఇంటెగ్రల్ యోగ సాధకుడిని'అన్నాడు.
'పోనీ ఒక విషయం చెప్పండి. ఇంటెగ్రల్ యోగా లో ఉన్నత స్థాయిలు అందుకున్న సాధకులు ఎవరైనా మీకు తెలుసా? పుస్తకాలు చదివి మాటలు చెప్పేవాళ్ళు కాదు. అనుభవజ్ఞానం ఉన్నవాళ్లు'
ఆతను మళ్ళీ ఎగాదిగా చూశాడు.
'అనుభవం అంటే దానిని మాటల్లో చెప్పడం కష్టం కదా?' అన్నాడు.
'సరే వినండి. అరబిందో గారి యోగపరిభాషలోనే అడుగుతాను. ఓవర్ మైండ్, సూపర్ మైండ్ స్థాయిలను అనుభవంలో అందుకున్నవాళ్ళు మీకు తెలిసినవాళ్లలో ఎవరైనా ఉన్నారా?'
అతను తల అడ్డంగా ఆడించాడు.
'మీరు ఇక్కడే ఉంటే ఎవరో ఒకరు కలుస్తూ ఉంటారు. ఇప్పుడు మనం కలుసుకున్నట్లే' అన్నాడు.
అతని నిజాయితీ నాకు నచ్చింది.
'ఉత్తమాటలు చెప్పేవాళ్ళతో లోకమంతా నిండి ఉంది. సాధనానుభవాలలో ఔన్నత్యాలను అందుకున్నవాళ్ళు మాత్రం ఎక్కడా లేరు' అని శ్రీ విద్యారహస్యం పుస్తకంలో పదేళ్లక్రితం నేను వ్రాసిన మాటలు గుర్తొచ్చాయి.
'ఐ లైక్ యువర్ సిన్సియారిటీ. థాంక్స్. నమస్తే' అని అతనితో చెప్పి 'పదండి పోదాం' అన్నాను శిష్యబృందంతో.






.jpeg)
.jpeg)
.jpeg)


.jpeg)
.jpeg)


.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)

.jpeg)
.jpeg)
.jpeg)


