27, అక్టోబర్ 2022, గురువారం

మూడవ అమెరికా యాత్ర - 47 ( ప్రశ్నలు - జవాబులు )

మన 'ప్రశ్నలు - జవాబులు' శీర్షికను మూలబెట్టి చాలారోజులైంది. మళ్ళీ ఒకసారి మన మెయిల్స్ లోనుంచి కొన్ని తీసుకుని పారాయణం చేసుకుందాం.

ఒక ICU బాధితుడు

ప్రశ్న : అయిదేళ్ల క్రితం మా నాన్నగారికి AIDS తో సీరియస్ అయ్యి ICU లో ఉండగా మీకు ఫోన్ చేశాను. మీరు ప్రశ్న చూచి కొన్ని రెమెడీలు చెప్పారు. కానీ వాటిని చెయ్యడానికి నాకు కుదరలేదు. కారణం? మా అన్నయ్య వద్దన్నాడు. అందుకే మీ మాట వినలేకపోయాను. మా నాన్న చనిపోయాడు. ఇప్పుడు మా బాబాయి మళ్ళీ అదే ICU లో ఉన్నాడు. మీ పాత నంబర్ కు ఫోన్ చేస్తే కలవడం లేదు. అందుకే email ఇస్తున్నాను. మా బాబాయికి డ్రింక్ అలవాటుంది. ఎక్కువై లివర్ చెడిపోయి ప్రస్తుతం ICU లో ఉన్నాడు. ఏం చెయ్యమంటారు?

నా రిప్లై : చాలా సంతోషం నాయన ! మీ కుటుంబ సభ్యులలో ఎవరైనా ఒకరు ICU లో ఉన్నపుడే నేను గుర్తొస్తానన్నమాట. మరి మీ అన్నయ్య ఇప్పుడెక్కడున్నాడు? మళ్ళీ నేను చెప్పడం, మళ్ళీ ఆయన వద్దనడం ఇదంతా ఎందుకు గాని, ఒక మాంచి రెమెడీ చెబుతా విను. మీ బాబాయి దిండు కింద సీసా ఉంటుంది. సైలెంట్ గా ICU లోనుంచి దానిని బయటకు తెచ్చి, నువ్వు కొట్టేసి, బయట బెంచీమీద హాయిగా రిలాక్స్ అవ్వు. ఏ సమస్యకైనా సరే, దీనిని మించిన రెమెడీ లేదు. మధ్యలో మీ అన్నయ్య అడ్డొస్తే అతనికి కూడా పట్టించు. అతన్ని పక్క బెంచీమీద పడుకోమను. ఏదైనా న్యూస్ ఉంటే, ఆస్పత్రివాళ్ళే మీ ఇద్దరినీ లేపుతారు. నా పాత ఫోన్ నంబర్ మారిపోయింది.  చెయ్యకు. కలవదు. ఉంటా మరి !

ఒక సంతాన బాధితురాలు

ప్రశ్న : మా అబ్బాయి చిన్నప్పటినుండీ అదోరకంగా ఉండేవాడు. ఆరేళ్ళ క్రితం మిమ్మల్ని కన్సల్ట్ చేస్తే, తేడాగా ఉన్నాడని, కొన్ని రెమెడీలు చెప్పారు. కానీ వాటిని చెయ్యలేదు. మా ఆయన అయ్యప్పభక్తుడు. గురుస్వామి కూడా. సాయిబాబా ఆయన కలలో కనిపించి, మీ రెమెడీలు వద్దని, కొన్ని వేరే రెమెడీలు చెప్పాడు. వాటిని చేశాము. రెమెడీలు వికటించాయేమో? తెలీదు. మావాడు LGBTQ గా మారిపోయాడు. పెళ్లొద్దంటున్నాడు. చేసుకుంటే గింటే, వాడి స్నేహితుడిని చేసుకుంటానని అంటున్నాడు. ఇద్దరూ చిన్నప్పటినుంచీ ఒకే స్కూలు, ఒకే కాలేజి. చిన్నప్పటినుండీ లవ్వట. మాది 'జన్మజన్మల బంధం' అంటున్నాడు. ప్రస్తుతం మంచి కంపెనీలో ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లే. మేము గనక ఒప్పుకోకపోతే సూయిసైడ్ చేసుకుంటానని బెదిరిస్తున్నాడు. ఏం చెయ్యమంటారు?

నా రిప్లై : అమ్మా ముందుగా నీకో దణ్ణం. నీకు రెమెడీలు చెప్పబోయేముందు నాకున్న కొన్ని సందేహాలు తీర్చు తల్లీ. మీ ఆయన అయ్యప్పభక్తుడు కదా, ఆయనకు అయ్యప్ప కలలోకి రావాలి గాని, సాయిబాబా రావడమేంటి? మీ ఆయనే ఏదో తేడాగా ఉన్నాడు. మరి మీ అబ్బాయి అలా ఉండటంలో వింత లేదని నాకనిపిస్తోంది. విధి బలీయం తల్లీ. నువ్వూ నేనూ ఏం చెయ్యగలం చెప్పు. నా మాట విను. ముందుగా మీ అబ్బాయిని చేసుకోవడం ఆ అబ్బాయికి ఇష్టమో కాదో విచారించండి. ఆ తరువాత, మంచి ముహూర్తం చూసి ఆ ఫ్రెండ్స్ ఇద్దరికీ పెళ్లి చేసెయ్యండి. పీటలమీద మీ దంపతులే కూర్చోండి. కొడుకైనా, కూతురైనా ఒకటేలే అనుకుని, కన్యాదానం చెయ్యండి. ప్రస్తుతకాలంలో, ఇంతకంటే మంచి రెమెడీ నేను చెప్పలేను. పోతే, ఆ సాయిబాబాను ఒక్కసారి నా కలలోకి రమ్మని మీ ఆయనచేత రికమెండేషన్ చేయించు తల్లీ. ఎప్పటినుంచో తీరని కోరికగా ఉంది. ఉంటా మరి.

ఒక ఆశపోతు సందేహం

ప్రశ్న: ఏమండి? మీరు పెద్ద జ్యోతిష్కులని మీ పుస్తకాలను చదివితే అర్ధమైంది. మీకేగాక మీ శిష్యులకు కూడా న్యూమరాలజీ వచ్చని విన్నాను. మరి ఏదైనా లాటరీ టికెట్ నంబర్ మాకు చెప్పచ్చు కదా. మీరు ప్రస్తుతం US లో ఉన్నారు కదా. అక్కడ Power Ball అనే బంపర్ లాటరీ ఉంటుంది. మీరు కూడా దానిని ట్రై చెయ్యవచ్చు కదా కనీసం?

నా రిప్లై : ఇలాంటి ఆలోచన ఇంతవరకూ నాకు రాకపోవడానికి నాకే సిగ్గుగా ఉంది నాయన ! తప్పకుండా ఇవాళే ఆ లాటరీ టికెట్ కొంటాను. అంతేకాదు, రేపే లాస్ వెగాస్ వెళ్లి అక్కడే ఒక వారంపాటు తిష్ట వేసి, అన్నీ చూసేసి, అడ్రస్ లేకుండా అయిపోతాను. అయినా నీ పిచ్చిగాని, అలాంటి లాటరీల వెంట పడేవాడినైతే, నలభై ఏళ్ళు రైల్వేలో గాడిదచాకిరీ ఎందుకు చేస్తానురా పిచ్చినాగన్న? ఏదేమైనా, మంచి సలహా ఇచ్చావ్. చాలా థాంక్స్ నాయన ! పోతే నాదొక రిక్వెస్ట్. నా శిష్యులలో ఇటువంటి న్యూమరాలజీ ఎక్స్ పర్ట్ లెవరో కొంచం నాకు పేర్లు చెప్పు. వెంటనే వారిని నా గ్రూప్ లోనుంచి తొలగించి చేతులు కడుక్కోవాలి. బై.

ఒక ఆధ్యాత్మికుడి అనుమానం

ప్రశ్న : గురువుగారు. నేను లాగు వేసుకోవడమైనా మరచిపోతానేమో గాని, మీ బ్లాగు చదవకుండా మాత్రం ఒక్కరోజు కూడా ఉండలేను.  చాలా మంచి విషయాలు రాస్తున్నారు.  అయితే నాదొక్క సందేహం. మీకు కర్ణపిశాచి తరచుగా కన్పిస్తూనే ఉంటుందని మాకు తెలుసు.  అయితే, ఈ మధ్యన బాబాజీ కూడా కనిపించాడని రాశారు. ఇదెలా సాధ్యం? అదేమో పిశాచం, ఈయనేమో బాబాజీ. ఇద్దరూ మీకెలా కనిపిస్తారు? పైగా అమెరికా వచ్చి ఎలా కనిపిస్తారు? ఇదేదో అనుమానంగా ఉంది. ఈ సందేహాన్ని తీర్చండి.

నా రిప్లై: చూడు నాయనా. తొందరేమీ లేదు. ముందు ప్యాంట్ వేసుకుని, ఆ తర్వాత తీరిగ్గా నా బ్లాగు చదువు. ఇక్కడేమీ కొంపలు మునిగిపోవడం లేదు. నీకు చాలా గొప్ప సందేహం వచ్చింది. నేను వ్రాసేవన్నీ అబద్దాలేనని నీకూ అర్ధమైందన్న మాట. చాలా సంతోషం. కర్ణపిశాచి, బాబాజీ ఇద్దరూ ప్రస్తుతం ఇండియా లోనే ఉన్నారు. ఇక్కడకి రావడానికి వాళ్లకు వీసా దొరకడం లేదు. అయితే, అమెరికాలో కూడా పిశాచాలు, బాబాజీలు బోల్డు మందున్నారు. ఇక్కడ ప్రతిదీ ఒక పిశాచమే. ప్రతివాడూ ఒక బాబానే. అది హెడ్డాఫిసు, ఇవి బ్రాంచాఫీసులు.  అంతే తేడా. అందుకని, వాళ్ళు ఫోన్ చేసి చెబితే, వీళ్లొచ్చి నాకు కనిపిస్తారన్నమాట ! అర్థమైందా? ఇక తీరిగ్గా ప్యాంటేసుకో.

ఒక జ్యోతిష విద్యార్థి సందేహం

ప్రశ్న: గురూజీ ! మీ పుస్తకాలు చదివాను. ముఖ్యంగా మెడికల్ ఆస్ట్రాలజీ బాగా నచ్చింది. నాకు జ్యోతిష్యమంటే మహాపిచ్చి. మీ దగ్గర నేర్చుకుందామని అనుకుంటున్నాను. ఇప్పటికే మార్కెట్లో ఉన్న పుస్తకాలన్నీ చదివేశాను. అవిగాక, నెట్లో పడి రాత్రీ పగలూ జోతిష్యం గురించి చదువుతూనే ఉంటాను. ఒక్క మూడు నెలలలో నాకు జ్యోతిష్యం నేర్పగలరా? మీరెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను.

నా రిప్లై : ఇన్నాళ్లు ఎక్కడున్నావ్ నాయన ! నీలాంటి పిచ్చివాడికొసమే ఎదురు చూసిచూసి, నాకు పిచ్చి ముదిరిపోయింది. నీకు మహాపిచ్చని నీ మెయిల్ చదివినప్పుడే అర్థమైంది. అది నాకెక్కిద్దామని నీ ప్రయత్నమా? నాకే చాలా ఉంది. ఇంక నువ్వేం ఎక్కిస్తావు చెప్పు? ఒక నిజం చెప్తాను విను! జ్యోతిష్యం వేస్ట్ నాయన! జరిగేది ఎలాగూ జరుగుతుంది. దానిని నువ్వూ మార్చలేవు. నేనూ మార్చలేను. ఇంకెందుకు దానిని ముందే తెలుసుకుని ముందునుంచే ఏడవడం? అయినా, జ్యోతిష్యం నేర్చుకోడానికి మూణ్ణెళ్ళెందుకు నాయన? మూడురోజులు చాలు. వెంటనే వచ్చెయ్.  నేను ప్రస్తుతం డెట్రాయిట్ అమెరికాలో ఉన్నాను. నువ్వెప్పుడొస్తే అప్పుడే మూడ్రోజుల క్రాష్ కోర్స్ లో నీకు నేర్పిస్తాను. నేను 2000 లో జ్యోతిష్యం MA చేశాను. కానీ నేటికీ కూడా నాకు జ్యోతిష్యం పూర్తిగా అర్ధం కావడం లేదు. అయినా పరవాలేదు. నాకున్న మిడిమిడి జ్ఞానాన్నే నీకూ  నేర్పిస్తాను. కాకపోతే, ఇండియాకు నా రిటన్ విమాన ఖర్చులు నువ్వే పెట్టుకోవాలి. నాతోబాటు నా శిష్యులు ఒక పదిమంది మాత్రమే ఉంటారు. సరేనా. బి క్విక్. నీ రాకకోసం ఎదురుచూస్తూ ఉంటాను.

ఇలా ఉంటాయి - 'ప్రశ్నలు - జవాబులు'.

ఎక్కువైన సమాచారం, చేతులో ఉన్న పిచ్చిడబ్బు, తీరికలేని జీవితాలు, విలువలు లేని బ్రతుకులు, పెరుగుతున్న అతితెలివి - ఇవీ కారణాలు.

ఏమ్ చేస్తాం? బుద్ధి కర్మానుసారిణి !

read more " మూడవ అమెరికా యాత్ర - 47 ( ప్రశ్నలు - జవాబులు ) "

25, అక్టోబర్ 2022, మంగళవారం

మూడవ అమెరికా యాత్ర - 46 ( గాయత్రీ సాధన )

గాయత్రీమంత్రం అందరికీ తెలుసు. అది వేదమంత్రాలలోకెల్లా అత్యున్నతమైన మంత్రం. గాయత్రికి వేదమాతయని పేరు. తాంత్రిక గాయత్రి, రహస్య గాయత్రి, ఇంకా ప్రతిదేవతకూ ఒక గాయత్రీమంత్రం ఉన్నప్పటికీ, లేదా తర్వాతివాళ్ళు తయారు చేసినప్పటికీ, వేదమాతయైన గాయత్రి ఈ అన్నింటికంటే ఉత్తమమైనది. ఈ గాయత్రిని జపించేవారు ఇండియాలో కోట్లాదిమంది ఉన్నారు.

కానీ, ప్రతిరోజూ సంధ్యావందనం చేస్తూ, గాయత్రిని మొక్కుబడిగా జపిస్తున్న కోట్లాదిమందిలో కూడా ఎవరికీ తెలియని రహస్యసాధన ఒకటుంది, అదే గాయత్రీసాధన. దీనిలో వేద, యోగ, తంత్రమార్గముల సమన్వయపూర్వకమైన సాధనావిధానం ఉంటుంది. ఇది పుస్తకాలలో ఎక్కడా దొరకదు. గురుశిష్యపరంపరలో అనూచానంగా వస్తూ ఉంటుంది. అన్ని రహస్యసాధనలలాగే, బయట ఎవ్వరూ దీనిని గురించి మాట్లాడరు. 'గాయత్రి మా సొత్తు' అని చెప్పుకునే గాయత్రీ పరివార్ వారికి కూడా ఈ సాధన తెలియదు.

ఈ గాయత్రీసాధన చేసేవాడికి, ఇతర ఏ పూజలుగాని, దీక్షలు గాని, సాధనలు గాని, వ్రతాలు గాని, మొక్కులు గాని, తీర్ధయాత్రలు గాని, గుళ్ళూ గోపురాలూ తిరగడం గాని ఏవీ అవసరం ఉండదు. ఇల్లు కదలకుండా ఇదొక్కటే అత్యున్నతమైన సిద్ధిని కలిగిస్తుంది. అలాంటి మహోన్నతమైన సాధన ఇది.

అయితే, దీనిని గురూపదేశ పూర్వకంగానే స్వీకరించాలి. ఎందుకంటే, గురువుయొక్క సాధనాశక్తి అనేది దీక్షాసమయంలో శిష్యునికి ఇవ్వబడుతుంది. ఈ ప్రాసెస్ చాలా సూక్ష్మంగా ఉంటుంది. కాలక్రమేణా ఈ సత్యం, దీక్షను స్వీకరించిన శిష్యునికి తెలియవస్తుంది. కొంతమందికి వెంటనే అనుభవంలోకి వస్తుంది, కొంతమందికి కాలక్రమంలో తెలుస్తుంది. అదంతా వారి వారి సంస్కారములకు అనుగుణంగా జరుగుతుంది.

అటువంటి గాయత్రీదీక్షను, మొన్న అమెరికాలో ఒక శిష్యునికి ఇచ్చాను.

ఇన్నేళ్ళుగా నాతో పరిచయం ఉన్నవారిలో ఎవ్వరికీ ఈ దీక్షను ఇవ్వలేదు. కారణం? వారికి ఇవ్వమని నాకు  ఆదేశం రాకపోవడమే. ఈ అబ్బాయికి ఇవ్వమని ఆదేశం వచ్చింది. అతనడగలేదు, కానీ ఇవ్వమని నాకు ఆదేశం వచ్చింది. మొన్న ఒక వీకెండ్ లో  నేనున్న చోటకు అతనిని పిలిచి మరీ ఈ దీక్షనిచ్చాను.

నా దగ్గరకు వచ్చిన వందలాదిమందిలో ఇతడే ప్రప్రధమంగా ఈ దీక్షను స్వీకరించినవాడు.

ఆధ్యాత్మికమార్గంలో ఎవరి అర్హతను బట్టి వారికి లభిస్తుందని, దీనికి చోటుతో, సమయంతో సంబంధం ఉండదని, నేను ఎప్పుడూ చెప్పేమాట ఈ విధంగా మళ్ళీ ఋజువైంది.

read more " మూడవ అమెరికా యాత్ర - 46 ( గాయత్రీ సాధన ) "

మూడవ అమెరికా యాత్ర - 45 ( కొంచెం ఎదగండిరా బాబు )

నిన్న రాత్రి ఇక్కడ దీపావళి. పండగ కదా అని, మావాడు ఉంటున్న అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ కు వెళ్ళాను. చీకటిపడే వరకూ కూర్చుని మాట్లాడిన తర్వాత, కాసేపు బయట తిరిగి చూద్దామని, కాలనీలో కాసేపు వాకింగ్ చేశాను.

ఆ అపార్ట్ మెంట్ కాలనీలో ఎక్కువశాతం మన ఇండియన్సే ఉంటారు. తెలుగువాళ్లే కాకుండా, ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన ఇండియన్స్ కూడా చాలామంది ఉంటారు. నిదానంగా మెయిన్ రోడ్డు వరకూ నడుస్తూ అంతా గమనించాను. ప్రతిచోటా, మనవాళ్ళు కుటుంబాలతో సహా చేరి ఆరుబయట లాన్స్ లో టపాకాయలు కాలుస్తూ కనిపించారు. ఒకచోటయితే, పొగ చాలా ఎక్కువగా వస్తూ, దూరానికి ఏదో తగలబడుతోందా అన్నంతగా ఉంది. అలా కాలుస్తున్న ఇండియన్స్ లో మిగతా రాష్ట్రాలవాళ్ళ కంటే, తెలుగువాళ్లే ఎక్కువగా ఉన్నారు. వాళ్ళమీద చాలా జాలేసింది.

ఎంత అమెరికా వచ్చినా, నాలుగు డబ్బులు సంపాదించినా, అజ్ఞానం ఎలా పోతుంది? నేలబారు చవకమనస్తత్వాలు ఎలా పోతాయి? పోవు. అందుకే అమెరికాలో కూడా టపాకాయలు కాలుస్తూ గోల చేస్తున్నారు. అదేమంటే 'ఇండియన్ కల్చర్' అంటారు.

గతంలో ఇదేవిధంగా ఇండియన్ కల్చర్ గురించి ఒకబ్బాయి చాలాసేపు నాతో మాట్లాడాడు.  అతని దృష్టిలో ఇండియన్ కల్చర్ అంటే, పాపులర్ పండగలు చేసుకోవడం, వాటిల్లో కొత్త డ్రస్సులు వేసుకుని, రకరకాల తిండ్లు వండుకొనో, బయటనించి ఆర్డర్ చేసుకోనో తిని, సినిమాలు చూసి, గోల చెయ్యడం అంతే. అతని దృష్టిలో అదే ఇండియన్ కల్చర్.

వినీ వినీ, అతన్ని ఇలా అడిగాను.

'చూడమ్మా. ఇదే పనులు ప్రపంచంలో అన్ని దేశాల ప్రజలూ చేస్తారు. వాళ్ళకీ పండగలుంటాయి.  ఆ పండుగలలో వాళ్ళు కూడా ఇవే పనులు చేస్తారు. తిండి, గోల, ఎగురుడు, పోసుకోలు మాటలు, ఒకళ్ళ ఇంటికి మరొకళ్ళు రాకపోకలు. సరదాలు. అని దేశాలలో, అన్ని జాతుల్లో కొద్దో గొప్పో  తేడాలతో ఇవే పనులు జరుగుతాయి. మరి అందరి కల్చరూ ఒకటేగా అప్పుడు? 'తినుము, త్రాగుము, సుఖించుము' - ఇది బైబిల్ సూక్తి. మరి అందరూ బైబిల్ ని పాటిస్తున్నట్లా?'

అప్పటి దాకా అతను మాట్లాడినదంతా గాలికెగిరి పోయింది.

'అదేంటండి? మన పూజలు మనకుంటాయి కదా? అన్నీ ఒకటే ఎలా అవుతాయి?' అన్నాడు.

'పూజలు మనకే కాదు నాయనా అందరికీ ఉంటాయి. ఎవరి పూజలు వాళ్ళకుంటాయి. అడివి మనుషులలో కూడా వాళ్ళ పూజలు వాళ్ళకుంటాయి? ఏంటి మీ గొప్ప? తేడా ఏముంది? అందరూ కామన్ గా చేసేది తినడం, గోలచెయ్యడం ఇంతే కదా?' అన్నాను.

సమాధానం లేదు.

దీపావళిని జరుపుకోవడం తప్పని నేననడం లేదు. కానీ ఎలా జరుపుకోవాలో మనవాళ్లకు తెలియడం లేదు.  సెన్స్ లేకుండా  రాత్రి పదిగంటలు దాటాక కూడా టపాకాయలు కాల్చి గోలచెయ్యడం మాత్రమే భారతీయ సంస్కృతి కాదు.  అసలు చెప్పాలంటే, ఇదికాదు భారతీయ సంస్కృతి. దీపావళి వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్ధాలు అందరూ మర్చిపోయారు.  పైపైన కాకిగోల మాత్రం మిగిలింది. దానినే 'ఇండియన్ కల్చర్' అనుకుంటున్నారు. అమెరికా వచ్చిన ఇండియన్స్ కూడా ఇదే భ్రమలలో ఉన్నారు. పైగా అదేదో గొప్పగా, అమెరికన్లకు తెలియనిది తామేదో నేర్పిస్తున్నట్లు  గర్వంగా ఫీలౌతున్నారు. వాళ్ళేమో 'లేకి వెధవలు' అని తిట్టుకుంటున్నారు ఎంత ఖర్మో?  

ఇండియన్ కల్చర్ అంటే, పంచెలు చీరలు, పరికిణీలు కట్టుకుని అందరూ ఒకచోట చేరి, బాలీవుడ్ సినిమా పాటలకు డాన్సులు చేసి, తిని, త్రాగి గోలచెయ్యడం కాదురా బాబూ ! ఎలా చెబితే మీకర్థమౌతుంది? మన ప్రతి పండుగ వెనుకా ఒక ఆధ్యాత్మిక అర్ధం ఉంది. ఒక సాధనావిధానం ఉంది. మన మతం ఒక జీవన విధానం. దానిని మర్చిపోయి, ఎంతసేపూ వండుకొని, నైవేద్యాల పేరుతో మీరు మెక్కి, మీరు చేసే గోలతో ప్రకృతిని పాడుచెయ్యడం కాదు ఇండియన్ కల్చరంటే.

మనవాళ్లతో పోలిస్తే, ఇక్కడి అమెరికన్స్ చాలా నయం. వాళ్ళు కూడా, జూలై నాలుగున టపాకాయలు కాలుస్తారు. అయితే, మనవాళ్ల లాగా ఎవరి ఇళ్ళదగ్గర వాళ్ళు చెత్త చెయ్యరు.  అందరూ ఒక గ్రౌండ్ కు చేరుకుంటారు. చక్కగా కూర్చుంటారు. టపాకాయలు కాల్చే బ్యాచ్ ఒకటుంటుంది.  వాళ్ళు కాలుస్తారు. మిగతావాళ్ళు దానిని చూస్తూ ఎంజాయ్ చేస్తారు. ఆ టపాకాయలు కూడా, ఎక్కువగా, ఒక మితం లేకుండా కాల్చరు. గాలిమొత్తం పొగతో నిండిపోయి అందరికీ దగ్గులు, ఆస్మాలు వచ్చేటంతగా కాల్చరు. వాళ్ళ సెలబ్రేషన్ లో ఒక డీసెన్సీ, ఒక డిగ్నిటీ ఉంటాయి. మనవాళ్లకు ఆ రెండే ఉండవు. మనవాళ్ల సెలబ్రేషన్ వెకిలిగా, చాలా చీప్ గా ఉంటుంది.

అమెరికన్స్ కూడా 'ఫెస్టివల్ ఆఫ్ లైట్స్' పండుగను చేసుకుంటారు. ఇళ్లలో దీపాలను పెడతారు. అంతే. డీసెంట్ గా ఉంటుంది. అయితే వాళ్ళ గోలలు వాళ్ళకీ ఉన్నాయి. హాలోవీన్ అనే దరిద్రం వాళ్ళకీ ఉంది. దయ్యాల్లాగా భూతాల్లాగా వేషాలు వేసుకుని రోడ్లమీద తిరుగుతారు. ఆఫీసులకు కూడా వెళతారు. అందులో బెస్ట్ వేషానికి ప్రయిజు కూడా ఉంటుంది ఆఫీసులో. ఇళ్లల్లో ఎముకలు, పుర్రెలు, మొదలైన చెత్తతో అలంకరిస్తారు. ఇదే విధంగా ప్రతి మతానికీ సోకాల్డ్ కల్చర్లు ఉన్నాయి.  బక్రీద్ అంటూ, లక్షలాది మేకలను, గొర్రెలను చంపి తింటారు ముస్లిమ్స్. అది కూడా మానవుడి చీప్ ప్రవర్తనకు ఒక రుజువే. అదసలు అవసరమా? ఆకారమే లేని అల్లాకి మేకల బలులెందుకు? ఆకారం లేనివాడు, ఎలా తింటాడు? తినేది మీరేగాని అల్లా కాదుగా?  ఈ విధంగా ప్రతి జాతిలోనూ లేకి పండుగలున్నాయి. దురదృష్టవశాత్తూ వాటికి 'కల్చర్' అని పేరు పెట్టి కొనసాగించుకుంటున్నారు. అదేంటంటే, ,'వాళ్ళు చేస్తున్నారుగా, మేం చేస్తే తప్పేంటి?' అంటారు. ఇదొక లాజిక్కా అసలు? వాడు చేస్తున్నాడని వీడు, వీడు చేస్తున్నాడని వాడు, అందరూ కలసి ప్రకృతిని పాడు చేస్తున్నారు. అకాల వర్షాలు, వానలు, వరదలు, కోవిడ్లు వచ్చి చస్తున్నారు. కానీ బుద్ధులు మారడం లేదు. 'మేం చేసేదానివల్ల కాదులే' అని ప్రతివాడూ అనుకుంటాడు. కానీ దానిపాత్ర కూడా ఉందని, ఇలా అందరి పాత్రలతోనే, మన యాత్ర సమాప్తం అవుతున్నదన్న స్పృహ మాత్రం ఎవరిలోనూ లేదు. 

అలాంటి వాటిల్లో ఒకటి, మనవాళ్ళు అమెరికాకు వచ్చికూడా దీపావళి పేరుతో టపాకాయలు కాల్చి, వాతావరణ కాలుష్యం చెయ్యడం. అదికూడా రాత్రి పది తర్వాత.

సగటు మానవుడి మనస్తత్వం ఎప్పటికీ ఇలాగే నేలబారుగా, చౌకబారుగా ఉంటుందేమో? క్లాస్ గా,  డీసెంట్ గా, పక్కవాడికి, ప్రకృతికి హానిచేయ్యకుండా బ్రతకడం మనిషికి చేతకాదేమో?

మన పండుగలు ఇలా చౌకబారువి కాదురా బాబు. అర్ధం చేసుకోండి. వీటిని జరుపుకునే విధానం ఇది కాదు.

ఇప్పటికే, ఇండియన్స్ అంటే ఇండీసెంట్ ఫెలోస్ అని చాలామంది అమెరికన్లు అనుకుంటారు. ఆ ఇమేజిని మీ ప్రవర్తనతో మార్చండి. కనీసం మన దేశగౌరవాన్ని పెంచేలా ప్రవర్తించండిరా.

కొంచెమైనా ఎదగండిరా బాబు !

read more " మూడవ అమెరికా యాత్ర - 45 ( కొంచెం ఎదగండిరా బాబు ) "

మూడవ అమెరికా యాత్ర - 44 (రిషి సునక్ - బ్రిటన్ కు ఇండియా దీపావళి గిఫ్ట్ )

ఈరోజున దీపావళి అమావాస్య సూర్యగ్రహణం. ఈ సూర్యగ్రహణం అమెరికాలో లేదుగాని, యూరప్, ఇండియాలలో పూర్తిగా ఉంది. గ్రహణం గురించి, దాని ప్రభావాల గురించి నేనేమీ వ్రాయబోవడం లేదు. ఏమంటే, అదంతా వ్రాసే చిల్లర జ్యోతిష్కులు చాలామంది లోకంలో సందుసందుకీ ఉన్నారు. 'ఈ రాశివారికి బాగాలేదు, ఆ రాశివారికి బాగాలేదు. మా దగ్గర పూజలు చెయ్యండి, డబ్బులు కట్టండి, హోమం చేసి బూడిద పంపిస్తాం, ముఖానికి పూసుకోండి' ఇదే కదా వాళ్ళ గోల. ఇంతకంటే ఇంకేముంది?

సామాన్యంగా అమావాస్య మంచిది కాదంటారు, గ్రహణం మంచిది కాదంటారు. మరైతే, రిషి సునక్ ఇదే రోజున బ్రిటిష్ PM అయ్యాడు. ఇవి రెండూ ఇతనికి ఎంతో మంచిని చేశాయి. దీని గురించి చిల్లర జ్యోతిష్కులు ఏమంటారో చూడాలి.

బ్రిటిష్ సామ్రాజ్యపు కబంధ హస్తాలనుంచి భారతదేశం విముక్తి చెంది 75 సంవత్సరాలైంది. నేడు, ఒక ఇండియన్, బ్రిటిష్ PM అయ్యాడు. ఇదెంతో గర్వకారణం. పైగా నేడు UK చాలా గంగరగోళ పరిస్థితిలో ఉంది. దాని ఆర్ధికవ్యవస్థ కుప్పకూలడానికి సిద్ధంగా ఉంది. లక్షలాది బ్రిటిష్ వాళ్లకు తిండి దొరకని సమస్య, ఎనర్జీ బిల్లులు కట్టలేని సమస్య ఉన్నాయి. వేలాది కంపెనీలు దివాళా తీసే పరిస్థితిలో ఉన్నాయి. ప్రపంచంలోని ప్రతిదేశాన్నీ కొల్లగొట్టి దాచుకున్న దొంగసొమ్మంతా నేడు ఎందుకూ పనికిరాకుండా ఉంది. అలాంటి పరిస్థితిలో ఉన్న UK ని రక్షించడానికి నేడు ఒక ఇండియన్ దిక్కయ్యాడు. 140 మంది MP లు సునక్ కి మద్దతిచ్చారు. ఇది మామూలు విషయం కాదు.

సునక్ బాగా చదువుకున్నవాడు. ఎకనామిక్స్ పట్టభద్రుడు. ఆక్స్ ఫర్డ్, స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలలో స్కాలర్ షిప్ తో చదువుకున్నాడు. ఇది మామూలు విషయం కాదు. అన్నివిధాలుగా ఇతనికంటే ఉత్తమ రాజకీయనాయకుడు ప్రస్తుతం బ్రిటన్ లో లేడు. కాకపోతే  ఒక్కటే అడ్డంకి, ఇతను తెల్లవాడు కాదు. పైగా ఇండియన్ సంతతివాడు. అయినా సరే, ఇవి అడ్డు రాలేదు. టాలెంట్ కి అగ్రస్థానం దక్కింది. నేడు బ్రిటిష్ PM అయ్యాడు.

టాలెంట్ ముందు రేసిజం పనిచేయదని రిషి నిరూపించాడు.

బ్రిటిష్ వాళ్ళు 200 ఏళ్లపాటు మనల్ని పాలించారు. విచ్చలవిడిగా దోచుకున్నారు. కానీ కేవలం 75 ఏళ్లలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మనం పరిపాలించే పరిస్థితి వచ్చింది. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలంటే ఇదే మరి !

అయితే, బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి చేసిన మంచి ఎంతో ఉంది. 800 ఏళ్ల నుంచీ మనల్ని ఆక్రమించి, నానారకాల హింసలకు గురిచేస్తూ, రాక్షసపాలన సాగిస్తున్న ఇస్లామిక్ దోపిడీదొంగల పాలన నుండి  మనల్ని కాపాడింది బ్రిటిష్ వాళ్లే. వాళ్ళు రాకపోయి ఉంటే, మనంతట మనం ఇస్లామిక్ దురాక్రమణను ఎన్నటికీ తొలగించుకోగలిగేవాళ్ళం కాదు. బ్రిటిష్ వాళ్ళు మనకు చేసిన అతిపెద్ద మేళ్లలో ఇది చాలా ముఖ్యమైనదని నా అభిప్రాయం. అప్పట్లో రాజా రామ్మోహన్ రాయ్ కూడా ఇదే అనేవాడు.  అది వేరే సబ్జెక్ట్ గనుక ప్రస్తుతానికి ప్రక్కన ఉంచుదాం.

అయితే, ఈ గ్రహణ సమయంలో అధికారపగ్గాలు చేపడుతున్న సునక్ ముందు చాలా సవాళ్లున్నాయి. అవి మామూలువి కావు. అందులో ముఖ్యమైంది, దారితప్పి, కుప్పకూలే దిశగా దూసుకుపోతున్న ఎకానమీని చక్కదిద్దడం. రెండు, లుకలుకలతో కునారిల్లుతున్న పార్టీని బలోపేతం చెయ్యడం. ఇవి మామూలు విషయాలు కావు. వీటిని ఎలా చేస్తాడో అని లోకం  అంతా నేడు సునక్ వైపు చూస్తోంది.

ప్రపంచంలోని మేజర్ సంస్థలు ఇప్పుడు ఇండియన్స్ చేతులలో ఉన్నాయి. మనవాళ్లకు కష్టపడే తత్త్వం ఎక్కువ. బాగా చదువుకుంటారు. కనుక రాణిస్తున్నారు. అయితే, ఇండియాలో ఈ అవకాశాలు లేవు.  అందుకే విదేశాలలో రాణిస్తున్నారు. ఇండియాలోని అస్తవ్యస్త రాజకీయ వ్యవస్థ, అసంబద్ధ రాజ్యాంగం, రిజర్వేషన్ వ్యవస్థ, అవినీతి, విలువలు లేని పార్టీలు, కులం, మతం, ప్రాంతీయ అభిమానాలు, జ్ఞానం లేని ఓటర్లు, ఇవన్నీ ఇండియాకు శాపాలు. ఈ శాపాల మధ్యన స్వచ్ఛమైన తెలివి, నిజాయితి, కష్టపడే తత్త్వాలు బ్రతకలేవు. అందుకే ఇవన్నీ ఉన్నవాళ్లు విదేశాలకు వెళ్లిపోతున్నారు. అక్కడ రాణిస్తున్నారు.

నేను 40 ఏళ్లపాటు భారతీయరైల్వేలో రకరకాల స్థాయిలలో పనిచేశాను. ఆ అనుభవంతో చెప్పగలను. ఇండియా ప్రభుత్వంలో అవినీతి లేని ఏరియా అంటూ ఎక్కడా లేదు. ప్రతిచోటా, కులం, మతం, మనవాడు అన్న ఫీలింగ్, అధికార దుర్వినియోగం, దురహంకారం, అసమర్ధతను రిజర్వేషన్ చాటున కప్పిపుచ్చుకోవడం, నాసిరకం డెసిషన్ మేకింగ్, ఒకడు పనిచేస్తుంటే పదిమంది కూచొని సరదాగా కాలక్షేపం చెయ్యడం, లంచాలు, అవినీతిడబ్బు సంపాదించడం - ఇవన్నీ ఉన్నాయి. నేనే ప్రత్యక్షసాక్షిని, బాధితుడిని కూడా. నా సర్వీసు మొత్తం మీద నేను చూచిన, కలసి పనిచేసిన వందలాది అధికారులలో, అవినీతి చేయనివారు ఒకరో, ఇద్దరో ఉన్నారంతే. ఇది సెంట్రల్ గవర్నమెంట్ పరిస్థితి. ఇక స్టేట్ గవర్నమెంట్ గురించి చెప్పనే అక్కర్లేదు. అవినీతి లేని ఏరియా అంటూ దానిలో ఎక్కడా ఉండదు. అడుగడుగునా లంచాలు, రికమెండేషన్లు, పైరవీలు దాంట్లో రాజ్యాలు ఏలుతూ ఉంటాయి. రాజకీయజోక్యం అడుగడుగునా ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ లో రాజకీయజోక్యం అంతగా ఉండదు. కానీ స్టేట్ లో ప్రతిచోటా ఉంటుంది. 'ఈ ఐదేళ్లలో దోచుకున్నంత దోచుకోవాలి. తరువాత ఈ ఛాన్స్ ఉండదు/ అనేదే వారి పాలసీగా ఉంటుంది. ఈ సంగతి అందరికీ తెలుసు.

ఇటువంటి వ్యవస్థను చక్కదిద్దటమంటే మాటలు కాదు. అదికూడా అస్తవ్యస్త రాజ్యాంగవ్యవస్థలో, విలువలు లేని ప్రజావాతావరణంలో ఈ పనిని చెయ్యడమంటే మాటలు కాదు. ఉన్నంతలో అత్యంత గొప్పగా మోడీగారు పరిపాలిస్తున్నారు. కానీ, నేటి యువతకు, ఇతర దేశాలలో పోలిస్తే, ఇండియాలో ఎదిగే అవకాశాలు లేవు. అందుకే బ్రెయిన్ డ్రెయిన్ అవుతోంది. మన టాలెంట్ విదేశాలకు తరలిపోతోంది. వారికి ఉపయోగపడుతోంది. మనకేమో పిప్పి మిగులుతోంది. ఎక్స్ పోర్ట్ లో అంతేగా, ఫస్ట్ క్వాలిటీ ప్రాడక్ట్ అంతా విదేశాలకు ఎగుమతి అవుతుంది, నాసిరకం సరుకు ఇండియాలో చెలామణీ అవుతుంది.  టాలెంట్ లో కూడా అంతే. విదేశాలకు తరలిపోతున్న యువతను తప్పుపట్టలేం. కుళ్ళు వ్యవస్థలో ఎవరు మాత్రం ఎంతకాలం ఉండగలరు? లోకుల కోసం జీవితాలు త్యాగం చేయడానికి యువకులందరూ వివేకానందులు కారు కదా !

కులపైరవీలు చేసుకునేవాడు, తిని తినిపించేవాడు వ్యాపారంలో రాణిస్తున్నాడు. రిజర్వేషన్ ఉన్నవాడు ప్రభుత్వ ఉద్యోగాలలో రాణిస్తున్నాడు. ఇవి రెండూ చెయ్యలేని తెలివున్న నిజాయితీపరుడు దేశాన్ని వదిలిపోతున్నాడు. ఇదీ నేటి ఇండియా పరిస్థితి. ఇది ఎవ్వరూ కాదనలేని సత్యం.

వివేకానందస్వామిని అమెరికా నెత్తిన పెట్టుకున్నాక మాత్రమే, ఇండియాలో ఆయనకు గౌరవం దక్కింది. అంతకుముందు పదేళ్ళపాటు ఒక భిక్షుకునిగా ఇండియా అంతా ఆయన తిరిగినా ఎవడూ పట్టించుకోలేదు. విదేశాలలో రాణిస్తేనే మాతృదేశంలో గౌరవం లభిస్తుందనే సూత్రం ఆయనతోనే మొదలైంది. నేటికీ అదే బాణీ సాగుతోంది. పీవీ నరసింహారావుగారి పుణ్యమా అని నేడు లక్షలాది మంది ఇండియన్స్ అమెరికాలో, యూరప్ లో, ఇతర దేశాలలో నిలబడి, విజయాలను సాధిస్తున్నారు. ఇండియన్ ఎకానమీకి కూడా బాసటగా నిలుస్తున్నారు. దీనిని కూడా ఎవ్వరూ కాదనలేరు.

ఇండియా రాజకీయ రంగం మాత్రం దీనికి విరుద్ధంగా ఘోరంగా ఉంది. కారణాలను గమనిద్దాం.

1. బాగా చదువుకున్న యువకులు రాజకీయాలలోకి రావడం లేదు. అది రొచ్చుగుంట అనే అభిప్రాయం వారిలో బలంగా ఉండటమే దీనికి కారణం.

2. తాతలో, తండ్రులో సపోర్ట్ చేయనిదే రాజకీయాలలో రాణించడం ఇండియాలో సాధ్యం కాదు.

3. నీతిమంతులకు రాజకీయ రంగం అస్సలు పనికి రాదు. అడుగడుగునా అక్కడ అవినీతి తాండవిస్తూ ఉండటమే దీనికి ప్రధాన కారణం.

4. రాజకీయాలకు చదువుతో పనిలేదు. అక్కడ కావలసిన క్వాలిఫికేషన్సల్లా, తిను తినిపించు, కుల రాజకీయాలు, గ్రూపు రాజకీయాలు చెయ్యి. అంతే. దీనికి చదువెందుకు? 'మనం చెప్పినది చెప్పినట్లు చెయ్యడానికి బ్యూరోక్రాట్లున్నారు. వాళ్ళూ చదువుకుని, మనమూ చదువుకుని, ఏంటయ్యా ఇదంతా?, మనకెందుకు చదువు? IAS, IPS చదువుకున్నోళ్ళు మనదగ్గర పనిచేస్తారు అంతే' అనిన రాజకీయనాయకుడొకరు నాకు తెలుసు. వాళ్ళ అవినీతిని అమలు చెయ్యడానికే బ్యూరోక్రాట్లున్నారని చాలామంది రాజకీయనాయకుల ప్రగాఢ విశ్వాసం.

పై కారణాలవల్ల, భారతరాజకీయరంగంలో క్వాలిటీ ఘోరంగా లోపిస్తోంది. ప్రస్తుత రాజ్యాంగ పరిధులలో, వ్యవస్థా పరిధులలో, అదెప్పుడు బాగుపడుతుందో దేవుడికే ఎరుక ! మంచివాళ్ళు, ఆదర్శవంతులు, చదువుకున్నవాళ్ళు, టాలెంట్ ఉన్నవాళ్లు రాజకీయాలలోకి వచ్చినపుడు అది బాగుపడుతుంది. ఇదసలు జరిగే పనేనా ఇండియాలో?

రిషి సునక్ చదువుకున్న స్టాన్ ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ప్రొఫెసరైన జెఫ్రీ ఫిఫర్ ఇలా అంటాడు, 'రాజకీయాలతో దేశానికి మంచి చేయాలంటే, మంచివాళ్ళు రాజకీయాలలోకి రావాలి. మంచివాళ్ళు అధికార సూత్రాలను నేర్చుకోవాలి. బిజినెస్, ఎకనామిక్స్, అధికార నాయకత్వ సూత్రాలను వారు నేర్చుకోవాలి'.

ఆయన మాటలలో చెప్పాలంటే,

As I write in 7 Rules of Power, if power is to be used for good, good people need to master power skills and knowledge.

నిజమే. దానికి వ్యవస్థ సహకరించాలి కదా ! ఆదర్శాలు బాగానే ఉంటాయి. ఆచరణకు, వ్యవస్థే అడ్డుగా ఉంటే,  మంచివాళ్ళేం చేయాలి? ఉత్తతెలివి, మంచితనాలు, రాక్షసుల మధ్యన బ్రతికేదేలా? దీనికి సమాధానం లేదు. ఇది మన ఇండియా పరిస్థితి.

ఇటువంటి చెత్త వ్యవస్థలో నుంచి ఎదిగి, బయటపడి, విదేశాలలో విజయాలను సాధిస్తున్న వారికి ఆదర్శం రిషి సునక్. నేడు ఈయన, ఈయన భార్య కలసి, కింగ్ చార్లెస్ కంటే ధనవంతులని అంటున్నారు. కింగ్ చార్లెస్ దంతా దోచుకున్న సొమ్మేకదా ! బ్రిటిష్ రాజకుటుంబం కష్టపడిందేముంది? నీతిగా సంపాదించినదేముంది? రకరకాల దేశాలలో కొల్లగోట్టిన సొమ్మేకదా వాళ్ళది? రిషి సునక్ కుటుంబానికి, వారికి పోలికేముంది అసలు? 

ఏదేమైనప్పటికీ, రిషి సునక్ తన ప్రయాణంలో అనేక మైలురాళ్లను అధిగమించాలని, విజయాలను సాధించాలని, భారతీయుల గౌరవాన్ని ఇతర దేశాల దృష్టిలో ఎంతో పెంచాలని, ఇండియా మళ్ళీ  వరల్డ్ లీడర్ కావాలని ఆశిస్తూ, అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

read more " మూడవ అమెరికా యాత్ర - 44 (రిషి సునక్ - బ్రిటన్ కు ఇండియా దీపావళి గిఫ్ట్ ) "

22, అక్టోబర్ 2022, శనివారం

మూడవ అమెరికా యాత్ర - 43 (హరిదాసు కధ)

హరిదాసు కధను మధ్యలోనే వదిలేశాను కదా. దానిని పూర్తిగా చెప్పుకోకపోతే గాంజెస్ యాత్రకు సమగ్రత ఉండదు.

హరిదాసు తాతగారు కూడా అందరిలాగే యూరోప్ నుండి ఇక్కడకు వచ్చి సెటిలైనవాడే. మొదటి తరం సెటిలర్స్ చాలా కష్టపడి డబ్బు సంపాదించుకుని, ఇక్కడ స్థిరపడ్డారు. తాతగారికి అంతర్జాతీయ వ్యాపారం ఏదో ఉండేది. బాగా సంపన్నులు. హరిదాసు నాన్న కూడా అదే బిజినెస్ ను కొనసాగించాడు. కానీ, హరిదాసు తీరు వేరు. మొదటినుంచీ బాగా డబ్బులో పెరగడం వల్లనెమో అతనికి ఆ జీవితం అంతగా రుచించేది కాదు. భాష్యానందగారితో పరిచయం కావడం, వివేకానందస్వామి బోధనలు చదవడం జరిగాక, వేదాంతం వైపు ఆకర్షితుడైనాడు. మొదట్లో ఆయన దగ్గరకు వస్తూ పోతూ ఉండేవాడు. కొన్నేళ్ళకు అలా జరిగాక, ఇక్కడే స్థిరపడిపోయాడు. పెళ్లి చేసుకోలేదు. ఒక్కడే ఉంటూ రిట్రీట్ సెంటర్ చూసుకుంటూ ఉంటాడు.

'మీరు సన్యాసం ఎందుకు తీసుకోలేదు?' అనడిగాను.

'నాకెందుకు? సన్యాసం తీసుకుని, కాషాయవస్త్రాలు వేసుకుంటే నా స్వతంత్రం పోతుంది. అప్పుడు నా ఇష్టం వచ్చినట్లు నేనుండలేను. అప్పుడు సంస్థ చెప్పినట్లు చెయ్యాలి. ఉపన్యాసాలివ్వాలి. మతప్రచారం చేయవలసి వస్తుంది. రకరకాల చోట్లకు పోవలసి వస్తుంది. నాకది ఇష్టం లేదు. ఒంటరిగా ఉండటమే నాకిష్టం. సన్యాసం తీసుకోకపోతే ఏమైంది? నేను ప్రస్తుతం అలాగే జీవిస్తున్నాను కదా. డ్రస్సులో ఏముంది?' అన్నాడు హరిదాస్.

ఆ మాటలకు సంతోషం కలిగింది.

'మరి ఈ అడవిలో ఒక్కడివే ఉంటావు కదా? రోజంతా నీకెలా తోస్తుంది?' అడిగాను.

'నేను పెయింటింగ్స్ వేస్తాను. అది నా హాబీ. భారతీయ పురాణాలలో ఎన్నో అద్భుతమైన పాత్రలున్నాయి. ఎన్నో అద్భుతమైన ఘట్టాలున్నాయి. అవన్నీ పెయింటింగ్స్ వేసుకుంటూ ఉంటాను. అదే నా ధ్యానం. ఇదుగో చూడండి. ఇవన్నీ నేను వేసిన పెయింటింగ్ లే' అంటూ కొన్ని చూపించాడతను.

ఆంజనేయస్వామి, వినాయకుడు, అమ్మవారు మొదలైన పెయింటింగులున్నాయి.

'అందరిలోకీ నేను ఆంజనేయస్వామిని, వినాయకుడిని ఇష్టపడతాను. అందుకే వాళ్ళ పెయింటింగ్స్ ఎక్కువగా వేస్తూ ఉంటాను' అన్నాడు ఆ అమెరికన్.

ఇండియాలో,  క్రైస్తవులుగా మారిన హిందువులు, హిందూ దేవతలను ఏ విధంగా హేళనగా మాట్లాడుతుంటారో గుర్తొచ్చింది. తరతరాలుగా క్రైస్తవులైన కుటుంబంలో పుట్టిన ఈ అమెరికన్ ఏమో ఇలా మన దేవతలను ఆరాధిస్తున్నాడు. ఎంత ఆశ్చర్యం?

హరిదాస్ ఇంకా ఇలా అన్నాడు.

'నాకు జనంతో కలవడం అంటే ఇష్టం ఉండదు. నాలోకంలో ఒక్కడినే ఉండటమే నాకిష్టం. నేను చాలా భోగభాగ్యాలతో పెరిగాను. కానీ ఏదో వెలితి ఉండేది. అందుకే ఇంట్లోనుంచి వెళ్ళిపోయి ఒక్కడినే కొన్నినెలల పాటు అడవులలో ఉంటూ ఉండేవాడిని. అలాంటి జీవితమే నాకు నచ్చుతుంది. ఇక్కడ రిట్రీట్స్ ఉన్నపుడు జనం చాలామంది వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చినా నేను ఎవరితోనూ కలవను. నేనున్నట్లు కూడా ఎవరికీ తెలియకుండా  ఉంటాను. నన్నెవరైనా డిస్టర్బ్ చేయడం కూడా నాకిష్టం ఉండదు. కానీ మీ గ్రూపు చాలా విభిన్నంగా ఉంది. మీకేం కావలసి వచ్చినా నాకు ఫోన్ చెయ్యండి. ఈ అడవిలో నేనెక్కడున్నా వచ్చి మీకు కావలసినవి చేస్తాను'

నేనతనితో ఇలా అన్నాను.

'మేము కూడా మినిమమ్ సౌకర్యాలతో ఉండటానికే ఇష్టపడతాము. మాకేమీ పెద్ద అవసరాలు లేవు.  మేము నిన్ను డిస్టర్బ్ చెయ్యము. ఇక్కడంతా బాగానే ఉంది. మూడు రోజులు ఇక్కడుంటాము. తర్వాత డెట్రాయిట్ కు వెళ్ళిపోతాము. కాకపోతే ఒకటి. ఈ మూడు రోజులూ మాతోబాటు భోజనం చెయ్యండి.  ఎలాగు మా కందరికీ వంట చేసుకుంటున్నాం. మీరు కూడా మాతోబాటు తినండి.'

హరిదాసు ఇలా అన్నాడు.

'సారీ. నేనా పని చెయ్యలేను. ఏమంటే, నేను రోజుకొక్కసారి, అదికూడా రాత్రిపూట మాత్రమే భోజనం చేస్తాను.  ఉదయం ఒక కాఫీ తాగుతాను. మళ్ళీ రాత్రికే భోజనం. అదికూడా కొద్దిగా తింటాను. ఇంతే నా ఆహారం. పైగా, నాకు ఏ తిండి పడితే ఆ తిండి సహించదు. అందుకని నా వంట నేనే చేసుకుంటాను.  అందుకని మీ మాటను మన్నించలేను. ఏమీ అనుకోకండి' అన్నాడు. 

ఆశ్చర్యం వేసింది. ఒక అమెరికన్ అయ్యుండి, అందులోనూ బాగా సంపన్న కుటుంబంలో పుట్టి, దేనికీ లోటు లేని జీవితం గడుపుతూ కూడా, విలాసజీవితం అంటే విముఖతతో, అలాంటి అడవిలో ఉంటూ, ఒక్కపూట తింటూ, ధ్యానం చేసుకుంటూ, ఒక సన్యాసిలాగా జీవితం గడుపుతున్న హరిదాసు అంటే చాలా గౌరవం కలిగింది. అమెరికా అంటే సినిమాలలో చూసే అమెరికా కాదు. ఇలాంటి అమెరికన్స్ కూడా ఇక్కడున్నారు. మన హిమాలయాలలో ఉన్న యోగులకూ వీళ్లకూ ఏమీ భేదం లేదు. వాళ్ళు ఇండియాలో ఉన్నారు. వీళ్ళు ఇక్కడున్నారు. అంతే. కానీ, జీవనవిధానంలో ఇద్దరూ ఒక్కలాగే ఉన్నారు.

ఈ విషయం చెప్పడానికే ఈ పోస్ట్ వ్రాస్తున్నాను.

హిందూమతంలో పుట్టి, డబ్బుకు ఆశపడి,  మతప్రచారాలకు రెచ్చగొట్టబడి, క్రైస్తవంలోకి మారుతున్న హిందూ సోదరుల దురవస్థకు చాలా జాలి కలిగింది. ఎంతటి ప్రాచీన సంపదను వాళ్ళు కోల్పోతున్నారా  అని బాధ కలిగింది. అదే సమయంలో, కొంతమంది విదేశీయలు దానిని ఎలా అందుకుంటున్నారో చూచి ఆశ్చర్యమూ కలిగింది.

జగన్మాత లీల అద్భుతం కదూ ! ఎవరికేది అందాలో వారికది అందుతుంది. ఎవరి అర్హతను బట్టి వారికి జరుగుతుంది, వారు భూగోళంలో ఎక్కడున్నా, ఏ మూలనున్నా సరే !

read more " మూడవ అమెరికా యాత్ర - 43 (హరిదాసు కధ) "

21, అక్టోబర్ 2022, శుక్రవారం

మూడవ అమెరికా యాత్ర - 42 (నాకు పెళ్లి చేసుకోవాలనుంది)


కాసేపు మళ్ళీ గాంజెస్ కు వెళదాం. ఎందుకంటే, అక్కడి కధ ఇంకా పూర్తవలేదు మరి !

గాంజెస్ లో ఉండగా గ్రెగరీ మాతో చాలా క్లోజయ్యాడని చెప్పాను కదా. తన కుటుంబ విషయాలు కూడా చెప్పుకొచ్చాడు. 35 ఏళ్ల క్రితం తనకు పెళ్లయిందని, అయితే, రెండేళ్లకు విడిపోయామని అన్నాడు. ప్రస్తుతం తనకు 34 ఏళ్ల కొడుకున్నాడని, అతను కెనడాలో ఫైర్ ఫైటరని చెప్పాడు.

నేనేమీ వివరాలు అడగలేదు. ఎందుకంటే, ఇతరుల పర్సనల్ విషయాలను అడగడం నాకెప్పుడూ అలవాటు లేదు. అలా అడిగేవాళ్ళంటే నాకు అసహ్యం కూడా.

ఒకరోజున మాటల సందర్భంలో,' ప్రస్తుతం నాకు మళ్లీ పెళ్లి చేసుకోవాలనుంది' అన్నాడు గ్రెగరీ సీరియస్ గా.

కొరబోయింది నాకు.

వెంటనే NTR గుర్తొచ్చాడు. రెండోపెళ్లి తర్వాత ఆయన జీవితం ఏమైందో అంతా చూశాం గనుక, 'ఈ వయసులో ఇదేం పొయ్యేకాలం?' అన్నమాట నా నోటిదాకా వచ్చి ఆగిపోయింది.

'నీ వయసు 63 అని అన్నావు కదూ' అన్నాను.

'ఎస్' అన్నాడు, 'సో వాట్?' అన్నట్టు.

నేనేమీ మాట్లాడకపోవడం చూసి, 'అయితే నేను కోరుకునే అమ్మాయి, శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా పర్ఫెక్ట్ గా ఉండాలి' అన్నాడు.

'అలా అయితే, నీకీ జన్మకి పెళ్లి కాదు' అందామని మళ్ళీ నోటిదాకా వచ్చింది. మన తెలుగు అతనికి  అర్ధం కాదుకదా. మళ్ళీ మింగేశాను. ఇంగ్లీషులో అదే మాటను చెబుదామన్న కోరికను కూడా  బలవంతాన అణిచేసి, నవ్వుతూ, 'ఓరి పిచ్చోడా?' అన్నట్టు అతన్ని చూస్తున్నాను.

'డివైన్ మదర్ కి నా  కోరికను చెబుతూ ప్రేయర్ చేశాను' అన్నాడు గ్రెగరీ.

'ఎనీ రిప్లై ఫ్రమ్ హర్?' అన్నాను సీరియస్ గా.

'చాలామంది అమ్మాయిలు వస్తున్నారు. కానీ నాకు నచ్చడం లేదు. నేను ముఖ్యంగా నసని, ఎమోషనల్ గోలని భరించలేను. అవి చెయ్యని అమ్మాయి నాకు కావాలి' అన్నాడు.

'ఈ రెండూ చెయ్యని అమ్మాయంటూ ఈ భూమ్మీద అసలుంటుందా?' అని ఆలోచనలో పడ్డాను.

'ఏంటి ఆలోచిస్తున్నారు?' అన్నాడు కనిపెట్టి.

'అబ్బే ఏంలేదు. 'నీ కోరిక సఫలమగుగాక' అని డివైన్ మదర్ని నేనూ ప్రార్ధిస్తాను' అన్నాను నవ్వుతూ.

నా ప్రక్కనే ఉన్న ఆనంద్ వైపు చూస్తే, 'వెరీ బ్యాడ్ ఐడియా' అన్నాడు నాకొక్కడికే వినపడేటట్టు చిన్నగా.

'ఏంటి నాదా? వాడిదా?' అన్నాను.

'వాడిదే. 63 వచ్చినా వీడికి బుద్ధి రాలేదని అర్థమౌతోంది. జీవితంలో వీడేమీ నేర్చుకోలేదు. అందుకే మళ్ళీ పెళ్లంటున్నాడు' అన్నాడు ఆనంద్.

మా మాటలని ఖండిస్తూ, 'నేను AA సభ్యుడిని, ఆల్కహాలిక్స్ ఎనానిమస్' లో గత పదిహేనేళ్ల నుంచీ సభ్యుడిగా ఉన్నాను' అన్నాడు గ్రెగరీ.

'నేను ఐక్యరాజ్యసమితిలో మెంబర్ని' అన్నంత గర్వంగా చెప్పాడామాట.

'మంచిదే. మేము DA సభ్యులం. అంటే, డ్రగ్గహాలిక్స్ ఎనానిమస్' అన్నమాట' అన్నాను మళ్ళీ సీరియస్ గా.

'అదేంటి?' అడిగాడు అనుమానంగా.

'అవును. మేము ధ్యానంలో కూచునేముందు కొంచం ఇండియన్ మారిజువానా తీసుకుంటాం.  మేమే కాదు, హిమాలయాలలో సాధువులు చాలామంది తీసుకుంటారు' అన్నాను సాధ్యమైనంత నార్మల్ గా ఉండటానికి ప్రయత్నిస్తూ.

నా మాటను పట్టించుకోకుండా, 'నేనే కాదు. మా నాన్న కూడా ఇందులో మెంబరే' అన్నాడు నవ్వుతూ.

'అబ్బో గొప్ప వంశమే' అని మనసులో అనుకుంటూ, 'ఎందుకు దానికి బానిసవయ్యావు?'అడిగాను.

'భాష్యానంద గారు చనిపోయాక, మేమందరం ఈ ప్రదేశాన్ని వదలిపెట్టి వెళ్ళిపోయాము. దీనిని వదలడం మాకు చాలా నరకమైపోయింది. అందుకే త్రాగుడుకు బానిసనయ్యాను. కానీ ప్రస్తుతం వదిలేశాను' అన్నాడు. 

'మళ్ళీ పెళ్లి కంటే తాగుడే మేలేమో?' అనిపించింది నాకు. మళ్ళీ మింగేశాను. మనమాట ఎవరు వింటారు గనుక?

ఉన్నట్టుండి, 'మీకు పెళ్లయిందా?' అనడిగాడు నన్ను.

ఒక్కక్షణం కొరబోయింది నాకు. 'ఇంకా కుర్రాడిలా కనిపిస్తున్నానా?' అని ఒకవైపు ఆనందం వేసినా, ప్రక్కనే శ్రీమతి ఉందని గుర్తొచ్చి తనవైపు భయంగా చూశాను. ఆమె కోపంగా చూస్తోంది, ఏం చెబుతానా? అని.

'లేదు కాలేదు. కావాలంటే ఆమెనడగండి' అందామనుకున్నా.

తరువాతేమౌతుందో ఆలోచించుకుంటే భయమేసి, 'అయింది. నాకూ 32 ఏళ్ల క్రితమే అయింది. అప్పటినుంచీ ఈమొక్కతే  నా భార్య' అన్నాను.

'ఎందుకు నీ బతుకు?' అన్నట్టు ఒక చూపు చూశాడు గ్రెగరీ నా వైపు.

'మేము ఇండియన్స్ మి. మాలో ఇలాగే ఉంటుంది' అని భారతీయ వివాహవ్యవస్థ మీద ఒక లెక్చరిద్దామని బలంగా అనిపించింది గాని, ప్రస్తుతం ఇండియా ఎలా ఉందో వాళ్లకూ తెలుసు గనుక, మళ్ళీ అతను ఏవైనా ప్రశ్నలేస్తే, నేనెక్కడ దూకాలో అర్ధంకాక, ఆ గోలంతా ఎందుకని మళ్ళీ మాటల్ని మింగేశా.

'మరొక్క సాయం నాకు చెయ్యగలరా?' అడిగాడు.

'పెళ్లిసంబంధాలు వెదకమని అంటాడేమోరా భగవంతుడా? ఈ అమెరికాలో నేనెక్కడ వెదకాలి?' అని తెగ భయమేసింది. భయాన్ని కనిపించనివ్వకుండా నొక్కేసి, 'ఆబ్బె దాందేముంది? చెప్పండి. నేను పుట్టిందే లోకాన్ని ఉద్ధరించడానికి కదా' అన్నా నవ్వుతూ.

'ఏం లేదు. 'శ్రీ మండల' గురించి నాకు చెప్పగలరా?' అడిగాడు.

జీరో డిగ్రీల వాతావరణంల్లో కూడా వడదెబ్బ కొట్టినట్లయింది నాకు.

'యూ మీన్ శ్రీయంత్ర ఆర్ శ్రీచక్ర?' అన్నాను.

'యా' అన్నాడు.

'ఎందుకడుగుతున్నారో నేను తెలుసుకోవచ్చా?' అడిగాను.

'మా గురువుగారైన ఓంకారానందస్వామి నాతో ఇలా అన్నారు, 'శ్రీమండల అనేది అనేక త్రికోణాల సంక్లిష్టమైన స్వరూపం. ఇందులో ప్రతి త్రికోణానికి ఒక మంత్రము, ఒక దేవత ఉంటాయి.  ఆ త్రికోణాలన్నీ శక్తులు' అన్నారు, ఇది నిజమేనా?' అడిగాడు.

'నిజమే. అంతేకాదు. అది విశ్వానికి, మానవదేహానికి ఒక చిన్న నమూనా లాంటిది. అందులోని ప్రతి త్రిభుజానికి ఒక అర్ధం ఉంది. ఆ త్రిభుజాలన్నీ ఒకదానినొకటి సపోర్ట్ చేసుకుంటూ ఉంటాయి.  శ్రీమండలాన్ని అవి పరిపుష్టం చేస్తాయి. తంత్రశాస్త్రంలో అది అత్యుత్తమమైన సాధన' అన్నాను.

'శ్రీ మండలాన్ని గీయాలని నేనెంతో ప్రయత్నించాను. కానీ కొలతలు కుదరడం లేదు. మీరు చెప్పగలరా?' అడిగాడు.

'చెప్పగలను. కరెక్ట్ కొలతలతో గీయకపోతే అది రాదు. అయినా మీకెందుకా కొలతలు?' అడిగాను.

'శ్రీ మండలాన్ని ఒక 3-D హోలోగ్రాం గా చెయ్యాలని నా జీవితాశయం. అది నెరవేరిన రోజున నేను ఆనందంతో డాన్స్ చేస్తాను. నేనేమీ పెద్దగా చదువుకోలేదు. కానీ ఇదుగో చూడండి ఎన్నో డిజైన్స్ గీశాను' అంటూ ఒక ఫైల్లోంచి కాగితాలను చూపించాడతను.

పదేళ్ళక్రితమే 250 డాలర్స్ పెట్టి, లండన్ నుంచి ఒక 2-D హోలోగ్రాం మిషన్ని కొన్నాను. చూడండి అంటూ, సూట్ కేసులోనుంచి ఒక చిన్న పరికరాన్ని బయటకు తీశాడతను. అది చిన్న  భూచక్రం లాగా ఉంది. దానికి నాలుగు తాళ్లలాంటి రెక్కలున్నాయి. కరెంట్ కి ప్లగ్ చేస్తే, అది గిర్రున తిరుగుతూ ఒక గుండ్రటి తెరను సృష్టించింది. దానిపైన ఒక వీడియో కనిపించడం మొదలైంది. దానిని గోడపైకి ప్రాజెక్ట్ చేసి ఒక సినిమాలాగా చూడవచ్చని అన్నాడు.

'ఇప్పుడు టెక్నాలజీ ఇంకా పెరిగింది. 3-D హోలోగ్రాం సృష్టించడం ఇప్పుడు పిల్లలాట' అన్నాను.

'అవును. శ్రీమండల తో ఒక 3-D హోలోగ్రాం చెయ్యడమే నా జీవితాశయం, నాకు చదువు లేకపోవచ్చు. కానీ  నేను దీనిని చేసిన రోజున, పెద్ద పెద్ద సయింటిస్ట్ లు కూడా 'ఓహో' అంటూ తలలు ఆడిస్తారు. అలా చేస్తాను' అన్నాడు.

'మంచిదే. ఆ కొలతలు మా ఆనంద్ ఇస్తారు మీకు' అన్నాను.

వింటర్లో ఇక్కడి చలి భరించడం కష్టమని, అందుకని హవాయ్  ఐలాండ్స్ కి వెళ్లి, అక్కడుండి, తర్వాత మళ్లీ గ్రాండ్ రాపిడ్స్ కి వస్తానని గ్రెగరీ అన్నాడు. అలా అతని ఎపిసోడ్ ముగిసింది.

బయలుదరబోయే ముందు, మైకేల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అతను వేరే ఇంట్లో ఉన్నాడని అక్కడివాళ్లు చెప్పారు. ఫోన్ చేస్తే ఎత్తలేదు. తిరుగు ప్రయాణం సగంలో ఉండగా తను ఫోన్ చేశాడు.  మేము వెనక్కు వెళ్ళిపోతున్నామని చెబితే నొచ్చుకున్నాడు. 'నా ఫామ్ చూపించేవాడిని కదా?' అని బాధపడ్డాడు.

'బాధపడకు, ఇండియా వెళ్ళేలోపు మళ్ళీ వస్తాం. అప్పుడు నీ ఫామ్ చూస్తాం' అని అతనికి చెప్పాను.

అలా మూడురోజులపాటు సరదాగా కాలక్షేపం చేసి గాంజెస్ నుండి తిరుగుప్రయాణమయ్యాం. సరదాతో బాటు, ఆద్యాత్మికం కూడా కలసి మెలసి ఉంటూనే వచ్చింది.  ఆ సంగతి ముందే చెప్పాను కదా !

ఆ విధంగా గాంజెస్ రిట్రీట్ ముగిసింది.

ఈసారి మళ్ళీ ఇక్కడకంటూ వస్తే గిస్తే, గ్రెగరీ పెళ్ళికి రావాలనుంది. ఏమౌతుందో మరి? అతని కోరికా నా కోరికా తీరుతాయో లేవో చూడాలి !

read more " మూడవ అమెరికా యాత్ర - 42 (నాకు పెళ్లి చేసుకోవాలనుంది) "

20, అక్టోబర్ 2022, గురువారం

మూడవ అమెరికా యాత్ర - 41(సున్నా డిగ్రీల చలి)

ట్రాయ్ లో చలి సున్నా డిగ్రీలకు చేరుకుంది. అందరూ ఇళ్లలో దాక్కుంటున్నారు. అవసరమైతే తప్ప ఆరుబయట నడుస్తూ ఎవరూ కనిపించడం లేదు. కార్లలో తిరుగుతున్నారు. గబుక్కున ఇళ్లలోకి దూరిపోతున్నారు. ఏంటో ఒంటూపిరి మనుషులు? మాంసాలు తినడం కాదు, ప్రాణశక్తి బలంగా ఉండాలి.

మరి ఈ ఆరునెలలూ ఎలా? అంటే, 'ఇంతే ఇలాగే ఉంటుందిక్కడ' అని చెబుతున్నారు. కావాలంటే 'పెద్ద పెద్ద మాల్స్ కి వెళ్లి మాల్ వాకింగ్' చేసుకోవాలి' అని అంటున్నారు. మనకెందుకది? మనకు ఇంట్లోనే యోగాభ్యాసం, మార్షల్ ఆర్ట్ అభ్యాసాలు ఎన్నో ఉన్నాయి. మనకేమీ వాకింగ్ పిచ్చి లేదు. వాకింగ్ అనేది ముసలోళ్ల వ్యాయామం. ఇంక ఏమీ చెయ్యలేనివాళ్ళు మాత్రమే వాకింగ్ చెయ్యాలనేది నేను నలభై ఏళ్ల నుంచీ చెబుతున్న మాట. 

అయినా చూద్దాం, వాళ్ళకోసం ఒకసారి మాల్ వాకింగ్ కూడా వెళదాం.

ఇక మంచుపడబోతోందిక్కడ.

ప్రస్తుతానికి మాత్రం ఇలా ఉంది.




















read more " మూడవ అమెరికా యాత్ర - 41(సున్నా డిగ్రీల చలి) "

18, అక్టోబర్ 2022, మంగళవారం

మూడవ అమెరికా యాత్ర - 40 (Walks in the woods)


మిట్టమధ్యాన్నాం కూడా ఎండ పడనంత ఎత్తైన చెట్ల పందిరి
 








అడవిలో యాగశాల


గ్రెగరీతో అడవిలో నడుస్తూ. మేము ట్రెయిల్ వాక్ కు వెళుతుంటే తానూ వస్తానని మాతో వచ్చాడు గ్రెగరీ. ఈ అడవికి అతనికీ 15 ఏళ్ల సంబంధం ఉంది. తాపసానందగారితో కలసి మెలసి ఉండేవాడు. ఇక్కడనుంచి బయటకెళ్ళడం చాలా బాధ కలిగించిందని వాపోయాడు. భాష్యానంద గారి మరణమే ఇక్కడి స్వర్ణయుగానికి అంతం.




ట్రెయిల్ వాక్ మధ్యలో



ఈ చెట్ల దారి చివరలోనే రిట్రీట్ హోమ్ ఉంటుంది. రాత్రిళ్ళు వీస్తున్న గాలికి  హోరుమంటూ చెట్లు చేసే శబ్దం భయానకంగా ఉంటుంది. రాత్రిపూట ఒక్కరే ఈ దారిలో నడవాలంటే గుండెధైర్యం కావాలి. హర్రర్ సినిమాకు మంచి సెట్టింగ్.



ఈ మైదానమే ఒకప్పటి యాపిల్ పియర్స్ తోట ఉన్న ప్రదేశం. అవతలాగా కనిపిస్తున్న అడవిలోనే ట్రెయిల్ వాక్



అడవి మధ్యలో అమెరికన్ స్వామి తాపసానంద స్వయంగా కట్టుకున్న కుటీరం. ఈయన దీనిలోనే ఒక్కడే 15 ఏళ్ళపాటు నివసించాడు. మంచుపడే శీతాకాలంలో కూడా ఈ అడవి మధ్యలో ఈ కేబిన్ లో ఒక్కడే ఉండేవాడు. దీనికి కరెంట్ లేదు.


ఇందులో కాసేపు. కొన్నేళ్ల క్రితం స్వామి కోరిన కోరిక నెరవేరింది. లోపల పాములుండవచ్చు. మాకైతే కన్పించలేదు.


దానికి కొంచెం దూరంలో ఒక్క మనిషి మాత్రమే పట్టే ఇంకొక కేబిన్. స్వామి తాపసానంద మొదట్లో ఇందులో ఉండేవాడు.


పగలంతా రిట్రీట్ హోమ్ బిల్డింగ్ పనిలో పనిచేసి, రాత్రికి ఒక్కడే టార్చ్ లైట్ సాయంతో అడవిలో రెండుమైళ్ళు నడచి వచ్చి ఇందులో పడుకునేవాడు. ఈ విధంగా ఆరేళ్ళు చేశాడు. 



ఇంత దట్టమైన అడవి



తనకు తాయిచి వచ్చని గ్రెగరీ అన్నాడు. ఈ స్థలంలోనే, యాంగ్ స్టైల్ తాయిచి కొన్ని మూమెంట్స్ చేసి ఇవి ఏ స్టైలో చెప్పు? అన్నాను. తెల్లముఖం వేశాడు. తనకు తాయిచి రాదని నాకర్ధమైంది. నీదే స్టైల్? అంటే, ఫ్రీ స్టైల్ అని  పిచ్చిపిచ్చిగా చేతులూపాడు. భలే నవ్వొచ్చింది. కెంపో కరాటే కూడా వచ్చన్నాడు. ఎడ్ పార్కర్ పేరు చెబితే తెలీదన్నాడు. ఆంజనేయుడి ముందు కుప్పిగంతులా?


మధ్యమధ్యలో అన్ని మతాలకూ ప్రేయర్ ప్లేస్ లాగా కట్టారు. వాటిలో ఒకదాని దగ్గర


పంచవటి వృక్షం. ఇది దక్షిణేశ్వర్ పంచవటి మర్రిచెట్టు లాగా ఉంది. చుట్టూ ఒక అరుగు కట్టారు. అక్కడ కూర్చుని జపధ్యానాలు చేసుకోవచ్చు. రాత్రిళ్ళు మంత్రసాధనలకు ఇంకా బాగుంటుంది.



గాంజెస్ అడవిలోని పంచవటి వృక్షం క్రింద




హిందూమత ప్రార్థనా స్థలం


యాగశాల లోపల. 'మనం కూడా ఏదైనా హోమం చేద్దామా?' అని మా బృందంలో ఒకరడిగారు. 'మన విధానం అది కాదు. 'మనది అంతరికం, బాహ్యం కాదు' అని చెప్పాను.




అడవిలో ప్రదేశాలను వివరిస్తూ గ్రెగరీ



అడవి మధ్యలో ఒక కాలువ పైన. ప్రస్తుతం దానిలో నీళ్లు లేవు.



సూర్యకాంతి లోపలకు పడే అవకాశమే లేదు.


దారిలోని ఒక ప్రేయర్ ప్రదేశంలో


ఆ వెనుక కనిపించే అడవిలోనే ఇదంతా ఉంది


యూదుమత ప్రార్ధనా స్థలంలో




బౌద్ధ ప్రార్ధనా స్థలంలో


పంచవటి వృక్షం క్రింద





క్రైస్తవ ప్రార్ధనా స్థలంలో




పంచవటి వృక్షం క్రింద గ్రూప్ ఫోటో

read more " మూడవ అమెరికా యాత్ర - 40 (Walks in the woods) "